కరోనాకు వాక్సిన్ కనుగొనేంత వరకూ అన్నీ అనుమానాలే. ఎవరూ తీర్చలేని సందేహాలే. తాగే నీటిద్వారా, పీల్చే గాలి ద్వారా, మనిషి నుంచి మరో మనిషికి ఈ వ్యాధి సోకుతుందని వదంతులు. వీటిని ఖండించేవారు లేరు, ద్రువపరిచేవారు లేకపోవడంతో ఎవరికివారే సొంత భాష్యాలు, సొంత వైద్యాలు ప్రచారంలోకి తెచ్చారు. మా చిన్నప్పుడు ఇంట్లో మడి దడి పెద్దవాళ్లు పాటించేవాళ్లు. అంటూ సొంటూ పిల్లల్ని దగ్గరకి రానిచ్చేవాళ్ళు కాదు. కాళ్ళూ చేతులూ కడుక్కోకుండా ఇంట్లోకి ప్రవేశం వుండేది కాదు. ఇదెక్కడి చాదస్తంరా బాబూ అనుకునేవాళ్లం.
కరోనా కాలంలో అందరిదీ ఇదే వరస. ఒక
ఇంట్లో వుండే మనుషులే ఎడం ఎడం. మూతికి గుడ్డలు, వీటిల్లో మామూలు మనుషుల కోసం మామూలు
మాస్కులు, . ఖరీదైన మనుషులకోసం ఖరీదైనవి. చావు ముంగిట్లో కూడా తేడాలు. చేతులు శుభ్రం చేసుకోవడానికి శానిటైజర్లు. లిఫ్టుల ముందు శానిటైజర్ స్టాండ్స్. ఏది
తినాలన్నా, తాగాలన్నా ముందు చేతులు కడుక్కోవడం, క్యూ లైన్లలో మనిషికి
మనిషికి నడుమ ఎడం వుండేట్టు చూసుకోవడం,
రోదసీ యాత్రీకల మాదిరిగా పెద్ద పెద్ద మాస్కులు తగిలించుకుని విమాన
ప్రయాణాలు, మధ్యలో ఒక సీటు ఖాళీ. క్షవర
శాలలు మూతపడడంతో మగవాళ్లు తలనీలాల మొక్కు వున్నవారిలా దుబ్బు జుట్లతో, మాసిన గడ్డాలతో కనబడేవారు. ట్రాఫిక్ పోలీసు కనబడగానే స్కూటరుకు తగిలించిన
హెల్మెట్ తీసి పెట్టుకున్నట్టు, ఎవరైనా ఫొటో తీస్తున్నారనే ఎరుక కలగగానే, మొహం సరిగా కనబడదని పెట్టుకున్న మాస్కులు కాసేపు తీసేయడం, ఓహో
ఎన్నెన్ని వేషాలు వేయించింది కరోనా. ఇప్పుడు గుర్తు చేసుకుంటే, నవ్వు వస్తుంది. కరోనా కాలంలో తప్పనిసరై చేసుకున్న కొన్ని మంచి
అలవాట్లు, తదనంతర కాలంలో కొనసాగించి వుంటే, కొన్ని అంటూ రోగాలు మటుమాయం అయ్యేవని
అనిపిస్తుంది.
శాస్త్రవేత్తలు అంతటి లాక్ డౌన్
కాలంలోను కిట్లు, మాస్కులు ధరించి
నిర్విరామ కృషితో వాక్సిన్ కనుగొన్నారు. అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ ధృవీకరణతో ఇది
ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.
2021 మార్చి ఇరవై ఎనిమిదిన ఒకేరోజు, ఒకే హాస్పటల్ లో పదహారు వేలమందికి కోవిడ్ వాక్సిన్ (ఫైజర్) ఇచ్చారని
అమెరికాలో సియాటిల్ లో ఉంటున్న మా పెద్దకోడలు భావన ఫోన్ చేసి చెప్పింది.
చదివింది బీ టెక్ అయినా తన అభిరుచి కొద్దీ టీచింగ్ లైన్ ఎంచుకుంది. అది కోవిడ్
సమయంలో కలిసి వచ్చింది. నర్సులు, టీచర్లు వాక్సినేషన్ విషయంలో
ప్రాధాన్యతా క్రమంలోకి వస్తారు. అంచేత వాక్సిన్ రాగానే మొదటి డోసు ఇచ్చారు. ఇది రెండోది.
