తెలంగాణాలో తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగు
శాసనసభ్యులు, ఒక ఎమ్మెల్సీ టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం అయింది.
ముహూర్తం ఒక్కటే మిగిలి వుంది. ఇటీవలి కాలంలో రాజకీయనాయకుల పోకడలు
గమనిస్తున్నవారికి ఇదేమంత ఆశ్చర్యం కలిగించే వార్త కాబోదు. లాంఛనాలు పూర్తయి ఆ
అయిదుగురు టీడీపీ నాయకులు తమ అనుచరులతో కలిసి గులాబీ కండువాలు కప్పుకునేలోపు అటూ
ఇటూ కూడా షరా మామూలు ప్రకటనలు ఎలాగూ వెలువడుతాయి. వెలువడుతున్నాయి కూడా. 'తెలంగాణాలో తెలుగుదేశం పార్టీకి నూకలు చెల్లిపోయాయనీ,
అంచేతే ఆ పార్టీవారు మునిగే నావను వొదిలి తమ పార్టీలోకి చేరడానికి తొందరపడుతున్నారనీ'
పాలకపక్షం వారు అంటుంటే, 'అధికారం వున్నన్నాళ్ళు పదవులు అనుభవించి ఇప్పుడు తమ స్వప్రయోజనాలకోసం
పార్టీ వొదిలి పోతూ పోతూ, బట్టకాల్చి పైన పడేసినట్టు తమకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీపై
నీలాపనిందలు వేస్తున్నారని' టీడీపీ నాయకులు, పార్టీ పిరాయించిన వారిపై నిప్పులు
చెరుగుతున్నారు. ఎందుకో ఈ మాటలు ఎక్కడో, ఎప్పుడో విన్నట్టు వారికికూడా అనిపిస్తే చేయగలిగింది లేదు. గత అయిదారేళ్ళ కాలంలో ఇలాటి సందర్భాలు ఎన్ని
రాలేదు, ఇలాటి సన్నివేశాలు ఎన్ని చూడలేదు. ఎన్నికలకు ముందు తెలుగుదేశం నాయకులు తమ
పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకుల గురించి అచ్చు ఇప్పుడు టీ.ఆర్.యస్. వారు అన్నట్లే
అన్నారు. టీడీపీ అధినాయకుడి నాయకత్వ లక్షణాలు చూసి ఆకర్షితులై తమ పార్టీలోకి అందరూ
కట్టగట్టుకుని క్యూలు కడుతున్నారని అప్పుడు గొప్పలు చెప్పుకున్నారు. అంతేకాని కాంగ్రెస్ లో
ఏళ్ళపాటు పదవులు అనుభవించి ఇప్పుడు మనవైపు ఎందుకు చూస్తున్నారు అని లిప్త కాలం
ఆలోచించివున్నా, అలాటి జంప్ జిలానీలకు గతంలో ఎన్టీయార్ మాదిరిగా తెలుగుదేశం వాకిలి
మూసివేసినా, ఈనాడు టీడీపీ నాయకులు పడుతున్న ఆవేదనకు కానీ, వెళ్ళగక్కుతున్న ఆగ్రహానికి కానీ కొంత అర్ధం వుండేది. అర్ధం
చేసుకునే వాళ్ళూ వుండేవారు. అలాగే, ఇంకా కాస్త వెనక్కు పోయి చూస్తె, టీడీపీ నుంచి
వై.ఎస్.ఆర్.సీ.పీ. లోకి వరదలా వలసలు సాగుతున్న రోజుల్లో, పార్టీ వీడిపోతున్న తమ నాయకుల
విషయంలో చేసిన వ్యాఖ్యలు జనం మరచిపోయేంత సమయం గడవలేదని ఆ పార్టీ వారు గుర్తుపెట్టుకున్నట్టులేదు.
ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే, వై.యస్.ఆర్.సీ.పీ. టిక్కెట్టుపై గెలిచిన ఒక ఎంపీ, లోక సభ్యునిగా ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే టీడీపీ లోకి రావడాన్ని, ఆ రాకను తమ
పార్టీ స్వాగతించిన విషయాన్ని వారు జ్ఞప్తిలో వుంచుకున్నట్టు లేదు. ఈ రకమైన ద్వంద
వైఖరే వారి విమర్శలకు, ఆరోపణలకు, ఆవేదనకు విలువ లేకుండా చేస్తోంది. ఈ విషయంలో ఒక్క
టీడీపీ నాయకత్వాన్ని మాత్రమె తప్పుపట్టలేం. ఈ తప్పు చేయడంలో అన్ని పార్తీలదీ ఒకే
మాట, ఒకే బాట. టీడీపీ నాయకులు అంటున్నట్టు 'నాయకులు పోయినా కార్యకర్తలు చాలు
పార్టీని బతికించడానికి'. కానీ ఈ వాస్తవాన్ని ఈనాడు పార్టీని వీడుతున్న ఆ నాయకులు
పార్టీలో ఉన్నరోజుల్లో చెప్పివుంటే, కనీసం పార్టీ జెండాలను ఇన్నాళ్ళు మోస్తూ
వచ్చిన సామాన్య కార్యకర్తలన్నా సంతోషపడేవారు. 'రెండు రాష్ట్రాలు తమకు రెండు కళ్ళు'
అని చెప్పుకునే పార్టీ, రెండు
రాష్ట్రాల్లో ఒకే అంశంపై రెండు రకాల విధానాలను అవలంబించడం వల్ల కింది స్థాయి
నాయకుల్లో అనవసరమైన గందరగోళం ఏర్పడుతోందని ఆ పార్టీ అధినాయకత్వం యెంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.
ఇక అసలు విషయానికి వస్తే, ఈ ఏడాది జూన్ రెండో తేదీన
ఏర్పడ్డ రెండు రాష్ట్రాల్లోని వోటర్లు తమ
బాధ్యతను సజావుగా నిర్వర్తించారు. అలాగే కేంద్రంలో కూడా. పాలక పక్షాలకు ఎవరిమీదా
ఆధార పడాల్సిన పని లేకుండా పూర్తి మెజారిటీతో గద్దె ఎక్కించారు. కానీ
జరుగుతున్నదేమిటి? ప్రజలనుంచి ఇంకా ఎక్కువ ఆశించి భంగపడ్డట్టుగా అధికార పీఠం
ఎక్కినప్పటినుంచీ అన్ని విషయాల్లో విభేదించుకునే ఆ రెండు పార్టీలదీ ఒకటే లక్ష్యం.
'ప్రతిపక్షాన్ని ఎలా బలహీనపరచాలి?' పోనీ ఏదో బొటాబొటి మెజారిటీతో నెట్టుకొచ్చే పరిస్తితి
వుందంటే 'ఈ ఆకర్ష్, వికర్ష్ గారడీ'లను కొంత
అర్ధం చేసుకోవచ్చు. ప్రభుత్వాల మనుగడకు వచ్చిన ముప్పేమీ లేకపోయినా మొదటి రోజు
నుంచీ ఈ 'ఆకర్ష్ ' మంత్రం వల్లించడంతోనే డమే
పాలక పక్షాలకు పుణ్యకాలం కాస్తా సరిపోతోంది. ఇక కేంద్రంలో, ఎన్నో ఏళ్ళ తరువాత, రికార్డు స్థాయిలో ఏక పార్టీ పాలనకు అంకురార్పణ
చేసిన బీజేపీ జాతీయ అద్యక్షుడయితే, ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా 'కాంగ్రెస్ రహిత
భారత దేశాన్ని' కోరుకుంటున్నట్టు తెగేసి చెప్పారు. ప్రతిపక్షాల గొంతు నొక్కే
ఆరోపణలు ఇంతకాలం విన్నాం కానీ, ఇదో కొత్త వరస మొదలయింది. వెనుకటి రోజుల్లో, అంతంతమాత్రం
మెజారిటీతో నెట్టుకొచ్చే ప్రభుత్వాలను
పడగొట్టడానికి పాలకపక్షం సభ్యులకు ప్రతిపక్షాలు ఎరవేసే సందర్భాలు ఉండేవి. కానీ,
ఇప్పుడో, ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాలు ఏర్పాటు చేయగానే, అధికార పక్షాలు మరో పని
ఏమీ లేదన్నట్టు ప్రతిపక్షసభ్యులకు గాలం వేసే కొత్త ప్రక్రియ మొదలయింది. ఇలాటి
కుచ్చిత వ్యూహాలు ప్రజాస్వామ్యానికి మేలు చేయవని మాత్రం గట్టిగా చెప్పవచ్చు. 'ఈరోజు
ఒకరికి చేసిన కీడు మరో రోజు మరో రూపంలో మన
మెడకే చుట్టుకుంటుంది' అన్న నిజాన్ని రాజకీయ పార్టీలు అర్ధం చేసుకుంటాయని ఆశించడం
అత్యాశే అవుతుంది. 'ఈరోజు గడిస్తే చాలు' అనే రోజుల్లో సిద్దాంతాలు, సూత్రాలు పట్టించుకునే
తీరిక ఎవ్వరికి మాత్రం వుంటుంది ?
పార్టీ ఫిరాయింపులు గురించి ప్రస్తావించుకునేటప్పుడు కొంత
పరిణామక్రమాన్ని కూడా గుర్తుచేసుకోవాలి.
ఈ
అనైతిక పార్టీ మార్పిళ్లను అరికట్టడానికి చట్టం లేదా అంటే వుంది. దాదాపు మూడు
దశాబ్దాల క్రితమే, రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడే, 52 వ రాజ్యంగ సవరణ ద్వారా పార్టీ పిరాయింపుల నిరోధక చట్టం తీసుకువచ్చారు. అయితే,
దాని ప్రకారం, చట్ట సభలో ఒక పార్టీకి వున్న సంఖ్యాబలంలో మూడింట ఒక వంతు మంది వేరే
పార్టీలోకి మారితే అది పార్టీ పిరాయింపు కాకుండా వేరే పార్టీలో 'విలీనం' కిందికి
వస్తుంది. దీన్ని అడ్డుపెట్టుకుని వ్యూహాత్మక మార్పిళ్లు జరగడంతో ఆ చట్టం కోరలు
పదును పెట్టడం కోసం దరిమిలా దానికి ఎన్నో సవరణలు కూడా చేశారు. అయినా చట్టంలోని లొసుగుల్ని వాడుకుంటూ చట్టాలకు తూట్లు పొడవడం ఆ చట్టాల
నిర్మాతలయిన ప్రజా ప్రతినిధులకు వెన్నతోపెట్టిన విద్య. అందుకే చట్టం దోవ చట్టానిది,
రాజకీయ నాయకుల దోవ వారిదీ అవుతూవచ్చింది.
ఎవరినీ తప్పుబట్టడానికి వీలులేకుండా తప్పులు చేస్తూ పోవడానికి చట్టాల్లో వున్న ఈ లొసుగులే
ప్రధాన కారణం. అనేకానేక అధ్యయనాల అనంతరం పద్దెనిమిదేళ్ళ తరువాత అంటే, 2003
లో ఈ చట్టానికి మరో రాజ్యాంగ సవరణ చేసారు. దీని ప్రకారం 'పార్టీ మార్పిడి పిరాయింపు
కాదు, మరో పార్టీలో విలీనం కావడం' అని చట్టం దృష్టిలో అనిపించుకోవాలంటే ఆ పార్టీలో
మూడింట రెండు వంతుల మంది సభ్యులు సమ్మతించాలి. ఈ సవరణ ప్రకారం విడిగా
కానీ, బృందాలుగా కానీ పార్టీ మారే చట్ట సభల సభ్యులు తమ సభ్యత్వానికి ముందు రాజీనామా చేయాలి. అలా రాజీనామా చేసిన వారు ఆ తరువాత ఎటువంటి
లాభదాయక పదవులు పొందడానికి వీలుండదు. నిజానికి ఈ రాజ్యంగ సవరణ ద్వారా పార్టీ మార్పిళ్లు అనేవి దుర్లభంగా తయారుకావాలి.
కానీ, రాజకీయాల్లో వున్నవాళ్ళు ఘటనాఘటన దురంధరులు.
అడ్డువచ్చిన వాటిని ఎలా అడ్డు తొలగించుకోవాలో, అదీ చట్టబద్ధంగా, వారికి కరతలామలకం.
ఎన్నికలు కాగానే, గెలిచినవాళ్ళల్లో కొందరు, తాము అధికారం దక్కని పార్టీలో ఉన్నామని
గ్రహించిన మరుక్షణం నుంచే గోడదూకే సన్నాహాలు మొదలుపెడతారు. ఎందుకంటె, ఎన్నికల్లో గెలవడం ఒక్కటే వారికి
ముఖ్యం కాదు, పాలక పక్షం అండ దొరికితేనే 'ప్రజాసేవ' చేయడానికి వీలుంటుంది అన్న
నమ్మకం పుష్కలంగా పెంచుకున్నవాళ్ళు వారు. అందుకే అధికారంలోకి వచ్చిన పార్టీలో
చేరిపోయి, తమ రాజీనామా ద్వారా ఉత్పన్నమైన ఖాళీలో జరిగే ఉపఎన్నికలో పోటీ చేసి, అధికార పార్టీ ప్రాపకంతో మళ్ళీ అనతికాలంలోనే చట్టసభల్లో ప్రవేశించిన ఉదాహరణలు కోకొల్లలు. పార్టీ పిరాయింపులను నిరోధించడానికి రూపొందించిన
చట్టాన్ని ఆ విధగా కొందరు నీరుకార్చివేస్తున్నారు. 'ఇది నైతికమా కాదా' అని ప్రశ్నించుకోవాల్సిన
అవసరం కానీ, అంతటి సావధానం కానీ వారికి ఉంటుందనుకోలేము.
ఇక, 'ఇలా చేతికి అందిన రాజీనామాలు 'ఆమోదించాలా తిరస్కరించాలా లేదా పెండింగులో
పెట్టాలా' అనే విషయంలో స్పీకర్లదే తుది నిర్ణయం. ఆ నిర్ణయాలను సమీక్షించే లేదా తిరగతోడే అవకాశం న్యాయస్థానాలకు
కూడా లేదు. గత అయిదారేళ్ళ కాలంలో రాష్ట్రంలో
జరిగిన రాజకీయ పరిణామాలను సునిశితంగా గమనిస్తూ వస్తున్నవారికి ఇటువంటి సందర్భాలు లెక్కకు మిక్కిలి అన్నవిషయం
తేలిగ్గానే బోధపడుతుంది. మళ్ళీ ఇక్కడ కూడా అధికారంలో వున్న పార్టీదే పైచేయి. అందువల్ల, పిరాయింపులు అనేవి పాలకపక్షాల ఇష్టాఇష్టాల
ప్రకారమే అటు చట్టబద్దం కావడమో, ఇటు చట్ట విరుద్ధం కావడమో జరుగుతోంది. అయితే,
చట్టంలో వున ఈ లొసుగుకు సుప్రీం కోర్టు ఓ
మేర అడ్డుకట్టవేసింది. గోవా శాసనసభ స్పీకర్ ఇద్దరు సభ్యులపై వేసిన 'అనర్హత వేటు'ను
అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. కానీ రాజ్యాంగం పదో షెడ్యూల్లో పొందుపరచిన మిగిలిన
అధికరణాలను మాత్రం సుప్త్రీం కోర్టు తప్పుపట్టలేదు.
మంచి చేయబోతే చెడు ఎదురయినట్టు,
ఈ చట్టం వల్ల కొందరు నిజాయితీపరులయిన సభ్యులు ఇబ్బంది పడే అవకాశం వుంది. అనర్హత వేటుకు భయపడి, ఇష్టం వున్నాలేకపోయినా
పార్టీ అధినాయకత్వం తీసుకునే అన్ని నిర్ణయాలను, బిల్లులను వాటి మంచి చెడులతో నిమిత్తం లేకుండా సమర్ధించాల్సిన
పరిస్తితి వారిది.
ఇండిపెండెంటు
సభ్యులకు ఈ చట్టంలో కొంత వెసులుబాటు వుంది.
వారు తమ ఇష్టం వచ్చిన పార్టీకి మద్దతు తెలపవచ్చు. కానీ అందులో చేరడానికి వీలులేదు.
ఇండిపెండెంటుగా గెలిచినా వాళ్ళు ఇండిపెండెంటు హోదాలోనే కొనసాగాలని చట్టం నిర్దేశిస్తోంది. హర్యానాలో ఒక సంఘటన
జరిగింది. అక్కడ ఇండిపెండెంటుగా గెలిచిన అభ్యర్ధులు అధికార పార్టీలో చేరినట్టు టీవీల్లో వార్త ప్రసారం అయింది. ఒక టీవీ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన
ఇంటర్వ్యూ లో ఏకంగా వారే ఈ విషయం చెప్పినట్టు
వచ్చింది. స్పీకర్ వారిని అనర్హులుగా ప్రకటించారు. వారు కోర్టును ఆశ్రయించారు.
చివరికి సుప్రీం కోర్టు కూడా స్పీకర్ నిర్ణయాన్నే సమర్ధించింది.
పొతే, మనం సాధారణంగా 'పాలిటిక్స్' అని వాడే ఇంగ్లీష్ పదం గ్రీకు భాషలోని 'పొలిటికా' అనే పదం నుంచి
వచ్చింది. అమెరికా దేశపు అధ్యక్షుడిగా
పనిచేసిన అబ్రహాం లింకన్, ప్రజాస్వామ్య
ప్రభుత్వానికి ఇచ్చిన నిర్వచనాన్నే మన
రాజకీయ నాయకులు తరచూ ఉటంకిస్తుంటారు. 'ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటే ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజలు ఎన్నుకున్న
ప్రజా ప్రభుత్వం' అని. 'పొలిటికా' అనే ఈ
గ్రీకు పదానికి కూడా ఇంచుమించు అదే అర్ధం.
అయితే కాలక్రమంలో 'నేతిబీరకాయ సామెత' మాదిరిగా ప్రజాస్వామ్యంలో 'ప్రజలు' అడుగంటి
పోయి 'నాయకస్వామ్యం'గా మారడం మొదలయింది. 'దీనికి ఎవ్వరు కారకులు? ప్రజలా? పాలకులా?
పార్టీలా?' అంటే, 'తిలాపాపం తలా పిడికెడు' అన్నట్టు అందరికీ ఇందులో భాగం వుంది. ఎవరో అన్నట్టు రాజకీయాలు అనేవి ఒక బుడుగు
మాదిరి. దాంట్లోకి ఒకసారి దిగితే అంతే సంగతులు. తిరిగిరావడం వారి చేతిలో వుండదు. అందుకే,
ఒక పార్టీలో తమకు భవితవ్యం లేదనుకున్నప్పుడు సిద్దాంతాలు, సూత్రాలు గాలికి
వొదిలేసి వేరే పార్టీలోకి దూకుతున్నారు. ఇలా గోడలు దూకేవాళ్ళు కొందరయితే, దూకడానికి
తటపటాయించేవారిని దింపడం కోసం గోడలకు నిచ్చెన వేసే పార్టీలు మరికొన్ని. చేపలకు 'ఎర'
వేస్తున్నారా, లేక చేపలే వచ్చి గాలానికి
చిక్కుకుంటున్నాయా అనేది జవాబు దొరకని ప్రశ్న.
చివరికి చెప్పేదేమిటంటే, చట్టాలు చేసేవారే వాటిని 'ఎలా ఉల్లంఘించాలా'
అనే దారులు వెతకడం మొదలు పెడితే, అసలు వాళ్ళు చేసిన చట్టాలకు అర్ధం వుండదు, అవి
తయారయ్యే చట్టసభలకూ అర్ధం వుండదు. తరువాత
తీరిగ్గా విచారించినా ప్రయోజనం వుండదు.
అన్ని రాజకీయ
పార్టీలు ఈ వాస్తవాన్ని తెలుసుకున్నప్పుడే మన ప్రజాస్వామ్య సౌధం పునాదులు బీటలువారకుండా
వుంటాయి. (11-10-2014)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి