17, డిసెంబర్ 2018, సోమవారం

చెప్పాలని అనుకున్నది, చెప్పలేకపోయిందీ..... భండారు శ్రీనివాసరావు


సోమవారం పొద్దున్న “AP 24 X 7 Debate With Venkata Krishna” చర్చాకార్యక్రమం. ప్రసారం అమరావతి  స్టూడియో నుంచి. నేను పాల్గొన్నది హైదరాబాదు స్టూడియో నుంచి. అక్కడికీ ఇక్కడికీ కొన్ని సెకన్ల టైం తేడా వస్తుంది. ఇదొక సమస్య అయితే, కార్యక్రమం మొత్తం మీద మాట్లాడే అవకాశం తక్కువగా వుండడం మరో సమస్య.
ఈరోజు అలాగే జరిగింది.
“తుపాను ముప్పు ముంగిట్లో వుంటే చంద్రబాబు కాంగ్రెస్ ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారాలకోసం వెళ్ళడం ఏమేరకు సబబు?”
సరే ఈ ప్రశ్నకు పార్టీల ప్రతినిధులు వాళ్ళ పార్టీల వైఖరులకు అనుగుణంగానే సమాధానాలు చెప్పారు.
నేను చెప్పాలని అనుకున్నదీ, పూర్తిగా చెప్పలేకపోయిందీ ఇదీ.
“ఒక ఇంటికి ఇద్దరు అల్లుళ్ళు. ఒకాయన పండక్కి అత్తగారింటికి వెళ్ళినప్పుడు అక్కడి యావన్మందికీ యేవో కానుకలు పట్టుకు వెడతాడు. రెండో ఆయన చేతులు ఊపుకుంటూ వెడతాడు. పొరబాటున ఏ పండక్కి అయినా మొదటాయన బహుమతులు తీసుకు వెళ్ళడం మరచిపొతే ఆ యావన్మందీ మనసులో గొణుక్కుంటారు. ‘చూసారా ఏమీ తేలేదని’ సన్నాయి నొక్కులు నొక్కుతారు. రెండో ఆయన్ని పల్లెత్తు మాట అనరు.
చంద్రబాబు మొదటి అల్లుడి బాపతు. హుద్ హుద్ తుపాను సమయంలో బస్సులోనే మకాం వేసి, ‘సీఎం అంటే ఇలా వుండాల’ని జనం చేత అనిపించుకున్నాడు. మరి ఇప్పుడు అలా చేయకుండా వేరే పనుల మీద  వేరే రాష్ట్రాలకు వెడితే ‘చూసారా మొహం చాటేశాడు’ అదే జనం అంటారు. ఇది ఆయన చేసిన అలవాటే. చీమ చిటుక్కుమన్నా తక్షణం అక్కడ వాలిపోయి ‘పనిచేసే ముఖ్యమంత్రి’ అని పేరు తెచ్చుకున్నారు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్నసమయంలో ఒరిస్సా తుపాను బాధితులను ఆదుకోవడానికి చంద్రబాబు  ప్రదర్శించిన చొరవను జనం మెచ్చుకున్నారు.  ఇప్పుడు ఆ పేరే ముందు కాళ్ళకు బంధం అయింది.
ఆయన ఎక్కడ వున్నా తుపాను పరిస్తితిని ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటారని టీడీపీ ప్రతినిధి సమర్ధించుకోవాల్సి వచ్చింది. ‘తిత్లీ తుపానప్పుడు జగన్ బాధితులను ఎందుకు పరామర్శించలేదు’ అని టీడీపీ నాయకులు అప్పుడు చేసిన వ్యాఖ్యలను వైసీపీ వాళ్ళు ఇప్పుడు గుర్తుచేస్తున్నారు.  
వెంగళరావు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు దివి సీమ తుపాను సంభవించింది. కృష్ణా జిల్లాకు చెందిన  మంత్రి మండలి వెంకట కృష్ణారావు, అప్పటి జిల్లా కలెక్టర్ ఏవీఎస్ రెడ్డి మొత్తం బాధ్యతను తమ భుజస్కందాలకు ఎత్తుకున్నారు. సీఎమ్  పర్యవేక్షణ హైదరాబాదుకే పరిమితం. అప్పుడున్న పరిస్తితుల కారణంగా ప్రాణ నష్టాన్ని పెద్దగా నివారించలేకపోయారు. కానీ తదనంతర పరిణామాలను కట్టుదిట్టంగా అదుపు చేయగలిగారు. అధికారులు గట్టిగా పనిచేసారు.  ఆ క్రెడిట్ మాత్రం ముఖ్యమంత్రి ఖాతాకే చేరింది.
నీళ్ళల్లో రోజుల తరబడి నానిపోయి చూడడానికే భయంకరంగా ఉన్న శవాలను ముట్టుకోవడానికి కూడా ఎవరూ ధైర్యం చేయని పరిస్తితుల్లో  ఆర్ ఎస్ ఎస్ బృందాలు రంగ ప్రవేశం చేసి వాటికి అంత్యక్రియలు చేయడం ఆరోజుల్లో ప్రజల ప్రశంసలు  పొందింది.
కాబట్టి, ముఖ్యమంత్రులు అనేవాళ్ళు ఇలాంటి సమయాల్లో పైనుంచి పర్యవేక్షణ చేయాలి కానీ స్వయంగా క్షేత్రస్థాయికి వెడితే ప్రచారం లభిస్తుందేమో కానీ ఆశించిన ఫలితాలు రావు.
ముఖ్యమంత్రి భోపాల్ వెళ్ళాడా లేక తుపాను ప్రాంతాలలో బస్సులో మకాం వేసారా అనేది అప్రస్తుతం. ఆ ప్రాంతాల ప్రజలను యెంత బాగా ఆదుకున్నారు అనేదే ముఖ్యం.
ప్రసారం జరుగుతున్నప్పుడు కూడా చంద్రబాబు ఆయా జిల్లాల కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు ఇస్తున్నారని చెప్పారు. ఈ ప్రచారం ముఖ్యమంత్రికి మంచి పేరు తేవచ్చు కానీ, అధికారుల విధులకు అది  ఆటంకంగా మారుతుంది. ఈ విషయం చంద్రబాబు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.

7 కామెంట్‌లు:

Jai Gottimukkala చెప్పారు...

ఆయన బెంగుళూరు వెళ్లినా భోపాల్ వెళ్లినా అను"కుల" మీడియా మాత్రం ఆయన వెంటే ఉంటుంది. అసలు గెలిచిన వాళ్లెవరో వీరికి అక్కరలేదు, అంతా నిప్పుబాబు "శబ్దభేరి" ఖాతాలోకి వేసుకోవాలని వీరి ఉబలాటం.

అదే పక్కోడయితే మాత్రం పచ్చ మీడీయా వైఖరి పూర్తిగా యూ-టర్న్ తీసుకుంటుంది. పార్టీ కార్యక్రమానికి గుంటూరుకు వచ్చిన రాజనాథ్ సింగ్ శ్రీకాకుళం (అదేదో పక్కన ఉన్నట్టు) ఎందుకు సందర్శించలేదని పొడబెబ్బలు పెట్టారు.

వీళ్ళు మారరు!

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

// "చంద్రబాబు ఈ రెండో అల్లుడి బాపతు." //
కాదు, మీ వర్ణన ప్రకారమే మొదటి అల్లుడి బాపతు అవుతాడు ☺.

Damned if you do, damned if you don't అన్న ఆంగ్లసామెతలాగా తయారయినట్లుంది సిబిఎన్ పరిస్ధితి. Fall of the giants ఇలాగే ఉంటుందన్నమాట.

Edward Gibbon గారి ప్రసిద్ధ పుస్తకం The History of the Decline and Fall of the Roman Empire లాగా సిబిఎన్ గురించి కూడా ఎవరైనా వ్రాయచ్చేమో?

Jai Gottimukkala చెప్పారు...

@విన్నకోట నరసింహా రావు:

సోవియట్ రష్యాలో కమ్యూనిస్ట్ పాలన గురించి ఒక పాత జోకు గుర్తుకు వచ్చింది. భండారు గారికి ఇది తెలిసే ఉండవచ్చు.

Napoleon came as the chief guest during an annual October Revolution parade. Stalin said to him "I wish we had a general like you. We would have defeated Hitler much more easily". Napoleon replied "I wish we had media like yours. No one would have found out I lost the battle of Waterloo".

మూడు రాష్ట్రాలలో బీజేపీ ఓటమి బాబు గారి ఖాతాలో వేస్తున్న వేమూరి లాంటి మీడియాకు ఇది అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. రేపో మాపో తమిళనాడులో స్టాలిన్ (డీఎంకే నాయకుడు, not the Soviet dictator!) గెలిస్తే నిన్నటి ఈయన ఆరవ దంపుడు వల్లే అని ఖచ్చితంగా దండోరా వేస్తారు.

సూర్య చెప్పారు...

రాజ్ నాథ్ లాంటి వాళ్ళకి గుంటూరు శ్రీకాకుళం పక్కనే ఉన్నట్టు. అక్కడ హెలికాఫ్టర్ ఎక్కితే ఇక్కడ దిగిపోగలరు

సూర్య చెప్పారు...

అయినా ప్రజలకి కావలసింది పనిచేసిపెట్టే అధికారగణమే కానీ అంతా అయిపోయాక ఓదార్చడానికి వచ్చే నాయకుడు కాదు.

అజ్ఞాత చెప్పారు...

It looks to me some people have a phobia about Chandrababu and media coverage about him. But what I don't understand is, how conveniently they ignore the coverage of Namaste Telangana about Dora&Family and Sakshi coverage on Jagan Reddy.

సూర్య చెప్పారు...

బ్లాగాధ్యక్షా.. డిలీటస్త్రమును ప్రయోగింపరేల? ఎవరు ఏమి కామెంటిననూ ఒప్పుకొందురా?