ఏ నీతివాక్యం అయినా సరే, ఏ ఒక్కరికో అనుకూలం కాదు. ఏ ఒక్కరికో ప్రతికూలం కాదు. నీతి అంటేనే ధర్మం. ధర్మానికి స్వపర బేధాలు వుండవు.
వర్తమానంలో
ఏది సరైన దారి అని చెప్పేదే గతం. దాన్ని నుంచి పాఠం నేర్చుకుంటే భవిష్యత్తు
బాగుంటుంది.
ఇది
ఇప్పటి మాట కాదు, జరిగి అటూ ఇటూగా అరవై ఏళ్ళు.
బెజవాడ
రైల్వే ప్లాటు ఫారం. కృష్ణా జిల్లా కలెక్టర్ హడావిడిగా రాత్రివేళ అక్కడికి
చేరుకున్నారు. కారణం వుంది. రైల్వే అధికారులపై ఆయనకు ఆగ్రహం కలిగింది. హైదరాబాదు
నుంచి వైజాగ్ వెడుతున్న ఒక ఉన్నతాధికారికి కలిగిన అసౌకర్యం అందుకు కారణం. అధికారి
రైల్వే రిజర్వేషన్ గురించి ముందుగానే రెవెన్యూ అధికారులు బెజవాడ రైల్వే వారికి సమాచారం అందించి,
రిజర్వేషన్ గురించిన అర్జీ ముందుగానే అందచేశారు కూడా. ఆ రోజుల్లో రిజర్వేషన్ల
వ్యవహారం ఇప్పట్లా కంప్యూటర్ల సాయంతో జరిగేది కాదు. హైదరాబాదు నుంచి వైజాగ్ వెళ్ళే వాళ్ళు బెజవాడలో రైలు మారి మరో రైల్లో
వెళ్ళాలి. బెజవాడలో రైల్వే అధికారులు తయారు చేసిన రిజర్వేషన్ చార్టులో హైదరాబాదు
అధికారి పేరు లేదు. రెవెన్యూ అధికారులకు ఏం చెయ్యాలో పాలిపోలేదు. కలెక్టర్ నేరుగా
రైల్వే ఉన్నతాధికారితో మాట్లాడినా ప్రయోజనం లేకపోయింది. రైల్వే వారికీ, రెవెన్యూ
వారికీ మాట పట్టింపు వచ్చింది. ఎవరికి వారు తమ వాదనే సరయినది అనుకోవడం వల్ల ఆ
పట్టింపు పంతానికి దారి తీసింది. రిజర్వేషన్ ఇవ్వడం కుదరదు అంటే కుదరదు అన్నారు.
కలెక్టర్
తన పవర్ చూపించారు. తనకున్న జిల్లా మేజిస్ట్రేట్ అధికారాలను ఉపయోగించుకుంటూ,
అక్కడికక్కడే ప్లాటుఫారం మీదనే కోర్టు ఏర్పాటు చేశారు. దురుసుగా ప్రవర్తించిన
రైల్వే అధికారిని అరెస్టు చేయాలని ఆర్డరు వేశారు. రైల్వే వారికి పరిస్తితి అర్ధం
అయింది. మెట్టు దిగి వచ్చి హైదరాబాదు అధికారికి బెర్తు ఏర్పాటు చేశారు.
ఇది
జరిగి కూడా అరవై ఏళ్ళు దాటింది. ఆ రోజుల్లో పత్రికల్లో చిన్న వార్తగా వచ్చింది.
అప్పటి హైదరాబాదు పొలిమేరల్లో ఉన్న మిలిటరీ కంటోన్మెంటు నుంచి ఒక సైనిక జవాను
నగరానికి వచ్చాడు. సినిమాహాల్లో కాబోలు అతడికీ స్థానిక పోలీసు జవానుకూ నడుమ ఒక
తకరారు వచ్చింది. అది ముదిరి చేతులు కలుపుకునే దాకా వెళ్ళింది. స్థానిక పోలీసు
తనకున్న స్థానబలంతో ఆ మిలిటరీ జవానును తీసుకువెళ్ళి లాకప్పులో పడేశాడు. ఈ సమాచారం
కాస్త ఆలస్యంగా కంటోన్మెంటుకు చేరింది. ఒక ట్రక్కులో సైనికులు ఆ పోలీసు స్టేషన్ కు
చేరుకొని స్థానిక పోలీసులకు దేహశుద్ధి చేసి తమ సహోద్యోగిని బందీఖానా నుంచి
విడిపించి వెంటబెట్టుకు వెళ్ళారు. ఆ కాలంలో సమాచార వ్యాప్తి మెల్లగా జరిగేది కనుక, విషయం పైఅధికారులకు తెలిసేసరికి కొంత ఆలస్యం అయింది. కేంద్ర
రాష్ట్ర ప్రభుత్వాల నడుమ వ్యవహారం కాబట్టి అది మరింత ముదరకుండా ఇరువైపులా
ఉన్నతాధికారులు సర్దుబాటు చర్యలు తీసుకున్నారని పత్రికా వార్తల కధనం.
“విద్యా
సంస్థలు బంద్ అని టీవీల్లో స్క్రోలింగులు
కనబడగానే మా అమ్మాయి బడికి వెళ్ళకుండా ఇంట్లో వుండిపోతుంది. యెంత చెప్పినా వినదు.
ఇక స్కూళ్ళు కూడా అలాగే మూసేస్తున్నారు. ఇదంతా
మీడియా సృష్టిస్తున్నభయాందోళనల వల్లే”.
ఈ
మాటలు అన్నది సాక్షాత్తూ ఒకప్పటి హైదరాబాద్ నగర పోలీసు కమీషనర్ ఏకే ఖాన్ అంటే
నమ్మ శక్యం కాకపోవచ్చు కానీ ఇది నిజంగా నిజం.
చాలా
ఏళ్ళ క్రితం నగరంలో జరిగిన ఒక సమావేశంలో
మాట్లాడుతూ ఆయన తన మనసులోని మాటలను బయట పెట్టారు. ఈ క్రమంలో ఇజ్రాయల్ దేశాన్ని
ఉదాహరణగా పేర్కొన్నారు. “ఆ దేశంలో యెంత పెద్ద హింసాత్మక సంఘటన జరిగినా అక్కడి
మీడియా ఆ విషయాన్ని లోపలి పేజీల్లో ప్రచురిస్తుంది. అభివృద్ధికి సంబంధించిన
వార్తల్ని ప్రముఖంగా మొదటి పేజీల్లో వేస్తుంది. మన దగ్గర మాత్రం ఇందుకు పూర్తిగా
భిన్నంగా జరుగుతోంది. స్తానికంగా పరిమితమయిన సంఘటనలను సార్వత్రికం చేసి వార్తలు
ప్రచారం చేయడం వల్ల లేనిపోని అనర్ధాలు జరుగుతున్నాయి.”
కొత్వాల్
గారు అంతటితో ఆగలేదు.
ఇతరుల
హక్కులకు భంగం కలగకుండా ఉద్యమాలను నిర్వహించుకోవాలని హితవు పలికారు.
“రోడ్ల
మీద భైఠాయించి ఇతరుల హక్కులకు భంగం
కలిగించే స్వేచ్చ ఆందోళనకారులకు ఎక్కడిద”ని నిలదీశారు.
ఖాన్
గారి ఈ భావజాలంతో ఏకీభవించాల్సిన అవసరం
వుందని కాదు కానీ, ఈ అంశాన్ని గురించి ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమయిందని మాత్రం
చెప్పవచ్చు.
“పత్రికలు
చదవను. టీవీ చూడను. ఇదే నా ఆరోగ్య రహస్యం” అన్నారు మాజీ ప్రధాని, కీర్తిశేషులు
చరణ్ సింగ్.
భారత
ప్రజాస్వామ్య సౌధానికి మూల స్తంభాలయిన వ్యవస్థల
ప్రతినిధుల నిర్వాకాలు గమనిస్తుంటే చరణ్ సింగ్ మాటలు గుర్తుకొస్తున్నాయి.
‘చేతులు బార్లా
జాపుకునే స్వేచ్చ ప్రతి ఒక్కరికీ వుంటుంది. అయితే ఆ చేతి కొసభాగం పక్కవాడి ముక్కునో, కంటినో
తాకనంత వరకే ఈ స్వేచ్చ’ అని ఓ ఆంగ్ల సామెత వుంది. అంటే స్వేచ్చకు సయితం హద్దులు వున్నాయని
చెప్పడం ఈ నానుడి తాత్పర్యం.
“కేంద్రం
మిధ్య” పొమ్మన్నారు, అలనాడు తెలుగుదేశం పార్టీ సంస్థాపక అధ్యక్షుడు, ఉమ్మడి
రాష్ట్రంలో తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి
ఎన్టీ రామారావు.
రామారావు
సొంత పార్టీ పెట్టిన నాడు ఆయన పెట్టుకున్న లక్ష్యాలు ఆంధ్రుల ఆత్మగౌరవ పరిరక్షణ,
కాంగ్రెస్ వ్యతిరేకత, ప్రాంతీయ ప్రయోజనాల సాధన. ఆ క్రమంలో ఆయన కేంద్రంపై
విరుచుకుపడడాన్ని ప్రజలు అర్ధం చేసుకుని ఆయన్ని ఆశీర్వదించారు. అప్పుడు కేంద్రంలో
అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులను ఇష్టం వచ్చిన
రీతిలో మార్చడం, ఆ పార్టీ హయాములో ముఖ్యమంత్రి అంజయ్యకు జరిగిన అవమానం, తెలుగు
వాడి ఆత్మ గౌరవం దెబ్బతినేలా ఆనాడు తీసుకున్న కొన్ని చర్యలు కూడా కేంద్రంపై
పోరాటంలో రామారావు సాధించిన అపూర్వ విజయానికి
ఉపయోగపడిన మాట వాస్తవం. పోరాట పటిమ ప్రదర్శించడంలో ఎన్టీఆర్ చిత్తశుద్ధిని ప్రజలు
త్రికరణశుద్ధిగా ఆమోదించారు.
ఒక్క
ప్రధాన మంత్రి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, ముఖ్యమంత్రి అనేకాదు, ఈ
ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పదవికీ, ప్రతి ఉద్యోగికీ కొన్ని అధికారాలు
వుంటాయి. ఆ అధికారాలుకు అనుగుణంగా పనిచేసే కొన్ని వ్యవస్థలు వుంటాయి. రాజ్యాంగం ప్రసాదించిన ఆ అధికారాలను, వ్యవస్థలను
తమ ప్రత్యర్ధులు, లేదా తాము ఇష్టపడని వారిపై ప్రయోగిస్తూ పోతే అది
ఖచ్చితంగా అధికార దుర్వినియోగమే అవుతుంది. అలా వాడుకోలేని అధికారాలు వుంటే ఏమి,
లేకపోతే ఏమి అని వాదించేవాళ్లకు ఒక నమస్కారమే నా సమాధానం.
అంతరిక్షంలో వేలాది గ్రహాలు కళ్ళు
తిరిగిపోయే వేగంతో తమ నిర్ణీత కక్ష్యల్లో
పరిభ్రమిస్తుంటాయని సైన్సు చెబుతుంది. ఏ ఒక్క గ్రహమూ తన నిర్దేశిత కక్ష్యను దాటి ఒక
మిల్లి మీటరు కూడా పక్కకు తొలగదు. అలా జరిగితే అది విశ్వ వినాశనమే. అయినా అన్ని
గ్రహాలు అంత వేగంతో తిరుగుతూ కూడా గతి
తప్పకుండా భ్రమిస్తుంటాయి. పైగా కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాల నుంచీ జరుగుతోంది.
వాటికి ఎవరు చెప్పారు ఇలా గాడి
తప్పరాదని.
రాజ్యాంగ వ్యవస్థలు కూడా అలాగే గతి
తప్పకూడదు. తప్పితే రాజ్యాంగానికే ముప్పు. మన ప్రజా ప్రతినిధులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు, న్యాయాధిపతులు,
అధికారులు అందరూ సతతం మననం చేసుకోవాల్సిన నీతి వాక్యం.
ధర్మోరక్షిత రక్షితః
‘రాజ్యాంగాన్ని మీరు కాపాడండి. ఆ
రాజ్యాంగమే మిమ్మల్ని కాపాడుతుంది”
(ఇంకా
వుంది)
2 కామెంట్‌లు:
ధర్మో రక్షతి రక్షితః 🙏
కేంద్ర ప్రభుత్వ శాఖలైనా / సంస్థలైనా / ఉద్యోగులైనా (బహుశః మిలటరీ మినహా అనుకుంటున్నాను ???) స్ధానిక ప్రభుత్వ అధికారుల సహకారం కోరాలే గానీ వారితో తలపడడం అభిలషణీయం కానేరదు - అందునా రెవిన్యూ, పోలిసు వారితో. స్థానికంగా వ్యవహారాలు, శాంతిభద్రతలు చూసుకునేది స్ధానిక అధికారులే. కనుక వారిదే పై చేయి గా ఉంటుంది సాధారణంగా.
—————
// “ఖాన్ గారి ఈ భావజాలంతో ఏకీభవించాల్సిన అవసరం వుందని కాదు ”//
ఏం, ఎందుకని “కాదు” ? అవసరం పూర్తిగా ఉందని నేను నమ్ముతున్నాను. లేకపోతే ఎవరికి వారికి ఇష్టారాజ్యం అయిపోయింది దేశంలో. హైదరాబాదులో పని చేసిన పోలీస్ కమీషనర్లలో - నన్నడిగితే - ఖాన్ గారిది చెప్పుకోదగిన వ్యవహారశైలి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి