25, ఏప్రిల్ 2013, గురువారం

ఆ వెధవలంతే దేవుడా! వాళ్లు మారరు!!




సుందరం ఓ పోస్టాఫీసులో పనిచేస్తుంటాడు. వేరే వూళ్లనుంచి వచ్చిన ఉత్తరాలను, వాటిపై చిరునామాలను చూసి వాటిని బట్వాడా చేసేవారికి అందించడం అతగాడి ఉద్యోగం.
ఒకరోజు పనిచేసుకుపోతుంటే కంటబడ్డ ఒక చిరునామా సుందరం దృష్టిని ఆకర్షించింది.
ఆ కవరుపై అడ్రసు స్పష్టంగా లేదు. ‘భగవంతుడికి’ అని మాత్రం వుంది.
దేవుడికి ఉత్తరం ఏమిటి అన్న ఉత్సుకతతో దాన్ని తెరిచి చూశాడు.
అందులో ఇలా రాసి వుంది.

“ పూజ్యులైన దేవుడి గారికి
సుందరమ్మ నమస్కారములు చేసి చేసుకుంటున్న విన్నపములు.
నీకు తెలుసు కదా నాకు ఎనభై ఏళ్ళ వయస్సులో  మొగుడు పోయాడు. ఆయన తాలూకు పెన్షన్ తప్ప వేరే ఆధారం లేదు. అవసరం వస్తే  ఆదుకోవడానికీ, మంచాన పడితే  ఇంత ఉడకేసి పెట్టడానికీ   పిల్లలూ పీచూ అంటూ ఎవరూ లేరు. ఆ పించను డబ్బు వెయ్యితోనే  కిందామీదా పడుతూ బతుకు బండి ఈడుస్తున్నాను. ఈ మధ్య చత్వారం వచ్చి చచ్చిందేమో  అంతా మసకలుగా వుంది. గూట్లో నీ ఫోటో ముందు దీపం వెలిగించడానికి కూడా ఈ మాయదారి శుక్లాలు అడ్డొస్తున్నాయి.  డాక్టర్ దగ్గరకు వెడితే, వచ్చే శుక్రవారం  ఓ వెయ్యి పట్రా, ఆపరేషన్ చేసి కంట్లో శుక్లాలు తీస్తానన్నాడు. ఏమైనా సరే ఈ సారి పించను డబ్బులు రాగానే సుక్రారం నాడు  ఆ డాక్టర్ దగ్గరికి వెళ్లాలని అనుకున్నాను.  అయితే పించను ఆఫీసుకువెళ్లి డబ్బులు తీసుకుని వస్తుంటే  ఓ మాయదారి మనిషి, వాడి జిమ్మడ, కళ్ళు సరిగా కనబడని  నా కళ్లుగప్పి పించను డబ్బులున్న నా చేతి సంచీ కాస్తా  ఎగరేసుకుపోయాడు.
“డాక్టరుకివ్వాల్సిన డబ్బు సంగతి సరే! నెల మొత్తం ఆ మొత్తంతోనే గడవాలి. ఎలారా దేవుడా అనుకుంటూవుంటే దేవుడుడివి నువ్వే గుర్తుకొచ్చావు. ఏం చేస్తావో తెలవదు. నాకా వెయ్యి రూపాయలు అర్జంటుగా  కావాలి. డాక్టర్ దగ్గరకు వెళ్ళి ముందు కళ్ళు బాగుచేయించుకోవాలి. ఆ తరవాతే ఏపనయినా. అంతదాకా నీకు దీపం వెలిగించడం కూడా కుదరదు. అందుకే ఏదో చేసి ఆ  వెయ్యి రూపాయలు నాకు వెంటనే పంపించు. నీకు సవాలక్ష పనులుంటాయి కాని నా  పని మాత్రం మరచిపోవద్దు. ముసల్దాన్ని. కాస్త కనికరించు. నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు – ఇట్లు నీ భక్తురాలు – సుందరమ్మ”

అది చదివి సుందరం కళ్ళు చమర్చాయి. ఆ ఉత్తరాన్ని ఆఫీసులో వున్న పదిమందికీ చదివి వినిపించాడు. ఆ ముసలిదాని కన్నీళ్ళ కధ అందర్నీ కదిలించింది. అందరూ తలో చెయ్యీవేసి ఆమెకు సాయం చేయాలని అనుకున్నారు. తోచినంత చందాలు వేసుకున్నారు. చేతయిన డబ్బు ఇచ్చారు. అంతా  కూడితే తొమ్మిది వందలు పోగయ్యాయి. పరవాలేదు ఈమాత్రం పంపితే,  మిగిలిన యాభై ఆవిడే సదురుకుంటుంది అనుకుని ఆ మొత్తాన్ని ఓ కవరులో పెట్టి ఆ ముసలావిడకు పంపారు. పంపిన దగ్గరనుంచి ఆవిడ నుంచి రాబోయే ఉత్తరం కోసం అంతా ఎదురు చూడడం మొదలు పెట్టారు.  శుక్రవారం వచ్చింది వెళ్ళింది. ఆ తరువాత వారం ఉత్తరం తప్పక వస్తుందని భావించారు. అనుకున్నట్టే భగవంతుడి పేరుతొ ఉత్తరం వచ్చింది. అంతా ఆసక్తిగా దాన్ని తెరిచి చూసారు.

“ఆపదలో ఆదుకున్న భగవంతుడికి వేలవేల నమస్కారాలు. నువ్వు దయతో  పంపిన డబ్బు ముట్టింది.  కొద్దిగా తక్కువపడ్డా మొత్తం మీద అవసరం గడిచింది. డాక్టరు గారు  నా కళ్ళు బాగుచేసాడు. చాలా తేటగా అనిపిస్తోంది.  నిన్నటి నుంచి మళ్ళీ నీ గూట్లో దీపం వెలిగిస్తున్నాను.

“అయితే ముసలిముండాదాన్ని. అనుభవంతో ఓ మాట చెబుతున్నాను. మనసులో పెట్టుకో. నువ్వయితే నేను అడిగిన వెయ్యీ పంపించేవుంటావు. కానీ ఈ పోస్టాఫీసువాళ్ళున్నారు చూసావు. వీళ్ళు వెధవన్నర వెధవలు. నువ్వేమో నామీద జాలిపడి డబ్బు పంపించావు.  వీళ్లేమో తమ బుద్ధి పోనిచ్చుకోకుండా అందులోనే  చిలక్కొట్టుడు కొట్టారు.  అందులో వంద నొక్కేసారు. వాళ్ళంతే! వాళ్లు మారరు. అది నాకు తెలుసు. ఎందుకయినా మంచిది నువ్వూ  తెలుసుకుంటావని రాస్తున్నా.  ఇట్లు నీ భక్తురాలు –సుందరమ్మ”

(ఇంగ్లీషులో నెట్లో కనబడ్డ కధకి తెలుగులో స్వేచ్చానువాదం.)
NOTE: Courtesy Image Owner

కామెంట్‌లు లేవు: