నేను బాంకర్ నా, బాంక్ కస్టమర్ నా ?
నా బుద్ధి పనిచేసే మేరకు నేను బాంకర్ ని కాదు, కేవలం కస్టమర్ నే.
మరి ఈ కె వై సీ ఏమిటి? బాంకుల పరిభాషలో KYC అంటే KNOW YOU CUSTOMER. దీనికి అర్ధం చెప్పుకుంటే నీ కస్టమర్ పూర్వాపరాలు గురించి తెలుసుకో అనే భావం స్పురిస్తుంది. కస్టమర్ గురించి తెలుసుకోవాల్సింది బాంకులే అనే అర్ధం వస్తుంది. మరి మీ కె వై సి ఇంకా దాఖలు చేయలేదు, వెంటనే మీ బ్రాంచికి వెళ్ళండి అని మెసేజ్ లు, ఈ మెయిల్స్, ఆఖరికి స్పీడ్ పోస్టులో ఉత్తరాలు. ఈ ఉత్తరం వెంటబెట్టుకుని వెళ్ళండి అని ఓ చివర్లో సలహా కూడా.
సరే! ఈ మతలబు ఎలాగో అర్ధం అవదు కనుక ఇంతటితో వదిలేద్దాం.
ఇది వాళ్ళ బాధ్యతా, మన బాధ్యతా అనే కుశంకలకు తావివ్వకుండా, తర్కాలకు పోకుండా బాధ్యత కలిగిన పౌరుడిగా బాంక్ కే వెళ్లాను. అన్ని కౌంటర్లలో సింగిల్ విండో అనే బోర్దులే కనిపించాయి. ఒక కౌంటర్ దగ్గర ఆట్టే జనం లేకపోవడంతో కాసేపు వెయిట్ చేసి అడిగితే, ఈ కౌంటర్ కాదు, పలానా కౌంటర్ కు వెళ్ళండి అని సూచన. మరి సింగిల్ విండో అంటే అర్ధం ఇది కాదు కదా అని అడగబోయి, సాధారణ పౌరుడి సాధారణ పౌర ధర్మం గుర్తుకు వచ్చి, మళ్ళీ తర్కవితర్కాలకు పోకుండా బుద్ధిగా తలూపి అక్కడికే వెళ్లాను. అదేమిటో కొన్ని చోట్ల జనం లేరు. ఈ విండో దగ్గర కనీసం పదిమంది తేనేతీగెల తుట్టెలా మూగివున్నారు. తీరా నా వంతు వచ్చేసరికి అ కౌంటర్ లో వ్యక్తి ఆధార్ ఉందా, పాన్ వుందా వుంటే వాటి జిరాక్స్ కాపీలు, లేటెస్టుగా దిగిన పాస్ పోర్ట్ సైజ్ ఫోటో జత చేసి, అక్కడ కౌంటర్ లో కేవైసీ ఫారం పూర్తిచేసి పట్రండి అన్నది, తాపీగా. పర్సులో క్రెడిట్ కార్డులు అంటే వుండవు కానీ ఇలాంటి కార్డులకు కొదవేముంటుంది. అక్రిడిటేషన్ కార్డు, ప్రెస్ క్లబ్ కార్డు, పెన్షన్ కార్డు, సీ జీ హెచ్ ఎస్ కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు మొదలైన కార్డులతో, డబ్బులు లేకపోయినా న పర్స్ ఎల్లప్పుడూ కడుపు నిండుగా వుంటుంది. కానీ జిరాక్సులు. ఈ మండుటెండలో అదో పరీక్ష. వీటి కాపీలు తీసుకురావాలని ఆ స్పీడ్ పోస్టు ప్రేమలేఖలో రాస్తే మీ సొమ్మేం పోతుంది అనబోయి మళ్ళీ ఏదో సినిమాలో కోపాన్ని నిగ్రహించుకోవడానికి చిటికెలు వేసినట్టు వేయబోయి, మళ్ళీ కొత్త అపార్థాల సీనుకు తెర తీయడం ఎందుకని, బలవంతాన నిగ్రహించుకుంటుంటే ఎదురుగా ఒక నోటీసు బోర్డు మీద ఒక ఫోటో కనిపించింది. కింద బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ది క్వార్టర్ అని రాసుంది. అరె యాదగిరి రెడ్డి గారు, తెలిసినవాడే అని ఆయన ఛాంబర్ లోకి వెళ్లబోతుంటే, ఫోనులో మాట్లాడుతూ కనిపించారు. ఆ సమయంలో డిస్టర్బ్ చేయడం ఎందుకని అక్కడే కాసేపు నిలబడ్డాను. ఫోను పెట్టేసిన తర్వాత కలిసి విషయం చెబితే ఎవర్నో పిలిస్తే, అతడికి నా ఆధార్, ఇతర కార్డులు పూర్తిచేసిన ఫారం ఇచ్చాను.
కధ సుఖాంతం నేను అనుకున్నా కానీ, కధ అనుకోలేదు. అది యథావిధిగా కొనసాగింది. ఈ వివరాలను అప్ లోడ్ చేయాల్సిన ఉద్యోగి తన పనితో సతమతమౌతున్నాడు. వీలు దొరకగానే చేస్తాను అన్నాడు. నమ్మకం లేక అక్కడే కాసేపు కూర్చొన్నాను. ఈ లోగా ఎదో పని మీద బయటకు వచ్చిన రెడ్డి గారు ఏమిటి ఇంకా ఇక్కడే వున్నారు అన్నట్టు చూస్తే, విషయం చెప్పాను. ఆయన కౌంటర్ లో కనుక్కుంటే ఇప్పుడే చేశాను, ఆయన అవసరం లేదు వెళ్లిపోవచ్చు అన్నాడు. ఏదైనా రసీదు ఇస్తారా అంటే అదేమీ లేదు, మీ మొబైల్ కి మెసేజ్ వస్తుంది అన్నాడు. నమ్మకం లేక బ్యాంకు వాట్సప్ నెంబరుకు మెసేజ్ పెడితే, మీ కేవైసీ దాఖలు చేయలేదు, వెంటనే దగ్గరి బ్రాంచికి వెళ్ళండి అని సమాధానం వచ్చింది. అది ఆయనకు చూపిస్తే, నేను పూర్తిచేసి ఇచ్చిన ఫారంలో కింది భాగం చించి, స్టాంపు వేసి ఇచ్చి వెళ్ళమన్నాడు.
చివరికి అర్ధం అయింది ఏమిటంటే కంప్యూటర్ చెప్పిందే వేదం. స్వయంగా నేను నేనే అని చెప్పినా అది కంప్యూటర్ చెబితేనే నమ్మే రోజులు.
1975 లో నేను హైదరాబాదులో రేడియో ఉద్యోగంలో చేరినప్పుడు ఓపెన్ చేసిన అక్కౌంట్. అంటే దాదాపు యాభయ్ ఏళ్ళుగా ఆ బ్యాంకుకి నిరవధిక కస్టమర్ ని. అయినా ఆ విషయం ఇన్ని ఆధారాలు ఇచ్చి ప్రవర చెప్పుకుంటే కానీ నేను కస్టమర్ ని కానట్టే లెక్క.
వచ్చేటప్పుడు మళ్ళీ ఎప్పుడు రావాలి అని అడిగితే రెండేళ్ల తరవాత అన్నారు. అప్పుడు కూడా ఇన్ని కార్డులు, కాపీలు తేవాలా అంటే తప్పకుండా అనే జవాబు.
‘ఇప్పుడు నా వయసు 79. విష్ మి బెస్ట్ ఆఫ్ లక్’ అని చెప్పి వచ్చేశాను.
AI అడుగు పెడుతున్న సంధి యుగంలోనే ఇలా వుంటే అది పూర్తిగా రెక్కలు విప్పితే అప్పుడు ఎలా వుంటుందో!
(08-04-2025)
5 కామెంట్‌లు:
ఈ అక్నాలెడ్జిమెంటు ఏ అకౌంటుకైనా చూపించొచ్చు "లా" వుంది :)
ఏమండీ వినరా ఏమిటి "మీ" సేఠు బ్యాంకు ఈ తీరై పోయింది ?
ఏమి చెప్పుదు గురునాథా 😒 !
రిటైరయిన వాళ్ళ పరిస్థితి కూడా మామూలు కస్టమర్ కన్నా ఏం మెరుగ్గా లేదు. కాబట్టి మీరు రాంగ్ నంబర్ ని (అంటే నన్ను) అడుగుతున్నారు.
అయినా స్వయానా భండారు వారి అన్నగారే మీరన్న “సేఠు బ్యాంకు” లో పెద్ద సేఠుల్లో ఒకరిగా పరిగణించబడే ఉద్యోగం చేసారు, శ్రీనివాసరావు గారు వారికి చెప్పుకుంటారేమో లెండి.
ఎందుకయినా మంచిది అని ఈ పూటకి జిలేబి గారి మాటే విని దాన్ని తీసేసాను.
Procedures were standardized, not leaving to individual whims.
Now a days, a proof(identity, residence and any other related) are required to check any issue. I made a folder and carry it everywhere. When they ask, i provide.
I visited my bank hardly in years. All things can be done on line(but for very few). Technology eased the friction. However, to those who understand and use. My father(>80) goes to bank monthly, check and updates his passbook and feel happy by seing pension deposited in it. In the process he spends 1 hour there. He likes it.
I read Alvin Toffler book 'The future shock' in late 80s. The scenarios are happening.
ఆ kyc చిదంబర రహస్యం, బేంకుల వాళ్ళు మారరు,మొన్నమొన్ననేనా అనుభవం ఇంతకంటే మెరుగ్గా లేదు. నాకు చిరాకొచ్చి ఈ బేంకులో 50 ఏళ్ళుపైగా కస్టమర్ ని. నేనీ బేంకులో అక్కౌంటు ఓపెన్ చేసినరోజుకి మీరు పుట్టి ఉండరు అని కూడా అనేసాను. వాళ్ళకి సిగ్గులేదు,మనకి తప్పదు.ఎవరు రమ్మన్నారని ఎదురు ప్రశ్న మెసేజ్ చూపిస్తే సమాధానం లేదు. ఇంకెంతకాలం లేవయ్యా!నీతో మాకు పని లేదులే అన్న చూపు
కామెంట్‌ను పోస్ట్ చేయండి