మా వాడు మాత్రం
ఇంకా వెయిటింగ్ లిస్టులోనే వున్నాడు. వాళ్ళ
వరుస వచ్చేసరికి కొన్ని నెలలు పట్టేట్టు ఉందిట.
సియాటిల్ లోని ఒక పెద్ద హాస్పటల్ లో ఈ కోవిడ్ వాక్సినేషన్ కి భారీ ఏర్పాట్లు
చేశారట. ముందే టైం స్లాట్లు నిర్ణయించి ఎక్కువ సేపు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా,
స్లాట్ ప్రకారం టైముకు వచ్చిన వారికి వచ్చినట్టు వాక్సిన్ డోసు ఇచ్చారట.. ఉదయం ఆరు
గంటల నుంచి మొదలై సాయంత్రం వరకు ఇది కొనసాగిందట.
అజ్ఞానం, అవగాహన లేమి అని అనుకున్నా పర్వాలేదు కాని, వాక్సిన్ కనుగొనేంత వరకు, కరోనాను కట్టడి చేయడానికిఅప్పటికి
అందుబాటులో ఉన్న ఆచరణ సాధ్యమైన మార్గం, మనుషుల నడుమ కొంత దూరం ఉండేలా
చూసుకోవడం ఒక్కటే. ఇందుకోసం లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారం. ఒకరకంగా ఇది ప్రధమ
చికిత్స లాంటిది.
సామాజిక దూరమో, భౌతిక దూరమో ఏ పేరుతో పిలిచినా,
దాన్ని ఖచ్చితంగా పాటించడం ఒక్కటే ఆ నాటికి శరణ్యం. ముందు వ్యాధి
వ్యాప్తిని అరికట్టడం ప్రాధమిక బాధ్యత. ప్రభుత్వాలు ఈ దిశగానే అడుగులు వేసాయి. కొన్ని
ఫలితాలు కూడా వచ్చాయి.
ఉదాహరణకు అమెరికాలోని వాషింగ్టన్
రాష్ట్రం. ఈ రాష్ట్రంలోని సియాటిల్ లోనే ముందు ఈ వ్యాధి పొడసూపింది. పాజిటివ్
కేసులు వెలుగు చూసింది, కరోనా మరణాలు సంభవించింది కూడా ఈ నగరంలోనే. ఒకరకంగా
అమెరికాలో కరానా వ్యాధికి ఈ నగరాన్ని ఎపిసెంటర్ గా మొదటి రోజుల్లో అనుకున్నారు.
దేశంలో లాక్ డౌన్ పెట్టాలా అక్కరలేదా అని ఫెడరల్ ప్రభుత్వం మీన మేషాలు లెక్క పెడుతున్నప్పుడే, వాషింగ్టన్ స్టేట్ గవర్నర్ తమ రాష్ట్రంలో లాక్
డౌన్ ప్రకటించారు. రోజులు గడిచిన తర్వాత దాని సత్ఫలితాలు క్రమంగా అనుభవంలోకి రావడం
మొదలెట్టాయి. పాజిటివ్ కేసులు తగ్గలేదు కాని వాటి సంఖ్య పెరగకుండా ఆపగలిగారు.
ఒక చిన్న నిప్పు రవ్వ గాలికిలేచి
దూరంగా వున్న గడ్డి వాములపై పడి అవి భస్మీపటలం అయిన సందర్భాలు అందరి అనుభవం
లోనివే. కాబట్టి ఈ కరోనా నిప్పురవ్వ యావత్ సమాజాన్ని దహించకుండా వుండాలంటే బహుముఖ
చర్యలు అవసరం. అవన్నీ ఆచరణలోకి వచ్చేలోగా లాక్ డౌన్ ఒక్కటే పరిష్కార మార్గం అని శాస్త్రవేత్తలు భావించారు. అభివృద్ధికి ఆటంకం
అని తెలిసి కూడా చాలా దేశాల ప్రభుత్వాలు తలవూపక తప్పలేదు.
ఈ క్రమంలో ప్రజలకు సాధ్యమైనంత తక్కువ
అసౌకర్యం కలగకుండా చూసుకోవడం ఒక్కటే ప్రభుత్వాల బాధ్యత. చిన్న చిన్న ఇబ్బందులను
పెద్ద మనసు చేసుకుని భరిస్తూ అనవసరమైన ఆరోపణలు, విమర్శలు చేయకుండా ప్రభుత్వాలకు సహకరించడం ప్రజలు అలవాటు చేసుకోవాలి.
కొన్నాళ్ళు ఇది తప్పదు అనే నిర్ణయానికి అందరూ వచ్చారు.
కరోనా గురించి వేగంగా విస్తరించిన వదంతులు
అన్నీ అర్ధ సత్యాలే. వాతావరణంలో వేడి వుంటే ఈ వైరస్ నశిస్తుందని కొందరు అన్నారు. కానీ
ఈ వ్యాధి బాగా విస్తరించిన దేశాల్లో చలి వాతావరణం ఉన్న దేశాలతో పాటు ఉష్ణ దేశాలు
కూడా వున్నాయి. ఏదీ నిర్ధారణ కానీ నేపధ్యంలో ఈ ఊహాగానాలు ప్రజల్లో భయ సందేహాలను
మరింత పెంచడానికి మాత్రమే పనికివచ్చాయి. చదువుకున్నవాళ్లు సయితం తమకు తెలిసిన అరకొర జ్ఞానాన్ని నలుగురికీ
పంచాలనే అతి ఉత్సాహాన్ని తగ్గించుకోకపోవడం వదంతుల విస్తృతికి దోహదం చేసింది.
ఆ రోజుల్లో, తెలియని కొరానా గురించి తెలిసీ తెలియని మాటలు
చెప్పేవారిని చూస్తుంటే,
చిన్నప్పుడు చదువుకున్న నలుగురు దృష్టి లేనివాళ్ళు, ఏనుగు కధ గుర్తుకు వచ్చేది.
పెద్దగీత ముందు చిన్న గీత
కరోనా రాకకు ముందు వరకు కేన్సర్ పేరు
చెబితే జనం హడిలిపోయేవారు. కేన్సర్ నిర్ధారణకు చేసే పరీక్ష పేరు చెబితేనే కేన్సర్
వచ్చినట్టుగా భావించి ఇంటిల్లిపాదీ భయపడిపోయేవారు. ఎందుకంటే వర్తమాన ప్రపంచంలో
సామాన్యులు, అసామాన్యులు కూడా కేన్సర్ అంటే ఇక కేన్సిల్ అని ఆశలు వదులుకునే
పరిస్తితుల్లో జీవిస్తున్నారు. రోగి బతకడు అని తెలిసి కూడా, అలవి కాని చికిత్స చేయించక తప్పని పరిస్తితి. అదీ లక్షల్లో
ఖరీదు చేసే వైద్యం.
కరోనా సమయంలోనే మాకు తెలిసిన వాళ్ళలో
ఒకరికి అత్యంత భయంకరమైన ఈ కేన్సర్ వ్యాధి సోకినట్టు పరీక్షల్లో
నిర్ధారణ అయింది. భయపడిపోయి పెద్ద కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పించారు.
పదహారు లక్షల ప్యాకేజీతో పలానా రోజున ఆపరేషన్ చేస్తామని చెప్పి అందుకు అవసరమైన
కొన్ని పరీక్షలు చేశారు. ఆ రోగికి కరోనా పాజిటివ్ అనే సంగతి ఆ పరీక్షల్లో
బయటపడింది. అంతే! డాక్టర్లు కేన్సర్ ఆపరేషన్ పక్కన పెట్టి ఆ రోగిని ఐసొలేషన్ లో
పెట్టారు. పొద్దున్నే ఒక నర్సు వచ్చి బెల్లు కొట్టి తలుపు దగ్గర రెండిడ్లీలు ఉన్న
ప్లేటు పెట్టి వెళ్లిపోయేదట. వేళకు కొన్ని మందులు, భోజనం అలాగే. రోగికి ఎవరూ కనబడరు. ఇంటి మనుషుల్ని రానివ్వరు. అసలే
కేన్సర్ భయంతో బిక్కచచ్చి ఉన్న రోగికి ఈ పరిస్తితి మరింత భయానకంగా మారింది. బిల్లు
చూస్తే రోజుకు లక్ష.
కట్టగలిగిన స్థోమత వున్నవాళ్ళు కూడా వైద్యం ఎలా జరుగుతోందని ఆలోచిస్తారు.
కానీ అక్కడ రోగికి జరుగుతున్న చికిత్స అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. కరోనా నెగెటివ్
వచ్చిన దాకా కేన్సర్ గురించి ఆలోచించరు. పెద్ద గీత ముందు చిన్న గీత మాదిరిగా అంత
పెద్ద కేన్సర్ కూడా ఇంత చిన్న కరోనాముందు చిన్నదయిపోయింది.
కుటుంబ సభ్యుల ఆందోళన అంతా కరోనా
గురించి. కేన్సర్ విషయం మరిచిపోయారు.
(ఇంకా వుంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి