వెలుగు చూడని వార్తలు
మనం
రోజూ పత్రికల్లో,
మీడియాలో చూస్తున్న వార్తల కంటే మీదు మిక్కిలి వార్తలు వెలుగు చూడకుండానే అంతర్ధానం అవుతుంటాయి అనే సంగతి ఈ రంగంలో
వున్నవారికే బాగా తెలుస్తుంది. కాకపోతే, అప్పుడప్పుడు ఇలాంటి వార్తలు
అభిజ్ఞవర్గాల కధనం అనే పేరుతోనో, అసలు
పేర్లే పెట్టకుండా ఇచ్చే లీకుల రూపంలోనో కానవస్తుంటాయి. సోషల్ మీడియా రంగప్రవేశం
తర్వాత వీటికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అసలు వార్తల కన్నా, ఈ కొసరు వార్తలకే రంగూ రుచీ వాసనా ఎక్కువ కాబట్టి ఇప్పుడు ఇవే ప్రధాన వార్తలుగా
చలామణీ అవుతున్నాయి. ఏడాదికోసారి ఏప్రిల్ ఒకటో తేదీన గతంలో చాలా పత్రికలు, లేనిపోని ఊహాగానాల కధనాలు ప్రధాన శీర్షికలుగా ప్రచురించి,
చివర ఎక్కడో ఈరోజు ఏప్రిల్ ఒకటి అని రాసి పాఠకులను ఫూల్స్ చేశామని సంతృప్తి పడడం
జరిగేది.
రాజకీయ
నాయకులకు దగ్గరగా మెసిలే కొందరు సీనియర్ జర్నలిస్టులమీద రాజకీయ నాయకులు కూడా విశ్వాసం వుంచి బయటకు తెలియని సమాచారాలు, విశేషాలు చెబుతుండడం ఎప్పటినుంచో
వున్న ఆచారమే. ఇలా ఉప్పు అందించే వారిలో ముఖ్యమంత్రి స్థాయి నాయకులు కూడా వుండడం
రహస్యమేమీ కాదు. తమకు రాజకీయంగా పనికి
వచ్చే కొన్ని వార్తలను (నిజాలు కాదు) తమ పీ ఆర్ వొ ల ద్వారా విలేకరులకు
అందిస్తుంటారు. అలాగే సాయంకాలాలు జరిగే వ్యక్తిగత భేటీల్లో కొన్ని సంగతులు బయట
పడుతుంటాయి. రేడియోకి ఇలాంటి వార్తలు
పనికిరావు. ఎలాగూ వార్తల్లో ఇవ్వడు అని అర్ధం చేసుకున్న కొంతమంది నాయకులు నాతో
బాహాటంగానే కొన్ని సంగతులు ముచ్చటిస్తూ వుండేవాళ్ళు. విలేకరులు కూడా తమకు ఇలా
తెలిసిన ప్రతి సంగతినీ వార్తగా మలచాలి అంటే ఆ సమాచారం యజమాని దృష్టిలో
పనికివచ్చేదిగా వుండాలి. అప్పుడే అది వెలుగు చూస్తుంది. ఇలా వెలుగు చూడని అనేక
వార్తలు బుద్దా మురళి వంటి సీనియర్ల వద్ద
పుంఖానుపుంఖాలుగా దొరుకుతాయి.
ఇటు
రాజకీయులకు, అటు
జర్నలిస్టులకు లీకులు అనేవి కొత్తవి కావు. వారిరువురి నడుమా బంధాలు, అనుబంధాలు పెనవేసుకుని పోవడానికి
బాగా తోడ్పడేవి నిజానికి లీకులే. పొగడ్తలతో కూడిన గొప్ప వార్తలు, వ్యాసాలు రాయడానికి చాలామంది
వుంటారు. అంతకంటే కూడా, తమ రాజకీయ
ప్రయోజనాలకోసం కొన్ని కట్టుడు కధలు పత్రికల్లో/ మీడియాలో రావడం వాళ్లకి
ప్రధానం.
అయితే
ఈ కధనాలు వాళ్ళు చెప్పినట్టే రావాలి కానీ వాళ్ళు చెప్పినట్టు ఎక్కడా బయటకి
రాకూడదు. అలా బయటకు వచ్చిన లీకులపై విస్తృతంగా చర్చ జరిగిన పిమ్మట ‘ఆ వార్తలు
మీడియా సృష్టి, నాకేమీ
సంబంధం లేదు’ అని ఖండన ఇచ్చుకునే విధంగా వుండాలి. అలా అని ఆ వార్తలో పూర్తిగా నిజం
వుండకూడదనీ కాదు. అలా అని అసలు నిజం లేదనీ కాదు. ఆ లీకు వీరుడి పేరు ఎటువంటి
పరిస్థితుల్లో వెల్లడి కారాదు. (సోర్స్ చెప్పాల్సిన అవసరం మాకు లేదు’ అనే unwritten
హక్కు గురించి
మాట్లాడేది ఇలాంటి సందర్భాలలోనే). ఇన్ని షరతులతో లీకులు బయటకి వస్తాయి కాబట్టే
వాటికి అంతటి డిమాండ్.
ఇంతకీ
ఈ లీకులు ఏమిటి? ఎలా
పురుడు పోసుకుంటాయి?
ఒకప్పుడు
కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించేరోజుల్లో అధికార పక్షంలోని
అసంతృప్తులే ఈ లీకుల్ని విలేకరులకు ఉప్పందించేవారు. ఆ తరువాత తెలుగుదేశం పార్టీ
అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ సాంప్రదాయం కొనసాగుతూనే వచ్చింది. తదనంతర కాలంలో
ఇవి పతాక స్థాయికి చేరి ఏది నిజమో ఏది అబద్ధమూ తెలియనంతగా మారిపోయి పాత్రికేయ
ప్రమాణాలను, విశ్వసనీయతను
దెబ్బతీసే విధంగా విశ్వరూపం దాలుస్తున్నాయి.
ముఖ్యమంత్రుల
కార్యాలయాల్లో పనిచేసే పౌర సంబంధాల అధికారులు ఈ లీకు వ్యవహారాలను చూస్తుంటారు.
అల్లాగే మంత్రుల దగ్గర పనిచేసేవాళ్ళు.
ఒక
ఉదాహరణ చెప్పుకుందాం.
అప్పటికి
మీడియా విస్తృతి ఇంత లేదు. పత్రికలే రాజ్యం చేస్తున్నాయి, ఇప్పటికీ వాళ్ళదే రాజ్యం. అందుకే
పలానా పత్రిక కావాలని రాసింది అని రాజకీయులు అంటుంటారు. ప్రింటులో వచ్చే వార్త
ఖచ్చితం అని నమ్మేవారు ఇంకా మిగిలి వుండడమే ఇందుకు కారణం.
ఓ
పత్రికా విలేకరికి ముఖ్యమంత్రి కార్యాలయంలోని సోర్స్ నుంచి ఫోన్ వస్తుంది. సంభాషణ
ఇలా నడుస్తుంది.
‘ఏమిటి
సంగతులు ఏమైనా కొత్త విషయాలు ఉన్నాయా!’
‘మా
దగ్గర వార్తలు ఏముంటాయి? మీరిస్తేనే
కదా మాకు వార్తలు’
‘అలా
అంటావు కానీ మీరు రాసేవే మాకు వార్తలు. మొన్న చెప్పాను కదా! ఆయన వెళ్లి ఆ పెద్దాయన్ని కలిశాడు అంటున్నారు. నీకేమైనా
తెలుసా?’
‘తెలియదే.
ఎప్పుడు?’
‘నేనూ
విన్నదే! కనుక్కోని చెప్పు’
ఇక
అక్కడినుంచి ఆ విలేకరి పని మొదలవుతుంది. ‘ఆయన’ అంటే ముఖ్యమంత్రి. మరి పెద్దాయన
ఎవరు?
‘ఆయన’
డ్రైవర్ నెంబరుకు ఫోను చేశాడు. వీ ఐ పీ రాకపోకలు కనుక్కోవాలంటే పోలీసులు, డ్రైవర్లను మించి విలేకరులకు మంచి
సోర్సు దొరకదు.
డ్రైవర్
దొరికాడు కానీ కావాల్సిన సమాచారం రాలేదు. కాకపొతే ఓ విషయం చెప్పాడు. ఆ రోజు ‘ఆయన’
అధికారిక వాహనం కాకుండా వేరే కారులో వెళ్ళిన మాట ధృవీకరించాడు. వెంట ఎవరు
వెళ్లిందీ చెప్పాడు. ఆ వెంట వెళ్ళిన వాళ్ళను పట్టుకుంటే ‘ఆ పెద్దాయన’ ఎవరో
తెలిసింది.
ఇవన్నీ
జరిగిన సంగతులు. తర్వాత కావాల్సిన విధంగా మసాలాలు దట్టించి వార్తను వండి వార్చడమే.
‘అధిష్టానంపై
తిరుగుబాటుకు పావులు కదుపుతున్న ముఖ్యమంత్రి!’
‘కేంద్రంలో
చక్రం తిప్పుతున్న ఓ సీనియర్ మంత్రిని రహస్యంగా కలుసుకుని చర్చలు జరిపిన
ముఖ్యమంత్రి’
ఇది
హెడ్డింగు. అసలు వార్త అనేక సోయగాలు అద్దుకుని అక్షరాల రూపంలో మర్నాడు పత్రికలో
మొదటి పేజీలో దర్శనం ఇస్తుంది.
దానితో
పాటే ముఖ్యమంత్రి కార్యాలయం జారీ చేసిన ‘ఖండన’ ప్రకటన కూడా ఆ పత్రిక కార్యాలయానికి
చేరుతుంది.
ఇలా
వుంటాయి ఆ తమాషాలు.
నలభయ్
ఏళ్ళ పాత్రికేయ జీవితంలో ఎదురయిన అటువంటి వృత్తాంతాలను, ఇంతవరకూ బయటకు రాని వార్తలను
సేకరించి, సుమారు
నూట యాభయ్ ఎపిసోడ్లు, వెలుగు చూడని వార్తలు అనే పేరుతో అక్షరబద్ధం చేసి నా కంప్యూటర్ లోనే పదిలంగా
దాచుకున్నాను.
అసలు
నేను నా ఈ జీవనయానం కధ మొదలు పెట్టినప్పుడు అలాంటి అన్ టోల్డ్ స్టోరీస్ రాస్తానని
నన్ను తెలిసిన వాళ్ళు అనుకున్నారు. నేను
కూడా ఒక బలహీన క్షణంలో అలాంటి ఆలోచన చేసిన మాట నిజమే. ఎందుకంటే పెద్ద కష్టం లేకుండా రోజుకు
ఒకటి తీసి పోస్టు చేస్తూ పోవడమే.
తరువాత
తీరిగ్గా ఆలోచించి, దరిమిలా ఎదురయ్యే కష్టనష్టాలను బేరీజు వేసుకుని ఆ ప్రయత్నం మానుకున్నాను.
ఎప్పుడో
పాతికేళ్ళ క్రితం కళ్ళతో చూసి,
చెవులతో విన్న సంఘటనలను అక్షరబద్ధం చేయాలి అంటే కత్తిమీద సామే. అప్పుడు ఉన్న పరిస్థితులు
ఇప్పుడు లేవు. రాజకీయ పారావారాలు గిరులు, బరులు గీసుకుని ఉచ్చనీచాలు లేకుండా విచ్చలవిడిగా చెలరేగిపోతూ, మాటల ఈటెలు దూసుకుంటున్నప్పుడు,
రామా అన్నా అందులో వేరే అర్ధం పట్టుకునే రోజులు. ఈ బురదలో కాలు పెట్టడం అంత అజ్ఞానం మరోటి
వుండదు. అడుసు తొక్కనేల కాలు కడుగనేల!
నిజానికి
నేను 1992 లో మాస్కో నుంచి తిరిగివచ్చిన తర్వాత
2005 వరకు యాక్టివ్
జర్నలిజంలోనే వున్నాను. ఆ తరవాత కూడా వివిధ టీవీ చానళ్ల రాజకీయ చర్చల్లో పాల్గొంటూ,
పత్రికలకి
వ్యాసాలు రాసుకుంటూ దాదాపు పదిహేను సంవత్సరాలు అదే వృత్తిలో కొనసాగాను. వారంలో ప్రతిరోజూ
ఒక టీవీకి వెడుతూ, వారాలబ్బాయి అనే పేరు కూడా తెచ్చుకున్నాను. టీవీల వాళ్ళు కూడా
నా మీద కాస్త సానుభూతితో ఏది మాట్లాడినా అనుమతించేవారు. మరీ వారి పాలసీకి
విరుద్ధంగా నా సంభాషణ సాగుతోందని ఎరుక కలిగినప్పుడు, ఇప్పుడో చిన్న విరామం అనో, లేక చర్చలో అతి తక్కువ సమయాన్ని
ఇవ్వడం ద్వారానో ఆ పూట లాగించేవారు. ప్రశ్న అడగకుండా కల్పించుకుని మాట్లాడే పద్దతి నాది కాదు. నేను
వ్యక్తం చేసే అభిప్రాయాల తీరు నచ్చని రాజకీయ పక్షాల ప్రతినిధులు కూడా లైవ్ లో నా
మాటకు అడ్డం తగిలే వారు కాదు. తెలంగాణా ఉద్యమం ఉదృతంగా వున్నప్పుడు కూడా నా సమైక్య
రాష్ట్ర వాదనను తప్పుపట్టేవారు కాదు.
ప్రస్తుతం ఉప్పూ నిప్పూ మాదిరిగా కత్తులు దూసుకుంటున్న ఛానల్లకు ఆ రోజుల్లో వెళ్ళినప్పుడు,
వారి వాహనంలోనే నేను ప్రత్యర్థి ఛానల్ కు
వెళ్ళిన సందర్భాలు అనేకం. అలాగే విభిన్న రాజకీయ స్వభావాలు, ఒత్తిడులు కలిగిన పత్రికలకి రాజకీయ అంశాలపై వ్యాసాలు ఏళ్ళ
తరబడి రాశాను. మాట రాలేదు, మాట
పడలేదు.
కానీ రోజులు
ఎప్పుడూ ఒకరకంగా వుండవు అనడానికి నా అనుభవమే సాక్ష్యం.
తర్వాత
తర్వాత రోజులు మారుతూ వచ్చాయి. ఛానల్ చర్చల్లో ఏమీ అనకపోయినా, వారి వారి సోషల్ మీడియా శక్తులు నా
మీద కత్తి దూయడం మొదలు పెట్టాయి. నన్నే కాకుండా నా కుటుంబాన్ని కూడా కలుపుతూ అతి హేయంగా వ్యాఖ్యలు పెట్టడం మొదలు పెట్టారు. సోషల్
మీడియా రాజకీయాల్లో పండిపోయిన వారికి వుండే, దళసరి చర్మం లేనివాడిని కనుక, వాటిని తట్టుకోలేక ఒక మంచి రోజు చూసుకుని టీవీ చర్చలకు
నేనే స్వస్తి చెప్పాను. పత్రికలకు రాజకీయ
వ్యాసాలు రాయడం మానేశాను. అంతెందుకు, సోషల్ మీడియాలో అత్యంత సన్నిహితులు పెట్టే రాజకీయ పోస్టులకు లైకులు
కొట్టడం , కామెంట్లు పెట్టడం కూడా మానేశాను. మరో రకంగా చెప్పాలంటే దశాబ్దాల నుండి
మోస్తూ వచ్చిన కాడి కింద పారేశాను.
చాలామంది హితైషులు, మీలాంటి జర్నలిస్టులే ఇలా భయపడిపోతే ఎట్లా అని సలహాలు చెప్పారు. ఇది భయపడి
వెనక్కు తగ్గడం ఎంత మాత్రం కాదు. కావాలని కాలు
అశుద్ధంలో పెట్టడం మాత్రం శ్రేయస్కరం కాదు. ఈ వయసులో నాకు కొత్తగా వచ్చే పేరు
ప్రఖ్యాతులు ఏమీ లేవు. వీటి మీద అదనంగా ఆర్జించే సంపాదనా లేదు. అనవసరంగా బీపీలు
పెరగడం తప్ప.
అంచేతే
నా దారి నేనే మార్చుకున్నాను. నా రాతలు మార్చుకున్నాను. రాజకీయాలకు పూర్తిగా
స్వస్తి చెప్పాను. నిజానికి ఈనాడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు గమనిస్తుంటే, గతంలో నేను చూసిన సంఘటనలు గుర్తుకు
వచ్చి ఏదైనా మంచి మాట చెప్పాలని, రాయాలని అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. కానీ బలవంతాన
నిగ్రహించుకుంటాను.
తెలిసిన
రాజకీయాలు గురించి,
తెలిసిన రాజకీయ నాయకులు గురించీ నాకు తెలిసిన మంచి విషయాలు రాయకుండా ఒక జర్నలిస్టు జీవిత
చరిత్ర సంపూర్ణం కాని మాట నిజమే. మంచి
మాటలు కూడా చెప్పే పరిస్థితి నా వంటివారికి లేకుండా పోయింది. ఇదో విషాదం! ఇదే
ప్రయత్నం ఓ పదేళ్లు ముందు చేసివుంటే, బహుశా నాకు తెలిసిన అనేక విషయాలు నిస్సంకోచంగా
రాసివుండేవాడినేమో! ఇప్పుడు అది కుదరని పని.
ఈ
కారణాల చేతనే భద్రంగా దాచుకున్న ఆ వెలుగు చూడని వార్తలను కంప్యూటర్ సమాధిలోనే వుంచేశాను.
నమ్మకమైన
సమాచారం అయినా, ఒక తరం
వారికి ఆసక్తి కలిగించే విషయాలే అయినా, ఆ సంచలనాల వైపు మళ్ళకుండా, ఏదో నా జీవితం గురించీ, దానిచుట్టూ అల్లుకున్న పరిస్థితులు గురించీ
రాసుకుంటూ వెడుతున్నాను. ఒక సాధారణ వ్యక్తి సాధారణ జీవితం ఎలా గడిచిందో, గడుస్తున్నదో చెప్పడమే ఈ బిగ్ జీరో
ధ్యేయంగా మార్చుకున్నాను.
ఈ విషయంలో
అందరి నుంచి వెల్లువెత్తుతున్న అభిమానానికి
వేల వేల ధన్యవాదాలు.
(రాజకీయాల
ప్రసక్తి లేని మీ జీవిత చిత్రం, రాముడు
లేని రామాయణంలా వుందని కొందరు మితృలు చేస్తున్న వ్యాఖ్యలకు ఇది చిన్నపాటి వివరణ)
కింది
ఫోటోలు:
(నా వృత్తి జీవితంలో తటస్థపడిన కొందరు రాజకీయ ప్రముఖులతో నేను. దయచేసి ఇందులో ప్రాధాన్యతా క్రమాలు వెతక్కండి. సాంకేతిక ప్రతిభ లేని కారణంగా ఒక క్రమంలో పోస్టు కాలేదు. వరుసగా: చంద్రబాబు నాయుడు, వై.ఎస్. రాజశేఖర రెడ్డి, డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ, రాహుల్ గాంధీ, చండ్ర రాజేశ్వర రావు, కె. రోశయ్య, ఎం. వెంకయ్య నాయుడు, తమిలసై, కేవీపీ, టి.అంజయ్య, నరసింహన్, కేటీఆర్, సీతారాం ఏచూరి, కిషన్ రెడ్డి, వై.ఎస్. జగన్ మోహన రెడ్డి)
(ఇంకా
వుంది)
5 కామెంట్లు:
అవును , ఈ విషయం లో , అసంతృప్తి .
నేను ఈ విషయమే మీతో చాలా నెలలు ముందు అడిగాను , ఎంతో అనుభవం ఉన్న మీ లాంటి జర్నలిస్ట్ లు కి , సామాన్యులు కి తెలియని విషయాలు ఉంటాయి కదా , అవి రాయండి అని. కానీ మీరు దాటవేశారు . మీ జీవిత చరిత్ర చదివితే , మీరు చాలా డేరింగ్ , డాషింగ్ , ముక్కు సూటి , ఎవరిని లెక్కచేయని మనస్తత్వం లా అనిపిస్తుంది , అలాంటిది మీరు ఇలా చెప్పడం ఆశ్చర్యం .
ఏది ఏమైనా , మీ నిర్ణయం మీ ఇష్టం . మిగతా విషయాలు రాసినందుకు మాత్రం చాలా కృతజ్నతలు. చాలా విషయాలు తెలిసాయి .
:Venkat
రేపటి పేపర్లో హెడ్ లైన్
విశ్రామ సీనియర్ జర్నలిస్ట్ హౌస్ లో కంప్యూటర్ చోరీ ! అందులో వున్న "భండారాలు" వెలుపలికి వస్తాయంటున్న అబిజ్ఞ వర్గాలు :)
🤣😂😀
btw, మీరు ఒక కాపీ జ్వాలా గారి వద్ద పదిలపరిచారని హైద్రాబాద్ గ్రేప్ వైన్ టాక్
చల్ రహా హై
ఏది రాయాలో ఏది రాయకూడదో తెలిసినవారు. మీకు తిరుగులేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి