18, మార్చి 2021, గురువారం

చేట భారతం

 

సుదీర్ఘసుత్తికి 'చేట భారతం' అని పేరు. అది  ఇదే  అని మీకు  అనిపించినా  అభ్యంతరం లేదు.

 

తాతల తండ్రుల చంపుకొనుటకా ఈ భండనంబు కృష్ణా!

 

కురుక్షేత్ర రణక్షేత్రంలో  మహా భారత యుద్ధం ప్రారంభం కావడానికి ముందు తెల్లగుర్రముల రధమును తోలే నల్లనయ్యను అప్పటికి అజ్ఞాన తిమిరంలో కొట్టుమిట్టాడుతున్న అర్జునుడు అడుగుతాడీ ప్రశ్న. తదుపరి కృష్ణుడు గీతార్ధ సారం ఎరిగించిన తరువాత ఎరుకన బడిన సవ్యసాచి అన్నదమ్ములతో కలసి సాగించిన ఆ మహా సంగ్రామం అనంతరం కూడా నివృత్తి కాని సందేహం  ఇదే.

ఎందుకంటె పద్దెనిమిది రోజులపాటు జరిగిన మహా యుద్ధంలో విజయం సాధించిన  యుధిష్టురు

డికి మిగిలిందేమిటి? గుట్టలకొద్ది సైనికుల శవాలు. ఆనవాలు పట్టలేని ఆత్మీయుల కళేబరాలు.

కౌరవ పాండవుల తరపున యుద్ధంలో పాల్గొన్నఅనేక  అక్షౌహిణుల  సైన్యం నిహతమయింది.  శవాల గుట్టల నడుమ గెలిచిన పక్షాన  బతికిబట్టగలిగింది ధర్మజ,భీమ,అర్జున,నకుల,సహదేవులు, కృష్ణుడితో కలిపి మరో ఇద్దరు మాత్రమే. ఈ ఇద్దరిలో సాత్యకిని మినహాయిస్తే  యుయుత్సుడి విషయం మళ్ళీ అనుమానమే అంటారు చరిత్రకారులు.అంటే విజయలక్ష్మి వరించిన ధర్మజుని  పక్షంలో మిగిలింది  కేవలం ఏడుగురు మాత్రమే. అటు కౌరవ పక్షంలో ప్రాణాలతో బయటపడింది  నలుగురే నలుగురు.  అశ్వథామ, కృపాచార్యుడు, కృతవర్మ, కర్ణుడి కుమారుడయిన  విశ్వకేతు/ వృషకేతు.  ఎవరి కారణంగా ఈ మహారణం చెలరేగిందో ఆ కురు సార్వభౌముడు   దుర్యోధనుడితో పాటు దుశ్శాసనాది అతడి సోదరులందరూ  ఈ మహా యుద్ధంలో అసువులు బాశారు.

పదిహేను లక్షల  యాభయ్ మూడు వేల తొమ్మిది వందల సైనికులతో కూడిన  ఏడు అక్షౌహిణుల పాండవ దండుకు   సైన్యాధ్యక్షుడు  పాంచాల రాజు ద్రుష్టద్యుమ్నుడు కాగా,  ఇరవై నాలుగు లక్షల అయిదు వేల ఏడు వందల సైన్యం కలిగిన పదకొండు అక్షౌహిణుల కౌరవసేనకు తొలుదొల్త నాయకత్వం వహించింది భీష్మ పితామహుడు. యుద్ధ పరిసమాప్తి నాటికి ఇరువైపులా మొత్తం సైనికులందరూ తుడిచిపెట్టుకుపోయారు.

       

ఈ నాడు ప్రపంచ ప్రసిద్ధి పొందిన చారిత్రాత్మక మహా సంగ్రామాలలో దేనిలో కూడా ఈ స్తాయిలో మానవ హననం జరిగిన దాఖలాలు లేవు. అయినా కానీ, వీటి  జాబితాలో మహాభారత యుద్ధానికి చోటు దొరకకపోవడానికి కారణం ఏమిటి ? ఈ ప్రశ్నకు సమాధానం అన్వేషించే  క్రమంలో రూపుదిద్దుకున్నదే ఈ వ్యాసం.

 

ప్రధమ ప్రపంచ సంగ్రామం , ద్వితీయ ప్రపంచ యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా జరిగాయి. కానీ మహాభారత యుద్ధం అలా కాదు. కురుక్షేత్రం రణక్షేత్రంగా భారత యుద్ధం  ఒక్కచోటనే  ఏకధాటిగా పద్దెనిమిది దినాలు సాగింది. ఈ యుద్ధంలో పాల్గొన్న ఏ ఒక్క రాజు కూడా తిరిగి తన దేశాన్ని చేరలేదు. ఏ ఒక్క సైనికుడు కూడా మళ్ళీ  ఇంటికి వెళ్ళలేదు. రణరంగంలో మరణించిన వారందరి కర్మకాండలు యుద్ధభూమిలోనే జరిపిన దాఖలాలు వున్నాయి. భర్తలు వీర మరణం పొందిన కారణంగా వైధవ్యం పొందిన రాణులందరికి హస్తినాపురంలోనే ఆశ్రయం కల్పించారు. అంటే ఏ ఒక్కరు తమ దేశం చేరుకోలేదని అర్ధం.  యుద్ధానికి సంబంధించి కానీ, దాని ఫలితానికి సంబంధించి కానీ ఏ ఒక్క ఖచ్చితమయిన  కబురు ఆయా దేశాలకు చేరలేదని స్పష్టమవుతుంది.

సాధారణంగా చక్రవర్తులు  ఇలాటి మహాయుద్ధాలు తలపెట్టినప్పుడు తమకు కప్పం కట్టే సామంత రాజులను, ఇతర మిత్ర దేశాల అధినేతలను సాయం అర్ధించడం పరిపాటి. ఆ సందర్భాలలో సామంతరాజులు, మిత్రదేశాల మహారాజులు చక్రవర్తి కోరికమేరకు అతడు సాగించ బోయే యుద్ధంలో పాల్గొనడానికి తమ  యావత్తు సైన్యాన్ని  వెంటతీసుకుని యుద్ధం జరిగే దూర ప్రాంతాలకు వెడతారు. తమ చక్రవర్తి  విజయం సాధిస్తే సరేసరి. లేకపోతే తమ రాజ్యాలకు తిరిగి రావడమన్న పరిస్తితి సాధారణంగా తలెత్తదు.

ఆ పరిస్థితుల్లో ఆయా సామంత రాజుల రాజ్యాల్లో ఏమి జరుగుతుంది ? ఎన్నాళ్ళు గడిచినా  యుద్ధానికి వెళ్ళిన రాజు ఆచూకీ లేదు. అతడి సైన్యం జాడ లేదు. ఎన్నేళ్ళు గడిచినా వారిని గురించిన సమాచారం లేదు.   తిరిగి వస్తారో రారో తెలియదు.

కురుక్షేత్రంలో జరిగిన మహాభారత యుద్ధాన్నే తీసుకుందాము. కౌరవ పాండవ పక్షాల తరపున అనేకమంది సామంత రాజులు, మిత్ర దేశాల వారు, వారి సమస్త సైన్యాలు పద్దెనిమిది రోజులపాటు జరిగిన యుద్ధంలో పాల్గొన్నారు. అరివీర భయంకరంగా సాగిన ఈ మహా సంగ్రామంలో లక్షలాది సైనికులు ప్రాణాలు అర్పించారు. ఇంత పెద్ద సంఖ్యలో రాజులు, సైనికులు  పాల్గొన్న ఈ యుద్ధం పరిసమాప్తి అయ్యేనాటికి బతికి బట్ట కట్టిన వారి సంఖ్య ఇరువైపులా కలిపి అక్షరాలా పన్నెండుమంది అంటే  ఓ పట్టాన నమ్మడం కష్టమే. కానీ జరిగిందదే.

 

అనేక దేశాల రాజుల్ని, సైనికులను మూకుమ్మడిగా బలిగొన్న ఈ యుద్ధం ముగిసిన తరువాత ఆ యా దేశాలలో పరిస్థితులు ఏవిధంగా మారి వుంటాయి ? రాజులు  లేని ఆ రాజ్యాలలో స్తితిగతులు ఏవిధంగా తయారయివుంటాయి ? ఈ ప్రశ్నలకు జవాబులు వూహించడం కష్టమేమీ కాదు.

రాజు యుద్ధానికి వెళ్లాడు. తిరిగి రాలేదు. అతడి వెంట వెళ్ళిన సైన్యం అతీగతీ లేకుండా అదృశ్యం అయిపొయింది. పన్నులు వసూలు చేసే వాళ్లు లేరు. అథవా చేసినా  ఆ మొత్తంలోనుంచి కప్పం సొమ్మును చక్రవర్తి ఖజానాకు  దఖలు పరిచే యంత్రాంగం లేదు. పైగా  కప్పం కట్టమని చక్రవర్తి తరపున  వొత్తిడి చేసేవారూ లేరు. అసలు చక్రవర్తే లేడు. లేడన్న విషయం కూడా  చాలాకాలం వరకు జనాలకు తెలియనే తెలియదు. అది వేరే విషయం.

దాంతో  హఠాత్తుగా ఈ చిన్న రాజ్యాలకు వూహించని రీతిలో స్వేచ్చ లభిస్తుంది. తాము ఎవ్వరికీ బానిసలం కామన్న ఎరుక వారికి కలుగుతుంది.

ఈ పరిణామాల ఫలితంగా ఆ చిన్ని చిన్ని  రాజ్యాల్లో పెను మార్పులు అనూహ్యంగా చోటుచేసుకుంటాయి. యుద్ధానికి వెళ్లి తిరిగి రాని రాజు స్తానంలో  రాజ్యాధికారం స్వీకరించిన కొత్త  రాజుకు కొత్త ఆలోచనలు ముప్పిరిగొనడం కూడా సహజం. రోజులు గడిచేకొద్దీ  తాను సర్వ స్వతంత్రుడిని అన్న భావన ఆ రాజులో  ప్రబలమవుతుంది. తరాలు గడిచేకొద్దీ నూతన తరం రాజుల  ఆలోచనలు మరింత మారుతాయి. తాతల కాలంలో తాము ఒక చక్రవర్తికి  సామంతులం అని గుర్తు చేసుకోవడం  కూడా వారికి  ఇష్టం వుండదు. పైపెచ్చు, అటువంటి చారిత్రిక  ఆధారాలు కనబడితే వాటిని ధ్వంసం చేయడానికి కూడా  వెనుకాడరు. పాత చరిత్రను సమాధి చేసి కొత్త సంస్కృతికి స్వీకారం చుడతారు. ఈ విధంగా చరిత్ర లోని వాస్తవాలు కాలగర్భంలో కలిసిపోతాయి.

మామూలుగా ఏదయినా యుద్ధం జరిగి అది ముగిసినప్పుడు రెండు రకాల పరిణామాలు చోటుచేసుకోవడానికి వీలుంది. కొన్ని సందర్భాలలో చాలాకాలం వరకు స్తబ్ధత నెలకొంటుంది. జరిగిన పరిణామాలను చూస్తూ ఏర్పడ్డ విభ్రమ  నుంచి తేరుకోవడానికి ఎంతో వ్యవధి అవసరమవుతుంది. మరికొన్ని సందర్భాలలో మార్పులు వూహాతీతంగా ప్రచండ వేగంతో చోటుచేసుకుంటాయి. కురుక్షేత్ర యుద్ధం తరువాత జరిగింది ఇదే.

కౌరవ పాండవ మిత్రదేశాలలో ముందు స్తబ్ధత నెలకొంది. సమాచారం అందక పోవడం వల్ల అలా జరిగివుంటుంది. రాజు లేడు. అతడి సైన్యం లేదు. జనాలకు ఏం చెయ్యాలో తెలియని అయోమయ స్తితి.

అయితే, కొద్ది కాలంలోనే పరిస్థితుల్లో మార్పు వస్తుంది. ముందు చెప్పినట్టు పాత తరం స్తానంలో కొత్త తరం రంగ ప్రవేశం చేస్తుంది. ఆ తరం క్రమంగా మునుపెప్పుడో మహా భారత యుద్ధంలో పాల్గొన్న తమ  పూర్వీకుల జ్ఞాపకాలను తుడిచిపెట్టే పనిలో పడుతుంది. ఒకానొక  కాలంలో తాము వేరెవ్వరికో కట్టుబానిసలుగా బతికామన్న  చేదు నిజాన్ని నిలువులోతున పూడ్చిపెడుతుంది. ఈ  క్రమంలో అసలు చరిత్ర మరుగున పడుతుంది. పాత  చరిత్రకు కొత్త భాష్యం ఆవిష్కృతమవుతుంది.

 

యుద్ధాలు జరిగినప్పుడు భౌతిక నష్టాలు మాత్రమే ప్రస్పుటంగా కానవస్తాయి. ఏ యుద్ధం గురించి చెప్పాల్సి వచ్చినా ముందు దానివల్ల వాటిల్లిన ధన, ప్రాణ నష్టాలు గురించే పేర్కొనడం కద్దు. కాని కొన్ని యుద్ధాలవల్ల కలిగే కష్టనష్టాలను రానున్న తరాలు కూడా అనుభవిస్తాయి. హిరోషిమా, నాగసాకీ  ఉదంతాలే ఇందుకు సాక్ష్యం. ఆనాటి ఆటంబాంబు పేలుడు కలిగించిన   అణు ధార్మిక ప్రభావం దుష్పరిణామాలను ఆ తరువాత అనేక తరాలు చవిచూడవలసి వచ్చింది. నిజానికి అప్పుడు వాడిన అణుబాంబులు ఇప్పటివాటితో పోలిస్తే నాసిరకమైనవనే చెప్పాలి. అల్పమయిన ఆ అణుబాంబులు మానవాళికి  కలిగించిన నష్టం మాత్రం అనల్పం.

ఈ ప్రస్తావన ఎందుకంటె -

మహాభారత యుద్ధంలో ఇరు పక్షాల  యోధులు అనేక మహిమాన్విత  అస్త్ర శస్త్రాలను ప్రయోగించారు. అవి విడుదలచేసిన అపారమైన శక్తి ప్రభావం  మానవాళిపై పడిందనుకోవాలి. బహుశా ఆ కారణంగానే మనుషులకు మాత్రమే వరంగా లభించిన మానసిక సున్నితత్వం  వారిలో అడుగంటి పోయిందని అనుకోవాలి. నాటి  అస్త్ర శస్త్రాల ప్రయోగ ఫలితంగా ఆవిర్భ వించిన మహానలం  తాలూకు  అగోచర శక్తి యావత్ భూమండలాన్ని చుట్టుముట్టి  మనుషుల మనసులను  కలుషితం చేసివుండాలి.  కలియుగంలో తలెత్త నున్న   వైపరీత్యాలకు, వైకల్యాలకు అప్పుడే బీజం పడి వుండాలి.

 

మహాభారత యుద్దానంతరం  కొన్నిలక్షల  సంవత్సరాల వరకు తీవ్రమయిన స్తబ్ధత చోటుచేసుకుంది. దీన్ని చీకటి కాలంగా భావించారని  అనుకోవడానికి  కొన్ని ఆధారాలు వున్నాయి.  దీనిని గురించిన ప్రసక్తి  కధాచరిత సాగరంలో కూడా వుంది. ప్రాచీన తమిళ సాహిత్యంలో సైతం ఈ చీకటి ఘట్టం గురించిన ప్రస్తావన వుంది. ఆ భాషలో ఈ కాలాన్ని కలపిరార్ కాలంఅంటారు. చరిత్రకు అందని రాజులు పాలించిన కాలం అని అర్ధం. దాదాపు యాభయ్ రెండు లక్షల ఏళ్లకు  పైగా ఈ చీకటి యుగం  సాగిందని చెబుతారు.  

మహాభారత యుద్ధంలో  చోళులు, పాండ్యులు పాల్గొన్నట్టు కొన్ని ప్రాచీన గ్రంధాలలో వుంది. చోళ రాజుల్లో ఒకరు మహా  భారత యుద్ధ  సమయంలో పాండవుల కోసం ఏర్పాటుచేసిన వంటశాల నిర్వహణ బాధ్యతలు చూసేవాడని ప్రతీతి. యుద్ధసమయంలో పాకశాలను నిర్వహించడం అంటే కేవలం వంటచేసే వాళ్లని అర్ధం కాదు. నిజానికి చోళ రాజు తన సైన్యంతో కురుక్షేత్రానికి వెళ్ళింది యుద్ధంలో పాండవులకు సాయపడానికి. అయితే యుద్ధ వ్యూహంలో భాగంగా కర్తవ్య విభజన చేసే సమయంలో చోళ రాజుకు వంట శాలను ఆజమాయిషీ చేసే  బాధ్యత మీద పడింది.

యుద్ధానంతరం ఏర్పడ్డ చీకటి యుగం ముగిసిన తరువాత ఆయా రాజ్యాలలో ప్రబలమయిన శక్తులుగా ఎదిగిన వారందరూ నిజానికి ఆ రాజ్యాలకు సాధికారిక, వంశానుగత  ప్రభువులు కాదు.  వారిలో చాలామంది దొరికిన అవకాశాన్ని వినియోగించుకుని అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. పూర్వ చరిత్రను పూడ్చిపెట్టే  క్రమంలో వారు అనుసరించిన విధానాల ఫలితంగానే  మహాభారత యుద్ధ ప్రసక్తి  ప్రపంచ చరిత్రల్లో నమోదు కాకపోవడానికి  కారణమయివుంటుంది. కాకపొతే అనేక దేశాల చరిత్రల్లో ఒక గొప్ప యుద్ధం జరిగినట్టు మాత్రం పేర్కొన్నారు కానీ ఎటువంటి వివరాలు ఇవ్వలేదు.

ఈ  సమరంలో  కౌరవ పాండవ సేనలతో పాటు వారి తరపున అనేకమంది రాజులు, సామంత రాజులు వీరోచితంగా పోరాడి వీరస్వర్గం అలంకరించారు. వారితో పాటు వారి సైన్యాలు కూడా ఈ యుద్ధంలో తమ   శాయ శక్తులా పోరాడాయి. ఆ రోజుల్లో సుదీర్ఘ కాలం యుద్ధంలో పాల్గొనే సైనికులను అనుదినం  ఉల్లాస పరచడానికి నాట్య, నటీనట బృందాలను,  విదూషకులను ఆయా  రాజులు తమ తమ దేశాలనుంచి  వెంటబెట్టుకు వెళ్ళేవాళ్ళు. వందిమాగధులు సరే సరి. వీరికి యుద్ధంలో కత్తి పుచ్చుకుని పోరాటం చేయాల్సిన అవసరం వుండదు. వారి పనల్లా, ఏరోజుకారోజు సూర్యాస్తమయం తరువాత యుద్ధరంగం నుంచి అలసి సొలసి శిబిరాలకు  తిరిగొచ్చే   సైనిక దళాలను తమ  కళాకృతులతో ఉత్సాహ పరచడమే. యుద్ధంలో పాల్గొనే అవసరం లేనందువల్ల ఈ కళాకారుల ప్రాణాలకొచ్చే ముప్పేమీ వుండదు. కానీ యుద్ధానంతరం వీరి పరిస్తితి దయనీయం. తమను తీసుకొచ్చిన రాజులు, వారి సైన్యాలలో ఏ ఒక్కరూ మిగలక పోవడంతో దిక్కులేనివాళ్లు గా మిగిలిపోతారు.  వీరికి తమ దేశం దరి చేరడానికి దారీ తెన్నూ తెలియదు. ఆ నాటి యుద్ధనియమాల ప్రకారం ఇలాటివారందరూ గెలిచిన రాజుకు వశమవుతారు. పరాజిత సైన్యానికి చెందిన వారందరూ  ఆయుధాలతో సహా  విజేత పరమవుతారు.  అయితే ఈ విషయంలో  అస్త్ర శస్త్రాలలో అస్త్రాలకు మినహాయింపు వుంది. ఎందుకంటె  అస్త్రాలనేవి మునులను, దేవతలను మెప్పించి వీరులు  సంపాదించుకునేవి.  వాటిని పొందిన వారు యుద్ధంలో మరణించిన తరువాత  ఆ అస్త్రాలన్నీ తిరిగి స్వస్తానాలకు చేరుకుంటాయి.

యుద్ధం ముగిసిన తరువాత ఒంటరిగా మిగిలిన కళా కారుల బృందాలు ఆదరించే నాధుడు లేకపోతే   తిరిగి ఇంటి మొగం పట్టకతప్పదు.కానీ  స్వదేశం చేరగలమనే  నమ్మకం లేని ప్రయాణం. తమను వెంట తీసుకుని యద్ధానికి వచ్చిన తమ రాజే  శాత్రవుల చేతిలో మరణించాడు. గమ్యం అగమ్యం. అందుకే తిరుగు ప్రయాణంలో  మార్గ మధ్యంలో ఏదయినా వసతి దొరకిన చోట ఆగిపోతారు. అక్కడి స్తానికులు ముక్కూ మొగం తెలియని వాళ్లు. అలాటిచోట  ఆశ్రయం సంపాదించాలంటే  వారికి తెలిసిన విద్య ఒక్కటే. తాము దూరప్రాంతంలో  చూసిన దానికి  తమ  కళారూపాలతో ఒక రూపం కల్పించి, దానిని రసవత్తరంగా  ప్రదర్శించి ప్రజల మెప్పు, తద్వారా వారి నుంచి తమకు కావాల్సిన  సాయాన్ని పొందడమే వారికి కనిపించిన దారి. అందులోను  తాము ప్రత్యక్ష సాక్షులుగా వున్నది ఏదో సాదా సీదా వ్యవహారానికి కాదాయె. అరివీర భయంకరంగా సాగిన మహాభారత యుద్ధాన్ని దాపున వుండి గమనించే అవకాశం దక్కిన వాళ్ళాయె.  ఈ ప్రదర్సనల వల్ల  లోక ప్రసిద్దులయిన  కురు వంశపు రాజులు  పరస్పరం తలపడ్డ  మహా సంగ్రామ  విశేషాలను నలుగురికీ తెలియచెప్పి తృణమో పణమో సంపాదించు కున్నట్టూ  వుంటుంది. అలాగే,  తమనీ, తమ  కుటుంబాలనీ  బహుకాలం పోషించిన ప్రభువుల రుణం తీర్చుకున్నట్టూ  వుంటుంది. ఈ ఆలోచన వచ్చిందే తడవుగా ఆ బృందాలలోని

నాట్యకత్తెలు గజ్జె కట్టారు. కవులు, పండితులు  పాటలు  కట్టారు. విదూషకులు తమదయిన  ధోరణిలో చూసినదానికి హాస్యాన్ని జత కట్టారు.  సహజంగా కళాకారులు కాబట్టి తాము చూసిన దానిని వర్ణించే క్రమంలో కొంత నాటకీయత చోటుచేసుకోవడం సహజం.

నిజానికి  వీరిలో కొందరికి మహాభారత యుద్ధం ఎలా ముగిసిందో  తెలవదు. ఎవరు గెలిచారో తెలియదు. యుద్ధంలో తమ రాజు మరణించగానే , ఇక అక్కడ వుండి చేసేదేమీ లేదు కాబట్టి వారు యుద్ధభూమిని వొదిలి పెట్టి  ఇంటి మొగం పట్టిన వాళ్లు వీళ్ళు.

మార్గమధ్యంలో తమని ఆదరించి ఆశ్రయం ఇచ్చేవారు తటస్తపడగానే - మహా భారత యుద్ధం జరిగింది మీకు తెలుసా ?’ అని సంభాషణ మొదలు పెట్టేవాళ్ళు. కానీ, అప్పటికి యుద్ధం ఇంకా  కొనసాగుతూనే    వున్న సంగతి వారికి తెలియదు. తమను వెంట తీసుకువచ్చిన రాజు యుద్ధంలో చనిపోయాడని మాత్రమే వారికి తెలుసు.  ఉదర పోషణ కోసం ఒక గొప్ప యుద్ధం ఎలా జరిగిందో వర్ణించి చెప్పేవారు. యుద్ధాలు, పోరాటాలు  మొదలయిన విషయాలు గురించి  తెలుసుకోవాలనే ఆసక్తి జనాల్లో వుంటుంది. అదే నిరాశ్రయులయిన కళాకారులకు  భుక్తికి మార్గమయింది. జనాలను మరింతగా  ఆకర్షించడం కోసం తమకు తెలిసిన విషయాలకు రంగులు అద్దేవారు. ఆ విధంగా (ఆ నాటి భరత ఖండపు) దేశ దేశాల్లో మహాభారత యుద్ధానికి సంబంధించిన రకరకాల కధలు విభిన్న రూపాల్లో ప్రచారం లోకి వచ్చాయి. ఒక గొప్ప యుద్ధానికి సంబంధించిన సమాచారం రకరకాల రూపాల్లో  అన్ని ప్రాంతాలకు చేరిపోయింది. ప్రజలకు ఒక గొప్ప  సంగ్రామం జరిగిందని తెలుసు. అయితే, అది మహా భారత యుద్ధం అన్న వాస్తవం ఇతర దేశాలవారికి తెలవదు.

యుద్ధానంతరం ఏర్పడ్డ చీకటి యుగం -  యుద్ధం గురించి జానపద కళాకారులు ప్రాచుర్యంలోకి తెచ్చిన విభిన్న కధా రూపాలు -  ఆ యా దేశాల్లో అధికారంలోకి వచ్చిన నూతన తరం రాజులు తమ గతం గురించి అనుసరించిన నిరాసక్త విధానాలు -  ఇవన్నీ కలసి  వెరసి మహాభారత యుద్ధానికి చరిత్రలో సముచిత స్తానం లభించకపోవడానికి కారణమయ్యాయని చెప్పుకోవచ్చు.

 

సుమేరియన్ సంస్కృతిలో వెల్లడయిన మరో విశేషాన్ని మహా భారత యుద్ధం కవుల కల్పన కాదనడానికి  ఆధారంగా కొన్ని వెబ్  సైట్లు  పేర్కొంటున్నాయి.

ప్రాచీన  సుమేరియన్ సంస్కృతిలో చాలా భాగం ఏడుపులు, రోదనల ప్రాతిపదికగా ఏర్పడిందని చెబుతారు. ఒక మహా యుద్ధంలో సైనికులయిన  భర్తలను కోల్పోయిన వీర పత్నులు  కన్నీటితో విలపించిన సన్నివేశాలే వారి ప్రాచీన రచనల్లో కానవస్తాయి.

వారి పురాతన  చరిత్రలో కూడా మహా భారతాన్ని పోలిన కధ వుంది.

ఒక నగరాన్ని నిర్మిస్తారు. జూదం జరుగుతుంది. మరో నగరాన్ని తగలబెడతారు. ఒక మహిళ అవమానానికి గురవుతుంది.   మహాభారతంలో  మాదిరిగా ఈ సన్నివేశాలన్నీ అదే  క్రమంలో జరగవు. కానీ అంశాలన్నీ ఏదోఒక విధంగా భారత కధను గుర్తుకు తెచ్చేవిగా వుంటాయి.

యుద్ధం ముగిసిన తరువాత భర్తలను కోల్పోయిన ఆడవారందరూ కలసి విలపించే అంశంతో సుమేరియన్ ప్రాచీన సాహిత్యం రూపుదిద్దుకుంది.

భారత యుద్ధంలో  రాజుల మరణానంతరం రాణులు విలపించే ఘట్టాన్ని గురించిన ప్రసక్తి మహాభారతంలో కూడా  వుంది. (వేదాలు వేద విజ్ఞానం గురించిన ఒక ఇంగ్లీష్ వెబ్  సైట్ లో ఇచ్చిన వివరాలు ఈ వ్యాసానికి ఆధారం – Originally published in Tatwa Prakasha News Letter in English - రచయిత )  

(25-10-2011)

 

 

6 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

మీ సుదీర్ఘ వ్యాసం ఆసక్తికరంగా ఉంది సందేహం లేదు. చదువుతుంటే నాకు కొన్ని సందేహాలు కలిగాయి.

- // “మహాభారత యుద్దానంతరం కొన్నిలక్షల సంవత్సరాల వరకు తీవ్రమయిన స్తబ్ధత చోటుచేసుకుంది.” // అన్నారు పైన ఒక పేరాలో.

లక్షల సంవత్సరాలు కాదనుకుంటానండి. చరిత్రకారులు ఆ యుద్ధం జరిగింది బిసి 5561 లో అంటారు. కొంత మంది బిసి 3000 అంటారు గానీండి అధికంగా 5561 నే అంగీకరిస్తున్నట్లు తోస్తోంది. అంటే 7500 యేళ్ళయినట్లు.

- ఆ యుద్ధ వివరాల గురించి వివిధ కళారూపాల్లోనే గానీ మరే ఇతర రకాలుగా దొరకలేదు - అందరూ చనిపోయారు కాబట్టి అంటున్నారు. పైన వ్యాసంలోనే పాండవుల వంటశాల అజమాయిషీ చోళ రాజు చేశాడని అన్నారు. అంటే ఆయన యుద్ధం చెయ్యలేదన్నమాటేగా? ఆయన ద్వారా వివరాలు లభించి ఉండచ్చు కదా?

- సంజయుడు కూడా చూశాడు కదా.

- అసలు వ్యాసుడి మహాభారతంలో వివరిస్తాడు కదండీ?

ఇక ప్రపంచ చరిత్రలో కురుక్షేత్ర యుద్ధ ప్రస్తావన లేదు అంటే ఒకటే అనుకోవాలి. చరిత్ర వ్రాసింది విదేశీయులు / విజేతలు / పాలకులు / అధికంగా తెల్లవాళ్ళు. అసలు మన దేశ చరిత్ర కూడా వాళ్ళే వ్రాసి పారేసారు. వాళ్ళ దేశాల యుద్ధాలే వాళ్ళకు గొప్పగా అనిపిస్తాయేమో? Troy War, Crusades, రోమన్ విజయాల లాంటివి వాళ్ళకు గొప్ప.

అజ్ఞాత చెప్పారు...

ఇదంతా అబద్దం . మనిషి పుట్టిన నుండి యుద్ధ పిపాసి గానే పెరిగాడు . మతాలు లో కూడా అవి పవిత్రం అనే చొప్పించారు .
యూరోప్ అంత ఒకప్పుడు యుద్ధాల మయం , మొన్నటి వరకు కూడా మిడిల్ ఈస్ట్ లో జాతుల ఘర్షణలు ఉన్నాయి . ( ఇప్పుడు కూడా ఉన్నాయి , కాకపోతే వేరే రూపం లో ) . ఆసియ లో కూడా అంతే . గత 200 ఏళ్ళ నుండి దేశాలు మెల్లిగా కుదుటపడుతూ వస్తున్నాయి .
చెప్పొచ్చేదేంటంటే , ఆ కాలాల్లో , జనాలని యుద్దానికి సన్నద్ధం చేయడానికి , ఇలాంటి కథలు పుట్టిచ్ఛేవారు . యుద్ధవీరుడు , వీరస్వర్గం లాంటి పదాలు అలా వచ్చినవే . ప్రతీ దేశం లో యుద్ధ కథలు ఉన్నాయి ఎందుకంటే ప్రతీ చోట యుద్ధాలు జరిగాయి కాబట్టి .
మహాభారతం జరిగింది , కాకపోతే అది నిజంగా చేట భారతమే, చాప భారతం కాదు .

ఎవరో అటు పది మంది ఇటు పది మంది కొట్టుకుని ఉండి ఉంటారు . దానికి భారతం అని , అక్షౌహిణి లు అంటూ , కథలు అల్లుకుంటూ వచ్చేసారు .

:Venki

hari.S.babu చెప్పారు...

ఇదంతా అబద్దం . మనిషి పుట్టిన నుండి యుద్ధ పిపాసి గానే పెరిగాడు . మతాలు లో కూడా అవి పవిత్రం అనే చొప్పించారు-----ఎవరో అటు పది మంది ఇటు పది మంది కొట్టుకుని ఉండి ఉంటారు . దానికి భారతం అని , అక్షౌహిణి లు అంటూ , కథలు అల్లుకుంటూ వచ్చేసారు .
:Venki
18 మార్చి, 2021 6:45 PMకి

hari.S.babu
"ఇదంతా అబద్దం . మనిషి పుట్టిన నుండి యుద్ధ పిపాసి గానే పెరిగాడు." అని తీర్మానించేశారు.కానీ దానికి ఆధారం ఏమీ లేదు.పేరు మోసిన చరిత్ర కారులు మాత్రం క్రూరమైన యుద్ధాలు వెయ్యేళ్ళ అంధకార యుగం ముగిసి ఆధినిక సానాకెతిక విజ్ఞానం పెరిగాకనే జరిగాయని చెప్తున్నారు.నాగ్రికత పెరగక మునుపు తెగల, తండాల సంస్కృతిలో జరిగినవి కార్యకార్ణ అసంబంధాన్ని బట్టి చూస్తే చాలా అమాయకమైనవి.వాటిలో చాలామటుకు తనకు ప్రమాదం అనిపించినప్పుడు తనను రక్షించుకోవడానికి చేసినవే - తనను తను రక్షించుకోవడం కూడా తప్పనిపించేలా "మనిషి పుట్టిన నుండి యుద్ధ పిపాసి గానే పెరిగాడు" అనేస్తే ఏమిటి అర్ధం?కొంచెం కూడా కామన్ సెన్సు లేని మాటల్ని గంభీరమైన శాశ్వత సత్యాల్లా చెప్పడానికి సిగ్గు వెయ్యదా!

"ఎవరో అటు పది మంది ఇటు పది మంది కొట్టుకుని ఉండి ఉంటారు. దానికి భారతం అని , అక్షౌహిణి లు అంటూ , కథలు అల్లుకుంటూ వచ్చేసారు." అంటున్నారు - "ఉండి ఉంటారు" అట,చెప్పేదానికి గ్యారెంటీ లేదు, అయినప్పటికీ నాదే సత్యం అన్నంత ధీమా ఒకటి!

అజ్ఞాత చెప్పారు...

"కామన్ సెన్సు లేదా? సిగ్గు లేదా?" అంటూ నువ్వు బూతులేసుకో. "థూ. వీడితో మాటలేంటి" అంటూ వాల్లు వూరకుంటారు. దాన్ని నీ ఘనవిజయంగా డప్పేసుకో.

hari.S.babu చెప్పారు...

అజ్ఞాత చెప్పారు...
"కామన్ సెన్సు లేదా? సిగ్గు లేదా?" అంటూ నువ్వు బూతులేసుకో. "థూ. వీడితో మాటలేంటి" అంటూ వాల్లు వూరకుంటారు. దాన్ని నీ ఘనవిజయంగా డప్పేసుకో.

20 మార్చి, 2021 6:13 PMకి

hari.S.babu
తమరికి అస్సలు బూతులే రావు కదూ ,పాపం పాపం!

సొంత డబ్బా కొట్టుకోవాల్సిన ఖర్మ నాకేమిటీ, మీలాంటి వాళ్ళు కొడుతున్నారుగా!

చరిత్రకీ పురాణానికీ తేడా తెలియని దద్దమ్మల్ని ఎన్ని తిట్లు తిట్టినా తప్పు లేదు.

నేనలా తిట్టకపోయుంటే,మర్యాద చూపిస్తే అంత కన్న గొప్ప జవాబు ఏదో చెప్పగలిగిన ఘనులా వారు?అబద్ధం చెప్పాడు, వాయగొట్టాను.సమర్ధించుకోవడానికి నువ్వొచ్చావు.నిన్నూ వాయగొట్టాను.ఇంకెవరు ఉన్నారు క్యూలో?

జై శ్రీ రాం!

అజ్ఞాత చెప్పారు...

>> వాయగొట్టాను.సమర్ధించుకోవడానికి నువ్వొచ్చావు.నిన్నూ వాయగొట్టాను.

ఢమ ఢమ ఢమ డప్పు కొట్టెరా! తట్టుకోలేక ఆడప్పుకూడా పగిలి పోయెరా! వీడి సోది సౌండునుంచీ విడుదలెప్పుడని డప్పు కన్నీళ్ళు కార్చుచున్నదీ.. అయ్యో.. పాపం డప్పూ! వాడి కాళ్ళూ చేతులూ పడిపోయేదాకా నీకు మోక్షమే లేదా డప్పూ!