కాలుక్షేపం
బెన్ హర్ మహేష్ ఎక్కా. ఐ.ఏ.ఎస్. ఆయన్ని చూసి కాస్త అటూ ఇటూగా పాతికేళ్ళు పైమాటే. నేను గుర్తు పట్టనే లేదు. రాత్రి అన్నంలో వేసుకుంది ఏ కూర అంటే చప్పున చెప్పలేని గొప్ప జ్ఞాపక శక్తి నాది.
ఆ విషయంలో జ్వాలాని మెచ్చుకుని తీరాలి. స్నేహితులు, సన్నిహితులవే కాక అప్పుడప్పుడు పరిచయం అయిన వ్యక్తుల పేర్లు, ఫోను నెంబర్లు అన్నీ ఆయనకి కరతలామలకం. నిజానికి ఆయన ఫోను చేసి చెప్పబట్టే బెన్ హర్ ఎక్కాని కలవడం జరిగింది. ‘నీకు ఆయన తెలుసు, ఐఏఎస్ ప్రోబెషనర్లగా వున్నప్పుడు ఆయన బ్యాచ్ కి నువ్వే తెలుగు పాఠాలు చెప్పావు, మరచిపోయావా’ అని కూడా అన్నాడు.
నాకయితే ఈ బెన్హర్ మహాశయుల రూపం కూడా గుర్తుకు రాలేదు.
గిరిజనుల ఆరోగ్యాలకు సంబంధించిన అంశంపై క్రియ సీయీఓ డాక్టర్ బాలాజీ ఆయనకి వివరిస్తున్నారు. మధ్య మధ్యలో బెన్ హర్ ఎక్కా నా వైపు చూస్తున్నారు. నేను కూడా తేరిపార చూసాను కానీ నా దగ్గర తెలుగు నేర్చుకున్న అధికారులు ఎవ్వరూ స్పురణకు రాలేదు. లేచి వస్తున్నప్పుడు బెన్ హర్ నాతో అన్నారు.
‘నేను, సంజయ్, వెంకటేశం ఇంకా కొంతమందిమి మీ ఇంటికి వచ్చే వాళ్ళం. ఆ రోజుల్లో మీకు కాలు ఫ్రాక్చర్ అయి ఇంట్లో వున్నారు’
నాకు లైట్ వెలిగింది.
మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థకు శ్రీ పీ.వీ.ఆర్.కే. ప్రసాద్ డైరెక్టర్ జనరల్. జ్వాలా అక్కడ చేసిన ఉద్యోగం ఏమిటో చెప్పలేను కానీ ఆ సంస్థలో అన్నీ ఆయనే అని చెప్పగలను. ఆ రోజుల్లో నాకు కాలు ఫ్రాక్చర్ అయింది. ఆఫీసుకు పోకుండా, తీరిక సమయాల్లో ఇంటి నుంచే ఫోన్ ద్వారా రేడియో రిపోర్టింగ్ పని చూస్తూ, (వర్క్ ఫ్రమ్ హోం పాతికేళ్ళ క్రితమే నాతోనే మొదలైందేమో) నా విరిగిన కాలుతో ‘కాలుక్షేపం’ చేస్తుండేవాడిని.
మరికొంత కాలక్షేపంగా ఉంటుందని జ్వాలా పూనికపై, ప్రసాద్ గారు తెలుగు మాతృభాష కాని ప్రొబేషనరీ ఐ.ఏ.ఎస్. అధికారులకు తెలుగు నేర్పే పని ఒప్పచెప్పారు. వాళ్ళు అప్పుడు గ్రీన్ లాండ్స్ గెస్ట్ హౌస్ లో (ఇప్పుడు అది శిధిలావస్థలో వుంది) వుంటుండేవాళ్ళు. మేము వుండే దుర్గానగర్ కు దగ్గర. అంచేత ఉదయమో, సాయంత్రమో వీలు చేసుకుని ఆ యువ అధికారులు అందరూ మా ఇంటికి వచ్చేవాళ్ళు. చాలా కలివిడిగా వుండేవాళ్ళు. నా దగ్గర నేర్చుకున్న తెలుగు వారికి యెంత ఉపయోగపడిందో తెలియదు కాని, పోటీ పరీక్షలు రాసి జీవితంలో అనుకున్నది సాధించిన కొందరు యువకులతో సన్నిహితంగా వుండే అవకాశం మాత్రం నాకు కలిగింది. ఐ.ఏ.ఎస్. అనే మూడు అక్షరాలు తమ పేరు పక్కన చేరగానే, తామేదో వేరే లోకానికి చెందినవారం అనే అభిజాత్య, ఆధిపత్య ధోరణి ఆ యువ అధికారులలో మచ్చుకు కూడా కానవచ్చేది కాదు. చాలా సింపుల్ గా వుండేవారు.
నా నుంచి వారు నేర్చుకున్న తెలుగు సంగతి అలా పెడితే, మా ఆవిడ మాత్రం వారికి అచ్చ తెలుగు వంటకాలను బాగానే పరిచయం చేసింది.
వారిలో ఒకరు తదనంతర కాలంలో విజయవాడ సబ్ కలెక్టర్ అయ్యారు. అప్పట్లో కూడా ఇసుకకు బాగా గిరాకీ వుండేది. ఆ మాఫియాకు ఈ అధికారి గొంతులో వెలక్కాయ కావడంతో బదిలీ తప్పలేదు.
మంచి అధికారి, నా దగ్గర తెలుగు నేర్చుకున్నాడు అనే భావనతో నా అంతట నేనే వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి చెప్పాను. ఆయన రవీంద్ర భారతిలో జరిగే ప్రజాప్రతినిధులు, మునిసిపల్ అధికారుల సమావేశానికి వెళ్ళే హడావిడిలో వున్నారు. ఆ సమావేశంలో ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి చెప్పారు.
“ఇంతవరకు మునిసిపల్ కమీషనర్లుగా ఐఏఎస్ అధికారులను నియమించలేదు. మునిసిపాలిటీలలో పరిస్తితులను మెరుగుపరచడానికి ఇప్పుడాపని చేద్దామనుకుంటున్నాను. ముందు ఏలూరుతో మొదలెడతాను. సంజయ్ అని సమర్దుడయిన అధికారిని ఏలూరు మునిసిపల్ కమీషనర్ గా వేస్తున్నాను”
సబ్ కలెక్టర్ గా పనిచేసిన అధికారికి మునిసిపల్ కమీషనర్ పదవి ఇష్టమో కాదో నాకు తెలవదు. కానీ, మంచి పనులు చేయడానికి ఆ ఉద్యోగం కూడా పనికి వస్తుంది అని తెలుసు. పైగా సిఎం అంతటి వాడే ‘సమర్ధుడు’ అని ఇచ్చిన కితాబు ఇంకా గొప్పది కదా!
నేను 2005లో దూరదర్సన్ నుంచి రిటైర్ అయ్యేవరకు ఏ టీవీ చర్చలకు వెళ్ళే వాడిని కాదు. ఒకపక్క టీవీలో పనిచేస్తూ వేరే టీవీల కార్యక్రమాల్లో పాల్గొనడం నాకు ఇష్టం వుండేది కాదు. అయితే రిటైర్ అయిన తర్వాత నేను వెళ్ళని టీవీ ఛానల్ వుండేది కాదు. ఉదయం, మధ్యాన్నం, సాయంత్రం ఏదో ఒక ఛానల్లో ఉభయం వుండేది. ఆ రోజుల్లో నన్ను టీవీల వారాల అబ్బాయి అనేవారు. ఉద్యోగం చేసే రోజుల్లో కూడా అంత నిర్విరామంగా పనిచేసిన దాఖలా లేదు. ఇక ఎన్నికలు, ఎన్నికల ఫలితాల రోజుల్లో ఉదయం బయటకు వెడితే ఎప్పుడో రాత్రి పొద్దుపోయి ఇంటికి చేరేవాడిని. ప్రస్తుత కాలంలో ఉప్పూ నిప్పూగా రాజకీయ పక్షాలకు అనుబంధంగా పనిచేస్తున్నాయన్న ఆరోపణలు ఎదుర్కుంటున్న ఛానళ్ళు కూడా చర్చలకు పిలిచే సుహృద్భావం వున్న రోజులవి. ఒక ఛానల్ కారులో మరో ఛానల్ కు వెడితే అభ్యంతరం పెట్టకుండా లోపలకు అనుమతించేవాళ్లు. మరి ఇప్పుడు ఒక టీవీ ఇంటి కాకి మరో టీవీ మీద వాలడం లేదని అంటున్నారు. ఎంత నిజమో తెలియదు.
తెలంగాణా ఉద్యమం తీవ్రంగా సాగుతున్న రోజుల్లో కూడాఆయా పార్టీల ప్రతినిధులు చర్చల్లో పొట్టుపొట్టు అయ్యేవారు కానీ విశ్లేషకుల/ జర్నలిస్టుల మాటలకు అడ్డం తగిలేవాళ్ళు కాదు. అలాగే టీవీ యాంఖర్లు కూడా.
2019 లో నా భార్య చనిపోయేవరకు టీవీ చర్చల్లో పాల్గొంటూనే వచ్చాను. తర్వాత కొన్ని సార్లు వెళ్లాను కానీ అప్పటికే పరిస్థితుల్లో మార్పు స్పష్టంగా కనిపించడం మొదలైంది. దానితో నెమ్మదిగా ఆ వ్యాపకం నుంచి నా అంతట నేనే తప్పుకున్నాను.
బహుశా నా జీవితంలో తీసుకున్న అతి కొద్ది మంచి నిర్ణయాల్లో ఇదొకటి. డబ్బూ డుబ్బూ ఎలాగూ లేదు. కొత్తగా వచ్చే గుర్తింపూ లేదు. ఆ అవసరమూ లేదు. మరెందుకు ఈ లాయలాస.
తోకటపా:
టీవీ చర్చల విరామసమయంలో లేదా చర్చలకు, ముందూ తరువాత జరిగే తేనీటి సమావేశాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులు అనేక ఆసక్తికరమైన విశేషాలు చెబుతుంటారు. వాటిల్లో నిజంపాలెంతో తెలియదు కాని, విన్నప్పుడు నిజమేనేమో అనిపించేలా వుంటాయి ఆ కబుర్లు. అలాటి ఉదంతం ఒకటి.
చాలా ఏళ్ళ కిందటి సంగతి. అధికార పార్టీలో పైకి వచ్చిన నాయకుడొకరు, అప్పుడప్పుడే పైకి వస్తున్న మరో ఛోటా నాయకుడికి రాజకీయ గీతాబోధ చేసాడిలా.
'నాయనా! రాజకీయాల్లో పైకి రావడానికి ఎన్నో కావాలి. కానీ నా అనుభవం మీద చెబుతున్నాను. అన్నింటిలోకి అతి ముఖ్యమైనది మీడియా మేనేజిమెంటు'
'మేనేజిమెంటు అంటే ఏమిటి గురువుగారూ?' అడిగాడు ఛోటా నాయకుడు.
'అది తరువాత చెబుతా కాని మన జిల్లా రిపోర్టర్ పలానా వాడు వున్నాడు చూసావు కదా. అతడికేదో డబ్బవసరం పడినట్టువుంది. నేను ఇచ్చానని చెప్పి ఈ ఇరవై వేలు అతడికి ఇచ్చిరా. అలాగే, మన సీఎం గారి కారు డ్రైవర్ వున్నాడు తెలుసు కదా! అతడింటికి వెళ్ళి ఈ ఇరవై వేలూ నేనిచ్చానని చెప్పి ఇచ్చేసిరా' అన్నాడు.
ఛో.నా., బ. నా.
చెప్పినట్టే వెళ్ళి చెప్పిన పని చప్పున చేసేసి తిరిగొచ్చిఆ సంగతి చెప్పాడు. చెప్పి తన మనసులో తొలుస్తున్న సందేహం బయట పెట్టాడు.
'రిపోర్టర్ కు ఇవ్వమన్నారు. సరే. బాగుంది. వాళ్ళకు మనతో, మనతో వాళ్లకు సవాలక్ష పనులుంటాయి. కానీ సీ ఎం గారి కారు డ్రైవర్ సంగతే నా మట్టి బుర్రకు అర్ధం అయి చావలేదు'
'అదేమరి. నేర్చుకో అని చెప్పింది అందుకే. సీఎం గారిని మన పార్టీ కార్యకర్తలు ఎక్కడ కలుస్తారు ? ఆయన కారు ఎక్కుతున్నప్పుడో, దిగుతున్నప్పుడో కదా! మామూలు వాళ్ళకి అవకాశం అలాటప్పుడే దొరుకుతుంది. మరి ఆయన కంట్లో పడాలంటే సీఎం గారి కారు కాసేపు అక్కడే ఆగాలి. ఆగాలి అంటే డ్రైవర్ కారు ఆపాలి. ఆపాలి అంటే డ్రైవర్ ని మనం మంచి చేసుకోవాలి. అప్పుడే, మనం కనబడగానే, డ్రైవర్ కాలును, కాసేపు బ్రేక్ మీద నొక్కిపెడతాడు. అర్ధం అయిందా? సమ్జే! అండర్ స్టాండ్!' అన్నాడు అన్ని భాషల్లో బ. నా.
'అయింది మహాప్రభో!' అనేసాడు ఛో.నా.
(తోకటపా: ఎవరా ఛో.నా. ? ఎవరా బ.నా.? ఇంతకీ ఎవరా రిపోర్టర్? ఇలాటి ప్రశ్నలు దయచేసి అడక్కండి. చెప్పినాయన చెప్పలేదు. అలా అడిగే అలవాటులేని నేనూ అడగలేదు, విని వూరుకున్నంత సుఖం మరోటి లేదు)
కింది ఫోటోలు:
వివిధ టీవీ చర్చల్లో...
(ఇంకావుంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి