20, డిసెంబర్ 2013, శుక్రవారం

బొద్దింక నేర్పిన బ్రహ్మ రహస్యం



ఆనంద రావుకు చికాగ్గా వుంది.

తెల్లారకముందే ఇంట్లో తండ్రి పెట్టిన చివాట్లు ఓ పక్కన, ఆఫీసులో బాసు విసిరిన వ్యంగాస్త్రాలు మరో పక్కన గుర్తుకొచ్చి మనసును ముల్లుతో గుచ్చుతున్నాయి. ఆ గందరగోళంలో ఏం చెయ్యాలో తోచక కాఫీ తాగుదామని హోటల్లోకి అడుగుపెట్టాడు.

వేళ కాని వేళేమో ఖాళీగావుంది. ఓ మూల బల్ల దగ్గర కూర్చుని కాఫీ ఆర్డర్ చేసాడు. ఇంతలో ఎక్కడినుంచో వూడిపడ్డట్టు అయిదారుగురు అమ్మాయిలు పక్క టేబుల్ వద్దకు చేరారు.

అసలే ఆడపిల్లలు. ఉద్యోగాలు చేస్తూ సొంతంగా సంపాదించు కుంటున్న వాళ్లు. లోకం పోకడ తెలిసిన వాళ్లు. ఇక కబుర్లకేం తక్కువ. ఎక్కడలేని విషయాలు వాళ్ల నోళ్ల నుంచి గలగలా తన్నుకువస్తున్నాయి.

ఏమయిందో యేమో వారిలో ఒకమ్మాయి దిగ్గున లేచి కెవ్వున కేక పెట్టింది. ఆనందరావు కూడా అటు చూశాడు.

చూడరానిదేదో చూసినట్టు ఆమె మొహంలో భయం తాండవిస్తోంది. తాకరానిదేదో తాకినట్టు ఆమె వొళ్ళు కంపిస్తోంది. సాయం చేయండంటూ స్నేహితురాళ్ల ని కంటి చూపుతోనే బేలగా అర్ధిస్తోంది.



తీరా చూస్తే ఆమె చున్నీ మీద ఓ బొద్దింక విలాసంగా వాలి తమాషా చూస్తోంది.

బొద్దింక ను చూడగానే వాళ్ళందరికీ మతులు పోయాయి. అది లేచి వచ్చి తమ మీద ఎక్కడ దాడి చేస్తుందేమో అన్నట్టుగా వాళ్ళంతా హడలి పోతున్నారు.

వాళ్లు అనుకున్నంతా అయింది. బొద్దింక మొదటి అమ్మాయిని వొదిలేసి మరో అమ్మడి భుజం మీద వాలింది. అంతే! ఇక ఏడుపులు మొత్తుకోళ్ళు ఆ రెండో అమ్మాయి వంతయ్యాయి.

ఇదంతా చూసి ఓ వెయిటర్ ముందుకు వచ్చాడు. రిలే జంపింగ్ లో భాగంగా బొద్దింక అమాంతం యెగిరి అతడి చొక్కాపై వాలింది.

కానీ, అతడు కంగారు పడలేదు. ఇతరులను కంగారు పెట్టలేదు. కదలకుండా నిలబడి దానివైపు కాసేపు కళ్ళార్పకుండా చూశాడు. తనని తాను కుదుట పరచుకున్నాడు. సుతారంగా చేయి చాపి బొద్దింకను వేళ్ళతో పట్టి విలాసంగా బయటకు విసిరేసాడు.

కాఫీ చప్పరిస్తూ ఇదంతా గమనిస్తున్న ఆనంద రావులో కొత్త ఆలోచనలు సుళ్ళు తిరిగాయి. ఆ ఆడపిల్లలు అలా భయం భయంగా ప్రవర్తించడానికి కారణం ఆ బొద్దింక అయివుంటుందా ?

పోనీ అలానే అనుకున్న పక్షంలో అదే బొద్దింక ను చూసి వెయిటర్ ఎందుకు కంగారు పడలేదు? కంగారు పడకపోగా ఎలాటి గందరగోళానికి తావివ్వకుండా , ఎటువంటి నాటకీయతకు అవకాశం ఇవ్వకుండా ఆ బొద్దింక ను ఎలా వొదుల్చుకోగలిగాడు?

వేర్వేరు వ్యక్తులు ఒకేరకమయిన పరిస్థితుల్లో విభిన్నంగా ప్రవర్తించడానికి కారణం ఏమయి వుంటుంది?’

అంటే ఏమిటన్న మాట.

అమ్మాయిలు అలా గాభరా పడడానికి కారణం బొద్దింక కానే కాదు. అనుకోకుండా ఎదురయిన పరిస్తితిని ఎదుర్కోవడానికి వాళ్ల శక్తి యుక్తులు, సామర్ధ్యం సమయానికి అక్కరకు రాలేదని అనుకోవాలి.

ఆనందరావు ఆలోచనలు మరింత వెనక్కు సాగాయి.

నాన్న తనపై కేకలు వేసినప్పుడు, బాసు ఆఫీసులో అకారణంగా ఇంతెత్తున యెగిరి పడ్డప్పుడు తన మనసు బాధ పడింది. నిజానికి ఇంత గందరగోళపడడానికి వాళ్ల ప్రవర్తన ఎంత మాత్రం కారణం కాదన్నమాట. ఆ సమయంలో ఆ పరిస్తితిని తట్టుకోవడంలో తన మానసిక సామర్ధ్యం కొరవడడమే కారణం అన్నమాట.

మనసు కలత పడడానికి, బాధ పడడానికి మనసు కారణం కాదు. తగిన మానసిక ధైర్యంతో పరిస్తితులను వాటికి తగ్గట్టుగా ఎదుర్కోలేకపోవడమే మానసిక వొడిదుడుకులకు కారణం.

రోడ్డుమీద వెడుతుంటా ము. ట్రాఫిక్ జాం లో చిక్కుకోగానే మనసు గందరగోళంలో పడుతుంది. దీనికి కారణం ట్రాఫిక్ జాం అని విసుక్కుంటాము. అంతేకాని ట్రాఫిక్ జాం చూడగానే మనసులో ఏర్పడ్డ గందర గోళాన్ని ఎదుర్కోవడంలో మన వైఫల్యం అని అనుకోము.

సమస్య కంటే కూడా ఆ సమస్యవల్ల కలిగే మానసిక వొత్తిడే మనుషుల్ని ఎక్కువ బాధ పెడుతోంది.

అందుకే, బొద్దింక ను చూడగానే అమ్మాయిలు గాభరా పడ్డారు. వెయిటర్ మాత్రం కుదురుగా ఆ పరిస్తితిని ఎదుర్కున్నాడు.

జీవితంలో ఎదురయ్యే సంఘటనలను చూసి గందరగోళానికి గురికాకూడదు. వాటిని ఎదుర్కోవడం పైనే దృష్టి పెట్టగలగాలి.

క్రియ ప్రతిక్రియ అతి సహజంగా అప్పటికప్పుడు జరిగేవి.

స్పందన ప్రతిస్పందన బుద్ధి సూక్ష్మత వల్ల కలిగేవి.

సమస్య పట్ల రియాక్ట్ కావడం కాదు దాని విషయంలో సరిగా రెస్పాండ్ కావలి. అప్పుడే పరిష్కారం లభిస్తుంది.

బోధి వృక్షం అవసరం లేకుండానే ఆనందరావుకు జ్ఞానోదయం అయింది.


కామెంట్‌లు లేవు: