19, ఏప్రిల్ 2013, శుక్రవారం

ఉప్పుకప్పురంబు .......



గుండీలు మార్చినంత సులభంగా గుండెలు మార్చడంలో పేరొందిన ఒక సర్జన్ గారు తను నడిపే కారు ట్రబుల్ ఇస్తుండడంతో దాన్ని తీసుకుని మెకానిక్ దగ్గరికి వెళ్లాడు. ఆ సమయంలో మెకానిక్  మరో కారులోని భాగాలను అలవోకగా  విడతీస్తూ, మారుస్తూ బిజీబిజీగా వున్నాడు.  డాక్టర్ రావడం వోరకంట గమనించిన  మెకానిక్ ఆయన దగ్గరకు వచ్చి, చేతికంటిన గ్రీజు తుడుచుకుంటూ పలకరించాడు. ఆయన చెప్పింది విని చిటికెలో డాక్టరు గారి కారు బాగుచేసాడు. స్టార్ట్ చేసి చూపెట్టాడు. అంతతొందరగా పనిపూర్తిచేసినందుకు డాక్టర్ ధన్యవాదాలు తెలిపి డబ్బు తీసి ఇస్తుండగా మెకానిక్ వున్నట్టుండి    
“ఎన్నాళ్ళ నుంచో నాకొక  అనుమానం  డాక్టర్ గారు  అడగమంటారా?” అన్నాడు.
డాక్టర్ కూడా కాస్త తీరిగ్గా వున్నాడో యేమో  “చెప్పు ఏమిటి నీ సందేహం?” అని అడిగాడు.
మెకానిక్ కాసేపు అడగాల్నా వద్దా అన్నట్టు మొహం పెట్టి చివరికి అడిగేసాడు.
‘డాక్టర్ గారు. మీరేమో మనిషి గుండె ఓపెన్ చేసి, భాగాలు మార్చి, మరమ్మతు చేసి  మళ్ళీ రోగిని మామూలు మనిషిని చేస్తారు. నిజానికి మేమూ చేసేదీ  అదే. కారు ఇంజిన్ వూడతీస్తాం. చెడిపోయిన పార్టులు బయటకు తీస్తాం. కొత్త పార్టులు వేస్తాం.  పాత వాల్వులు తీసి కొత్త వాల్వులు వేస్తాం.  మళ్ళీ ఇంజిన్ మామూలుగా పనిచేసేట్టు చేస్తాం. మీరూ మాలాగే గుండె వాల్వులు మార్చి కొత్తవి వేస్తారు. మీకేమో అడిగినంత డబ్బు అడక్కుండానే ఇస్తారు. మా దగ్గరకు వచ్చేసరికి గీసి గీసి బేరం చేస్తారు. మీరూ మేమూ చేసేది ఒకే పని కదా! అటువంటప్పుడు  ఈ తేడా యెందుకు చెప్పండి?”
డాక్టర్ ఒక్క క్షణం నివ్వెరపోయినట్టు కనిపించినా వెంటనే తేరుకున్నాడు.  కారు  బానెట్  మీదికి  వొంగి అతడి చెవిలో గుసగుసలాడాడు.
అది విన్న మెకానిక్ ఒక్కసారి నోరు తెరిచాడు.
ఇంతకీ డాక్టర్ గారు ఆ మెకానిక్ చెవిలో చెప్పింది ఏమిటి?
కాస్త ఆలోచించి చూడండి..................

.........డాక్టర్ ఏంచెప్పాడంటే -
“నువ్వు చెప్పింది బాగానే వుంది. అయితే కారు నడుస్తున్నప్పుడు  ఆ పనేదో చేసి చూడు,  అప్పుడు తెలుస్తుంది తేడా ఏమిటన్నది”

కామెంట్‌లు లేవు: