19, డిసెంబర్ 2013, గురువారం

దేవుడి తెలివితేటలు



అవి అన్నీ ఇన్నీ కాదు. అందుకే కొద్దికొద్దిగా చెప్పుకుందాం.
(దేవుడ్ని నమ్మని వాళ్లకు ఓ వినతి. భగవంతుడు మన సమస్యలను పరిష్కరిస్తే ఆయన  సమర్ధత పట్ల మనకు నమ్మకం వుంటుంది. దేవుడు మన సమస్యలను తీర్చలేకపోతే ఆయనకు మన సామర్ధ్యం పట్ల విశ్వాసం వున్నది అనుకోవాలి. సృష్టి నిర్మాణంలో దేవుడు చేసిన చమక్కులు గమనిస్తే ఆయన గొప్పతనం ఏమిటో బోధపడుతుంది. అందుకే ఈ ప్రయత్నం)

మనకు ఈనాడు కనపడే జంతువుల్లో ఏనుగుది భారీ కాయం. అందుకే ఏనుగు నాలుగు కాళ్ళు వొకే పద్దతిలో ముందుకే వొంగివుండే ఏర్పాటు చేసాడు. అంతటి వొళ్ళు వున్న జంతువు మామూలుగా ఇతర జంతువుల మాదిరిగా లేచి నిలబడడం కష్టం. అందుకే సృష్టికర్త ఏనుగుకు ఈ వెసులుబాటు కలిపించాడు. అదే గుర్రం విషయం తీసుకోండి. అది  ముందు కాళ్ళు ముందు పైకి లేపి తరువాత నిలబడుతుంది.  ఆవులు, గేదెలు మాత్రం  వెనుక కాళ్ళు ముందు పైకి లేపి తరువాత  నిలబడతాయి. ఇది చిన్న విషయంలా కనబడవచ్చు. కానీ ఈ అమరికలో ఎన్నో  శాస్త్రీయ పద్దతులు దాగివున్నాయి.



కలువలూ, తామరలూ రెండూ పూలే. కానీ తామర సూర్యోదయ సమయంలో వికసిస్తే కలువ పూవు చంద్రోదయ సమయంలో రెక్కలు విప్పుతుంది. అలాగే ప్రపంచంలో అనేక రకాల పుష్పజాతులు ఒక్కోసమయంలో వికసించే విధానాన్ని గమనించినప్పుడు సృష్టి కార్యం లోని గొప్పతనం అవగతమవుతుంది. లినాయాస్ అనే ప్రఖ్యాత వృక్ష శాస్త్రవేత్త – ‘రక రకాల పూల మొక్కలను ఒకేచోట పెంచగలిగిన వీలున్న పక్షంలో అవి వికసించే సమయాన్నిబట్టి గడియారం అవసరం లేకుండా కాలనిర్ణయం చేయొచ్చున’ని అంటాడు. ఈ వొక్క ముక్క చాలు సృష్టిలో దాగున్న రహస్యాలను అర్ధం చేసుకోవడానికి.
(ఒక ఇంగ్లీష్ గల్పిక ఆధారంగా)

NOTE: Courtesy Image Owner

1 కామెంట్‌:

anrd చెప్పారు...

చక్కటి విషయాలను తెలియజేసారు.