25, అక్టోబర్ 2014, శనివారం

ప్రపంచాన్ని వణికిస్తున్న 'ఎబోలా' ముప్పు

(Published by 'SURYA' Telugu Daily in its Edit Page on 26-10-2014, SUNDAY)
ప్రపంచ జనాభాలో అత్యధికులను  ఓ మూడక్షరాల పదం వణికిస్తోంది. 'ఎబోలా' అనే వ్యాధి ఛాపకింది నీరులా వ్యాపిస్తోందని ఏకంగా ప్రపంచ  ఆరోగ్య సంస్థ అన్ని దేశాలను హెచ్చరించిందంటే పొంచివున్న పెను ముప్పు ఎలాటిదో అర్ధం చేసుకోవచ్చు.
ఎబోలా అనే పేరు గల వ్యాధి ఒకటి  వుందని కొన్నేళ్ళ ముందువరకు అనేక దేశాలకు తెలియనే తెలియదు. ఇది సాధారణ వ్యాధి కాదనీ, చాలా ప్రమాదకరమైనదనీ, ప్రాణాంతకమైనదనీ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో గడగడలాడించిన స్వైన్ ఫ్లూ వ్యాధి గాలి ద్వారా వ్యాపించేది. అయితే ఎబోలా వైరస్  అంతకంటే చురుగ్గా త్వరగా పాకిపోతుంది.  ఈ వ్యాధి  యెంత త్వరగా తేలిగ్గా వ్యాపిస్తుందంటే, ఎబోలా రోగిని తాకినా, లేదా ఆ రోగి చెమట చుక్క ఇతరులపై చిందినాకూడా  వారికి ఈ వ్యాధి వైరస్  సోకుతుంది.  ఇప్పటికే పశ్చిమాఫ్రికా దేశాల్లో వేలాదిమంది ఈ వ్యాధి కారణంగా అసువులుబాశారు. అభివృద్ధి చెందిన అమెరికా ఐరోపా దేశాలను కూడా ఈ వ్యాధి విడిచిపెట్టలేదు. ఆ దేశాలలోని వైద్యనిపుణులకు ఎబోలా పెను సవాలుగా మారుతూ,  అక్కడి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా వ్యవహరించని కారణంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని లైబీరియా అధ్యక్షురాలు ఎలెన్ జాన్సన్ సర్లీస్ వాపోవాదం గమనార్హం. ఆ దేశంలో ఎబోలా బారిన పడి రెండువేలమంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆ తరువాత జాగ్రత్తపడి తీసుకున్న చర్యల కారణంగా ఎబోలా బాధితుల సంఖ్య పెరగకుండా అడ్డుకట్ట వేయగలిగామని ఆమె అన్నారు. తమ దేశ ఆర్ధిక వ్యవస్థను సైతం ఈ వ్యాధి అతలాకుతలం చేసిందని ఆవేదన వ్యక్తం చేసారు. ఎబోలా వ్యాధికి అడ్డుకట్ట వేయడం చిన్న చిన్న దేశాలకు అలవి కాని పని అనీ, ఈ విషయంలో అంతర్జాతీయ సమాజం నుంచి  సహకారం అవసరమని సర్లీస్ చెప్పిన మాటలు మిగిలిన దేశాలకు ఒక హెచ్చరిక లాంటివి.  
ఆ దేశాల పరిస్తితి ఈ విధంగా వుంటే, ప్రజారోగ్యం విషయం అంతగా పట్టించుకోవన్న పేరుపడిన  ఆసియా దేశాలు, పొంచివున్న ఈ పెను ముప్పును ఎలా తప్పించుకోగలుగుతాయి అన్నది సమాధానం దొరకని ప్రశ్న. ఈ వ్యాధి కేవలం పశ్చిమాఫ్రికా దేశాలకు పరిమితమై వున్నప్పుడు పరిస్తితి వేరు. భారతీయులు అత్యధిక సంఖ్యలో నివసిస్తూ అనునిత్యం రాకపోకలు సాగిస్తున్న అమెరికా, ఐరోపా దేశాలల్లో కూడా ఎబోలా జాడలు బయటపడుతున్న తరుణంలో ఇక ప్రమత్తంగా వుండడం ఏమాత్రం మంచిది కాదు  అన్న భావన క్రమంగా ప్రబలుతోంది. భారత దేశంలోని మీడియా కూడా ఈ విషయంలో తన బాధ్యతను గుర్తెరిగి ఎబోలా ఎంతటి ప్రాణాంతకమైనదో సవివరంగా ప్రజలకు తెలియచెప్పే  కర్తవ్యాన్ని నెత్తికెత్తుకున్నాయి. ఒక రకంగా ప్రభుత్వాలు నిర్వర్తించాల్సిన ఈ రకం విధులలో పత్రికలు, మీడియా కూడా పాలుపంచుకోవడం ముదావహం.
ఎబోలా అనేది కొత్త వ్యాధి. ఈ వ్యాధి వైరస్  ఎలా వ్యాపిస్తుందో కనుక్కోగలిగారు కాని దీన్ని అరికట్టే వాక్సిన్ కానీ ఔషధాలను కానీ ఇంతవరకు కనుగొనలేదు. కేవలం రోగిని తాకడం ద్వారా వ్యాపించే  గుణం ఉండడంతో ఈ వ్యాధికి చికిత్స చేయగల వైద్య సిబ్బంది కూడా కరువవుతున్నారు. ప్రస్తుతం  పశ్చిమాఫ్రికా దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదే. రోగ లక్షాలను తెలుసుకుని రోగిని గుర్తించడం ఒక  సమస్య అయితే,  ఆ రోగికి వైద్య సహాయం అందించే సిబ్బందిని వెతికి పట్టుకోవడం మరో సమస్య. అయితే ఈ సమస్యకు  సమర్ధవంతమైన పరిష్కారం కనుగొన్న  దేశం ఒకటి వుంది. ఎబోలా అనే ఈ మూడక్షరాల మహమ్మారికి క్యూబా అనే రెండక్షరాల దేశం ముకుతాడు వేసే పనికి పూనుకుంది. ఇంకో విశేషం ఏమిటంటే ఆ వ్యాధి ఇంతవరకు ఆ దేశంలో పొడసూపలేదు.  ఈ వ్యాధి పొటమరించిన ఆఫ్రికా ఖండానికి కొన్ని వేల మైళ్ళ ఆవల వున్న దేశం అయినప్పటికీ, క్యూబా తన బాధ్యతగా  ఎబోలా వ్యాధి పీడిత దేశాలకు అండగా నిలిచింది. ఈ విషయంలో క్యూబా నిర్వర్తిస్తున్న పాత్ర అనితర సాధ్యం. ఈ కితాబు ఇచ్చింది ఎవరో కాదు. క్యూబా పొడకూడా గిట్టని  అమెరికాలోని ప్రధాన వార్తా పత్రిక న్యూయార్క్ టైమ్స్. ఈ పత్రిక  ఈ మధ్య ఏకంగా క్యూబా కృషి గురించిన ఓ సవివర వార్తా కధనాన్ని ప్రచురించింది. నిజానికి అమెరికా ఈ వ్యాధి నివారణ చర్యల విషయంలో ముందంజ వేయకపోయినప్పటికీ, ఆ అమెరికా పత్రిక కధనంతోనే ఈ వ్యాధిపట్ల అవగాహన పెంపొందించుకోవడానికీ,  ఏం చేయాలి, ఎలా చేయాలి అనే విషయంలో మిగిలిన దేశాలకు ఒక మార్గం దొరికినట్టయింది. మిగిలిన దేశాలన్నీ వ్యాధి పట్ల గుండెలు బాదుకుంటూ, చేతులుకట్టుకుని కూర్చుంటే క్యూబా మాత్రం తనవంతు సాయంగా క్షేత్రస్థాయిలో పనిచేసే వైద్య సిబ్బందిని ఈ వ్యాధి పీడిత దేశాలకు సాయంగా పంపింది. వాస్తవానికి ఈ వ్యాధి వేలాదిమందికి సోకినా వారిలో అధిక సంఖ్యాకులు రోగులకు వైద్యసాయం అందించిన సిబ్బందీ డాక్టర్లే కావడం విశేషం. చికిత్స అందించేవారే రోగం బారిన పడుతూ ఉండడంతో సాయం అందించేవారి కొరత ప్రధాన సమస్యగా మారింది. క్యూబా ఈ విషయంలో గణనీయమైన సేవా పాత్ర పోషించిందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక శ్లాఘించింది. పశ్చిమాఫ్రికా  దేశాలు ఈ వ్యాధిని ఎదుర్కోవడంలో పడుతున్న ఇబ్బందులను గమనించిన  క్యూబా తక్షణం స్పందించి తన వైద్య బృందాలను, అవసరమైన మందులను హుటాహుటిన ఆదేశాలకు తరలించింది. సొంత దేశంలోని వైద్యులే సాయం చేయడానికి తటపటాయిస్తున్న తరుణంలో క్యూబా అందిస్తున్న  ఈ ఆపన్న హస్తం ఆ దేశాలకు వరప్రసాదంగా మారింది.  రోగులకు చికిత్స  అందిస్తూ వైరస్ సోకిన వారిలో క్యూబన్ వైద్య సహాయక బృంద సభ్యులు కూడా వున్నారు. అయినా వారు వెరవకుండా సహాయక చర్యల్లో పాల్గొనడం ఆ దేశాలవారిని నివ్వెరపరుస్తోంది. ఈ విషయం ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టికి  వెళ్ళింది. దానితో  ఎబోలా  వ్యాధిని అరికట్టే విషయంలో ఏం చేయాలనే దానిపై ఆ సంస్థ క్యూబన్ వైద్య నిపుణుల  సాయం కోరాల్సిన పరిస్తితి ఏర్పడింది.                                  
ఈ క్యూబా కధనం అలా ఉంచితే, మన దేశంలో పరిస్తితి వేరేగా వుంది. 'సమస్య ఎదురయినప్పుడు చూసుకుందాం, ఇప్పటినుంచీ ఎందుకు లాయిలాసా' అనేవాళ్ళు ఎక్కువున్న దేశం కాబట్టి ఎబోలా  గురించి ఆందోళన పడేవాళ్ళు తక్కువనే చెప్పాలి. అయినా కొన్ని పత్రికలు పట్టించుకుని ప్రచురిస్తున్న కధనాలు కొంత కదలిక తెచ్చాయనే అనుకోవాలి.
ఎబోలా అనేది ప్రాణాంతక వ్యాధి అని ముందే చెప్పుకున్నాం. రక్తం, చెమట, లాలాజలం ద్వారా ఆ వైరస్ త్వరితగతిన ఇతరులకు సోకుతుంది. జ్వరం, తలనొప్పి, వాంతులు, అలసట, కీళ్ళ నొప్పులు,  కడుపు నొప్పి, ఆకలి మందగించడం ఈ వ్యాధి లక్షణాలు. అయితే ఇవన్నీ షరా మామూలుగా  జనాలకు అలవాటయినవే. ఈ లక్షణాలు  వుంటే వారికి ఈ వ్యాధి సోకినట్టుగా కంగారు పడనక్కరలేదు. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని వైద్యుల సలహా. చేతులు శుభ్రంగా సబ్బుతో  కడుక్కోవాలి. పరిసరాల్ని పరిశుభ్రంగా వుంచుకోవాలనీ, వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలనీ వాళ్ళు చెబుతున్నారు. ఇవన్నీ మామూలుగా చెప్పే విషయాలే కావడంవల్ల జనం అంతగా  పట్టించుకునే అవకాశాలు కూడా వుండవు. కాకపోతే ఈ వ్యాధి తీవ్రత పట్ల అవగాహన పెంచడం అవసరం. ఎందుకంటె ఒకసారి ఈ వ్యాధి సోకినట్టు నిర్ధారణ అయితే ఇక ఆ రోగి మరణానికి చేరువ అయినట్టే అన్నది వైద్యులు చేసే హెచ్చరిక. చెవులు, ముక్కు, దేహంలోని ఇతర బాహ్య రంధ్రాల ద్వారా అపరిమితమైన  రక్తస్రావం జరిగి  రోగి, కొన్ని వారాల్లోనే ప్రాణాలు కోల్పోతాడు అనేది వాళ్ళు చెప్పే మరో బహుపరాక్. బయట తిండ్లు మానుకోవడం లేదా తగ్గించడం  మంచిదని వారిచ్చే ఇంకో సలహా.  
ఇటీవల ఢిల్లీలో ఎబోలా వ్యాధి గురించి ఓ అవగాహనా గోష్టి నిర్వహించారు. ప్రభుత్వ వైద్యులతో పాటు ప్రవేటు డాక్టర్లు  కూడా దీనికి హాజయ్యారు. భారతదేశం వంటి సువిశాల దేశంలో, జనసాంద్రత ఎక్కువ వున్న దేశంలో ఎలోబా వంటి వ్యాధుల లక్షణాలను రోగుల్లో ఖచ్చితంగా గుర్తుపట్టి, వారిని మిగిలిన రోగులనుంచీ, జనాలనుంచీ వేరుచేసి విడిగా వైద్యం  పరిస్తితులు పరిమితంగా వుంటాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు సంయుక్తంగా, కలసికట్టుగా, ఎంతో సమన్వయంతో, కార్య దీక్షతో, మినుమిక్కిలి   నిబద్ధతతతో - నిర్విరామ కృషి చేయగలిగితే కొంత మేరకు ఫలితం ఉండొచ్చు.అయితే,  క్యూబా డాక్టర్లను ఆదర్శంగా తీసుకుని వైద్యం చేసే సిబ్బంది మన దేశంలో చాలా అరుదన్నది  చాలామంది అభిప్రాయం.
ఎబోలా వ్యాధిని ఎదుర్కునే కృషిలో మొదటి, చివరి అవరోధం ఇదొక్కటే.
(25-10-2014)


కామెంట్‌లు లేవు: