7, నవంబర్ 2021, ఆదివారం

అగ్నిమీళే పురోహితం – భండారు శ్రీనివాసరావు

 

(ఈరోజు 07-11-2021 ఆదివారం ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం)

చాలా చాలా వస్తువులు మన కళ్ళ ముందే కనుమరుగవుతున్నాయి. విశ్వనాధవారి బాణీలో చెప్పాలంటే ఇదొక పెను విషాదము.

కానీ పరిణామ క్రమంలో ఇవన్నీ తప్పని విష పరిణామాలు.

లాంతర్లు, చిమ్నీలు, రోళ్ళు, రోకళ్ళు, ఎడ్లబళ్ళు, కచ్చడం బళ్ళు, చల్ల కవ్వాలు, మేనాలు, వాటిని మోసే బోయీలు, మేనా మోస్తూ వాళ్ళు చేసే ఒహోం ఒహోం వొహ్ వోహోం వోహోం ధ్వనులు – ఎక్కడన్నా కనవస్తున్నాయా? ఎప్పుడన్నా వినబడుతున్నాయా?

నా చిన్నతనంలో మా సుబ్బయ్య తాతయ్య గారి దగ్గర ఓ గ్రామఫోన్ వుండేది. దాని ధ్వని నలుగురికీ బాగా వినబడడానికి దానికి గమ్మత్తయిన, విచ్చుకున్న పువ్వు  ఆకారంలో వుండే  రేకుతో చేసిన ఒక  స్పీకర్ తగిలించేవాళ్ళు. గ్రామఫోనుకు అదొక గుర్తుగా వుండేది. పాటల రికార్డులు మందపాటి భోజన పళ్ళాల మాదిరిగా పెద్దగా వుండేవి. వాటిమీద గాయనీగాయకుల పేర్లు, సినిమా పేరు, సంగీత దర్శకుడి వివరాలు ముద్రించేవాళ్ళు. గ్రామఫోనుకు గడియారం మాదిరిగా కీ ఇచ్చి, రికార్డు  దానిమీదవుంచి, అది తిరుగుతున్నప్పుడు ముల్లును జాగ్రత్తగా గాడిలో పెట్టేవాళ్ళు. ఆ ముల్లును గవర్నర్ అనే పరికరంలో బిగించే వాళ్ళు. రికార్డు తిరగడం ప్రారంభం కాగానే పాట మొదలయ్యేది. మా తాత గారు సంగీతం అంటే చెవికోసుకునేవారు. అందువల్ల ఆయన దగ్గర వున్నరికార్డుల్లో అన్నీ జావళీలే. ఒక్క ముక్క అర్ధం అయ్యేది కాదు. అయినా వూరు వూరంతా ఆ పాటలు వినడానికి పోగయ్యేవాళ్ళు. అంత చిన్న పెట్టెలో నుంచి పాటలు పాడుతున్నదెవరో తెలియక విస్తుపోయేవాళ్ళు. ఏదో మంత్రం పెట్టె పట్టుకొచ్చారని మా తాతగారిని అనుమానించిన వాళ్ళు కూడా వున్నారు.

పొతే, నేను రేడియోలో చేరినప్పుడు గ్రామఫోన్ రికార్డులు వుండేవి. కాకపొతే కాస్త నాజూకుగా చిన్నగా వుండేవి. ఇప్పడు వాటి జాడ కూడాలేదు. అన్నీ కంప్యూటర్ డిస్క్ లే. వాటికి కూడా కాలం చెల్లినట్టు వుంది. అంతా డిజిటల్. జగమంతా డిజిటల్. 

రేడియోలో చేరిన కొత్తల్లో ఓ రోజు జంధ్యాల స్వయంగా రేడియో స్టేషన్ కు వచ్చి తను మొదట డైరెక్ట్ చేసిన ‘ముద్దమందారం’ సినిమా పాటల రికార్డ్ ను ప్రసారం నిమిత్తం తెచ్చి నాకిచ్చివెళ్లడం ఇప్పటికీ ఓ మధుర విషాద స్మృతి.

తన గొంతు తాను వినాలని, తన మొహం తాను చూసుకోవాలని – ప్రతి మనిషికీ కొన్ని బలహీనతలు వుంటాయంటారు. ఇలా మనసుపడని మనుషులు వుండరేమో కూడా. రేడియోలో తమ గొంతు ఒక్కసారయినా వినపడాలని తాపత్రయపడి అందుకోసం ఎంతగానో ప్రయత్నించిన పెద్దవాళ్ళు ఎందరో నా వృత్తి జీవితంలో పరిచయం అయ్యారు. అలాగే ఋష్యశృంగుడు లాటి పెద్దమనుషులు కూడా ఫోటోలో తమ మొహం ఎలావుందో చూసుకోవాలని ముచ్చటపడడం కద్దు. అలాటి వాళ్లకు వాళ్ళ ఫోటో వాళ్ళకే చూపింఛి చూడండి. పైకి మొహమాటపడి చూసీ చూడనట్టు చూసి వొదిలేసినా, నలుగురు లేని సమయం చూసి ఒక్కమారయినా ఆ ఫోటోను తనివితీరా చూసుకోవడం మాత్రం ఖాయం అనే చెప్పాలి. ఆ రోజుల్లో రేడియోకు, ఈ రోజుల్లో టీవీలకు జనం వెంపర్లాడటం అన్నది జనంలో అంతరాంతరాలలో దాగివున్న వున్న ఈ బలహీనతవల్లే అని అనుకోవాలి.

సరి. మళ్ళీ గ్రామ ఫోన్ రికార్డుల సంగతికి వద్దాం.

ఈ రికార్డులకు హెచ్ ఎం వి (హిజ్ మాస్టర్ వాయిస్)ది పెట్టింది పేరు. ఈ కంపెనీ లోగో పై వుండే కుక్క బొమ్మ జగత్ ప్రసిద్ధం. అసలీ గ్రామ ఫోను రికార్డుల కధాకమామిషు గురించి ఈ కంపెనీ ఓ బుల్లి కరపత్రాన్ని ప్రచురించింది. ఇప్పుడు చెప్పబోయే కధనానికి అదే ఆధారం కనుక ఇది వొండివార్చిన వార్తా కధనం కాదని నమ్మడానికి ఆస్కారాలు వున్నాయి.

పందొమ్మిదవ శతాబ్దం లో థామస్ ఆల్వా ఎడిసన్ అనే శాస్త్రవేత్త గ్రామఫోను రికార్డును తయారు చేసారు. ఈ ఒక్కటే కాదు - విద్యుత్ దీపం, కెమెరా మొదలయిన వాటిని తొలిసారి కనుక్కున్నది కూడా ఎడిసన్ మహాశయులవారే అన్నది ఎలిమెంటరీ స్కూలు విద్యార్ధికి సయితం తెలిసిన విషయమే.

గ్రామఫోను రికార్డుని తయారు చేసిన ఎడిసన్ గారు – ఎవరయినా సుప్రసిద్ధ వ్యక్తి స్వరాన్ని మొదటి రికార్డుపై భద్రపరచాలని తలపోశారు. ప్రొఫెసర్ మాక్స్ ముల్లర్ ఆయన మదిలో మెదిలారు.

“మీ స్వరాన్ని రికార్డు చేయాలనుకుంటున్నాను, ఎప్పుడు కలవాలని” కోరుతూ మాక్స్ ముల్లర్ కి ఆయన వెంటనే లేఖ రాసారు. ఎడిసన్ పై ఎంతో గౌరవ ప్రతిపత్తులు కలిగిన మాక్స్ ముల్లర్, ఎడిసన్ అభ్యర్ధనను అంగీకరించారు. పలానా సమయంలో యూరోపులోని శాస్త్రవేత్త లందరూ ఇంగ్లాండ్ లో సమావేశం అవుతారనీ, అప్పుడువస్తే బాగుంటుందనీ ముల్లర్ జవాబు రాసారు.

ఆవిధంగానే ఎడిసన్ ఆ సమావేశానికి వెళ్లారు. మాక్స్ ముల్లర్ ఆయన్ని సభికులకు పరిచయం చేసారు. అప్పటికే ఎడిసన్ శాస్త్ర ప్రయోగ విజయాలను కర్ణాకర్ణిగా వినివున్న ఇతర శాస్త్రవేత్తలు ఆయన్ని సగౌరవంగా స్వాగతించారు.

తరువాత ఎడిసన్ అభ్యర్ధనపై మాక్స్ ముల్లర్ వేదికపైకి వచ్చి ఎడిసన్ వెంట తెచ్చుకున్న రికార్డింగ్ పరికరం ఎదుట నిలబడ్డారు. ఆయన చెప్పిన మాటలు రికార్డు చేసుకున్న ఎడిసన్ బయటకు వెళ్లి మళ్ళీ అదే రోజు మధ్యాహ్నం సమావేశ మందిరానికి తిరిగి వచ్చారు. ఈ సారి ఆయన చేతిలో ఒక రికార్డు కూడా వుంది. దాన్ని గ్రామ ఫోనుపై వుంచి ఆ ఉదయం రికార్డు చేసిన ముల్లర్ స్వరాన్ని సభికులకు వినిపించారు.

అందులో నుంచి వినిపిస్తున్న ముల్లర్ స్వరాన్ని వింటూ యావన్మందీ చేష్టలుడిగి పోయారు. భావి తరాలకోసం ముల్లర్ స్వరాన్ని భద్రపరచిన ఎడిసన్ కృషిని అంతా చప్పట్లు చరుస్తూ మెచ్చుకున్నారు. కరతాళధ్వనులు సద్దుమణిగిన తరవాత మాక్స్ ముల్లర్ మళ్ళీ వేదిక మీదకు వచ్చారు. సభికుల నుద్దేశించి ప్రసంగించడం ప్రారంభించారు.

“ఈ ఉదయం ఎడిసన్ మహాశయులు నా గొంతు రికార్డు చేస్తున్నప్పుడు మీరది విన్నారు. ఇప్పుడు మళ్ళీ గ్రామఫోను నుంచి వెలువడిన నా మాటలు కూడా విన్నారు. నేను ఉదయం ఏమి మాట్లాడానో, ఇప్పుడు మీరు ఏమి విన్నారో ఏమయినా, ఎవరికయినా అర్ధం అయిందా?” అని సభికులను సూటిగా ప్రశ్నించారు.

ఒక్కసారిగా సభలో నిశ్శబ్దం తాండవించింది. హాజరయిన వారందరూ వారి వారి విభాగాలలో నిపుణులు. నిష్ణాతులు. అయితే మాక్స్ ముల్లర్ ఏమి మాట్లాడారో వారిలో ఎవరికీ అర్ధం కాని మాట నిజం. కారణం ఆ భాష వారికి తెలవదు కాబట్టి. గ్రామఫోను నుంచి వెలువడుతున్న ముల్లర్ స్వరాన్ని వింటూ మైమరచిపోయిన సభికులు, ఆ ఆశ్చర్యంలో ఆయన ఏభాషలో మాట్లాడారన్నది గమనించలేదు. వాళ్ళంతా యూరోపు కు చెందినవాళ్ళు కాబట్టి ఆ భాషను వారెప్పుడూ వినివుండలేదు.

సభికుల అశక్తతను అర్ధం చేసుకున్న మాక్స్ ముల్లర్ తానేమి మాట్లాడిందీ తానే స్వయంగా వివరించారు. తాను మాట్లాడింది సంస్కృత భాషలో అన్నది ఆయన చెప్పేవరకు తెలియని శాస్త్రవేత్తలందరూ ఆశ్చర్యంతో నోళ్ళు వెళ్ళబెట్టారు. గ్రామ ఫోను రికార్డింగ్ కోసం అంతకుముందు పేర్కొన్న రిగ్వేదం లోని మొదటి శ్లోకాన్ని ఆయనమళ్ళీ చదివి వినిపించారు.

“అగ్నిమీళే పురోహితం – యజ్ఞ స్వదేవ మృత్విజం హాతారం రత్నశాసనం” – ఇలా సాగిపోతుందా శ్లోకం. ప్రపంచంలో మొట్టమొదటి గ్రామఫోను రికార్డుపై రికార్డయిన  అరుదైన రికార్డును, రిగ్వేద శ్లోకానికి,  మాక్స్ ముల్లర్ ఆవిధంగా కట్టబెట్టారన్న  విషయం తెలపడమే ఈ కధనం లోని విశేషం.

(EOM)

NOTE: అగ్ని మీళే పురోహితం శ్లోకానికి ప్రతిపదార్ధ తాత్పర్యాలు ఆంధ్రామృతం బ్లాగులో వున్నాయి. అవి యధాతధంగా: 

ప్రతిపదార్థము.  అగ్నిం = అగ్నినిపురోహితం = పురోహితుడినియజ్ఞస్యదేవం = (జీవన) యజ్ఞాన్ని ప్రకాశింపచేసేవానినిఋత్విజమ్ = ఋత్విక్కునుహోతారమ్ = హోతను ( దేవతాశక్తులను ఆహ్వానించే ఋత్విక్కును)రత్నధాతమమ్ = (జీవన యజ్ఞక్రియారూపం ద్వారా వచ్చే) ధర్మజ్ఞానరత్నాలతో పోషించేవాణ్ణిఈళే = నేను ప్రస్తుతిస్తానుమనసా ప్రార్థిస్తాను.

భావము. అగ్నినిపురోహితుడిని; (జీవన) యజ్ఞాన్ని ప్రకాశింపచేసేవానినిఋత్విక్కునుహోతను ( దేవతాశక్తులను ఆహ్వానించే ఋత్విక్కును); (జీవన యజ్ఞక్రియారూపం ద్వారా వచ్చే) ధర్మజ్ఞానరత్నాలతో పోషించేవానినినేను ప్రస్తుతిస్తానుమనసా ప్రార్థిస్తాను.



3 కామెంట్‌లు:

Srinivas చెప్పారు...

There are no authentic references to this in non-Indian blogs/google etc. This was referenced many times in Hindu blogs. That makes the assertion suspect.

The first recorded words as per Google are : "Mary had a little lamb".

One may aspire for great things from one's country or heritage. However, such assertions should be supported by facts.

అజ్ఞాత చెప్పారు...

చెవిలో పువ్వులు బాగున్నవి :)

అజ్ఞాత చెప్పారు...

https://bhandarusrinivasarao.blogspot.com/2010/11/blog-post_19.html

మీరిందులో వ్రాసినవన్నీ తప్పని తార ఆధారాలతో సహా నిరూపించారు కదా? మళ్ళీ అదే అబద్దాన్ని ఎందుకు చెబుతున్నారు?