మరపురాని మనుషులు
తురగా కృష్ణ మోహన రావు
పేరిట ఉత్తమ జర్నలిష్ట్ అవార్డ్ స్వీకరించిన సందర్భంలో నా ప్రసంగ పాఠం
"తురగా కృష్ణ మోహన
రావుగారు.
"ఎందుకో ఆయన కూడా
ఈ వేదిక మీద వున్నట్టే నాకనిపిస్తోంది. నిన్న పోతే రేపటికి మూడు అనుకునే ఈ
పాడులోకంలో కృష్ణ మోహనరావుగారు చనిపోయి ఒకటా రెండా – మరో ఒకటిరెండేళ్ళలో
నలభై ఏళ్ళు కావస్తోంది. అయినా, ఇన్నేళ్ళ తరువాత కూడా
ఆయన్ని స్మరించుకుంటూ ఇంతమంది ఇక్కడకు వచ్చారంటే - ఏ లెక్కన
చూసుకున్నా – నా దృష్టిలో ఆయన
బతికున్నట్టే లెక్క. అంత గొప్ప మనిషి కాబట్టే ఆయన పేరుమీద ఇస్తున్న ఈ అవార్డ్
తీసుకోవడానికి గర్వపడుతున్నాను. అందుకే జానకీరాణి గారు ఫోను చేసి చెప్పినప్పుడు
కాదనలేకపోయాను. కాకపొతే, ముసలితనంలో వసంతం అన్నట్టుగా రిటైర్
అయి ఎనిమిదేళ్ళు పూర్తి అవుతుంటే ఇప్పుడు ఉత్తమ జర్నలిస్టో, అలాటిదో
ఈ అవార్డ్ ఏమిటి చెప్పండి. కానీ రేడియోలో పనిచేసిన మా బోంట్లకు
జానకీరాణి గారంటే భయంతో కూడిన గౌరవం ఏం చేస్తాం? కాదనే
ధైర్యం ఎక్కడిది ?
"జానకీరాణి గారు
అంటే గౌరవం. ఆవిడ వయస్సు కొంతా, ఆవిడ కలివిడితనం కొంతా కలిపి గౌరవం ఆవిడంటే. భయం
దేనికంటే- నేనే గలగలా మాట్లాడుతానని అంతా అంటారు. జానకీరాణి గారు గలగలా మాత్రమే
కాదు – దడ దడలాడిస్తూ దడదడా కూడా మాట్లాడతారు.
"ఇక అసలు
విషయానికి వస్తే – నేను చదువుకుండే రోజుల్లో ఆంధ్ర పత్రిక
వారపత్రికలో ‘రాజధాని కబుర్లు’ అనే
శీర్షిక వచ్చేది. ప్రవీణ్ అనే ఆయన రాస్తుండేవారు. ఆ రాసే విధానం నాకు బాగా
నచ్చేది. ఎప్పుడయినా హైదరాబాదు వెడితే ఆయనగారిని కలవాలని అనుకునేవాడిని. ఆయన
అంటే ఎందుకో ఇష్టం. ఆయనే తురగా కృష్ణ మోహన రావు గారని చాలాకాలం తరువాత
తెలిసింది. నాకు వారితో మరో బాదరాయణ సంబంధం కూడా వుంది. కృష్ణ మోహన రావుగారు అకాల
మృత్యువాత పడిన తరువాత వారు చేసిన రేడియో విలేకరి ఉద్యోగంలోకే నేను ప్రవేశించాను.
అది చిన్న ఉద్యోగం కావచ్చు. అయినా అంత పెద్ద మనిషి చేసిన ఉద్యోగం కాబట్టి
నాకది పెద్ద ఉద్యోగమే.
"కృష్ణ మోహన
రావుగారు మంచి హాస్య రచయిత. అంటే నా అర్ధం మంచి హాస్యం రాస్తారని. ఆహ్లాదకరమైన
హాస్యం రాస్తారని. ఆరోగ్యకరమైన హాస్యం రాస్తారని. ఆయన రచనలు చదివిన అనుభవంతో
నేను ఈ మాట చెబుతున్నాను.
"తురగా వారు
చిలికించిన హాస్యం లాంటి హాస్యం ఈ నాటి సమాజానికి ఎంతో అవసరం.
జనంలో ‘నవ్వు’ చచ్చిపోతోందేమో అని నాకు ఒక్కోసారి చచ్చేంత
భయం వేస్తుంటుంది. నవ్వుతూ మాట్లాడేవాళ్ళతో మాట్లాడిచూడండి. కోపాలు తాపాలు
మాయమైపోతాయి. బీపీలు గట్రా తగ్గిపోతాయి. దురదృష్టం ఏమిటంటే అలా నవ్వేవాళ్ళు,
నవ్వించే వాళ్ళు బాగా తగ్గిపోతున్నారు. ఇదొక విషాదం.
మరి ఏమిటి శరణ్యం.
వుంది. ఇదిగో కృష్ణ మోహనరావు గారు రాసిన ఈ ‘మాట కచ్చేరీ’ మొదలుపెట్టండి. పుస్తకం చదువుతూ మీరేమో ముసిముసినవ్వులు. ఆ నవ్వుల్ని
చూస్తూ మీ ఆవిడ కూడా ‘ఏమిటీ నవ్వేది మా ఆయనేనా’ అని అనుమానంతో కూడిన నవ్వులు. ఇక ఆ ఇంట్లో ఒకటే నవ్వులవాన. మళ్ళీ
మాట్లాడితే నవ్వుల తుపాన్.
"ఒక విషయం నేను
గట్టిగా చెప్పగలను.
ఈనాడు మనం
అనుభవిస్తున్న అన్ని రకాల రుగ్మతలకీ నవ్వే చక్కటి ఔషధం. కాణీ ఖర్చులేని ‘ఆరోగ్య
శ్రీ’
"రేడియోలో పనిచేసే
రోజుల్లో నా బల్ల మీద అద్దం కింద ఒక కాగితం మీద రాసిపెట్టుకున్నాను.
“మనిషి
ఏడుస్తూ పుట్టేది నవ్వుతూ చనిపోవడానికి.”
"పుట్టగానే
ఏడిస్తేనే బతికినట్టు లెక్క. బతికివున్నప్పుడు నవ్వితేనే బతికున్నట్టు లెక్క. ఈ
లెక్క కుదరాలంటే తురగా కృష్ణ మోహనరావు గారి రచనలు చదవండి. వాటిని
ఆస్వాదించండి. అన్ని లెక్కలు, అన్ని తిక్కలు ఇట్టే కుదిరిపోతాయి.
"ఎనీ డౌట్ ? నాకయితే
లేదు.
"ఇది సగర్వంగా
నేనిస్తున్న సర్టిఫికేట్"
(నిరుడు 'తురగా అవార్డు'కు నన్ను
ఎంపిక చేసిన తురగా జానకీరాణి గారు ఈ లోకం నుంచే తప్పుకున్న ఈ రోజు ఆవిడను మరో సారి
ఇలా గుర్తు చేసుకుంటున్నాను - భండారు శ్రీనివాసరావు)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి