9, డిసెంబర్ 2018, ఆదివారం

పూర్తయిన ఒక ప్రజాస్వామ్య క్రతువు – భండారు శ్రీనివాసరావు

(Published in SURYA daily on 09-12-2018, SUNDAY)

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. శీతాకాలంలో చలిమంటలు భుగభుగ రేపిన రాజకీయ పారావారాలు సేదతీరుతున్నాయి. జరిగిన ప్రచార ఉధృతితో పోల్చుకుంటే పోలింగు ప్రశాంతంగా జరిగిందనే చెప్పాలి. అంటే రాజకీయులకంటే ఓటర్లే ఎక్కువ సహనశీలురని అనుకోవాలి.
ప్రజాతీర్పు సీళ్లు వేసిన ఈవీఎంలలో భద్రంగా వుంది. ఎల్లుండికల్లా ప్రజలు ఎవరి పక్షమో తేలిపోతుంది.
తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత జరిగిన మొట్ట మొదటి ఎన్నికలు ఇవి. ప్రతిసారి మాదిరిగానే అన్ని రాజకీయ పక్షాలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడాయి. నిజం చెప్పాలంటే సర్వశక్తులు ఒడ్డాయి. ఎన్ని నిబంధనలు వున్నా, ఎంతటి నిఘా వున్నా ధనం పంపిణీ విచ్చలవిడిగా జరిగింది. మద్యం ఏరులై పారింది. పట్టుకున్న డబ్బు అనేక కోట్లు అని లెక్క తేలింది. పట్టుపడనిది ఇంకెంత అనేది అంచనాలకే అందడం లేదు. ఇందులో ఎవరో ఒకరిని వేలెత్తి చూపే పని లేదు. అనునిత్యం ప్రవచనాలు వల్లించే వారందరూ ఈ ప్రలోభాల ప్రహసనంలో పాత్రధారులు కావడం ఓ విషాదం.
ఓటర్లను తమవైపు ఆకర్షించడానికి పార్టీలు వెయ్యని ఎత్తులు లేవు. దిగజారని లోతులు లేవు. బహిరంగ సభలు, రోడ్డు షోలకు ఎంతఖర్చు అయిందో అని వాటిని చూసిన సామాన్యుడి గుండె గుభేల్ అంటోంది కానీ పార్టీలకి చీమ కుట్టినట్టయినా లేదు. ఆయా పార్టీల అధినాయకులు హెలికాప్టర్లు, ప్రత్యేక విమానాలను వెనుకటి కాలంలో దొరలు కచ్చడపు ఎడ్లబళ్ళు వాడినట్టు లెక్కలేకుండా వాడారు. కొన్ని పార్టీలు దిన పత్రికల్లో పూర్తి పేజి ప్రకటనలు వరసగా కొన్ని రోజులపాటు ఇచ్చి అది పత్రికో, పార్టీ కరపత్రమో తెలియకుండా చేసాయి. ఇక టీవీల్లో రకరకాల దృశ్యాలతో కూడిన ప్రకటనలతో ఓటర్లను ఆకట్టుకునే ఠక్కుటమార, గజకర్ణ, గోకర్ణ విద్యలు ప్రదర్శించాయి. ఇవన్నీ చూసిన తర్వాత కూడా అభ్యర్ధులు, ఆయా పార్టీలు తమకు నిర్దేశించిన వ్యయపరిమితి లోపలనే ఖర్చు చేశామని ఎన్నికల సంఘానికి సమర్పించే అఫిడవిట్లు కేవలం జనాల కళ్ళకు కట్టే గంతలే అనుకోవాలి.
ఇక ఈ ప్రచారంలో కొందరు నేతలు వాడిన భాష కంపరం కలిగించేదిగా వుంటే, మరి కొందరు ప్రత్యర్ధులపై చేసిన ఆరోపణలు వాస్తవాలకు ఆమడ దూరంలో వున్నాయి. ఒకప్పుడు శత్రువులుగా వుండి ఆపద్ధర్మానికి మిత్రులు అయిన వాళ్ళు, ప్రచ్చన్నంగా మిత్రులుగా ఉంటూ పైకి మాత్రం పరుష పదజాలాలతో కడిగి గాలించేవాళ్ళు ఇలా తమదయినా రీతిలో ప్రజలను అయోమయంలోకి నెట్టే ప్రయత్నాలు ఈసారి ప్రచారంలో అలుపు లేకుండా సాగాయి. ఎన్నికల ప్రణాలికల్లో పొందు పరచిన హామీలు కూడా ఒకదాన్ని మించి మరొకటి వేలం పాటలను తలపించాయి.
తెలంగాణా ప్రాంతంలో జరిగిన పోలింగులో ప్రత్యేక ఆకర్షణ ఒకటుంది. ఒక రకంగా అది రికార్డు కూడా.
కొన్ని దశాబ్దాలుగా ‘బ్యాలెట్ వద్దు, బులెట్ ముద్దు’ అంటూ విప్లవ గీతాలతో ప్రజలను ‘కిర్రెక్కించిన’ గద్దర్ మహాశయులు ఈసారి పోలింగు కేంద్రానికి వచ్చి ఓటు వేసి వెళ్ళడం మీడియాకు మంచి ముడి సరుకుగా మారింది.
రాష్ట్ర ఎన్నికల సంఘం ఈసారి ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు చాలా చక్కగా, పకడ్బందీగా చేసింది. వికలాంగులకు చక్రాల కుర్చీలు ఏర్పాటు చేయడం మొదలయిన చర్యలు ప్రజల మన్ననలు పొందాయి. పోలింగు కేంద్రాలకు వెళ్లి ఓటు వేసిన వాళ్ళు అక్కడి ఏర్పాట్లను, కల్పించిన సదుపాయాలను మెచ్చుకుంటున్నారు. అయితే, ‘తాళము వేసితిని, గొళ్ళెము మరచితిని’ తరహాలో ఓటర్ల పేర్లు జాబితాల్లో లేకుండా గల్లంతు కావడం చాలామందిని నిరాశ పరచింది. కొందరయితే ఆగ్రహం పట్టలేకపోయారు. చేతిలో ఓటరు గుర్తింపు కార్డు వున్నా, జాబితాలో పేరు లేకపోవడం వల్ల ఓటుహక్కు వినియోగించుకోలేని పరిస్తితిని వారు జీర్ణించుకోలేకపోయారు. ఇటువంటి అతి ముఖ్యమైన అంశం పట్ల అశ్రద్ధ చూపారనే అపప్రధను సంబంధిత అధికారులు మోయాల్సి వస్తోంది. కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. ఆ ఇబ్బందిని కొంతవరకు అర్ధం చేసుకోవచ్చు. కానీ వేల సంఖ్యలో ఓటర్ల పేర్లు గల్లంతు కావడాన్ని ఎవరూ సమర్ధించరు. ఇది ఖచ్చితంగా ఎన్నికల సంఘం తప్పిదంగానే ఎంచాల్సి వుంటుంది. ఓట్లు గల్లంతు అయినట్టు స్వయంగా ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ కూడా అంగీకరించారు. అందుకు మన్నించాలని కోరారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నాటికి ఓటర్ల జాబితాను ఎటువంటి స్ఖాలిత్యాలు లేకుండా సవరించగలిగితే ఈ క్షమాపణలకు అర్ధం వుంటుంది.
ఇది ఎన్నికల సంఘానికి సంబంధించిన అంశం. ఓటర్లకు సంబంధించిన మరో అంశం కూడా వెలుగులోకి వచ్చింది. ప్రత్యేకించి నగర, పట్టణ ప్రాంతాల్లో పోలింగు శాతం నానాటికి తీసికట్టు చందంగా తయారవుతోంది. సమాజం పట్ల వ్యక్తులకు ఉండాల్సిన బాధ్యతలు గురించీ, పౌరధర్మాలు గురించీ సామాజిక మాధ్యమాల్లో అనునిత్యం ప్రవచనాలు గుప్పించే బుద్ధి జీవులు, ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఇచ్చిన ప్రత్యేక సెలవును పూర్తిగా దుర్వినియోగం చేసుకున్నారు. పోలింగుకు వెళ్ళకుండా మొహం చాటేయడం నిజంగా గర్హనీయం. ఇచ్చిన సెలవు దినాన్ని సరదాగా గడపడానికి తప్ప ఒక విద్యుక్త ధర్మ నిర్వహణకోసం కల్పించిన వెసులుబాటుగా వారికి అనిపించకపోవడం శోచనీయం.
‘ఇంట్లో చేసుకోవాల్సిన పనులు ఎన్నో వున్నాయి. ముందు ఓటు వేసి ఆ తర్వాతే ఆ పనుల సంగతి చూసుకుంటాను’ అని చంకలో పసిపిల్లను పెట్టుకుని విలేకరులతో చెబుతున్న ఓ సామాన్య గృహిణి మాటలను టీవీల్లో విని అయినా పోలింగుకు వెళ్లకపోవడం ఏ లెక్కన చూసినా క్షమార్హం కాదు.
ఇక ఈ ఎన్నికల్లో రాజకీయ కోణాన్ని చూస్తే....
తెలంగాణా అసెంబ్లీకి జరిగిన ఎన్నికలకు జాతీయ స్థాయిలో ప్రాముఖ్యం రావడానికి ఓ కారణం వుంది.
మరో ఆరు నెలలలోపే సార్వత్రిక ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా యూపీఏను బలమైన ప్రత్యామ్నాయంగా రూపొందించడానికి తెలుగుదేశం నాయకుడు చంద్రబాబునాయుడు తెలంగాణా ఎన్నికలను ఒక ప్రయోగశాలగా ఎంపిక చేసుకున్నట్టు కానవస్తుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో ఫలించిన వ్యూహాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడం కోసమే చంద్రబాబు కాంగ్రెస్ తో జత కట్టడం జరిగింది. తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు సంబంధించినంతవరకు ఇది అనూహ్య పరిణామమే. వచ్చేఏడాది మొదట్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగే ఎన్నికలలో ఎదురీదాల్సిన పరిస్తితి వుందన్న వాస్తవం తెలియని రాజకీయ నాయకుడు కాదాయన. తెలంగాణాకు ముందస్తు ఎన్నికలు జరగడం కూడా చంద్రబాబుకు కలిసి వచ్చింది. లేని పక్షంలో తెలంగాణా ప్రాంతంలో ఇంత ఉధృతంగా, రోజుల తరబడి ప్రచారం చేయగలిగే సావకాశం ఆయనకు దొరికేది కాదు. తెలంగాణాలో ప్రజాకూటమిని గెలిపించుకోగలిగితే ఆ విజయం తాలూకు సానుకూల ప్రభావం ఆంధ్రప్రదేశ్ ఓటర్లపై పడుతుందని, తద్వారా తమ పార్టీ విజయావకాశాలు మెరుగుపడతాయని ఆయన నమ్మకం. దాదాపు ఇదే అభిప్రాయంతో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం కూడా ఈ ప్రయోగానికి పచ్చజెండా చూపి ప్రజాకూటమిలో భాగస్వామి అయింది. ఆ పార్టీ దృష్టి సహజంగా జాతీయ రాజకీయాలపైన వుంటుంది. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీకి కూడా తెలంగాణాలో ప్రజాకూటమి గెలుపు ఆవశ్యకం. ఈ ప్రయోగం విజయవంతం అయితే దాని ప్రభావం రానున్న సార్వత్రిక ఎన్నికల మీద ఉంటుందని, మోడీని గద్దె దించాలనే తమ లక్ష్యసాధనకు ఉపకరిస్తుందని ఆయన యోచనగా అనుకోవచ్చు. అటు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబుకు, ఇటు జాతీయ స్థాయిలో రాహుల్ కు ఈ కలయిక ప్రయోజనకారి కాగలదన్న నమ్మకమే ఉప్పూనిప్పూ లాంటి వారిద్దరినీ ఒక దగ్గరకు చేర్చింది. తెలంగాణాలో ఎన్నికల్లో పొత్తులో భాగంగా జరిగిన సీట్ల సర్డుబాట్లలో తెలుగుదేశం పార్టీ ఒకింత తగ్గి వ్యవహరించడానికి కూడా ఇదే కారణం.
సూర్యుడి కాంతి చంద్రుడి మీద పడి ప్రతిఫలించినట్టు తెలంగాణా ఎన్నికల ఫలితం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద తప్పనిసరిగా ఉంటుందనే విశ్వాసంతో చంద్రబాబు, జాతీయ స్థాయిలో కలిసిరాగలదని రాహుల్, ఇరువురూ ఇంతటి విస్తృత స్థాయిలో ప్రచారంలో పాల్గొనడానికి కారణమని అనుకోవచ్చు.
ఇక తెలంగాణా ఎన్నికల్లో భారీ ప్రచారానికి నోచుకున్న అంశం మరోటుంది. ప్రీ పోల్, ఎక్జిట్ పోల్ పేరిట వివిధ సంస్థలు నిర్వహించిన ఒపీనియన్ పోల్స్.
అభిప్రాయ సేకరణ పేరుతొ సాగుతున్న ఈ తతంగం ఒక్కోసారి పార్టీలకు, అభ్యర్ధులకు తలనొప్పిగా మారుతోంది. పలానా పార్టీకి విజయావకాశాలు వున్నాయంటూ పోలింగుకు ముందే ప్రీ పోల్ సర్వే పేరుతొ వెలువడే సర్వేలు క్రమేణా తమ ప్రామాణికతను కోల్పోతున్నాయని చెప్పక తప్పదు. ఈ రకమైన ప్రీ పోల్ సర్వేల ద్వారా తటస్థ ఓటర్లను తమవైపు మొగ్గేలా చేసుకోవడానికి కొంతవరకు ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయనే భ్రమతో కొందరు అభ్యర్ధులు, పార్టీలు లక్షలాది రూపాయలు వీటి మీద వెచ్చిస్తున్నారనే విషయం కూడా సత్యదూరం కాదు.


అలాగే ఎక్జిట్ పోల్ సర్వేలు. ఒక్కసారి పోలింగు పూర్తయిన తర్వాత వెలువడే ఈసర్వేలకు, అభ్యర్ధుల జాతకాలను మార్చే శక్తి ఉండని మాట నిజమే. అయినా వీటి కోసం లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయనే బలమయిన అభిప్రాయం జనంలో వుంది. దీనికి కారణం పార్టీలు, అభ్యర్ధుల జయాపజయాల మీద జరుగుతున్న బెట్టింగులు అని కొందరు చెబుతున్నారు. పోలింగు తేదీకి, ఓట్ల లెక్కింపు తేదీకి నడుమ ఉన్నవ్యవధానంలో ఈ బెట్టింగులు తారాస్థాయికి చేరుకుంటాయని, వాటికి ఈ ఎక్జిట్ పోల్స్ ఒక ప్రాతిపదికను ఏర్పరుస్తాయని వారంటారు. ఇందులో నిజమెంతో నిర్దారించేవాళ్ళు లేరు. అయితే, నిజమేనేమో అని సందేహించడానికి మాత్రం కొంత ప్రాతిపదిక ఉన్న మాట కూడా నిజం. కోళ్ళ పందేలు, క్రికెట్ బెట్టింగులు చట్ట రీత్యాశిక్షార్హమైన నేరాలు అయినప్పుడు ఈ ఎక్జిట్ పోల్స్ వెనుక దాగున్న మర్మం ఏమిటో వెలికి తీయాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఎన్నికల రంగంలో నిలబడే అభ్యర్ధులు పెట్టే ఖర్చుకు దీటుగా ఈ బెట్టింగులు సాగుతాయనే వదంతులు విచ్చల విడిగా వినబడుతున్నప్పుడు ఈ అంశంపై ఓ కన్నేయడం సంబంధిత అధికారుల ప్రధమ కర్తవ్యమ్.

3 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ప్రజాస్వామ్యం అనే mockery నడుస్తోంది దేశంలో. ఇంతగా భ్రష్టు పట్టిపోయిన ఎన్నికలు, గోల, దిగజారుడుతనం అవసరమా అనిపిస్తుంది. నా అభిప్రాయంలో ఒక ప్రత్యామ్నాయం ఏమిటంటే ... నామినేషన్లు పూర్తయిన తరువాత రెండోరోజున ఆ ఊళ్ళో ఒక ఇండోర్ గేమ్ పోటీ ఏర్పాటు చెయ్యాలి - చదరంగం, కేరమ్స్ లాంటివి ... మహిళలు, వృద్ధులు, అంగవైకల్యులకు కూడా అనుకూలంగా ఉండే ఆటలు అన్నమాట. ఎన్నికల అభ్యర్థులందరూ పోటీలో పాల్గొనాలి. ఇద్దరికన్నా ఎక్కువమంది అభ్యర్థులు బరిలో ఉంటే రౌండ్ రాబిన్ పద్ధతిలో పోటీ నిర్వహించాలి. ఫైనల్ విజేతను ఆ నియోజకవర్గ MLA గా (లోక్-సభ ఎన్నికలైతే .. MP గా) ప్రకటించేస్తే సరిపోతుంది. బోలెడంత డబ్బు, సమయం ఆదా అవుతాయి. ఇప్పుడు బేలట్ల ద్వారా ఎన్నికవుతున్న వారిలో చాలామంది కూడా అంతకన్నా ఊడపొడిచే వారేమీ ఉండడం లేదు. కొంతకాలం పాటు ఎన్నికలలో నేరస్థుల హవా తగ్గుతుంది .... కనీసం వాళ్ళు కూడా ఈ ఆటలు బాగా ప్రాక్టీస్ చేసేటంత వరకు 😀. అందుకని ప్రతి ఎన్నికలకు వేరే వేరే రకం ఆటపందెం ఏర్పాటు చేస్తే సర్ప్రైజ్ గా కూడా ఉంటుంది 😀😀.

సూర్య చెప్పారు...

మీ అభిప్రాయాన్ని ఆందరూ ఒప్పుకోవలన్నా మళ్ళీ ఒక ఎన్నిక (ఒపీనియన్ పోలింగ్) అవసరమే కదండీ.