20, మార్చి 2021, శనివారం

శాసనసభలో పద్యం పాడిన వై.ఎస్.ఆర్. - భండారు శ్రీనివాసరావు

ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా వున్నప్పుడు శాసనసభలో ఏకంగా ఒక పద్యం మొత్తం చదివి వినిపించారు.

2001- 2002 ఆర్ధిక సంవత్సరం బడ్జెట్ పై జరిగిన చర్చను ప్రారంభిస్తూ చంద్రబాబు పరిపాలనలో వున్న రాష్ట్రాన్ని ఆ భగవంతుడే కాపాడాలని, భారతంలో తిక్కన విరచిత పద్యం - 'సారపు ధర్మమున విమల సత్యము ....' అని మొదలెట్టి ఒక పద్యం పూర్తిగా చదివారు.
"ద్రౌపదీ వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు దక్షత కలిగిన భీష్మ, ద్రోణుల వంటి వారు కూడా మౌనంగా వుండిపోయారు. అలా ఉపేక్షిస్తే అది వారికే చేటవుతుంది. కానీ ఏదో ఒకరోజున భగవంతుడే కల్పించుకుని సత్యాన్ని, ధర్మాన్ని నిలబెడతాడు. ఈ రాష్ట్రాన్ని కూడా ఆ దేవుడే కాపాడాలి" అని ప్రసంగం ముగించారు రాజశేఖర రెడ్డి.
మరోసారి 2003 ఫిబ్రవరిలో గవర్నర్ ప్రసంగంపై జరిగిన చర్చలో పాల్గొంటూ, దేవరకొండ బాలగంగాధర తిలక్ రాసిన గేయభాగాన్ని వై.యస్.ఆర్. చదివి వినిపించారు.
'ఒక్క నిరుపేద ఉన్నంతవరకు, ఒక్క మలినాశ్రువు బిందువు ఒరిగినంతవరకు, ఒక్క శుష్క స్థన్య సన్నిధిని క్షుదార్తి ఏడ్చు పసిబాలిక ఉన్నంతవరకు, నాకు శాంతి కలుగదింక నేస్తం ..... ఈ ఆర్తి ఏ సౌధాంతరాలకు పయనించగలదు, ఏ రాజకీయవేత్త గుండెలను స్పృశించగలదు' అంటూ 'పేదవాడి ఆర్తిని వినే ప్రయత్నం చేయండి ముఖ్యమంత్రిగారు, చేయండి ముఖ్యమంత్రిగారు' అని తనదైన శైలిలో ప్రసంగం ముగించారు.

కామెంట్‌లు లేవు: