13, ఏప్రిల్ 2013, శనివారం

ఎన్టీయార్ పై పార్టీ తిరుగుబాటు రోజులు గురించి ఓ జర్నలిస్టు జ్ఞాపకంప్రముఖ తెలుగు టీవీ జర్నలిస్టు శ్రీ తోట భావనారాయణ నిర్వహిస్తున్న ‘తెలుగు టీవీ ఇన్ఫో’ అనే వెబ్ సైట్ లో ప్రస్తుతం ఎన్ టీవీ లో పనిచేస్తున్న  జర్నలిస్ట్ ఏ.ఎం.ఖాన్ యజ్దాని (డానీ) రాసుకున్న సొంత వూసులు ఇవి: 


జర్నలిస్టు డానీ 

“ఆంధ్రజ్యోతి దినపత్రికలో నా ప్రవేశం నాటకీయంగా జరిగింది. డెక్కన్ క్రానికల్ అంగ్ల దినపత్రికలో స్టాఫ్ రిపోర్టర్ గా వున్న నాకు  1990  జులైలో ఆఫర్ వచ్చింది. అప్పట్లో స్పాట్ న్యూస్ డైరెక్టర్ గా వున్న మా మిత్రుడు రావి రాంప్రసాద్ నన్ను ఆంధ్రజ్యోతిలోకి తీసుకోవాలని  చేసిన ప్రయత్నాలకు హెచ్ ఆర్ విభాగం గండి కొట్టింది. నక్సలైట్లతో నా సంబంధాలు " సజీవంగా " వున్నాయని ఒక నోట్ పెట్టింది. అలా ఆ ఆఫర్ నాటకీయంగా ముగిసింది.
“ఏడాది తరువాత ఆంధ్రజ్యోతికి మళ్ళీ  నా అవసరం వచ్చింది. అప్పట్లో, ఆంధ్రజ్యోతి విజయవాడ ఎడిషన్‌లో బ్యూరోచీఫ్ పోస్టు ఖాళీ అయింది. మరోవైపు, దూరదర్శన్ లో ప్రసారమయ్యే చాణక్య సీరియల్ తెలుగు ప్రచురణ హక్కుల్ని ఆంధ్రజ్యోతి అందుకుంది. ఒకవైపు, న్యూస్ బ్యూరో బాధ్యతలు నిర్వహిస్తూ, మరోవైపు, సంస్కృత-హిందీ భాషల్లో సాగే చాణక్య సీరియల్ ను వారంవారం తెలుగులోకి అనువదించే అభ్యర్ధి కోసం అంధ్రజ్యోతి అన్వేషణ మొదలెట్టింది. విజయవాడలో ఈ రెండు బాధ్యతల్ని కలిపి నిర్వహించగల అభ్యర్ధి అప్పట్లో నేను తప్ప మరొకరులేరు. అలా 1991 జులై 17 న నేను  అంధ్రజ్యోతిలో చీఫ్ రిపోర్టరుగా చేరాను.
“అప్పట్లో ఆంధ్రజ్యోతి కేంద్ర కార్యాలయం విజయవాడలో ఉండేది. హెడ్ క్వార్టర్స్ బ్యూరో చీఫ్ అనేది ప్రతిష్టాత్మకమైన ఉద్యోగం. అంతటి సున్నితమైన, సంక్లిష్టమైన, కీలకమైన  ఉద్యోగానికి నన్ను ఎంపిక చేసినందుకు నాటి అంధ్రజ్యోతి, మేనేజింగ్ డైరెక్టర్ కానూరి జగదీష్ ప్రసాద్ గారికి నేను జీవితాంతం ఋణపడివుంటాను. నేను అంధ్రజ్యోతిలో చేరడానికి రావి రాంప్రసాద్‌తో పాటూ, గారపాటి ఉపేంద్రబాబు. నల్లూరి వెంకటేశ్వర్లు, త్రిపురనేని శ్రీనివాస్ దోహదపడ్డారు. సంపాదకులు నండూరి రామ్మోహనరావుగారు తన కమ్యూనిస్టు వ్యతిరేకత కారణంగా మొదట్లో నా ప్రవేశాన్ని గట్టిగా అడ్డుకున్నాతరువాతి కాలంలో నా మీద వాత్సల్యాన్ని చూపించారు.  
“పత్రికలన్నీ పార్టీ కార్యకర్తలుగా పిడికిలి బిగించి  పనిచేసే  ప్రక్రియ అప్పటికింకా పూర్తికాలేదు. విశాలాంధ్ర, ప్రజాశక్తి పూర్తిస్థాయి కమ్యూనిస్టు పత్రికలుగానూ,  ’ఈనాడుతెలుగుదేశానికి మద్దతిచ్చే పత్రికగానూ వుండేవి. ఆంధ్రజ్యోతి వ్యవస్థాపకులు కేఎల్‌యన్ ప్రసాద్‌గారు కాంగ్రెస్‌లో ప్రముఖ నాయకులు కావడాన ఆ పత్రిక మీద చాలాకాలం కాంగ్రెస్ ముద్ర ఉండేది. కేఎల్‌యన్ ప్రసాద్‌గారి తరువాత పత్రికలో టీడీపీ ప్రభావం క్రమంగా పెరిగింది. అయినప్పటికీ, దాన్ని ఒక పార్టి పత్రిక అనడానికి వీల్లేదు. ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి పార్టీ అభిమానంకన్నా వివిధ రాజకీయ పార్టీల్లోని కొందరు ప్రముఖ నాయకుల మీద వ్యక్తిగత అభిమానం వుండేది.
“ఏ మీడియా సంస్థలో అయినా, న్యూస్ బ్యూరో అనేది యాజమాన్యం మనసెరిగి ప్రవర్తించడం  సంప్రదాయం. ఆవేశం పాళ్ళు కొంచెం ఎక్కువ కావడాన ఈ మనసెరిగి ప్రవర్తించే ప్రక్రియలో నేను విఫలం అయ్యాను. నా మార్క్సిస్టు-లెనినిస్టు రాజకీయాలు కూడా దానికి ఒక కారణం. పార్లమెంటరీ రాజకీయాల మీదా, వాటి నాయకుల మీదా నాకు ఎన్నడూ నమ్మకం లేదు. వాళ్లకు వ్యతిరేకంగా వార్త దొరికితే చాలు రెచ్చిపొయేవాడిని. ఎడిషన్ ఇన్-చార్జి యూఎస్‌ఎన్ రాజుగారు, డిప్యూటీ ఎడిటర్ గారపాటి ఉపేంద్రబాబుగారు నన్నుగాడిలో పెట్టడానికి  కొంచెం శ్రమించేవారు.
“రాజుగారి, ఉపేంద్రబాబుగారి బోధనలవల్ల కొంతకాలనికి నాకు అర్ధం అయ్యింది ఏమంటే నేను కమ్మ సామాజికవర్గానికి చెందిన నాయకులతో అంత సన్నిహితంగా లేనన్న అభిప్రాయం ఏర్పడిందని. నామీద ఈ అసంతృప్తి అర్ధసత్యం మాత్రమే. ప్రధాన స్రవంతికి చెందిన ఏ రాజకీయ ప్రముఖులతోనూ నాకు సన్నిహిత సంబంధాలు లేవు. అందులో, కమ్మ సామాజికవర్గం, కమ్మేతర సామాజికవర్గం అనే విభజనే లేదు. ఇది రాజకీయ విభేదమేతప్ప, సామాజికవర్గ విభేదం కాదు. ప్రధాన స్రవంతి రాజకీయాల్ని పక్కన పెడితేకమ్మ సామాజికవర్గంలో నాకు అత్యంత ఆత్మీయులున్నారు. ఆ మాటకొస్తే, మినహాయింపులేకుండా,   అన్ని సామాజికవర్గాల్లోనూ నాకు ఆత్మీయులున్నారు. ఈ విషయాన్ని నిరూపించుకునే సమయంసందర్భం కోసం నేను ఎదురుచూశాను.
“ఎంత గొప్పగా చెప్పుకున్నా ప్రజాస్వామ్యం అంటే అంకెల గారడీయే.  ప్రతి రాజకీయపార్టీ తన ఓట్ల సంఖ్యా బలాన్ని పెంచుకోవడానికి కొన్ని సామాజికవర్గాల మీద దృష్టి పెడుతుంది. అంతమాత్రాన సామాజికవర్గాలన్నీ గంపగుత్తగా ఒకే పార్టీలో వుంటాయని తీర్మానించలేం. పైగా ఈ సామాజికవర్గాల సమీకరణలు జిల్లాజిల్లాకూ మారిపోతుంటాయి. తెలుగుదేశం పార్టీ ఉభయ గోదావరిజిల్లాల శాఖల్లో కాపు సామాజికవర్గం ప్రాబల్యం ఎక్కువైతే, ఆ పార్టీ కృష్ణాజిల్లా శాఖలో కమ్మ సామాజికవర్గం ప్రాబల్యం ఎక్కువ.
“న్యూస్ బ్యూరోలో సీనియర్లు అధికార పార్టీ బీట్ చూడడం ఒక ఆనవాయితీ. నేను ఆంధ్రజ్యోతిలో చేరేనాటికి, కాంగ్రెస్ అధికారంలోవుంది. అలా నేను కాంగ్రెస్ బీట్ చూసేవాడిని.  1994 చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి గెలిచింది. కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. కృష్ణా జిల్లా కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో వంగవీటి రత్న కుమారి ఒక్కరే తిరిగి ఎన్నికయ్యారు. జిల్లాలో మొత్తమ్మీద మూడు చోట్ల మాత్రమే కాంగ్రెస్ అభ్యర్ధులు గెలిచారు. మిగిలిన పధ్నాలుగు స్థానాల్నీ టిడిపి -మిత్రపక్షాలు గెలుచుకున్నాయి. న్యూస్ బ్యూరోలో సీనియర్ గా  అధికార పార్టీ అయిన టిడిపి బీట్‌కు మారే అవకాశం వుండిందిగానీ, నేను మారలేదు. అప్పటి వరకు టిడిపి బీట్ చూస్తున్న  ఉన్నవ గోపాలరావు ఎన్నికల తరువాత కూడా అదే బీట్ లో కొనసాగాడు.
“ఆంధ్రజ్యోతిలో,  నేను ఎదురు చూసిన సందర్భం  1995  ఆగస్టులో వచ్చింది. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తిరుగుబాటు జరగడంతో, ఎన్టీ రామారావు ప్రభుత్వం సంక్షోభంలో పడిపోయింది. “శాసనసభలో బలాన్ని నిరూపించుకోవడానికి ఆగస్టు  27  ఎన్టీఆర్ కు ఐదు రోజుల గడువు ఇచ్చారు గవర్నర్ కిషన్ కాంత్. అంతకుముందు,  1984 ఆగస్టులో నాదెండ్ల భాస్కరరావు చేసిన తిరుగుబాటును ప్రజాబలంతో  విజయవంతంగా  తిప్పికొట్టిన అనుభవం ఎన్టీఆర్ కు వుంది. అదే నమ్మకంతో,  1984ను పునరావృతం చేసే లక్ష్యంతో ఎన్టీ రామారావు నల్లటి దుస్తులు వేసుకుని  నిరసన యాత్రకు బయలు దేరారు. అయితే ఈసారి ప్రకృతి వారికి సహకరించలేదు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఫలితంగా రాష్ట్రమంతటా భారీ వర్షాలు కురుస్తుండడంతో ఎక్కడా ఆయనకు జనసమీకరణ సాధ్యం కాలేదు.
“ఆగస్టు 27 నా పుట్టిన రోజు. ముందుగానే చిన్న టూర్ ప్లాన్ చేసుకున్నాం. కానీ, ప్రభుత్వ సంక్షోభం కారణంగా దాన్ని రద్దుచేసుకున్నాం. ఆగస్టు 28న ఎన్టీఆర్ రాజమండ్రి, భీమవరం, విజయవాడల్లో సభలు పెట్టుకున్నారు. రాజమండ్రి, భీమవరం సభలు దాదాపు రద్దు అయ్యాయి.  ఆయన రావల్సిన సమయంకన్నా రెండు గంటలు ముందుగానే విజయవాడ చేరుకుని కెనాల్ గెస్ట్ హౌస్ లో విడిది చేశారు.
“ఎన్టీఆర్ బీట్ నాదికాదు. మా గోపాలరావుది. అయినా, జరుగుతున్న పరిణామాల్ని ప్రత్యక్షంగా పరిశీలిద్దామనే వృత్తిపరమైన ఆసక్తితోకెనాల్ గెస్ట్ హౌస్ కు వెళ్ళాను. ఎన్టీఆర్ ను చూస్తానంటే మా పెద్దబ్బాయిని కూడా వెంట తీసుకెళ్ళాను.  అంతమంది ఎమ్మెల్యేల్లో, మంత్రి దేవినేని నెహ్రు ఒక్కరే అక్కడ కనిపించారు. మీడియా ప్రతినిధులు, ఎన్టీఆర్ అభిమానులతో కెనాల్ గెస్ట్ హౌస్ హడావిడిగావుంది. అయినప్పటికీ, ఎన్టీఆర్ స్థాయి జనాకర్షణగల నాయకునికి తగ్గ జనం అక్కడలేరు.


“ఇంతలో సమాచారశాఖ ఉద్యోగి ఒకరు బయటికి వచ్చి "డానీగారూ!" అని అరిచారు.
నేను జనాన్ని తోసుకుంటూ అటువైపు వెళ్ళాను.
"సియంగారు పిలుస్తున్నారు" అన్నాడతను.
నాది ఎప్పుడూ టిడీపి బీట్ కాదు. ఎన్టీఆర్ కు నేను తెలిసే అవకాశమూలేదు.
"నేను ఆంధ్రజ్యోతి డానీని. నన్నేనా పిలిచిందీ?" అనడిగాను అనుమానంగా.
"మిమ్మల్నే సార్! త్వరగా రండి" అన్నాడతను.
నేను వరండాలో నుండి, హాల్లోకి వెళ్ళాను. అక్కడ ప్రముఖ నాయకులందరూ ఏదో హడావిడిగా మాట్లాడుకుంటున్నారు. ఎవరో నా పేరు పలకడం వినిపించింది.
నన్నతను సియం ఛాంబరు లోనికి తీసుకువెళ్ళాడు. అక్కడ సమాచారశాఖ అధికారి చోరగుడి జాన్సన్, ఎన్టీఆర్ రాజకీయ కార్యదర్శి ఎన్. జయప్రకాష్ నారాయణ కనిపించారు. "లోపలికి వెళ్ళండి" అన్నారు వాళ్ళు నన్ను చూసి. నన్ను తీసుకుని వచ్చిన అతను యాంటి రూమ్ డోర్ దగ్గర  ఆగిపోయాడు. అక్కడ గుమ్మంలో నెహ్రు వున్నారు. ఆయన నన్ను లోపలికి తీసుకువెళ్ళి ఎన్టీ రామారావు ముందు నిలబెట్టారు.
“ఎన్టీఆర్ నల్లటి షర్టు, నల్లటి ప్యాంటు వేసుకుని వున్నారు. మనిషి బిగుసుకుపోయినట్టు బెడ్ మీద కూర్చున్నారు. రెండు చేతుల్ని గట్టిగా పరుపుని అదిమిపట్టారు. తలవాల్చి, నేలకేసి చూస్తున్నారు. చూడగానే వారేదో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారనిపించింది.
"నమస్కారం సార్" అన్నాను; వారికి ఎదురుగా నిలబడి.
"నమస్కారం. మీరు జానీయా?" అన్నారు నావైపు చూడకుండానే.
"జానీ కాదండి డానీ ... డానీ"
"ఊ... వారికి కాగితాలు, కలం ఇవ్వండి" అన్నారు.
నెహ్రూ నాకు కొన్ని తెల్ల కాగితాలు ఇచ్చి, డోర్ దగ్గరగా వేసి వెళ్ళిపోయారు. గదిలో నేనూ, ఎన్టీఆర్ మాత్రమే వున్నాం.
“రాడికల్స్ కార్యకర్తగా, విప్లవరచయితల సంఘం సభ్యుడిగా,  1983-89 ల నాటి ఎన్టీఆర్ పాలనను నేను అనేక సభల్లో తీవ్రంగా విమర్శించాను. ఆయనకు వ్యతిరేకంగా అనేక రచనలు చేశాను. నాటకాలు వేశాను. కానీ  నాముందు అలా కుప్పకూలిపోయివున్న ఆ మనిషిని చూడగానే ఎందుకో నేను ఒక రకమైన భావోద్వేగానికి లోనయ్యాను. 


"నేను మీ అభిమానిని సార్!" అనేశాను అనుకోకుండానే.   
"హ్హూ" అన్నారాయన . నైరాశ్యం ధ్వనించింది. అప్పుడూ నా వైపు చూడలేదు.
"రాసుకోండీ"  అంటూ మనసులోని ఆవేదనను వెళ్ళగక్కడం మొదలెట్టారు. చంద్రబాబునాయుడు ఎంతటి దయనీయ స్థితిలో తన దగ్గరికి వచ్చిందీ, తను ఎలా ఆదరించిందీ, ఎప్పుడెప్పుడు ఏఏ పదవులు కట్టబెట్టిందీ, వాళ్ళంతా ఎలా సంపాదించుకున్నదీ,   తనకు వ్యతిరేకంగా విశ్వాసఘాతకులు ఎలా కుట్ర చేసిందీ చెప్పారాయన. మధ్యలో, ఇదంతా తాను చేసిన పాపమే అని కూడా ఒకసారి బాధపడ్డారు. చంద్రబాబుని ఔరంగజేబ్ తో పోల్చారు.  జామాతా దశమగ్రహః  అని సంస్కృతంలో తిట్టారు. ప్రజాస్వామ్యాన్ని ప్రజలు కాపాడుకోవాల్సిన తరుణం వచ్చిందన్నారు. అలా, ఆయాస పడుతూ ఒక పావుగంట మాట్లాడారు.
"ఇందులోని ఒక్కో విషయాన్ని తీసుకుని వివరంగా రాయండి" అన్నారు.
అప్పటికి గానీ నన్ను అక్కడికి ఎందుకు పిలిచారో అర్ధంకాలేదు. అంతవరకూ ముఖ్యమంత్రి నాకు స్పెషల్ ఇంటర్వ్యూ ఇస్తున్నారు అనుకున్నాన్నేను. వారికి ఉపన్యాసాన్ని రాసిపెట్టడానికి పిలిచారని అప్పుడు అర్ధం అయింది.
“అంతలో, నెహ్రూ గదిలోకివచ్చి, ఎన్టీఆర్ కు తినుబండారాలు వడ్డించడానికి డైనింగ్ హాల్లోకి తీసుకెళ్ళారు.
ఎన్టీ రామారావుగారికి ఉపన్యాసం రాస్తున్నాననేమాట నాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చినట్టయింది. ఆ ఊపులో చకచకా పది పేజీలు రాసేశాను. ఇరవై నిమిషాల తరువాత ఎన్టీఆర్ మళ్ళీ గదిలోకి వచ్చారు. మళ్ళీ బెడ్ మీద, చెతులు అదిమిపెట్టి అలాగే పాత భంగిమలో కూర్చున్నారు.
“నేను రాసింది చదివి వినిపించాను. వారు కొన్ని చోట్ల మార్పులు, చేర్పులు చెప్పారు. నా చేతిలోని కాగితాల్ని చేతిలోకి తీసుకుని ఆయనే ఒకసారి చదువుకున్నారు. కామాలు, ఫుల్ స్టాపులు సరిగ్గా వుండాలని హెచ్చరించారు. ఉపన్యాసం చెప్పడానికి అనువుగా, వాటిని స్కెచ్ పెన్నుతో ఒక్కొక్క పాయింటును ఒక్కోపేజీలో పెద్దపెద్ద అక్షరాలతో మళ్ళీ రాయమన్నారు. నేను అలాగే చేశాను.
“అప్పటికే నేను ఆ యాంటీ రూమ్ లోకి వచ్చి దాదాపు గంట అవుతోంది. అంతలో నెహ్రూ లోపలికి వచ్చి "బయట మీ ప్రెస్సువాళ్ళు, లోపలికి వస్తామంటూ గొడవ చేస్తున్నారు" అన్నారు. నేను ఎన్టీఆర్ దగ్గర సెలవు తీసుకుని బయటికి వచ్చేశాను.
 "ఒక్కరికేనా సియం  ఇంటర్వ్యూ ?.  మిగతా మీడియాతో సియం మాట్లాడరా?" అంటూ అసహనంగా ఊగిపోతున్నారు నా పాత్రికేయ  సహచరులు. నేను సియంను హైజాక్ చేసి ఎక్స్ క్లూసివ్ ఇంటర్వ్యూ కొట్టేశానని వాళ్ళ అనుమానం. నన్ను గుర్రుగా చూస్తున్నవాళ్లందరినీ తప్పించుకుని నెమ్మదిగా అక్కడ నుండి బయటపడ్డాను.
“తరువాత సమాచారశాఖవాళ్ల ద్వారా తెలిసిందేమంటే, ఎన్టీఆర్ ఉపన్యాస వ్యవహారాల్ని అప్పట్లో లక్ష్మీపార్వతి చూసుకునేవారట. చంద్రబాబు తిరుగుబాటుకు లక్ష్మీపార్వతి కూడా ఒక కారణం కాబట్టి ఈసారి భార్యను తీసుకురాలేదట ఎన్టీఆర్. సియంకు ఉపన్యాసం రాసిచ్చేవాళ్ళు ఎవరైనా కావాలని వ్యక్తిగత కార్యదర్శి అడిగితే, చోరగుడి జాన్సన్ నా పేరు సూచించారట.
“ఆ రోజు సాయంత్రం విజయవాడ పిడబ్ల్యూడి మైదానంలో సభకు వర్షం వచ్చిందిగానీ, జనం రాలేదు. వేదిక మీద నుండి ఎన్టీఆర్ బొంగురు పోయిన గొంతుతో నిస్సహాయంగా, నిస్పృహతో  ఆవేదన వెళ్ళగక్కడం నాకు ఇప్పటికీ గుర్తుంది.
“సియం సభ విఫలమైనా, కమ్మ సామాజికవర్గానికి అగ్రనాయకుడైన ఎన్టీఆర్ కు సేవలందించినందుకు మా యాజమాన్యం కూడా ఆనందిస్తుందనే ఉత్సాహంతో ఆ రాత్రి ఆఫీసుకు చేరుకున్నాను.
“కానీ, అప్పటికే నా కథ అడ్డం తిరిగిపోయింది. 
 నేను అఫీసుకు చేరుకుని, న్యూస్ బ్యూరో క్యాబిన్ లోనికి వెళుతుంటే, ఎడిషన్ ఇన్-చార్జి యూఎస్‌ఎన్  రాజుగారు పిలిచారు. " ఏం డానీ! ఎన్టీ రామారావుకు నువ్వు ఏమైనా రాసిపెట్టావా? " అనడిగారు.


" స్పీచ్ రాసిపెట్టాను " అన్నాను.
" అనవసరంగా ఇరుక్కున్నావుగా! " అన్నారు.
వారేంచెపుతున్నారో  నాకు అర్ధం కాలేదు.
" మేనేజ్ మేంట్ చంద్రబాబును సపోర్టు చేయాలని నిర్ణయించుకుంది " అన్నారు.
నా కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్టయింది.
" అదేంటిసార్? " అన్నాను ఏం అడగాలో తెలీక.
" అవన్నీ తరువాత మాట్లాడుకుందాం. ముందు నీ మీద మేనేజ్‌మెంటుకు కోపం రాకుండా చూసుకో "
" ఇప్పుడు నన్నేంచేయమంటారూ? " అనడిగా.
" అన్ని పేపర్ ఆఫీసులకూ ఫోన్ చేసి, ఎన్టీ రామారావుకు నువ్వు ప్రసంగం రాసి ఇచ్చిన వార్త రాకుండా చూసుకో " అన్నారు.
వృత్తిలోనూ, సంస్థలోనూ రాజుగారు  నాకన్నా చాలా సీనియర్.  పైగా నేనంటే వారికి శిష్యవాత్సల్యం. నేను వారి టేబుల్ మీదున్న ల్యాండ్ లైన్  ఫోన్ నుండే మిగతా పత్రికలన్నింటికీ ఫోన్ చేశా. నా గురించి ప్రస్తావించవద్దన్నా. కొందరు అంగీకరించారు. కొందరు కుదరదన్నారు. 
" అదేంటి సార్! ఇలా చేశారు.  మేనేజ్‌మెంటు సంతోషిస్తుంది అనుకుంటే, నా ఉనికికే ముప్పు వచ్చి పడింది " అన్నాను రాజుగారితో కొంచెం  ఆక్రోశంగా. 
" ఇది వ్యాపారం. మేనేజ్‌మెంటు ఎవరిని సపోర్టు చేయాలో మనం నిర్ణయించలేంగా డానీ! "  అన్నారాయన తనదైన శైలిలో.
“ఆ రాత్రి ఆనందంగా నిద్రపోవాల్సిన నేను నిద్రలేకుండా గడిపాను.
“ఉదయాన్నే పత్రికలన్నీ కొని, తిరగేశాను. ఎవ్వరూ నాగురించి రాయలేదు.  హిందూ ఆంగ్లపత్రిక మాత్రం చిన్న సంకేతం వదిలింది.  "Mr. Ramarao had his food and took the help of a journalist to write down his speech legibly and in bold letters for him to read at the meeting" అని రాసింది.
“ఇది నన్ను ఆవరిస్తున్న ముప్పుకు తొలిసంకేతం మాత్రమే. ఆ మరునాడు, హిందూ రిపొర్టర్ ఎం. వెంకటేశ్వరరావు గారు నాతో చాలా సేపు మాట్లాడారు. ముప్పై ఏళ్ల క్రితం నేను ఎన్టీ రామారావుకు వీరాభిమానిననీ, ఆయన పేరు చెపితే చాలు ఎక్కడలేని ఉత్సాహంతో దుస్సాహసాలు కూడా చేసేసేవాడినని అన్నాను. ఒకప్పుడు నాకు ఎంతో ఉత్తేజాన్నిచ్చిన వ్యక్తి అలా చేష్టలుడిగి మంచంలో కూలబడ్దం చూసి ఉద్వేగానికి గురయ్యానన్నాను.


“నేను పిచ్చాపాటీగా మాట్లాడినదాన్ని హిందూ రిపోర్టర్ తనదైన శైలిలో, సెప్టెంబరు 4  నాటి రిపోర్టర్స్ డైరీలో  మళ్ళీ  పత్రిక్కి ఎక్కించారు. "The scribe said that he had been an admirer of Mr. Ramarao for his histrionic talents for over three decades. Mr. Ramarao was, however not aware that he has close links with naxalites and deserted extremism for journalism only a few years ago"   అని ముగించారు. ఈ విశ్లేషణ నన్ను మరో నాలుగు వివాదాల్లోకి పడేసింది.  అటు యాజమాన్యంతో, ఇటు పోలీసులతో నేను కొత్త వివాదాల్లో చిక్కుకోవడానికి ఇది పనిచేసింది. "ముప్పేళ్ల క్రితం నేను ఎన్టీఆర్ అభిమానిని" అని నేను అన్నది హిందూ పత్రికలో "ముప్పై ఏళ్ళుగా నేను ఎన్టీఆర్ అభిమానిని" అని మారిపోయింది. దాని వల్ల నక్సలైట్ కామ్రేడ్స్ కూ నా మీద కోపం వచ్చింది.
“కష్టాలు ఎప్పుడూ కలిసికట్టుగా వస్తాయి. నా చుట్టూ నాకు తెలియకుండానే హైదరాబాద్ లో మరో వివాదం రాజుకుంది. అప్పట్లో ఆంధ్రజ్యోతి స్టేట్ బ్యూరో చీఫ్ గా ఎస్సెస్సార్ ఆంజనేయులు వుండేవారు. ఆఫీసు మీటింగుల్లో ఒకటీ, రెండు సందర్భాల్లో చూడడం తప్ప వారితో నాకెలాంటి సాన్నిహిత్యమూ లేదు. నిజానికి ఎస్సెస్సార్ నాకు ఎదురైనా నేను వారిని గుర్తుపట్టలేను. స్టేట్  బ్యూరోలో ఎన్టీ రామారావుతో ఎస్సెస్సార్, చంద్రబాబునాయుడితో వేమూరి రాధాకృష్ణగారు సన్నిహితంగా వుండేవారు. ఎన్టీ రామారావు గద్దె దిగి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడంతో, న్యూస్ బ్యూరోలో  సమీకరణలు మారి రాధాకృష్ణగారి ప్రాబల్యం పెరిగింది. రాధాకృష్ణగారు నన్ను అకారణంగా యస్సెస్సార్ ముఠాగా భావించేవారు. యస్సెస్సార్ ఆంజనేయులు ఆదేశాలమేరకే  నేను  చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ కు ఉపన్యాసం రాసిచ్చానని వారి అభిప్రాయం. ఈ అపోహ తరువాతి కాలంలో నా ఉద్యోగ జీవితం మీద చాలా ప్రతికూల ప్రభావాన్ని చూపింది.
నీతి : జీవితంలో ఆనందంగా మొదలయ్యేవన్నీ ఆనంద ఘట్టాలుకావు. విషాదంగా మొదలయ్యేవన్నీ విషాద ఘట్టాలుకావు.
హైదరాబాద్, 2013 ఏప్రిల్ 11( ఉగాది)
రచన: జర్నలిస్ట్ ఏ.ఎం.ఖాన్ యజ్దాని (డానీ)

4 కామెంట్‌లు:

buddhamurali చెప్పారు...

బండారు గారు ఆ సమయం లో డానీ విజయవాడలో ఉన్నారు ..కాని మీరు హైదరాబాద్ లో ఉన్నారు ఏం జరిగిందో మీకు తెలియదా? ఈ సమయం లో మరు జరిగిన్దెమిఒతొ మీ కోణం లో రాయవచ్చు కదా .. బాగున్తున్ది. రిటైర్ అయిన మీరు నిష్పాక్ష పాతంగా రాయడానికి అవకాశం ఉంటుంది

పల్లా కొండల రావు చెప్పారు...

good one. పాత ఆంధ్రజ్యోతి లో ఓ మండల స్థాయి రిపోర్టర్ గా పని చేసిన నాకు యాజమాన్యం ఎలా ఉంటుందో అనుభవాలు ఉన్నాయి. అవమానాలూ ఉన్నాయి. నేడు పత్రికలూ అంటే పెట్టుబడిదారులకు మాత్రమె అవకాశాలు. అయినా ఉన్న అవకాశాలను ఉపయోగించుకుని వ్యవస్థలో మార్పు కోసం ప్రయత్నించాలి.

knmurthy చెప్పారు...

mitrudu dany rasindi akshara satyam.nenu jyothy lo pani chesaanu.

అజ్ఞాత చెప్పారు...

ఏమయినా ఒక ముఖ్యమైన ఘట్టాన్ని గుర్తు తీసుకువచ్చారు...
@ జీవితంలో ఆనందంగా మొదలయ్యేవన్నీ ఆనంద ఘట్టాలుకావు. విషాదంగా మొదలయ్యేవన్నీ విషాద ఘట్టాలుకావు...
మంచి సందేశం ఇచ్చారు...బాగుంది...