6, ఏప్రిల్ 2013, శనివారం

ఈనాడు సిటీ ఎడిషన్ ఎనిమిదో పేజీ చూశారా?
ఈనాటి ‘ఈనాడు’ దినపత్రిక సిటీ ఎడిషన్ ఎనిమిదో పేజీలో ఒక ఫోటో వేసారు. ఆ ఫోటోలో ఒక నడివయసు ఆవిడ తన మనుమడిని భుజాలమీద ఎత్తుకుని వెడుతున్న దృశ్యం వుంది. పల్లెపట్టుల్లో ఇది మామూలే కాని హైదరాబాదు లాటి నగరంలో అపూర్వ దృశ్యమే అని చెప్పాలి. అందుకే అది ఆ ఫోటోగ్రాఫర్ కళ్ళల్లో పడి కెమెరా కంటికి చిక్కి పత్రికలోకి  ఎక్కింది.
ఈ ఫోటోలో వున్న ఆవిడతో మాకు బాదరాయణ సంబంధం వుండడం వల్లనే ఇది రాయాల్సివస్తోంది. 1992 లో మేము మాస్కోనుంచి వచ్చిన తరువాత పంజాగుట్టలోని  దుర్గానగర్ కాలనీలో చాలా ఏళ్ళు వున్నాము. ఆ రోజులనుంచి ఈ ఫోటోలో వున్న యాదమ్మ కుటుంబంతో మాకు అవినాభావ సంబంధం ఏర్పడింది. యాదమ్మ చాలా కాలం మా ఇంట్లో పనిచేసింది. వాళ్ళాయన మల్లయ్య ఆటో నడుపుతాడు. ఆ రోజుల్లో దూరాభారాలకు మల్లయ్య ఆటోనే మాకు ఆధారం. అలాగే ఆ తరువాత సంవత్సరాలలో యాదమ్మ పిల్లలు – సైదమ్మ, కళ, భాగ్య, సంపూర్ణ , తిరుపతమ్మ మా ఇంట్లో పనిచేస్తూ వచ్చారు. చిన్నపిల్లలు సంపూర్ణ, తిరుపతమ్మ మా ఇంట్లో వుంటూనే చదువుకున్నారు. సంపూర్ణ పెళ్ళయి అత్తగారింటికి వెళ్ళేదాకా మా ఇంట్లోనే వుండేది. వాళ్ల అక్క  భాగ్య ఇప్పుడు మాకు వంట చేసిపెడుతోంది. ఇదిగో ఈ భాగ్య ‘భాగ్యమే’ ఫోటోలో యాదమ్మ నెత్తికెక్కిన వాడు,  ఆమె  ఏకైక సంతానం గౌతమ్. కాన్వెంటు స్కూల్లో చదువుకుంటున్నాడు.  పోతే, కళ తనకు పుట్టిన పిల్లలకు మా పిల్లల పేర్లే ‘సందీప్,సంతోష్’ అని పెట్టుకుంది. మా పిల్లలు అమెరికా నుంచి ఎప్పుడు ఫోను చేసినా వీళ్ళందరి యోగక్షేమాలు అడుగుతారు. మా ఇంట్లో యే శుభకార్యం జరిగినా మొత్తం కుటుంబం మా చెంతనే  సాయంగా వుండిపోతుంది.   అదీ ఈ ఫొటోకు మాకువున్న లింకు. (06-04-2013)

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

మీ పిల్లలు వాళ్ళ యోగ క్షేమాలడుగు తున్నారంటే ..(మా పిల్లలు కూడా హాస్టల్ నుంచి ఫోన్ చేసినప్పుడు ఇంట్లో పని చేస్తున్న వాళ్ల గురించి అడగడం...వాళ్ళకు ఫోన్ ఇవ్వమని చెప్పి వాళ్ల క్షేమం అడగటం) నాకు ఆశ్చర్యం గా ఉంటుంది..పెద పెద్ద మాటలు నాకు రావు గానీండి..వాళ్ల పెద్ద మనసుకు జోహోర్లు....

Jwala's Musings చెప్పారు...

Good Job