27, ఏప్రిల్ 2013, శనివారం

మన్నించడమే మనిషి పని



ఆ దంపతులది అన్యోన్య దాంపత్యం.   లేక లేక మగపిల్లవాడు  పుట్టాడు. వాళ్ల ఆనందానికి అంతే లేదు. ఎత్తుకెత్తుగా పిల్లాడిని అబ్బురంగా అపురూపంగా పెంచుకుంటున్నారు. చూస్తుండగానే  అతడికి రెండేళ్లు వచ్చాయి.




తండ్రి ఒక రోజు హడావిడిగా ఆఫీసుకు వెళ్లాడు. ఆ తొందరలో తాను రోజూ వేసుకునే మందు  బాటిల్ మూతపెట్టడం మరచిపోయాడు.  ఆఫీసుకు వెళ్ళగానే ఆ విషయం గుర్తుకువచ్చింది. వెంటనే ఇంటికి  ఫోను చేసి భార్యకు విషయం చెప్పి ముందు ఆ  మందు  సీసా మాట  సంగతి చూడమన్నాడు. ఆమె సరే అంది కాని ఇంటిపనుల్లో తలమునకలైవుండి  ఆ విషయమే మరచిపోయింది. భర్త గుర్తు చేసిన విషయం ఆలస్యంగా ఆమెకు  గుర్తుకు వచ్చింది. కాని అప్పటికే జరగాల్సిన ఆలశ్యం జరిగిపోయింది.
ఇంట్లో  ఆడుకుంటున్న పిల్లాడికి భోజనాల బల్ల మీది మందు సీసా కనిపించింది. అందులోని ద్రవం రంగు అతడిని ఆకర్షించింది. చూసి ముచ్చట పడ్డాడు. మూత లేని ఆ సీసా పట్టుకుని  అందులోని మందంతా  గటగటా తాగేసాడు. అది పెద్దవాళ్ళు వాడాల్సిన మందు. వాళ్ళు కూడా కొద్ది డోసుల్లో తీసుకోవాల్సిన ఘాటయిన  ఔషధం. సీసా మొత్తం ఒకేసారి తాగడంతో ఆ పసివాడు తట్టుకోలేకపోయాడు.  మందు వికటించి పిల్లాడు వున్నపెట్టున స్పృహ కోల్పోయాడు. అది చూసి తల్లి  చిగురుటాకులా వొణికిపోయింది. అదిరే గుండెలతో  ఆదరాబాదరాగా పిల్లాడ్ని చేతుల మీద వేసుకుని దగ్గరలోని  ఆస్పత్రికి తీసుకువెళ్ళింది. భర్తకు ఫోను చేసి విషయం చెప్పింది. అప్పటికే  జరగరానిది జరిగిపోయింది. పిల్లాడి ప్రాణం పోయిందని  డాక్టర్లు  చెప్పగానే ఆమె పై ప్రాణాలు పైనే పోయాయి. ఆ నిజాన్ని తట్టుకోలేక  నిస్సత్తువుగా  కూలబడిపోయింది.
తండ్రి ఆఫీసునుంచి ఆఘమేఘాలమీద  వచ్చాడు. విగతజీవుడిగా మంచం మీద పడివున్న కన్నకొడుకుని చూశాడు. గుండెల్లోనుంచి  దుఃఖం తన్నుకువచ్చింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పిల్లవాడు తమ  అశ్రద్ధకి బలై  పోయాడన్న వాస్తవం అతడ్ని మరీ కుంగ తీసింది.  కుర్రాడి శవం పక్కనే కూలబడి గుండెలు బాదుకుంటూ రోదిస్తున్న భార్యను చూశాడు. ఆమె వైపు నెమ్మదిగా అడుగులు వేశాడు.
ఇదంతా తన వల్లనే జరిగిందనీ,  ఫోను రాగానే చేతిలో పని పక్కనబెట్టి ముందా  మందు సీసా భద్రం చేసి వున్నట్టయితే  ఈ పరిస్తితి  వచ్చివుండేది కాదని ఆ తల్లి  తల్లడిల్లుతోంది. భర్త వంక చూడడానికి కూడా భయపడుతోంది. నీవల్లనే ఇదంతా జరిగిందంటూ కోపడతాడని  కంగారు పడుతోంది.
అతడు భార్య దగ్గరికి వచ్చాడు. భార్య కళ్ళల్లోకి చూశాడు. ఆ చూపులో కోపం  లేదు. భుజం మీద చేయివేశాడు.ఆ స్పర్శలో కాఠిన్యం లేదు.  నెమ్మదిగా భార్యతో అన్నాడు.
‘ఇందులో ఎవరు చేసిందీ లేదు. ఎవరు చేయ కలిగిందీ  లేదు.వాడితో మనకు ప్రాప్తం లేదు. అందుకే ప్రాప్తమున్నలోకానికి వెళ్ళిపోయాడు’
భర్త నుంచి వచ్చిన ఈ అనూహ్య  స్పందన ఆమెను అంతులేని ఆశ్చర్యానికి గురిచేసింది.
కలా  నిజమా అనుకుంది. ఎన్నోమాటలు పడాల్సివస్తుందని అనుకుంటే భర్త పల్లెత్తు మాట అనకపోవడం  ఆమెకు వూరట కలిగించింది. జరిగినదాన్ని పొరబాటుగా తీసుకున్నాడే కాని తప్పుగా భావించని భర్త ఉదాత్త మనస్తత్వం  ఆమెను కదిలించివేసింది.  

‘జరగరాని ఘోరం జరిగిపోయింది. పొరబాటు  ఎవరిదయినా పిల్లవాడు దక్కకుండా పోయాడు. ఇందులో  నాకూ  భాగం వుంది. ఆఫీసు తొందరలో వెడుతున్నా కాస్త నేనే ఆ  మందు సీసా మూత తానే పెట్టినట్టయితే ఇంత ఘోరం జరిగివుండేదే కాదేమో.’
భర్త మాటలు లీలగా వినబడుతున్నాయి.
అతడి ఆలోచనలు అతడివి.
‘భార్యను నిందించడం వల్ల  లాభం ఏమిటి?  పిల్లాడిని కోల్పోయి అసలే పుట్టెడు దుఃఖంలో వుంది. నవమాసాలు మోసింది ఆమె.  పురిటి నొప్పులు భరించింది ఆమె.  ఇంటిదీపం కంటిముందే కన్నుమూయడం కంటే  కన్నతల్లికి  గర్భశోకం వేరే ఏముంటుంది.  నెపం  మోపి ఈ పాపం నీదే అనేయడం తేలికే. కాని అలాటి ఈటెల్లాంటి మాటలతో మనసును మరింత గాయపరిస్తే   ఆ కన్నతల్లి కడుపు మరెంతగా రగిలిపోతుంది.’
ఇలా ఆలోచించిన అతగాడు  భార్యను పల్లెత్తు మాట అనలేదు.
నిజానికి   ఈ పరిస్తితిలో ఆమెకు కావాల్సింది కూడా  వూరడింపుతో కూడిన ఓ చల్లని మాట. అది అర్ధం చేసుకున్నవాడు కాబట్టే  అతడు ఆ  విజ్ఞతను ప్రదర్శించాడు.  దానితో, అంత  దుఃఖంలోవున్న ఆమె మనసు  దూదిపింజలా తేలికయింది.
మంచి మనసుకు మంచితనం తోడయితే ఆ మనిషి మహామనీషి అవుతాడు.

(27-04-2013) 

కామెంట్‌లు లేవు: