16, ఏప్రిల్ 2013, మంగళవారం

ఇదీ సంగతిఒక్కరు ఒక్కరంటే ఒక్కరు ముందుకొచ్చినా మా అమ్మ బతికేది అని ఆక్రోశిస్తోంది తెనాలి ఆడపడుచు మౌనిక. కంటిఎదుటే కన్నతల్లిని పోగొట్టుకున్న ఆవేదన ఆమెది.
తాగుబోతుల ముష్కర చర్యకు ఒక నిండు ప్రాణం నలుగురి ఎదుటే నడిబజారులో గాలిలో కలిసిపోయింది. ఆ క్షణంలో జరగాల్సింది జరగక, జరగకూడనిది జరిగిపోయిన తరువాత మాత్రం నానా హడావిడీ జరిగింది. తదాదిగా,  స్పందించని వ్యక్తులు లేరు. వ్యవస్థ లేదు. కానీ, సమయానికి సాయం చేయని సమాజం ఆ తరువాత ఎన్ని మొసలి కన్నీళ్ళు పెట్టుకుంటే ఏం లాభం? ఎవరికి లాభం? అదే ఆ అమ్మాయి చెబుతోంది. ఒక్కరు ముందుకొచ్చినా మా అమ్మ బతికేది అంటోంది.
సరే! నాలుగు రోజులు మీడియా హడావిడి. తరువాత అంతా మామూలే.
ఇలా వుండగానే మీడియాలో జైపూర్ రోడ్డు ప్రమాదం వార్త -     
జైపూర్ లో ఓ యువకుడు, భార్యను,  నాలుగేళ్ల కొడుకును,  నెలల పసికందుని స్కూటర్ పై తీసుకుని వెడుతుండగా లారీని డీకొని అందరూ  రోడ్డుపై పడిపోయారు. కట్టుకున్న ఇల్లాలు, కన్నకూతురు అతడి  కళ్ళముందే కన్నుమూశారు. గాయాలబారిన పడిన పిల్లవాడు, పక్కనే విగతజీవులయిన వారి దేహాలు, వాటిపక్కన నిలబడి నెత్తీనోరూ కొట్టుకుంటూ  సాయంకోసం అర్ధించే యువకుడు - నిజానికి ఈ దృశ్యం చూసినవారికి కళ్లు చెమర్చి తీరాలి.  అయితే జరిగింది వేరు. దారిన పోతున్న ప్రతిఒక్కరూ ఒక్క క్షణం పాటు ఆగి చూసిపోతున్నవారే కాని కలగచేసుకుని సాయం చేద్దామనుకున్న వారు ఒక్కరూ లేకపోయారు. గంటసేపు ఇదే సీను  ఎలాటి అంతరాయం లేకుండా కొనసాగింది. సాయపడేవారు లేకపోవడంతో నిస్పృహకు గురైన  ఆ యువకుడు నడిరోడ్డు మీదనే తలపట్టుకుని కుప్పకూలిపోయాడు. ఈ దృశ్యాలన్నింటినీ తరువాత ఈ పవిత్ర దేశంలోని  ప్రజలందరూ బుల్లితెరలపై వీక్షించి తరించారు. అది వేరే సంగతి.

ఈ నేపధ్యంలో ఒక పాత సంగతి గుర్తుచేసుకుందాం.
ఇది ఇప్పటి మాట కాదు. యాభై ఏళ్ళ పైమాటే.
మద్రాసు జనరల్ ఆసుపత్రి బీట్ చూసే ఒక విలేకరికి ఒక రోజు స్కూటర్ ప్రమాదంలో గాయపడి మరణించిన వ్యక్తి శవం కనిపించింది. పక్కనే ఎవరికోసమో ఎదురు చూస్తున్న లక్ష్మి అనే వ్యక్తి అతడికి తారసపడింది. ఆమె ఒక నిర్మాణ కూలీ. స్కూటర్ పై వెడుతున్న ఓ ఇద్దర్ని అటుగా పోయే వాహనం  కొట్టేసి ఆగకుండా అందరూ చూస్తుండగానే వెళ్ళిపోయింది. కిందపడి గిలగిలా కొట్టుకుంటున్నవారిని అందరితో పాటు ఈమె కూడా చూసింది. అందరూ వింత చూసేవారే కాని ఒక్కరూ కలగచేసుకోలేదు.  ఈమే పరిగెట్టుకువెళ్లి వాళ్ళను లేవదీయాలని ప్రయత్నించింది.  ఓ టాక్సీని ఆపింది. అప్పటికే ముగ్గురు నలుగురు ఆపకుండా పోయారు. మరి కిరాయి ఎవరిస్తారని టాక్సీవాడు అడిగాడు. డబ్బులేదు. ముక్కుపుడక చూపించింది. టాక్సీలో ఇద్దరినీ జనరల్ ఆసుపత్రికి తీసుకువెళ్ళింది.  అయిన ఆలస్యం వల్ల ఒకడు అప్పటికే చనిపోయాడు. ఈ స్తితిలో విషయం తెలుసుకున్న  విలేకరి హృదయం ద్రవించింది.
నిరక్షురాస్యురాలయిన ఓ కూలీ వనిత తన రోజుకూలీ కూడా వొదులుకుని, ముక్కుపుడక టాక్సీవాడికి ఇచ్చి ఆసుపత్రికి చేర్చిన వైనాన్ని ఆ విలేకరి మరునాడు తన పత్రికలో రాసాడు. ‘క్వాలిటీ ఆఫ్ మెర్సీ’ అనే శీర్షికతో రాసిన ఆ వార్త మద్రాసులో చర్చనీయాంశం అయింది. పోలీసు కమీషనర్ లక్ష్మికి పాతిక రూపాయల నగదు బహుమతి ప్రకటించారు. ఆమె రోజు కూలీ రూపాయన్నరతో పోల్చుకుంటే ఆ రోజుల్లో అది పెద్ద మొత్తమే. పత్రికా పాఠకులనుంచి కూడా మంచి స్పందన వచ్చింది. అనేకమంది ఆమెకు కానుకలు పంపారు. మధురై నుంచి వెంకటేశ్వరన్ అనే వ్యక్తి ఒక పార్సెల్ పంపాడు. గాయపడ్డవారి రక్తంతో తడిసిన ఆమె చీరెకు బదులుగా ఒక కొత్తచీరెను కానుకగా పంపించాడు. పత్రిక పాఠకులనుంచి దాదాపు వెయ్యి రూపాయల సాయం అందింది. వందరూపాయలు మించి వస్తే ఒక ఇత్తడి గిన్నె కొనుక్కుంటానని ఆ యువతి తరువాత అదే  పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ చదివిన కంచి కామకోటి పీఠాధిపతి, పరమాచార్య ఒక ఇత్తడి గిన్నెను కానుకగా పంపించారు.
ఇంతకీ అసలు విషయం ఏమిటంటే -
ఆ వార్త రాసిన పత్రిక హిందూ. ఆ వార్త రాసింది ఆ పత్రికలో కొత్తగా విలేకరిగా చేరిన ఆర్.జే. రాజేంద్రప్రసాద్.
(అర్ధం అయింది కదా. ప్రసాద్ గారు రాసిన ‘డేట్ లైన్ ఆంధ్ర’ అనే పుస్తకంలో ఈ సమాచారం వుంది. మొన్న ఆదివారం నాడు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆవిష్కరించారు. ప్రచురణకర్త శ్రీ ఆర్.ఎస్. ప్రసాద్. విశాలాంధ్ర ప్రచురణాలయం అన్ని శాఖల్లో ఈ పుస్తకం దొరుకుతుందని పేర్కొన్నారు. వెల: 75 రూపాయలు)
16-04-2013

2 కామెంట్‌లు:

hari.S.babu చెప్పారు...

ఈ దృశ్యాలన్నింటినీ తరువాత ఈ పవిత్ర దేశంలోని ప్రజలందరూ బుల్లితెరలపై వీక్షించి తరించారు.


Antha sepu alaa chachae manushulni tama chanelloe choopinchukovadaaniki panikochchae laa angles to movie teesthoo kaaalam gadipina vaallu manushulaa.. rabandulaa? Avunu Media raabandulu. Shavala meeda dabbu laerukunae sarikoththa adhamulu.Down with Media

hari.S.babu చెప్పారు...

ఈ దృశ్యాలన్నింటినీ తరువాత ఈ పవిత్ర దేశంలోని ప్రజలందరూ బుల్లితెరలపై వీక్షించి తరించారు.


Antha sepu alaa chachae manushulni tama chanelloe choopinchukovadaaniki panikochchae laa angles to movie teesthoo kaaalam gadipina vaallu manushulaa.. rabandulaa? Avunu Media raabandulu. Shavala meeda dabbu laerukunae sarikoththa adhamulu.Down with Media