1, డిసెంబర్ 2013, ఆదివారం

కార్టూన్


దూరం నుంచి చూసినప్పుడు అతడేమోనని అనిపించింది. కానీ అతడేనా అన్న అనుమానం కూడా అప్పుడే  పొడసూపింది.
ఆ సాయంత్రం మళ్ళీ కనిపించాడు. తెల్లటి ఆఫ్రాన్ వేసుకుని.  హుందాగా నెమ్మదిగా నడుస్తుంటే అతడి వెనుక వినమ్రంగా అడుగులు వేస్తూ అమెరికన్ డాక్టర్లు.
సందేహం లేదు, అతడే.  ఎక్కడో ఇండియాలో మారుమూల పల్లెటూళ్ళో వుండే భాస్కరం ఇలా ఇక్కడ అమెరికాలో. నమ్మశక్యం కాని విషయం. కానీ కళ్ళెదుట కనబడుతుంటే నమ్మకపోవడం యెలా? చూస్తుండగానే ఆ డాక్టర్ల బృందం నన్ను దాటుకుని వెళ్ళిపోయింది.
ఆ మరునాడు అదే హాస్పటల్ లో మా కోడలు ప్రసవించింది. ఆడపిల్ల.  మా ఇంట్లో పిల్లి పిల్లకు కూడా మగ పిల్లే పుడుతుంది అందరూ హాస్యోక్తిగా చెప్పుకునేవారు. అలాటప్పుడు మళ్ళీ కొన్ని తరాల తరువాత ఆడపిల్ల పుట్టింది.  అదీ శుక్రవారం నాడు. మా ఆవిడ సంతోషానికి అంతే  లేదు. మా వాడు ఆ పసిపిల్ల ఫోటోని తీసి అప్పటికప్పుడే అప్ లోడ్ చేసేసాడు కూడా.  వాడు పుట్టినప్పటి రోజులు గుర్తొచ్చాయి. ‘..అమ్మాయి ప్రసవించింది. మగపిల్లవాడు. తల్లీ పిల్లవాడు క్షేమం’ అంటూ మామగారు రాసిన కార్డుముక్క బారసాల నాటికి కాని చేరలేదు.
అమెరికా వచ్చిన పని అలా శుభంగా ముగిసిపోయిన తరువాత మళ్ళీ భాస్కరం గుర్తుకు వచ్చాడు. తెల్లగా పొట్టిగా వుండేవాడు. అతడు చదువుకునే సోషల్ వెల్ ఫేర్ హాస్టల్ కు నేను వార్డెన్ ని. చదువులో చురుకే కాని ఆవేశం పాలు ఎక్కువ. ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా రగిలిపోయేవాడు. అప్పటికప్పుడు దాన్ని సరిదిద్దాలని చూసేవాడు. కానీ ఆ ప్రయత్నంలో అతడు ఎప్పుడూ గెలిచిన దాఖలాలు లేవు.  ఎందుకంటే వ్యవస్థ అలాటిది.  తుప్పుపట్టిపోయింది కానీ  మూలాలు మాత్రం చాలా గట్టివి.
భాస్కరాన్ని ఎవరయినా చూస్తే మళ్ళీ మరచిపోవడం కష్టం. పొట్టిగా గిడసబారినట్టు వుండే అతడి ఆకారం అందుకు కారణం. నేలకు నాలుగు అడుగుల ఎత్తు. ఎవరితోనయినా మాట్లాడాలి అంటే తలను పూర్తిగా వెనక్కు వాల్చి పైకి చూస్తూ మాట్లాడేవాడు. అతడిని అలా చూస్తుంటే నవ్వు ఆపుకోవడం చాలా కష్టం.
‘అవును మాస్టారు. నన్ను చూసి అందరూ నవ్వుతారు. తప్పేం లేదు. పత్రికలో కార్టూన్ చూసి నేనూ నవ్వుకుంటాను. అలాగే వాళ్ళూ. పోనీ లెండి నన్ను చూసి నవ్వుకుంటున్నారు. ఏడవకుంటే చాలు’ అన్నాడొకసారి. అంతే!  మళ్ళీ అతడ్ని చూసి నేను యెప్పుడూ నవ్వలేదు.
హాస్టల్లో జరిగిన ఓ అన్యాయాన్ని గట్టిగా ప్రతిఘటించినందుకు అతడ్ని ఫైనల్ పరీక్షలు రాయనివ్వలేదు. నేను వెళ్ళి గట్టిగా చెప్పాను.
‘అన్యాయాన్ని సరిదిద్దాలనే నీ తపనలో తప్పులేదు. కానీ దాన్ని సరిదిద్దే క్రమంలో బంగారం లాంటి నీ భవిష్యత్తు పాడుచేసుకోకు. ముందు నిన్ను నీవు నిరూపించుకో. ఆ తరువాత అందరూ నీ దారికి వస్తారు’ అని అతడికీ, ఆ తరువాత ప్రిన్సిపాల్ కీ నచ్చచెప్పి పరీక్షలు రాసేలా చూసాను. ఆ సంవత్సరం అతడే స్కూలు ఫస్ట్. ఇంటర్ లో అనుకుంటాను రాష్ట్రం మొత్తంలో ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాడు.  పత్రికల్లో అతడి ఫోటోలు కూడా వేసారు. ఆ తరువాత భాస్కరాన్ని నేను చూడలేదు. మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత ఇక్కడ ఇలా.


మర్నాడు కోడల్ని డిస్చార్జ్ చేస్తున్నారు. నర్సులు వచ్చి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఆ సమయంలో హఠాత్తుగా భాస్కరం మా గదిలోకి వచ్చాడు. చేతులు జోడించి నమస్కరిస్తూ ‘ యెలా వున్నారు మాస్టారు’ అన్నాడు. అతడలా రావడం చూసి మావాడు నివ్వెరపోయాడు. భాస్కరం ఆ ఆసుపత్రికి డైరెక్టర్ ట.
‘నేను నిన్ననే మిమ్మల్ని చూసాను. కానీ మిమ్మల్ని కలవాల్సింది అక్కడ కాదు. ఇలా మీదగ్గరకు వచ్చి పలకరిస్తేనే నాకు తృప్తి. ఇది మీరు పెట్టిన భిక్షే!’ అన్నాడు. నాకు ఆశ్చర్యంతో కొంతా, ఆనందంతో కొంతా నోరు పూడుకుపోయింది. కళ్ళు చెమర్చాయి. చెప్పొద్దూ! కాస్త గర్వంగా కూడా ఫీలయ్యాను. అసలే గొప్పగా వున్న ఆ ఆసుపత్రి ఇంకా గొప్పగా కనిపించింది.

(01-12-2013)

IMAGE COURTESY OWNER 

కామెంట్‌లు లేవు: