26, డిసెంబర్ 2013, గురువారం

ధన్యజీవికొద్ది రోజుల తేడాతో  ఇద్దరు అక్కయ్యలు కన్ను మూయడం మొత్తం మా కుటుంబాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. రెండువారాలు కూడా కాలేదు ఆరో అక్కయ్య ప్రేమక్కయ్య (74) చనిపోయి. వార్త తెలియగానే  మా పెద్దక్కయ్య శ్రీమతి తుర్లపాటి సరస్వతి హుటాహుటిన కారులో తన వయస్సును కూడా (84) లెక్కపెట్టకుండా  ఆమెను చూడడానికి బెజవాడ నుంచి హైదరాబాదు వచ్చింది. తన కళ్ళముందే చిన్నవాళ్ళు దాటిపోతున్నారని గొల్లుమంది.(శ్రీమతి తుర్లపాటి సరస్వతి)

 ఏమయిందో యేమో మూడో  రోజున ఆయాసంగా వుందంటే ఆస్పత్రిలో చేర్పించారు. అటునుంచి అటే ఐ.సీ.యూ, తరువాత వెంటిలేటర్ ఈ ఉదయం కల్లా అంతా అయిపోయింది. ప్రేమక్కయ్య పన్నెండో రోజుకు వచ్చిన బంధుగణం అంతా సరసక్కయ్య అంతిమ ఘడియలను చూడాల్సి వచ్చింది. ఎవరితో చేయించుకోకుండా పెద్ద ప్రాణం దాటిపోయింది. పెనిమిటి శ్రీ తుర్లపాటి హనుమంతరావు గారు చనిపోయిన నాటి నుంచి ఈ రెండేళ్లుగా సరసక్కయ్య ప్రాణం ఆయనకోసమే కొట్టుకుంది. దాదాపు డెబ్బయ్  ఏళ్ళ  దాంపత్య అనుబంధం. అందుకే ఆయనలేని లోకంలో ఎక్కువ కాలం మనలేకపోయింది. రోగం రొష్టు అంటూ పిల్లల్ని బాద పెట్టకుండా, తాను బాధ పడకుండా మా బావగారిని వెతుక్కుంటూ పైలోకాలకు వెళ్ళి పోయింది. ధన్యజీవి. నా వంటి ఎంతోమందికి అక్షరభిక్ష, అన్నభిక్ష పెట్టిన ఆదర్శ దంపతులు. వారికి నా నివాళులు. 

కామెంట్‌లు లేవు: