1, డిసెంబర్ 2018, శనివారం

బెజవాడ రేడియోకు డెబ్బయ్యేళ్ళు


1936లో అప్పటి ఆంగ్లేయ ప్రభుత్వం, భారత దేశంలో రేడియో వ్యాప్తిని గురించి పరిశీలించడానికి నిపుణులను నియమించింది. అప్పుడు మద్రాసు రాజధానిలో తమిళ జిల్లాలతో పాటు కొన్ని తెలుగు, కన్నడ, మళయాళ జిల్లాలు కూడా కలిసివుండేవి. మద్రాసునుంచి నాలుగు భాషల్లో ప్రసారాలు చేయాలనీ, విజయవాడ నుంచి కానీ, రాజమండ్రి నుంచి కానీ తెలుగు ప్రసారాలు చేయాలని మొదట్లో అనుకున్నారు. కానీ చివరకు తెలుగు కార్యక్రమాలను కూడా మద్రాసు నుంచే ప్రసారం చేయాలని నిర్ణయించారు.
“1947లో దేశం స్వాతంత్రం సాధించేనాటికి, ఆలిండియా రేడియో వ్యవస్థలో ఢిల్లీ, కలకత్తా (కోల్ కతా), బొంబాయి(ముంబై), మద్రాసు(చెన్నై), లక్నో, తిరుచిరాప్పళ్లి (తిరుచి, ట్రిచి)రేడియో కేంద్రాలు మాత్రమే వుండేవి. మద్రాసు నుంచే కాక డెక్కన్ రేడియో నుంచి, మైసూరు నుంచి(చాలా అరుదుగా) తెలుగు ప్రసారాలు జరిగేవి. స్వాతంత్రం వచ్చిన తరువాత సర్దార్ వల్లభాయ్ పటేల్ సమాచార, ప్రసార శాఖల మంత్రి అయ్యారు. ఆయన పర్యవేక్షణలో దేశంలో రేడియో వ్యాప్తికి కృషి మొదలయింది. 1956 నుంచి ఆలిండియా రేడియో సంస్థను ‘ఆకాశవాణి’గా పేర్కొంటున్నారు.
“1948 అక్టోబర్ 12 నాడు విజయవాడలో రేడియో కేంద్రం మొదలయింది. దీనితో మద్రాసు కేంద్రం నుంచి ప్రసారమయ్యే తెలుగు కార్యక్రమాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి.
డెక్కన్ రేడియో (హైదరాబాదు, ఔరంగాబాదు) రేడియో కేంద్రాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. 1950 ఏప్రిల్ ఒకటో తేదీన హైదరాబాదు రేడియో కేంద్రం ‘ఆలిండియా రేడియో’ వ్యవస్థలో భాగంగా పనిచేయడం ప్రారంభించింది.
“1955 నవంబర్ రెండో తేదీన మొదలయిన బెంగలూరు రేడియో కేంద్రం, 1963 జూన్ లో మొదలయిన పోర్ట్ బ్లేయర్ కేంద్రం కూడా తెలుగులో ప్రసారాలు చేస్తున్నాయి. 1957 అక్టోబర్ మూడో తేదీన మొదలయిన ‘వివిధ భారతి’ ప్రసారాలలో తెలుగు పాటలు రోజూ అరగంట సేపు వేసేవారు. 1969 సెప్టెంబర్ లో ఢిల్లీ, పాట్నా, రాంచీ, సిమ్లా రేడియో కేంద్రాల నుంచి తెలుగు నేర్పే పాఠాలు ప్రారంభించారు. 1991 మార్చి రెండో తేదీన హైదరాబాదు, విజయవాడలలో వాణిజ్య ప్రసారాలు మొదలుపెట్టారు.
“కాలక్రమేణా కడపలోను, విశాఖపట్నంలోను ఆకాశవాణి కేంద్రాలు ఏర్పాటయ్యాయి. స్థానికంగా అంటే జిల్లా స్థాయిలో రేడియో సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో మొదలు పెట్టిన తొలి స్థానిక రేడియో కేంద్రాలలో ఆదిలాబాదు కేంద్రం ఒకటి. వరంగల్లులో 1990 ఫిబ్రవరి 17 వ తేదీనాడు ప్రారంభమైన ఆకాశవాణి కేంద్రం, ఆకాశవాణి వ్యవస్థలో ఏర్పడ్డ నూరవ కేంద్రంగా చరిత్రకెక్కింది. ప్రస్తుతం ఆకాశవాణి వ్యవస్థలో మన రాష్ట్రంలో హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం, కడప, ఆదిలాబాదు, కొత్తగూడెం, వరంగల్లు, నిజామాబాదు, తిరుపతి, అనంతపురం, కర్నూలు, మార్కాపురం మొదలైన చోట్ల తెలుగులో కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. మాచెర్ల, కరీంనగర్, సూర్యాపేట మొదలయిన చోట్ల ప్రసార వ్యవస్థలు వున్నాయి. వంద వాట్ల సామర్ధ్యం కలిగిన ట్రాన్స్ మిటర్లను ఒంగోలు, నెల్లూరు, కామారెడ్డి, బాన్స్ వాడ, నంద్యాల, ఆదోని, కాకినాడ మొదలయిన చోట్ల ఏర్పాటు చేశారు”
(ఇతి వార్తాః)
(హైదరాబాదు ఆకాశవాణి పూర్వ సంచాలకులు డాక్టర్ పీ ఎస్ గోపాల కృష్ణ అందించిన వివరాల ఆధారంగా)

1 కామెంట్‌:

సూర్య చెప్పారు...

సీలోన్ ఛానెల్ గురించి రాయడం మానేశారు🤔