28, డిసెంబర్ 2013, శనివారం

రెడీమేడ్ మొగుళ్ళు


తల్లిపాలు తప్ప అన్నీ అమ్మకానికి పెట్టే కార్పొరేట్ యుగం నడుస్తోంది. మంచి లాభసాటి వ్యాపారం పెట్టాలని అనుకున్న ఓ కార్పొరేట్ సంస్థ,   ఏకంగా రెడీమేడ్  మొగుళ్లను అమ్మే ఓ పెద్ద దుకాణాన్ని న్యూ యార్క్ లో తెరిచింది. తలకు వంద డాలర్లు ప్రవేశ రుసుము పెట్టింది. తమ అభిరుచులకు తగిన చక్కని  భర్తకోసం వెతికే కన్నెపడుచులు ఎంచెక్కా ఈ షాపులోకి వెళ్ళి నచ్చిన వారిని నచ్చినట్టు కొనుక్కుని ఇంటికి తీసుకువెళ్ళి తమ ఇంటివాడిని చేసుకునే  సౌలభ్యం ఇందులో వుండడం వల్ల పెళ్ళికాని పడతులందరూ పెళ్ళికాని ప్రసాదులకోసం ఈ దుకాణంపై ఎగబడ్డారు. అయితే ఈ షాపులో షాపింగ్ చేయాలంటే కొన్ని నియమాలు, నిబంధనలు వున్నాయి.


అవేమిటంటే-
ఆరంతస్తుల ఈ భవనంలోకి ఎవరినయినాసరే ఒకేసారి అనుమతిస్తారు.
ప్రతి అంతస్తులో పెళ్లిళ్ళు కావాల్సిన యువకులు స్వయంవరంలో మాదిరిగా సిద్ధంగా వుంటారు. మొదటి అంతస్తులోనే తగిన యువకుడు తటస్థపడితే ఇక మరో అంతస్తుకు వెళ్ళడానికి వీలుండదు.
ఈ కండిషన్లు అన్నీ క్షుణ్ణంగా చదివిన తరువాత ఒక యువతి  రెడీమేడ్ మొగుడ్ని కొనుక్కోవడం కోసం వంద డాలర్లు చెల్లించి ఆ షాపులోకి  వెళ్ళింది.
మొదటి అంతస్తు మొదట్లోనే ఒక బోర్డు రాసివుంది.
ఈ అంతస్తులో మీకు నచ్చిన మొగుళ్ళు ఖచ్చితంగా దొరుకుతారు.  వీళ్ళందరూ చాలా బుద్దిమంతులు. చక్కటి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పైపెచ్చు  దేవుడిమీద విశ్వాసం వున్నవాళ్ళు.
ఆ యువతి తలపంకించి రెండో అంతస్తుకు  చేరుకుంది.
ఈ అంతస్తులో అమ్మకానికి వున్న మగపిల్లలు  మరింత మంచివాళ్ళు. వీళ్ళకు ఉద్యోగాలు, దైవభక్తే  కాదు, పిల్లలంటే  తగని ప్రేమ కూడా
అది చదివిన ఆ అమ్మడు మరో అంతస్తుకు వెళ్ళింది.
ఇక్కడ అమ్మకానికి వున్నవారికి అన్ని యోగ్యతలు వున్నాయి. మంచి ఉద్యోగం, దేవుడంటే భయం భక్తీ, పిల్లల్ని ప్రేమించే తత్వం, అన్నిటికీ మించి కళ్ళు చెదిరే అందం. మంచి బేరం మించిన దొరకదుఅని అక్కడ రాసివుంది.
అయినా ఆ అమ్మాయికి తృప్తి లేకపోయింది. నాలుగో అంతస్తుకు వెళ్ళింది.
కింది మూడు అంతస్తులలో వున్న వారి లక్షణాలకు  అదనంగా ఇక్కడి వారికి మరో మంచి గుణం వుంది. అదేమిటంటే కిమ్మనకుండా  ఇంటి పనులుమొత్తం వొంటిచేత్తో సవరిస్తారు.
ఒక్కక్షణం ఆమె ఆలోచించింది. ఇంతకంటే వెతకడం వృధాఏమో అని లిప్తపాటు ఆలోచించింది. అయినా పై అంతస్తులో ఇంతకంటే మంచి మొగుడు దొరక్కపోతాడా అన్న ఆలోచన ఆమెను అక్కడ నిలవనియ్యలేదు. దానితో  మరో అంతస్తుకు వెళ్ళింది.  
మీరు చాలా అదృష్టవంతులు. ఇక్కడ వున్న మగవాళ్ళు పుటం వేసి గాలించినా మీకు ఎక్కడా దొరకరు. కొరుక్కుతినాలనిపించే అందం, కూర్చుని తిన్నా తరతరాలకు తరగని ఆస్తి, పిల్లలపట్ల ప్రేమ, పెద్దలంటే గౌరవం, ఇంటి పనులు, వంట పనులు సమస్తం స్వయంగా చూసుకోగల శక్తి సామర్ధ్యాలు, ఓహ్! ఒక్కసారి లోపలకు వచ్చి చూస్తే మీకే తెలుస్తుంది
ఆ యువతి కాసేపు ఆలోచించింది. మిగిలింది ఇంక ఒకే అంతస్తు. పోయి చూస్తే పోలా!
ఆరో అంతస్తుకు చేరుకుంది. అక్కడ కింద కనబడ్డ బోర్డులు లాటివి ఏవీ లేవు. తలుపు తోసుకుని లోపలకు వెళ్ళింది. అంతా ఖాళీ. ఎవ్వరూ లేరు. కొంపతీసి నిఖార్సయిన మంచి మొగుళ్ళందర్నీ జనం ముందే  ఎగరేసుకుపోలేదు కదా!అని అనుకుంటూ తిరిగొస్తుంటే తలుపు వెనక ఎలక్ట్రానిక్ డిస్ ప్లే మీద ఇలా కనబడింది.
ఇప్పటిదాకా  లక్షాపాతికవేల నూటనలభయ్ రెండు మంది  ఈ చివరి అంతస్తుకు వచ్చారు. మీరు లక్షాపాతికవేల నూటనలభయ్ మూడోవారు. ఈ హాలులో అమ్మకానికి మగవాళ్ళు ఎవ్వరూ లేరు. ఆడవాళ్ళని మెప్పించడం అతికష్టం అన్న నిజానికి రుజువుగా మాత్రమే ఈ అంతస్తుని ఏర్పాటు చేశాం.
మా  షాపుకి వచ్చినందుకు ధన్యవాదాలు. దిగివెళ్ళేటప్పుడు జాగ్రత్త. మీకు అంతా మంచే జరగాలని మా యాజమాన్యం కోరుకుంటోంది’  
(గమనిక: నెట్లో  తిరుగాడుతున్న ఆంగ్ల కధనాన్ని శ్రీ గొర్తి శ్రీనివాస్ పంపారు. దానికి స్వేచ్చానువాదం ఇది)

NOTE: Courtesy Image Owner 

3 కామెంట్‌లు:

knmurthy చెప్పారు...

itis true

knmurthy చెప్పారు...

itis true

అజ్ఞాత చెప్పారు...

బాగుంది