18, అక్టోబర్ 2014, శనివారం

అమెరికా ప్రెసిడెంట్ అయితేనేం ఎవరయితేనేం రూలంటే రూలే ఆ దేశంలో


నిజమా! నిజంగా నమ్మలేం అనిపించే ఈ సంఘటన నిజంగా జరిగింది. ప్రెసిడెంట్ ఒబామా స్వయంగా చెప్పకపోతే అసలీవిషయం  బయటకు పొక్కేదే కాదు. నమ్మడానికి వీల్లేని ఈ కధా కమామిషూ ఏమిటంటే-
కిందటి నెలలో న్యూ యార్క్ లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశాల్లో పాల్గొనడానికి అమెరికా అధ్యక్షులవారు సతీ సమేతంగా ఆ నగరం వెళ్ళారు. ఓ రోజు వీలుచేసుకుని  భార్యను వెంటబెట్టుకుని హోటల్లో భోజనం చేయడానికి వెళ్ళారు. మాట మంతీ చెప్పుకుంటూ భోజనం ముగించిన తరువాత బిల్లు చెల్లించడానికి క్రెడిట్  కార్డు తీసిచ్చారు. అది తీసుకువెళ్ళిన బేరర్ అంతే వేగంతో తిరిగొచ్చి, 'ప్రెసిడెంట్! మీ క్రెడిట్  కార్డు చెల్లదు' అని చావు కబురు చల్లగా చెప్పాడు.   పక్కన భార్య ఉండబట్టీ, ఆవిడ తన కార్డు తీసి ఇవ్వబట్టీ ప్రెసిడెంట్ ఒబామా గారి పరువు ఆ పూటకు నిలబడింది. ఇది జరిగింది గత నెల 24 వ తేదీన. ఇది బయట పడింది  నిన్న శుక్రవారం. క్రెడిట్ కార్డ్లు, వాటి భద్రత గురించి జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ, మాటవరసకు ఈ విషయం స్వయంగా ఒబామా గారే వెల్లడించడంతో ఈ కధనం  మీడియాలో హుషారుగా గింగిరాలు తిరుగుతోంది.
ఒబామా గారు భార్యతో కలిసి భోజనం చేయడానికి ఇతర సాధారణ పౌరుల మాదిరిగానే హోటల్ కు వెళ్ళారు. ఇది ఎవరికీ పట్టలేదు. అలాగే బిల్లు కట్టడానికి క్రెడిట్ కార్డు ఇచ్చారు. బిల్లులు కట్టడం అలవాటులేని రాజకీయ నాయకులను కన్న కర్మ భూమి కాబట్టి ఆ విషయానికీ పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎంతసేపూ అమెరికా ప్రెసిడెంటు క్రెడిట్ కార్డు క్లోనింగుకు గురయిందని ఒకటే ఊదర.

ఈ సంఘటన నుంచి మన రాజకీయ నాయకులు, మీడియా నేర్చుకోవాల్సింది ఎంతో వుంది అంటే అపార్ధం చేసుకోరు కదా! 

NOTE : Courtesy Image Owner 

1 వ్యాఖ్య:

Saahitya Abhimaani చెప్పారు...

గొట్టాలు పట్టుకుని "ఐతే" అనే మాటను, లెక్కలేనన్ని సార్లు పొంతన/సందర్భశుద్ధి లేకుండా ఒక పడికట్టు మాటగా వాగేసే టి వి విలేఖర్లకు, ఉంటారో లేదో తెలియని వారి సంపాదకులకు, మీరు చెప్పిన ఉదంతంలో, అమెరికన్ అధ్యక్షుడు సామాన్యుడి లాగా హోటల్ కు వెళ్లి డబ్బులు చెల్లించటానికి తన కార్డు ఇవ్వటం అనేది వార్త అనిపించకపోవటం, ఆ కార్డు క్లోనింగ్ కు గురయ్యింది అన్నది మాత్రమే వార్త అనిపించటంలో ఆశ్చర్యం నాకేమీ కనపడటం లేదు మాష్టారూ.

ప్రస్తుతానికి ఎ విషయం అయినా సరే "ఊదర" కొట్టటమే పెద్ద సంపాదకత్వ/విలేఖర ప్రతిభగా చెలామణీ అవుతున్నది మరి!