1, ఏప్రిల్ 2013, సోమవారం

అమరం అమరం అమరం – మన వీరుల చరిత అమరం




కొన్ని వీరోచిత గాధలు  వింటుంటే వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. మరి కొన్ని అవి యెంత పాత కాలానికి చెందినవైనా సరే తలచుకున్న మాత్రంలోనే  సరికొత్తగా జనాలను ఉత్తేజపరుస్తుంటాయి.
ఈ ప్రస్తావనకు నేపధ్యం 1962 నాటి భారత చైనా యుద్ధం. దేశానికి ఉత్తరాన హిమాలయాల్లో  16000  అడుగుల ఎత్తునవున్న రెజాంగ్ లా కనుమలో,  ఎముకలు కొరికే చలిలో కుమాన్ బెటాలియన్ సరిహద్దుల్ని  కాపుకాస్తోంది. నిండా నూటపాతిక మంది కూడా లేని ఆ భారత సైనికదళంలోని జవానులందరూ ఆహిర్లు. ఆహిర్లు జన్మతః వీరులు. వెన్ను చూపి పారిపోయే రకం కాదు. అందుకే ఆహిర్లను  చూడగానే శత్రువులవొంట్లో ఆవిర్లు పుడతాయని  చెప్పుకునేవారు.


(రెజాంగ్ లా  యుద్ధరంగం - చిత్రకారుడి వూహాచిత్రం)

 ఈ దళానికి వీరికి జోద్ పూర్ కు చెందిన  రాజ్ పుట్ వీరుడు మేజర్ షితాన్ సింగ్ కమాండర్ గా వున్నాడు. దళపతి గట్టివాడే కాని, నాటి వాతావరణమే అత్యంత దుర్భరంగా వుంది. అందుకుతగ్గ వసతులు ఏమీ లేవు. నిజానికి ఆ పరిస్థితుల్లో ప్రాణాలు నిలుపుకోవడానికే ఎన్నో సదుపాయాలు అవసరం. అవేవీ  వారికి లేవు. కేవలం   ప్రాణాలు వొడ్డి పోరాడడానికి అవసరమయ్యే  చెక్కుచెదరని  మనోధైర్యం, ఆత్మ విశ్వాసం మాత్రమే వారివద్ద పుష్కలంగా   వున్నాయని  ప్రపంచ ప్రసిద్ధి చెందిన టైమ్  మేగజైన్ రాసిందంటే  ఆ  వీర సైనికులకు అంతకంటే  చక్కటి కితాబు ఏం కావాలి?
123 మంది ఆహిర్లు వున్న ఆ దళానికి పై అధికారులనుంచి  ఒక ఆదేశంలాటి సందేశం అందింది.  'మీరు ఏమైనా చేయండి. చుషూల్ పట్టణం మాత్రం చైనా సైనికుల పరం కాకుండా చూడండి.'
అటేమో పరాయి సైన్యం  పూర్తి సమాయత్తంగా వచ్చింది.  భారత సైన్యం  వారికి సరితూగే పరిస్తితిలో  లేదు. శత్రు సైనికులు ఒకరి యాభయ్ మంది చొప్పున వున్నారు. సంఖ్యాపరంగా అంత తేడా వుంది. వారి ఆయుధాలు కూడా అత్యంత ఆధునిక మైనవి. వారికి వెనుకనుంచి  దన్నుగా అందే ఇతర సహాయాలు, తోడ్పాటు విషయంలో కూడా వాళ్లు  భారత సైనికులకంటే ఎన్నో రెట్లు  మెరుగ్గా వున్నారు.
నవంబర్, 18, ఆదివారం. చైనా సైన్యం ఒక్కుమ్మడిగా  భారత సైనిక స్థావరం పై విరుచుకుపడింది.
భారత సైన్యం వారిని ఎదురొడ్డి నిలచింది. ఒకరు పోతే మరొకరు అన్నట్టు చైనా సైనికులు నేల ఈనినట్టు పుట్టుకువస్తున్నారు. వారిని  నిలవరించడం భారత సైన్యానికి తలకు మించిన భారంగా పరిణమించింది. కమాండర్ మేజర్ షితాన్ తన సైనికులను ఉత్సాహపరుస్తూ ఒకచోటి నుంచి మరో చోటికి వేగంగా కదులుతూ తన జవానులకు వెన్నుదన్నుగా నిలిచాడు. శత్రువులు మాత్రం  మిడతల దండు మాదిరిగా వస్తూనే వున్నారు. భారత సైనికులు స్థైర్యం కోల్పోకుండా ఎదురు నిలుస్తూనే వున్నారు. ఇంతలో శత్రు సైన్యం భారత  కమాండర్ పైనే నేరుగా కాల్పులు జరిపింది. ఒక తూటా షితాన్  భుజంలోకి దూసుకుపోయింది. మరోటి నేరుగా పొట్టలో దిగబడింది. అయినా ఆ వీరుడు వెన్ను చూపలేదు. సరికదా శత్రుసైన్యంపై  కాల్పులు జరుపుతూనే పోయాడు. నిమిష నిమిషానికీ రక్త స్రావం అధికం అవుతోంది. శరీరం సహకరించడం లేదు. అయినా ఆ వీరుడు మడమ చూపలేదు. ప్రాణాలతో మిగిలిన కొందరు బారత జవాన్లు అతడిని చేతులమీద వేసుకుని యుద్ధరంగం నుంచి దూరంగా తీసుకుపోయి కాపాడాలని ప్రయత్నించారు. కానీ షితాన్ సింగ్  పడనివ్వలేదు. ప్రాణాలు పోతున్నాయని తెలిసి కూడా శత్రు సైన్యాన్ని మట్టుపెట్టాలనే తుదివరకు పోరాడాడు. ఆ పోరాటంలో రక్తస్రావం అధికం అయి యుద్ధరంగంలోనే అతడు వీరమరణం పొందాడు. భారత ప్రభుత్వం షితాన్ సింగ్ ధైర్యసాహసాలకు గుర్తింపుగా మరణానంతర  పరమ వీర చక్ర పురస్కారం ప్రదానం చేసి గౌరవించింది.
కుమాన్  దళంలోని 123 మందిలో అనేకమంది వీరోచితంగా పోరాడి అసువులుబాసారు. ఈ యుద్ధంలో పాల్గొన్న ప్రతి   భారత సైనికుడు  కనీసం అయిదుమంది శత్రువులను మట్టుబెట్టిన తరువాతనే  నేలకొరగడం జరిగింది.
నాటియుద్ధం యెంత భయంకరంగా సాగిందన్నది తరువాత ఆ ప్రాంతాన్ని సందర్శించిన తరువాత కాని అధికారులకు బోధపడలేదు. ఆ దృశ్యాలు కడు దయనీయంగా వున్నాయి. కందకాల్లో కానవచ్చిన మృత సైనికుల చేతుల్లో గురిపెట్టిన తుపాకులు కడవరకు వారు పోరాడిన తీరుకు సజీవ సాక్ష్యంగా వున్నాయి. కొందరి దేహాలు శత్రు సైనికుల కర్కశ దాడికి గురై  చిద్రమై కానవచ్చాయి. వారి చేతుల్లో తుపాకులు మాత్రం అలాగే వున్నాయి. భారత సైనిక  దళంలోని ప్రతి ఒక్కడూ వీరమరణాన్ని ఆహ్వానించాడే కానీ ప్రాణాలు దక్కించుకోవాలని ఎంతమాత్రం ప్రయత్నించలేదు. శత్రువుల దాడికి ఖండ ఖండాలుగా మారిన వారి శరీర భాగాలు అక్కడి కందకాల్లో పడివున్నాయి. తూటాలతో వారి శరీరాలు చిల్లులు పడిపోయాయి. ఒక సైనికుడి చేతిలో విసరడానికి సిద్ధంగా  వుంచుకున్న  బాంబు కనిపించింది. కానీ అతడిలో ప్రాణం మాత్రం లేదు.  చైనా సైనికుడి తుపాకీ తూటాకు బలైన మరో భారత మెడికల్  ఆర్డర్లీ చేతిలో సిరంజి, బ్యాండేజీ కనిపించాయి. ఒక డజను మందికి పైగా ఆహిర్ల శవాలు వారి స్థావరాలకు దూరంగా కానవచ్చాయి. అంటే  సైనికులను తరుముతూ వారు అంత దూరం వెళ్లారన్నమాట.
ఈ యుద్ధంలో చనిపోయిన ఒక ఆహిర్  హర్యానాలోని కోస్లి గ్రామం నుంచి వచ్చాడు. ఈ గ్రామానికి  ఒక ప్రత్యేకత వుంది. ఆహిర్ల ధైర్య సాహసాలకు, పోరాట స్పూర్తికి   ఈ గ్రామమే   ప్రత్యక్ష ఉదాహరణ. రెండో ప్రపంచ యుద్ధకాలం నుంచి ఈ నాటి వరకు  ఈ వూరిలోని ప్రతి కుటుంబం సైన్యంలోకి ఒకరిని పంపుతూనే వస్తోంది. ఈ చిన్న గ్రామంలో భారత సైన్యానికి చెందిన 106  మంది అధికార్లు, 500 మంది జవాన్లు ఈనాటికి కూడా పనిచేస్తున్నారంటే ఈ గ్రామం విశిష్టత అర్ధం చేసుకోవచ్చు.
ఆహిర్ జిందాబాద్ !
సెహభాష్ కోస్లి !
Note: Courtesy Artiste of the picture.

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

చాలా బావుంది వీరి పరిచయం. అహిర్ల మనో ధైర్యాన్ని మెచ్చు కునేందుకు మాటలు చాలడం లేదు