31, అక్టోబర్ 2014, శుక్రవారం

కష్టే ఫలి


అయ్యన్నతో కలసి నగరానికి వచ్చినప్పుడు సుందరమ్మ సంతోషపడినదెంతో తెలియదు కాని భయపడింది మాత్రం వాస్తవం. అది బతుకు గురించిన భయం కాదు. కన్నవాళ్ళనీ, వున్న ఊరినీ విడిచి వెడుతున్నానన్న బెంగ.  చదువు సంధ్యలుండి అయ్యన్న బస్తీబాట పట్టలేదు. పొట్టచేతపట్టుకుని కూలీ నాలీ చేసి కడుపు నింపుకోవాలని అక్కడికి చేరాడు. కొత్తగా వెలుస్తున్న కాలనీలో కొత్తగా కట్టిన అపార్ట్ మెంటులో వాచ్ మన్ ఉద్యోగానికి కుదురుకున్నాడు.  తలదాచుకోవడానికి ఇబ్బంది లేదు. కరెంటు ఖర్చు లేదు. నీళ్ళ సమస్య లేదు. అందుకే జీతం తక్కువయినా అతడీ ఉపాధి ఎంచుకున్నాడు.

ఇక సుందరమ్మ.  ఏళ్ళు పైబడి సుందరమ్మ కాలేదు. పల్లెటూళ్ళల్లో అంతే!  పుట్టగానే ఆడపిల్లకు పెద్దరికం వచ్చేస్తుంది. బస్తీకి రాగానే సుందరమ్మ సుందరి అయిపోయింది. అయ్యన్నను మాత్రం అంతా 'అన్నా' అని పిలుస్తారు. పేరుమారింది సరే. కానీ జీవితం మారలేదు. మొగుడి జీతం గొర్రెతోక. పెరిగే ఆశ లేదు. అందుకే సుందరి కొంత భారాన్ని తన తలకు ఎత్తుకుంది. అపార్ట్ మెంటులో నాలుగు ఇళ్ళల్లో పనికి కుదిరింది. ఆలావచ్చిన డబ్బులతో మొగుడికి ఓ సెకండ్ హాండ్ సైకిల్ కొన్నది. అపార్ట్ మెంటులో కరెంటు బిల్లులు కట్టివస్తే పదో పరకో చేతిలో పెట్టేవాళ్ళు. కార్లు తుడిస్తే కొంత, చిన్నా చితకా పనులు చేసిపెడితే మరికొంతా చేతిలో పడేది. సుందరి పనిపాటులతోనే సరిపుచ్చకుండా అందరిళ్ళకు వెళ్లి వడియాలు అప్పడాలు పెట్టడంలో సాయం చేసేది. ఇంత ఇవ్వమని అడిగేది కాదు. ఇంతే ఇవ్వాలని వాళ్ళూ  అనుకునేవాళ్లు కాదు. కాబట్టి కష్టానికి సరిపడా గిట్టుబాటయ్యేది. మంచితనం మరికొన్ని పరిచయాలు చేసిపెట్టింది. ఆ కాలనీలో సుందరికి మంచి పేరువచ్చింది. క్రమంగా అవసరమయిన వారికి వంటలు చేసిపెట్టేది. పిండి వంటలు చేసిపెట్టేది. వూళ్ళో అమ్మ చేతికింద ఉంటూ నేర్చుకున్న విద్యలన్నీ బస్తీ కాపురానికి బాగా పనికి వస్తున్నాయి. బస్తీలో  కాపురం సులభం  కాదనుకుని వచ్చింది. కానీ కష్టపడాలే డబ్బు సంపాదించడం కూడా సులువే ఇప్పుడిప్పుడే అనిపిస్తోంది. పడుతున్న   కష్టాన్ని ఆ భావనే  మరిపిస్తోంది.


NOTE: Courtesy Image Owner