15, డిసెంబర్ 2018, శనివారం

ఒంటరిపోరులో విజేత కేసీఆర్ – భండారు శ్రీనివాసరావు


కేసీఆర్ ఒక్కడూ ఒక పక్క. ఇతర పార్టీలన్నీ మరో పక్క.
ఇలా మోహరించి జరిగిన తెలంగాణా  అసెంబ్లీ ఎన్నికల్లో చివరకు  కేసీఆరే గెలిచారు. ఆయన అనుకున్నది సాధించారు.
ఏ రకంగా చూసినా, ఏ కోణం నుంచి పరిశీలించినా, ఏ విధంగా విశ్లేషించినా ఆయనకిది గొప్ప వ్యక్తిగత విజయం. సందేహం లేదు.
ఒకరా ఇద్దరా! రాష్ట్ర స్థాయిలోనే కాదు, జాతీయస్థాయి నాయకులు కూడా నవజాత తెలంగాణా అసెంబ్లీకి జరిగిన తొలి ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొన్నారు. బహిరంగ సభల్లో ప్రసంగించారు. మూలమలుపు సమావేశాల్లో మాట్లాడారు. రోడ్డు షోలల్లో పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, యూపీయే  చైర్ పర్సన్  సోనియాగాంధీ, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షుడు రాహుల్ గాంధి, పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, టీడీపీ తెలంగాణా శాఖకు చెందిన అతిరధులు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి  యోగి ఆదిత్యనాద్, అనేకమంది కేంద్రమంత్రులు, ఇతర రాష్ట్రాల కేబినెట్ మంత్రులు, కొత్తగా బీజేపీలో చేరిన స్వామి పరిపూర్ణానంద ఇత్యాదయః ఈ జాబితాలో వున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన అధిష్టాన దేవతలు అనేకులు  రోజుల తరబడి హైదరాబాదులో మకాం వేసి ప్రచార కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించారు. మరోపక్క టీఆర్ఎస్ అధ్యక్షుడు కే. చంద్రశేఖరరావు సుడిగాలి పర్యటనలు జరిపి రికార్డు స్థాయిలో అనేక బహిరంగ సభల్లో అలుపెరగకుండా  ప్రసంగించారు. ఆయనకు బాసటగా మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు నిలిచి పార్టీ ప్రచార బాధ్యతలను తాము పోటీ చేసే నియోజక వర్గాలకు ఆవలకూడా నెత్తికెత్తుకున్నారు.
అరివీర భయంకరంగా సాగిన ఈ ప్రచార పర్వంలో  ఆయా పార్టీల నాయకుల ప్రసంగాల తీరు, వాడిన పదజాలం, వాటికి ఉన్న పదును, అది పుట్టించిన వేడి ఇవన్నీ గమనించిన వారికి ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయా లేదా  అనే సందేహం కలిగిన మాట నిజం.
ప్రచారం ఉధృతంగా సాగినా, నాయకులు కట్టు తప్పినట్టు కానవచ్చినా, ప్రజలు మాత్రం ప్రశాంతచిత్తులుగా వ్యవహరించి తమ ప్రజాస్వామిక కర్తవ్యాన్ని సరైన రీతిలో నిర్వర్తించారు.
పోలింగుకు కొద్దిరోజుల ముందుగా మరో రాజకీయ జాణతనానికి తెరలేచింది. సర్వేరాయుళ్ళు రంగ ప్రవేశం చేసారు. వారి వారి అంచనాలతో వాళ్ళు, వాటిపై ఊహాగానాలతో మీడియా, ఉభయులు కలిసి  ఊహించిన దానికి భిన్నంగా ఏదో జరగబోతోంది అనే అభిప్రాయాన్ని అటు రాజకీయ పార్టీలలో, సామాన్యజనంలో కల్పించడంలో సఫలీకృతులయ్యారు. దీనితో ఎవరి అంచనాలను వారికి అనుగుణంగా సవరించుకున్నారు. ఎవరి వ్యూహాలను వారు తదనుగుణంగా మార్చుకున్నారు. ఫలితంగా ఎత్తులు, పైఎత్తులు, వ్యూహాలు, ప్రతివ్యూహాలతో కూడిన మానసిక యుద్ధానికి రంగం సిద్ధం అయింది. పోలింగు ఘడియకు కొద్ది ముందు వరకు ఇది సాగింది. వంద స్థానాలకు తగ్గవు అంటూ కేసీఆర్ ఆదిలో చెప్పిన మాటనే పలుమార్లు పునరుద్ఘాటించారు. వైరి పక్షం అందుకు ప్రతిగా తమదే పై చేయి కాబోతోంది అంటూ ప్రచారాన్ని ఉధృతం చేసింది. ఈ ప్రచారాలు రాజకీయ పార్టీలకు ఏమేరకు లాభించాయో చెప్పలేము కానీ, బెట్టింగురాయుళ్ళు మాత్రం చెలరేగిపోయారు. పందేల మొత్తం వేలకోట్ల రూపాయలకు చేరిందని వార్తలు గుప్పుమన్నాయి. ఫలితాలు వెలువడిన తర్వాత పందేలు కాసిన వాళ్ళలో చాలామంది అదే స్థాయిలో నష్టాలు చవి చూడాల్సి వచ్చింది. అది వేరే విషయం. కాకపొతే,  ఈ ఎక్జిట్ పోల్స్ వెనుక ‘పందేల’ వ్యాపారవ్యూహం దాగి ఉందేమో అనే అనుమానం మాత్రం సర్వత్రా వ్యాపించింది.
ఈ నేపధ్యంలో జరిగిన ఎన్నికల్లో ఏ పక్షానికాపక్షం  తమదే విజయం అనే నమ్మకాన్ని గుండెల్లో నింపుకుంది. విజయం తధ్యం అనే విశ్వాసం వున్నా మరో పక్క అనుకున్నది జరగదేమో అనే శంక కూడా పార్టీలకు పట్టుకుంది. ఈ గుంజాటనల నడుమ పోలింగు పూర్తయింది.
అయినా మోహరించిన పారావారాలు విశ్రాంతి తీసుకోలేదు. ఫలితం గురించిన తమ ఊహాగానాలను తామే  నమ్ముతూ వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళే పనికి పూనుకున్నాయి. ఈ ప్రయత్నాలకు ఎక్జిట్ పోల్స్ సహకరించాయి. వీటివల్ల ఏమీ లాభం లేదని తెలిసినా, ఈవీఎంలలో నిక్షిప్తమయిన ప్రజాతీర్పు మారదని తెలిసినా పంధా మారలేదు.
ఈ ఎన్నికల్లో జరగకూడనివి చాలా జరిగాయి. డబ్బు పంపిణీ విచ్చలవిడిగా సాగింది. మద్యం ఏరులై పారింది. వీటిల్లో ప్రమేయం లేని పార్టీలేదేమో. అందుకే గుంభనగా సర్దుకున్నారు కాబోలు.
కాంగ్రెస్ టీడీపీ కలయికతో ఒక కూటమి ఏర్పాటు, దానికి దన్నుగా చంద్రబాబు ప్రచారం వివాదాంశాలుగా మారాయి. తెలంగాణా సెంటిమెంటు రగిలించడానికి ఇవి సమిధలుగా మారాయనే వాదం తెర మీదకు వచ్చింది. పట్టణ ప్రాంతాలలో కొంత ప్రభావం వుండిఉండవచ్చు కానీ పల్లెప్రాంతాల ఓటర్లు మాత్రం కేసీఆర్ ప్రభుత్వానికి సానుకూలంగా ఓటు చేసారనే అనుకోవాలి. ఆయన మొదటినుంచీ చెబుతూ వచ్చినట్టు ప్రభుత్వం మొదలు పెట్టిన పలు సంక్షేమ, అభివృద్ధి పధకాలే ప్రజలను ఆ వైపుగా మళ్ళించాయని అనుకోవాలి.
పదకొండో తేదీన ఫలితాలు వెలువడ్డాయి. కొన్ని సర్వేలకు పూర్తి విరుద్ధంగా, మరి కొన్ని సర్వేలకు ఒకింత దగ్గరగా వచ్చాయి. వీటితో నిమిత్తం లేకుండా కేసీఆర్ మొదటి నుంచీ చెబుతూ వచ్చిన అంకెలకు సరిపోలుతూ ఫలితాలు రావడం అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. పాలక పక్షానికి చెందిన నలుగురు సీనియర్  మంత్రులతో పాటు అసెంబ్లీ  స్పీకర్ సయితం  ఓటమిపాలవగా, కాంగ్రెస్ పార్టీలో ధిగ్గనాధీరులు పలువురు పరాజయం పాలవడం ఓ విశేషం. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచి తదనంతర కాలంలో టీఆర్ఎస్ లో చేరిన పలువురు నాయకులు ఈసారి ఎన్నికల్లో భారీ మెజార్టీలతో విజయం సాధించడం వల్ల వారి పార్టీ మార్పిళ్ళకు ప్రజామోదం లభించిందని చెప్పుకోవడానికి అవకాశం దొరికింది. ఎన్నికల్లో గెలిచిన  ఎనభై ఎనిమిదిమంది టీఆర్ఎస్ అభ్యర్ధులతో పాటు గెలుపొందిన మరో ఇద్దరు ఇండిపెండెంట్లు అధికార పార్టీలో చేరడానికి ఉద్యుక్తులు అయిన కారణంగా అధికార పార్టీ సంఖ్యాబలం తొంభయికి చేరినట్టవుతుంది.  ఎన్నికల్లో విజయం సాధించిన  వెంటనే,   ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ చేసిన వ్యాఖ్య మీడియాలో పలు చర్చలకు దారి తీసింది.      
క్రితంసారికన్నా అధికంగా, మూడింట రెండువంతులు బలం సొంతంగా సమకూర్చుకున్న విజయదరహాసంతో కేసీఆర్, గురువారం మధ్యాన్నం రాజభవన్ లో నిరాడంబరంగా నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణా రాష్ట్రానికి రెండో పర్యాయం ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్, కేసీఆర్ తోపాటు గతంలో ఉపముఖ్యమంత్రిగా పనిచేసి రెవెన్యూ శాఖ నిర్వహించిన మహమూద్ అలీ చేత కూడా ప్రమాణం చేయించారు. అత్యధిక మంత్రుల చేత ప్రమాణ స్వీకారాలు చేయించే  విషయంలో లోగడ ఉమ్మడి రాష్ట్రంలో  గవర్నర్ గా పనిచేసిన కేసీ అబ్రహాం రికార్డును నరసింహన్ అధిగమించారని అనుకోవచ్చు.
మహమూద్ ఆలీకి హోం శాఖను కేటాయిస్తున్నట్టు అధికార ప్రకటన కూడా వెనువెంటనే వెలువడింది. వారంరోజుల్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ను కొత్త ప్రభుత్వం విడుదల చేయాల్సివున్నందున  కేసీఆర్ ఒక్కరే ప్రమాణస్వీకారం చేయడానికి కారణంగా చెబుతున్నారు.
గత ముఖ్యమంత్రుల మాదిరిగా మీడియాను దగ్గరకు రానివ్వరనే పేరున్న కేసీఆర్ తో పత్రికల వాళ్లకు ఓ సౌలభ్యం కూడా వుంది. కలిసినప్పుడు తన మనసులోని విషయాలను మాయామర్మం లేకుండా వారితో పంచుకుంటారు. అదే సమయంలో తాను భవిష్యత్తులో ఏమి చేయబోతున్నదీ కూడా ముందస్తుగానే చెప్పేస్తారు.
అదే జరిగింది. త్వరలో జాతీయ పార్టీని ఏర్పాటు చేసి అటు బీజేపీ, ఇటు  కాంగ్రెస్ కూటములు  కాకుండా మరో కూటమి ఏర్పాటుకు అడుగులు వేయబోతున్నట్టు వెల్లడించారు. ఇది పాత విషయమే అయినా పునరుద్ఘాటించడం గమనార్హం.
రోజు తిరక్కముందే కేటీఆర్ ను టీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంటుగా నియమించారు. జాతీయ రాజకీయాలపై మరింత దృష్టి పెట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు. అధ్యతన భావిలో టీఆర్ఎస్ పార్టీలో చోటు చేసుకోబోతున్న పరిణామాలకు దీన్ని ఒక సంకేతంగా పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
విజయం ఆత్మస్థైర్యాన్ని ఇనుమడింపచేయడంతో  పాటు బాధ్యతను కూడా పెంచుతుంది. పైపెచ్చు ఇటువంటి అపూర్వ ఘన విజయాల వల్ల ఎదుర్కోవాల్సిన సవాళ్లు కూడా పెరుగుతాయి.
ఇప్పుడు ముఖ్యమంత్రి గారి గుమ్మం ఎదుట ఎదురు చూస్తూ కనిపించేది పదవులు కోరుతూ వచ్చే  ఆశావహులే కాదు, ప్రజలకిచ్చిన ఎన్నో  మాటలను అనుక్షణం గుర్తు చేసే సవాళ్లు కూడా.
కేసీఆర్ ఒక పార్టీని స్థాపించి దాన్ని విజయతీరాలకు చేర్చారు.
కేసీఆర్ ఒక గమ్యాన్ని నిర్దేశించుకుని తెలంగాణా స్వప్నాన్ని సాకారం చేసుకున్నారు.
కేసీఆర్ ఒక పరిపాలకుడిగా లక్ష్యాలను నిర్ణయించుకుని మిషన్ కాకతీయ, మిషన్ భగీరధ వంటి భారీ ప్రాజెక్టులకు ఒక స్వరూపం కల్పించారు.
ఆయనలో ఒక రాజకీయ నాయకుడు వున్నాడు. ఎప్పటికప్పుడు వ్యూహాలను మార్చుకుంటూ, బాధ్యతలను సరయిన వారికి అప్పగించడం ద్వారా సరిగ్గా తాను కోరుకున్న విధంగా ఫలితాలను సాధించే ధీమంతం ఆయన సొంతం.
ఇప్పుడు బంగారు తెలంగాణా బంతి ఆయన కోర్టులోనే వుంది. తెలంగాణా ఓటర్లు కేవలం ఆయన్ని మాత్రమే నమ్మి బంగారు పళ్ళెంలో పెట్టి మరీ అధికారం అప్పగించారు.
ప్రస్తుతం ఆ బక్కపలచటి మనిషి భుజాలపై ఎవ్వరూ అంచనా వేయలేనంత, కంటికి కనపడని  భారం వుంది.
ఎప్పటి మాదిరిగానే ఆయన ఈ కర్తవ్య నిర్వహణలో సఫలం కాగలరని ఆశిద్దాం.
వారికి మనఃపూర్వక అభినందనలు. 
Image result for KCR vs other political leaders            
NOTE: Courtesy Image Owner              

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

ఒక యూట్యూబ్ వ్యాఖ్య. - బాబు 'హస్తప్రయోగం' వికటించింది.