23, డిసెంబర్ 2013, సోమవారం



ఆనో భద్రాః క్రతవో యన్తు విశ్వతఃఅని రిగ్వేదం చెబుతోంది. అంటే అన్ని వైపులనుంచి ఉత్తమమైన భావాలు నాలో ప్రవేశించు గాక అని అర్ధం.

పరీక్ష జరిగే హాలు నిశ్శబ్దంగా వుంది. విద్యార్ధులందరూ జవాబులు రాసే క్రమంలో తలమునకలైవున్నారు.


(శ్రీ ఈశ్వరచంద్ర విద్యాసాగర్)

పరీక్షరాసే వారిలో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వున్నారు. తరగతి మొత్తంలో చాలా తెలివిగల విద్యార్ధి. అతడి వెనుకనే మనీష్ కూర్చుని ప్రశ్నాపత్రాన్ని దీక్షగా చూస్తున్నాడు. సహజంగా మందబుద్ధి అయిన మనీష్ కు ఆ పరీక్ష గట్టెక్కడం అన్నది ఒక పరీక్ష గా తయారయింది. అందుకే అతడు ఈ విషయంలో తన స్నేహితుడయిన విద్యాసాగర్ సాయం కోసం ఎదురుచూస్తూ బిత్తర చూపులు చూస్తున్నాడు. ఈలోగా ఈశ్వరచంద్ర విద్యాసాగ ర్ జవాబులురాసే పని పూర్తయింది. రాసిన సమాధానాలను మరోమారు పరిశీలించుకునే పనిలో పడిపోయాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మనీష్ మరో మారు ఈశ్వర్ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేసాడు. తన స్నేహితుడు కోరుతున్నదేమిటో ఈశ్వర్ కు సులువుగానే అర్ధం అయింది. కానీ ఈ విషయంలో స్నేహితుడికి సాయం చేయడానికి అతడికి మనస్కరించ లేదు. కానీ, దీనంగా అభ్యర్ధిస్తున్న స్నేహితుడి చూపులకు అతడి మనసు మెత్తపడింది. దాంతో అప్పటి వరకు తాను రాసిన సమాధాన పత్రాన్ని మనీష్ కు రహస్యంగా అందించాడు. ఇది ఎవరూ చూడలేదనుకున్నాడు కానీ, ఈశ్వర్ కాపీ అందిస్తూ వుండడం పరీక్ష హాలులో పర్యవేక్షణ చేస్తున్న ఉపాధ్యాయుడి కంటబడింది. అయ్యవారు ఆగ్రహంతో వూగిపోతూ ఈశ్వర్ ని పట్టుకుని కఠినంగా శిక్షించాడు. నలుగురిలో జరిగిన ఈ అవమానంతో స్వతహాగా అభిమానధనుడయిన ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఎంతగానో కుంగిపోయాడు.

పరీక్ష పూర్తి కాగానే ఉపాధ్యాయుడు ఈశ్వర్ ని తన గదికి పిలిపించుకున్నాడు.

చూడు. ఈశ్వర్. నువ్వు చాలా తెలివైన విద్యార్ధివి. బాగా చదువుకుని పైకి రావాల్సినవాడివి. నీలాటి తెలివయిన కుర్రవాడిని అలా శిక్షించినందుకు నాకెంతో బాధగా వుందిఅంటూ ఓదార్చే ప్రయత్నం చేసాడు.

స్నేహితుడికి సాయం చేయాలన్న సదుద్దేశ్యం తప్ప దగా చేయాలన్న అభిప్రాయం తనకు యే కోశానా లేదని విద్యాసాగర్ సంజాయిషీ ఇచ్చుకున్నాడు.

డానికి ఉపాధ్యాయుడు ఇలా జవాబు చెప్పారు.

తప్పుచేసినవాడు పాపితో సమానం. కానీ తప్పుచేసేవాడికి సాయం చేసేవాడు కూడా వాడితో సమానమే. అందుకే, నిన్నుశిక్షించాల్సి వచ్చింది. నిజమే. నువ్వు మనీష్ కి సాయం చేయాలని అనుకున్నావు. కానీ అలా చేయడం ద్వారా అతడిలోని బద్ధకానికి కూడా సాయం చేస్తున్న సంగతి మరచిపోయావు. అల్లా ఎవరో ఒకరు నీలా సాయం చేస్తూ పోతుంటే, ముందు ముందు తోటివారి సాయం తీసుకోకుండా అతడిక యేపనీ చేయలేడు

ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ వంటి మహా మేధావి స్వయంగా వెల్లడించిన ఈ ఉదంతం   ద్వారా తెలుసుకోవాల్సిన నీతి ఒకటుంది.

మనం చేసే ప్రతి పని వల్ల వచ్చే ఫలితం మంచి చెడుల సమ్మిశ్రమం. ఇతరుల జీవితాలను మంచి వైపు నడిపించే దిశగా మనం చేసే పనుల ఫలితం వుండేలాగా చూసుకోవాలి. అటువంటి చక్కటి భావనలు అన్ని వైపులనుంచి మన మనస్సులో ప్రవేశించేలా ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూవుండాలి. 


1 కామెంట్‌:

Unknown చెప్పారు...

మనలోని ద్వైదీ భావాలు నశించి అన్ని వైపుల నుండి
సద్భావనలు ప్రసరింపచేయుమని భగవంతుని ప్రార్థించే
"ఆనో భద్ర క్రతవయంతో విశ్వతః"అనే రుగ్వేద మంత్రం మాత్రమే నాలాంటి సామాన్యుల పాలిట ప్రణవం.