ఎవరీ పిల్లల కోడి?
ఒకప్పుడు
ఆంధ్రజ్యోతి పబ్లికేషన్స్ నుంచి వనితాజ్యోతి అనే మహిళల పత్రిక వెలువడేది.
వాసిరెడ్డి కాశీరత్నం గారు దానికి ప్రతినిధి. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పశు
సంవర్ధక శాఖ డైరెక్టర్ గా పనిచేసిన శ్రీ వాసిరెడ్డి నారాయణ రావు గారి సతీమణి.
ఎప్పుడో
నలభయ్ అయిదేళ్ళ క్రితం వెతుక్కుంటూ చిక్కడపల్లి
త్యాగరాయగాన సభ దగ్గర వున్న మా ఇంటికి వచ్చారు. నా కోసం కాదు, మా ఆవిడకోసం. వెంట ఒక ఫోటోగ్రాఫర్
కూడా. వచ్చేసరికి మా ఆవిడ నడుపుతున్న అమ్మవొడి చైల్డ్ కేర్ సెంటర్ పిల్లలతో కీసరబాసరగా
వుంది. వనితాజ్యోతి పత్రిక కోసం ఇంటర్వ్యూ చేద్దామని వచ్చారు. నోటు పుస్తకంతో
కాశీరత్నం గారు, చంకన
బిడ్డలతో మా ఆవిడ. ఆ గందరగోళం నడుమనే ఆమె ఇంటర్వ్యూ చేసి తమ పత్రికలో
ప్రచురించారు.
అది
యధాతధంగా:
చిట్టి
పొట్టి చిన్నారుల చిన్నారి ప్రపంచం – వాసిరెడ్డ్డి కాశీరత్నం
చిక్కడపల్లి
సుధా హోటల్ నుంచి త్యాగరాయ గానసభకు వెళ్ళే రోడ్డులో “అమ్మ ఒడి” అని బోర్డు
కనిపిస్తుంది. ‘అమ్మకొంగు ముడి విడలేని చిన్నారుల బడి’ అని కూడా ఓ ట్యాగ్ లైన్
వుంటుంది.
అదే
భండారు నిర్మలాదేవి నిర్వహించే డే కేర్ సెంటర్ “అమ్మ ఒడి”.
గేటు
తీసుకుని లోపలకు వెడితే...
ఆ గది
అంతా పసివారి కోలాహలంతో నిండి వుంటుంది. పాల కోసం ఏడుస్తూ చేతులు చాపే చిన్నారుల
దగ్గరినుంచి కాలిమువ్వలు ఘల్లుఘల్లుమంటూ తిరిగే దీపిక దాకా అంతా నిర్మలాదేవికి
మాలిమి అయినవారే.
“ఈ
పిల్లలంతా ఇలా కోలాహలంగా అరుస్తున్నారు కదా! మీకు తల నొప్పిగా ఉండదూ” అని
ప్రశ్నిస్తే నవ్వుతుంది నిర్మల.
“మొదట్లో
సంగతి ఎలా వున్నా తరువాత పిల్లలు బాగా అలవాటు అయ్యారు. ఇప్పుడు పిల్లలు లేకపోతె
నేనుండలేను. ఏదో ఒక కారణం వల్ల ఒక
పిల్లవాడో, పాపో
రాకపోతే ఆ రోజు నా మనసు తహతహలాడుతుంది. ఏమిటీ అనుబంధం అని
ఆశ్చర్యం వేస్తుంది” నిర్మల జవాబు.
ముద్దులొలికే
ఆ పసివాళ్లు పెద్దవాళ్ల మనస్సులకు బంధాలు వేసి లాగుతారు కదా!
“మొదటి
నుంచీ నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం. నా పిల్లలు ఇద్దర్నీ బాగానే పెంచాను. మా
పక్కన వుండే పూర్ణ చంద్రావతి నాకీ సలహా ఇచ్చారు. ముందుగా ఆవిడే వాళ్ళ పాప దీపికను
నాకు అప్పగించి ఆఫీసుకు వెళ్ళేవారు. ఆ తర్వాతనే జేమ్స్ తట్టా బుట్టాతో వచ్చాడు”
అక్కడే
ఆ పిల్లల దగ్గరే పిల్లల కోడిలా కూర్చుని కబుర్లు చెబుతోంది నిర్మల.
“ఇదిగో
కార్తీక్. వీళ్ళమ్మ మ్యూజిక్ కాలేజీలో పనిచేస్తుంది. ఇటు చూశారా, హేమంత్. ఇదిగో ఇటు గౌతమ్. పద్మ
ప్రియ. వీళ్ళ తల్లులు బ్యాంకుల్లో పనిచేస్తారు. ఈ చిన్నారి అపర్ణ అమ్మ
యూనివర్సిటీలో, సురేశ్ వాళ్ళమ్మ టెలిఫోన్స్ లో పనిచేస్తారు”
ఒక్కొక్క
బేబీని పేరుపేరునా పిలిచి చూపిస్తోంది నిర్మల.
“ఇంత
పసివాళ్లు కదా! ఎలా మాలిమి అయ్యారు”
“మొదట్లో
కొంతమంది మారాం చేశారు. శ్రీనివాస్ వచ్చినప్పుడు రెండున్నర ఏళ్ళవాడు. కొంచెం కష్టం
అయింది. చంక దిగేవాడు కాదు. ఇంట్లో వంటంతా
వాడిని ఎత్తుకునే చేసేదానిని. ఆ తరవాత అలవాటు అయ్యాడు అనుకోండి. శైలజ
రాగానే వాళ్లమ్మ చంక నుంచి నా మీదకు దూకేసింది. వీళ్ళందరికీ కబుర్లు చెప్పాలి.
మాటలు నేర్పాలి. సాయంత్రం అయ్యేసరికి మొహాలు కడిగి, పౌడరు వేసి, బొట్టూ కాటుక పెట్టి వారి తల్లులకు
అప్పగించేదాన్ని. కొంతమందికి స్నానాలు కూడా ఇక్కడే. కొందరికి జడలు వేయాలి. వాళ్ళ అమ్మావాళ్ళు ఇచ్చి
వెళ్ళిన డ్రస్సులు వేయాలి. మరీ చిన్నవాళ్లను లాలిపాటలు పాడి నిద్ర పుచ్చాలి.
పెండ్లి వారిన పంపినంత పని వుంది.”
“ఇంత
పనీ మీరొక్కరే చేయగలుగుతారా?”
“అరుగో
వున్నారు కదా! జయవిజయుల్లాగా. పెద్ద ఆయా సుశీల. చిన్న ఆయా పద్మ. వాళ్లిద్దరే నాకు
సాయం”
“ఈ
పసివాళ్లకు ఏదైనా సుస్తీ చేస్తే మీరేం చేస్తారు”
“చాలాసార్లు
చిన్న చిన్న చిట్కా వైద్యాలు నేనే చేస్తుంటాను. మా పిల్లలు పసివాళ్ళుగా
వున్నప్పుడు మా అత్తగారు, వదిన
గార్ల నుంచి నేర్చుకున్నాను. నిజానికి ప్రతి తల్లీ ఒక రకంగా చిన్నసైజు డాక్టరే. చాలా మంది తల్లులు పిల్లలకు నీళ్ళ
పాలు పడతారు. ఇది మంచిది కాదు. తల్లులకు
పాలు ఎలా కలపాలో, ఎంత
పొడి వేయాలో చెబుతుంటాను. సాధారణంగా
పసివారికి నెలకు రెండు డబ్బాలు పడతాయి. పాల పొడి డబ్బాలు, పాల సీసాలు వాళ్ళే ఇస్తారు. సీసాలను
ఇక్కడే నీళ్ళలో ఉడికించి స్టెరిలైజ్ చేస్తాము. ఒక్క జేమ్స్ ను మాత్రమే రెండు మూడు
సార్లు ఆసుపత్రికి తీసుకు వెళ్ళాల్సి వచ్చింది. తక్కిన పిల్లలతో ఎలాంటి ఇబ్బందీ
లేదు. మా పెద్ద వదిన గారి కొడుకు మనోహర్ ఈ ఏరియాలో మంచి పేరున్న పిల్లల డాక్టర్.
ఇంగ్లాండ్ లో చదువుకుని వచ్చాడు. అసలు విసుగన్నదే లేని మనిషి. ఎప్పుడు ఫోన్ చేసి
సలహా అడిగినా ఏం చేయాలో చెప్పేవాడు. అలాంటి డాక్టర్ మనోహర్ మా చుట్టం అని తెలియగానే చాలా
మంది తలిదండ్రులు సంతోషపడ్డారు కూడా”
“మరి ఈ
తల్లులందరూ మీకు రెగ్యులర్ గా పే చేస్తుంటారా”
తల
ఊపింది నిర్మల.
“చాలా
రెగ్యులర్ గా పే చేస్తారు. పొద్దున్నే ఎనిమిదిన్నరకల్లా పిల్లల్ని నాకు
అప్పగిస్తారు. మళ్ళీ సాయంత్రం అయిదున్నర లోపు తీసుకు వెడతారు. ఎవరో కొద్దిమంది
షాపింగ్ కూడా ముగించుకుని వస్తారు. అదే కొంచెం కష్టం అనిపిస్తుంది. మా పిల్లలు
అప్పటికే స్కూలు నుంచి వచ్చేవారు. వాళ్లకు ఏదైనా తినడానికి చేసి పెడదాం అంటే
కుదిరేది కాదు. పాపం ఇద్దరూ అలా మిగిలిన పిల్లలతో ఆడుతూ కాలక్షేపం చేసేవాళ్ళు”
మనసుకు
తృప్తి కలిగించే పనులు చేస్తున్నప్పుడు మిగిలిన బాధలు ఒక లెక్కలోనివి కావు
అన్నట్టు మాట్లాడింది నిర్మల.
తనకు
నచ్చిన పని దొరికితే మనిషికి ఎంత సంతృప్తి లభిస్తుందో నిర్మలను చూసినప్పుడు
నాకనిపించింది.
ముద్దులొలికే
ఆ చిన్నారుల కబుర్లు,
ముచ్చట్లు వింటూ నవ్వుకుంటున్న ఆ ‘భాగ్యశాలి’కి వీడ్కోలు చెప్పి అమ్మ ఒడి నుంచి
బయటకు వచ్చాను.
-వాసిరెడ్డి
కాశీరత్నం
కట్
చేస్తే
సరిగ్గా ముప్పై తొమ్మిది సంవత్సరాల తర్వాత :
చివరాఖరి నవ్వు
2019, ఆగస్టు.
హైదరాబాదు పంజాగుట్ట గలేరియా మాల్ లో ఓ
షాపు. తను లోపలికి వెళ్ళింది. నేనూ వెంటే వెళ్లాను. అక్కడి సేల్స్ గర్ల్ కు చిన్న తల నూనె సీసా చూపించింది.
“ఎంత”
“ట్వెల్ ఫిఫ్టీ”
ఆ అమ్మాయి ధర చెప్పగానే, నేను తొందరపడి,
“అయితే నాలుగివ్వండి” అన్నాను పర్సులో నుంచి యాభయ్ నోటు తీస్తూ.
అప్పుడు వినపడింది నవ్వు.
ముందు సేల్స్ గర్ల్ అనుకున్నాను.
ఆమె వైపు చూస్తే ఆ అమ్మాయి నా మొహంలోకి చూస్తూ సన్నగా మందహాసం చేస్తోంది. మరి అంత బిగ్గరగా నవ్వుతోంది ఎవరు?
తీరా చూస్తే మా ఆవిడే.
ఇంకా నవ్వుతోంది. చిన్నగా కాదు. పగలబడి నవ్వుతోంది. అందరూ చూస్తున్నారు అనే ధ్యాస లేకుండా.
బహుశా అంత హాయిగా నవ్వింది మా నలభయ్
ఎనిమిదేళ్ళ వైవాహిక జీవితంలో మొదటిసారి అనుకుంటా. అందుకే అలా చూస్తుండి పోయాను.
అంతగా నవ్వు తెప్పించే మాట అమాయకంగా
ఏమన్నాను?
ఆ తర్వాత తెలిసింది, ఆమె నవ్వింది నా అమాయకత్వాన్ని చూసి
కాదు, నా తెలివి తక్కువతనాన్ని చూసి అని.
ఉబెర్ లో ఇంటికి వస్తున్నప్పుడు కూడా ఆ
నవ్వు అలా తెరలు తెరలుగా వస్తూనే వుంది.
“మీకు కిలో కాఫీపొడుం రేటు తెలవదు, అలాంటి
షాపుల్లో పదీ పరక్కూ దొరుకుతాయని ఎలా అనుకున్నారు” అని నవ్వుతూనే అంది.
ఇంతకీ ఆ రోజు జరిగింది ఏమిటంటే సినిమా
చూసి వస్తూ షాపులోకి వెళ్ళాము. ఏదో తల
నూనె కొన్నది. చూడబోతే చిన్నసీసా.
డబ్బులు ఇవ్వబోతూ నేనడిగిన ప్రశ్న”ఎంత”
అని. “ట్వెల్ ఫిఫ్టీ” అన్నది షాపులోని అమ్మడు. “పన్నెండున్నర
రూపాయల సీసా కోసం మళ్ళీ మళ్ళీ రావడం ఎందుకు, ఒకేసారి నాలుగు సీసాలు కొనుక్కోవచ్చు
కదా” అంటూ యాభయ్ నోటు తీశాను. నిజానికి దాని ధర పన్నెండు వందల యాభయ్ రూపాయలు. ఈ
విషయం తనకు తెలుసు. నాకు తెలవదు. మరి నాది అమాయకత్వమో, తెలివితక్కువతనమో కూడా తెలియదు. ఏదైతేనేం అది చూసే ఆమెకు నవ్వొచ్చింది.
మామూలుగా కాదు. తెరలుతెరలుగా.
ఇలా పగలబడి నవ్వడం మొదటిసారి.
నాకప్పుడు తెలియదు, మరో వారం తర్వాత అదే చివరిసారి
అవుతుందని.
ఇప్పుడు కూడా ఆ మాల్ కి నా మనుమరాలు జీవికను వెంటబెట్టుకుని వెళ్లి ఆ షాపు దగ్గర కాసేపు తచ్చాడుతాను. నవ్వు వినబడుతుంది కానీ మనిషి కనబడదు.
నవ్వు లాగే జ్ఞాపకాలు.
తెరలు తెరలుగా అలా వస్తూనే వుంటాయి.
ఎక్కడో ఆపాలి!
కింది ఫోటో :
మా ఆవిడ నడిపిన అమ్మవొడి
(ఇంకా వుంది)
1 కామెంట్:
చిన్ని చిన్ని సంఘటనలు
ఎనలేని బాంధవ్యాలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి