24, డిసెంబర్ 2013, మంగళవారం

పడగొట్టినా నిలబడతాం


యు ఎస్ ఎస్ న్యూయార్క్

పేరు చూడగానే ఇది అమెరికా నౌక అనితెలిసిపోతూనే వుంది. కాకపోతే,   ఇది ఆదేశం తాజాగా నిర్మించుకున్న ఓ  యుద్ధనౌక. ఉగ్రవాదుల పీచమణిచే లక్ష్యంతో అమెరికా రూపకల్పన చేసిన నౌకల శ్రేణిలో ఇది అయిదవది. ఈ భారీ యుద్ధ నౌకలో 360  మంది నావికులు, 700  మంది నౌకా సైనికులు అధునాతన యుద్ధ సామగ్రి, పరికరాలతో సదా సిద్ధంగా వుంటారు.
అన్ని యుద్ధ నౌకల్లో ఇదొకటి అనుకోవచ్చుకానీ దీనికొక ప్రత్యేకత వుంది. దీని నిర్మాణంలో సుమారు ఇరవై నాలుగువేల టన్నుల ఉక్కును   ఉపయోగించారు. అందులో మాత్రం విశిష్టత ఏముంది అనిపించవచ్చు. అలా వాడిన ఉక్కు ఒక్కటే  ఈ నౌకకు ఇంతటి  ప్రత్యేకతను సమకూర్చిపెట్టింది. పదమూడేళ్లక్రితం ఉగ్రవాదుల ముష్కర దాడిలో నేలమట్టం అయిన న్యూ యార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట హర్మ్యాల నిర్మాణంలో వాడిన ఉక్కు, ఇనుములనే సేకరించి, కరిగించి  వాటితో  ఈ యుద్ధ నౌకను నిర్మించారు. నౌకను తయారుచేసిన కర్మాగారానికి ఆ ఉక్కు శకలాలను తీసుకుని వచ్చినప్పుడు అక్కడి పనివారు దానిని చూసి నాటి ఘోర దృశ్యాలను తలచుకుని విచలితులయ్యారని నేవీ కెప్టెన్ కెవిన్ వెన్సింగ్ చెప్పారు. కరిగించిన ఆ ఉక్కును చేతితో తాకినప్పుడు ఉద్వేగంతో తన వొంటిపై రోమాలు నిక్కబొడుచుకున్నాయని ఫౌండ్రీ ఆపరేషన్స్ మేనేజర్ జూనియర్ షావర్స్ గుర్తుచేసుకున్నారు.


‘ఈ నౌకను చూస్తున్నప్పుడు మా అందరికీ ఒక విషయం స్పురణకు వస్తుంది. అవును ‘వాళ్లు’ నేలమట్టం చేయగలిగారు. కానీ మమ్మల్ని ఆ నేల మీదనే ఎల్లకాలం వుంచలేరు. మళ్ళీ లేచి నిలబడతాం. ఈ నౌకే దానికి ప్రత్యక్ష సాక్ష్యం.’
సముద్ర జలాల్లో ఠీవిగా నిలబడిన ఆ నౌకను చూస్తూ అన్నారాయన.

(శ్రీ పీవీవీజీ స్వామి గారు పంపిన మెయిల్ ఆధారంగా -  ఫోటోగ్రాఫర్ కు కృతజ్ఞతలు)

2 కామెంట్‌లు:

vemulachandra చెప్పారు...

"కరిగించిన ఆ ఉక్కును చేతితో తాకినప్పుడు ఉద్వేగంతో తన వొంటిపై రోమాలు నిక్కబొడుచుకున్నాయని ఫౌండ్రీ ఆపరేషన్స్ మేనేజర్ జూనియర్ షావర్స్ గుర్తుచేసుకున్నారు."
ఉద్వేగభరితం గా రూపు దిద్దుకున్న నౌక ఉగ్రవాదులకు సింహస్వప్నం లా
చక్కని పోస్టింగ్
అభినందనలు బండారు శ్రీనివాసరావు గారు

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Chandra Vemula - ధన్యవాదాలు - 'భండారు' శ్రీనివాసరావు