17, అక్టోబర్ 2014, శుక్రవారం

శ్రమయేవ జయతే


ఊళ్ళల్లో రోడ్డు పక్కన సిగరెట్లు వగయిరా అమ్మే పాన్ డబ్బాలు కనిపిస్తాయి. ఉదయంనుంచి రాత్రి పొద్దుపోయేదాకా ఆ బడ్డీ దుకాణాల వారు శ్రమిస్తూ వుండడం అందరికీ తెలిసిన విషయమే. కానీ, ఆ చిన్న దుకాణాల మీద దాదాపు పది పదిహేను ప్రభుత్వ శాఖల ఆజమాయిషీ ఉంటుందనేది చాలామందికి తెలియవి విషయం. మునిసిపల్ కార్పోరేషన్, పారిశుధ్య శాఖ, కార్మికశాఖ ఇలా ఈ జాబితా చాలా పెద్దది. ఇలాటి దుకాణాలు పెట్టుకునేవారు పెద్ద చదువులు చదివిన వారు అయివుండరు. కలిగిన వారు అయివుండే అవకాశం లేదు. అయినా ఇన్నిన్ని శాఖల ఆజమాయిషీ వారిపై అవసరమా? ఈ ప్రశ్న అతి సహజమైనది. మనలో చాలామంది మదిలో ఈ ప్రశ్న మొలకెత్తినా ఉసూరుమని నిట్టూర్చడం తప్ప  చేయగలిగింది ఏమీ వుండదు. సందర్భం వేరయినా ఈ ప్రశ్న వేసింది, జవాబు అన్వేషించింది సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి మోడీ అవడం వల్ల పరిష్కారం దొరుకుతుందనే ఆశ ఈనాడు కలుగుతోంది.
మోడీ ప్రధాని అయిన తరువాత ఆయన ఈ దేశ భవిష్యత్తు గురించి, దేశాన్ని ఎలా తీర్చి దిద్దాలి అనే విషయం గురించీ అనేక కలలు కంటున్నారు. నాయకులకి అది సహజం. కానీ విశేషం ఏమిటంటే, మోడీ  కనే కలలు నిజం కావాలని ప్రజలు, ముఖ్యంగా చదువుకున్నవారు, యువతీ యువకులు  సయితం  కలలు కనడం మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో ఇది మరీ  స్పుటంగా కానవస్తోంది.  అంటే ఆయన మీద జాతి జనులు పెట్టుకుంటున్న ఆశలు ఏమేరకు పెరిగిపోతున్నాయో, ఆ కారణంగా ఆయన భుజస్కంధాల మీద బరువు బాధ్యతలు ఎలా పెరిగిపోతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఇక్కడ ఏమాత్రం తభావతు వచ్చినా ఆ ఆశల శిఖరం కూలిపోయి, ప్రస్తుతం వెల్లువెత్తుతున్న అభిమానం కాస్తా ఆగ్రహంగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ వాస్తవం తెలిసిన రాజకీయనాయకుడు కావడం వల్లనేమో, మోడీ కూడా అంతే జాగ్రత్తగా ప్రజామోదపధకాలకు రూపకల్పన చేస్తున్నట్టుగా వుంది. బహుశా, ఈ క్రమంలోనే కావచ్చు,  ఇటు యువతకు, అటు శ్రామికులకు, మరో పక్క పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం, ఉత్సాహం కలిగించే - 'శ్రమయేవ జయతే' అనే నూతన పధకాన్ని - భారతీయ జనతా పార్టీ, బీజేపీకి, ఒకప్పటి  మాతృ సంస్థ అయిన జన సంఘ్ నాయకుడు, కీర్తిశేషులు దీన దయాళ్ ఉపాధ్యాయ పేరిట  ప్రధాని మోడీ గత గురువారం నాడు ప్రారంభించారు. 


                 
ఉప్త్పత్తి రంగం తీసుకున్నా, తయారీ రంగం తీసుకున్నా అక్కడ పరిస్తితులు సజావుగా సాగాలంటే అటు పెట్టుబడి పెట్టే యజమానులు, ఇటు శ్రమను పెట్టుబడిగా పెట్టే  శ్రామికులు, ఒక కాడికి రెండు ఎడ్లు మాదిరిగా సమన్వయంతో సాగాలి. ప్రభుత్వం అనేది వీరిద్దరి మీదా పెత్తనం చేసే పెత్తందారీ వ్యవస్థ కాకుండా దారి చూపే దిక్సూచి మాదిరిగా వ్యవహరించాలి. మోడీ తన ప్రసంగంలో చెప్పింది అదే. ఏదయినా వ్యాపారం పెట్టాలన్నా, పరిశ్రమ స్తాపించాలన్నా, ఫాక్టరీ నెలకొల్పలన్నా అనేక రకాల ఫారాలు, అనేక రకాల దరఖాస్తులు, అనేక రకాల అనుమతులు. ఇన్నిన్ని  అవసరమా? అన్నది ఆయన వేసిన ప్రశ్న. అందుకే, ఒకే ఒక ధరఖాస్తుతో  అన్ని రకాల అనుమతులు, ఏక గవాక్ష విధానం ద్వారా కాలయాపన లేకుండా  మంజూరు చేయాలనేది ఆయన ఆలోచన.   
ఈ సందర్భంలోనే, పారిశ్రామికవేత్తలకు కొంత అనుకూలంగా, పనిచేసే కార్మికులకు, విశేషించి కార్మిక సంఘాలకు  మరి కొంత ప్రతికూలంగా కానవచ్చే నిర్ణయాలను ప్రధాని ప్రకటించారు. ఫాక్టరీలను, పారిశ్రామిక విభాగాలను, వ్యాపార సంస్థలను కార్మిక శాఖకు చెందిన ప్రభుత్వ అధికారులు అప్పుడప్పుడూ తనిఖీ చేసి, లోటుపాట్లను ఎత్తి చూపుతుంటారు. అయితే ఈ విధానంలో పారదర్శకత లోపించి, లాలూచీ వ్యవహారాలు సాగడానికి కూడా అవకాశం వుంది. యజమానులను అయిన దానికీ, కాని దానికీ అధికారులు వేధిస్తున్నారని వారి నుంచి ఆరోపణలు కోకొల్లలుగా వస్తూ వుండడం కొత్తేమీ కాదు. అందుకే ఈ మొత్తం తనిఖీ వ్యవస్థను పారదర్శకం చేయాలని మోడీ తలపెట్టారు. ఇకనుంచి కార్మిక శాఖకు చెందిన ఇన్స్పెక్టర్ ఏదయినా ఫాక్టరీకి వెళ్లి తనిఖీ చేయాలని అనుకుంటే ఇప్పటిమాదిరిగా తన ఇష్టం వచ్చిన ఫాక్టరీకి తన ఇష్టం వచ్చిన సమయంలో వెళ్లి తనిఖీ చేయడానికి కుదరదు. ఏ  ఇన్స్పెక్టర్  ఏ ఫాక్టరీకి వెళ్ళాలన్నది కంప్యూటర్ లో లాట్లు తీసి   నిర్ణయిస్తారు. అలా తనిఖీకి వెళ్ళిన అధికారి డెబ్బయ్ రెండు గంటల్లోగా  తన నివేదికను ఆన్ లైన్ లోనే పై అధికారికి పంపాల్సివుంటుంది. ఇటువంటి తరహా పద్దతులు ప్రవేశపెట్టడం వల్ల ప్రభుత్వ ప్రమేయాన్ని కనిష్ట స్థాయికి తగ్గించడం వీలుపడగలదని మోడీ మహాశయుల ఉద్దేశ్యం. వ్యాపారాలు సులువుగా చేసుకోగల పరిస్తితి వుంటే, అవినీతికి ఆస్కారం తగ్గి, నాణ్యతలో పోటీపడడానికి  వీలుంటుంది అన్నది ఆయన భావన. పాలన గరిష్ట స్థాయిలో వుండి ప్రభుత్వ పెత్తనం కనిష్ట స్థాయిలో వుండాలని ఆయన మొదటినుంచీ చెబుతూ వస్తున్నదే. అయితే,  ప్రధాని ప్రకటించిన కొన్ని నిర్ణయాలను పారిశ్రామికవేత్తలు హర్షించి ఆహ్వానిస్తే, అనేక కార్మిక సంఘాలు కొన్ని అంశాల పట్ల నిరసన తెలిపాయి. కాలక్రమంలో ఇటువంటి విధానాలు యజమానులకు లాభదాయకంగా, కార్మిక లోకానికి నష్టదాయకంగా పరిణమిస్తాయని, కార్మికులను తమ ఇష్టం వచ్చినట్టు తొలగించుకునే  అధికారం యజమానులకి దఖలు పడుతుందనీ కార్మిక సంఘాల నేతలు అంటున్నారు. ఏ.ఐ.టీ.యూ.సీ.  ఒక అడుగు  ముందుకు వేసి, కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు  నిరసనగా డిసెంబరు  అయిదో తేదీన అఖిల భారత బంద్ కు పిలుపు ఇచ్చింది.       
కార్మికులకు ప్రయోజనం వుండే మరో విధాన ప్రకటన కూడా ప్రధాని  చేసారు. అది ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలకు సంబంధించినది. కార్మికులు, ఉద్యోగులు తమ సంస్థను లేదా కంపెనీని వొదిలి వెళ్ళాల్సిన  సందర్భాలు తటస్తించినప్పుడల్లా ఈ ఖాతాను బదిలీ చేసుకోవడం వారికి దుస్తరంగా  మారుతోంది. దీన్ని అధిగమించడానికి పీ.ఎఫ్. ఖాతా నెంబరు మార్చుకోవాల్సిన అవసరం లేకుండా ఒకే నెంబరు కేటాయించే విధానం అమల్లోకి తెస్తారు. ఖాతా వివరాలను వారు ఎప్పటికప్పుడు వారి మొబైల్ ఫోన్ల ద్వారా తెలుసుకోగల వెసులుబాటు కూడా  వుంటుంది.
సరే! ఇవన్నీ కంప్యూటర్ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం ద్వారా అందుబాటులోకి తెచ్చుకోగల ప్రయోజనాలు. కానీ, కార్మిక లోకం తలెత్తుకుని తిరిగే రోజులు రావాలనీ, వారిలో ఆత్మ న్యూనతను కూకటివేళ్ళతో పెకలించి వేయాలనీ కూడా ప్రధాని కోరుకుంటున్నారు. ఇది నిజంగా ఆహ్వానించతగ్గ ఆలోచన. ఏ అభివృద్ధి చెందిన  దేశంలో అయినా పనివారికి సమాజంలో తగిన గౌరవ ప్రపత్తులు వుంటాయి. మన దగ్గర మాదిరిగా 'వైట్ కాలర్' ఉద్యోగాలు, 'కాలర్' మాసిన ఉద్యోగాలు అనే తేడాలు వుండవు. జీతాన్ని బట్టి కాకుండా పనికి గౌరవం లభించే విధానం రావాలనీ, అదే జీవన విధానం కావాలనీ కోరుకునే పాలకుల ప్రయత్నాలు హర్షణీయం. మోడీ  శ్రామికులను 'శ్రమయోగులు'గా అభివర్ణించారు. చక్కటి ఆలోచనే. అయితే, ఇన్నాళ్ళుగా రాజకీయ నాయకుల ఆలోచనలు అంతరిక్షంలోను,  ఆచరణ అధః పాతాళంలోను ఉండడమే ప్రజలకు తెలుసు. అందుకే వారు చెప్పే  మాటల  పట్ల, చేసే వాగ్దానాల పట్ల జనాలకు  అనేక సందేహాలు. అనేకానేక అనుమానాలు. కాబట్టి మాటలు చేతల్లో కనబడేలా అడుగులు పడినప్పుడే రాజకీయుల ఆలోచనలకు  విశ్వసనీయత లభిస్తుంది. సార్వజన ఆమోదం లభిస్తుంది.
ఇలాటి ఆలోచనలు మెండుగా చేస్తున్న ప్రధాని మోడీ 'అందరిలో ఒకరా, కొందరిలో ఒకరా' అనేది కాలమే తేలుస్తుంది.
విదియనాడు కనబడని చంద్రుడు తదియనాడు తానే కనబడతాడని సామెత.

కొంతకాలం వేచి చూడడం వల్ల పోయేదేమీ వుండదు. పైగా వోపిక అనేది భారతీయుల రక్తంలో వుంది అని కదా  చెబుతారు.  (17-10-2014)