ఏం చేసినా కలెక్టర్ గానే....
“మేము ఏం చేసినా, మంచి పేరు తెచ్చుకున్నా అది జిల్లా అధికారులుగా పనిచేసినప్పుడే.
ఒక్కసారి సచివాలయంలో అడుగు పెట్టాము అంటే మొత్తం సమయం విధానాల రూపకల్పనకూ, వాటి అమలు పర్యవేక్షణకే సరిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే సెక్రెటరీ
ఉద్యోగం పేరుకు పెద్దదే కావచ్చుకాని నిజానికి అది గ్లోరిఫైడ్ క్లర్క్”
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి
పదవీ విరమణ చేసిన ఒక సీనియర్ ఐ ఏ ఎస్ అధికారి మాటల సందర్భంలో చెప్పిన మాట ఇది.
గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వివిధ
జిల్లాలలో కలెక్టర్లుగా పనిచేసి తరువాత సచివాలయంలో డిప్యూటీ సెక్రెటరీలుగా,
కార్యదర్శులుగా విధులు నిర్వహించిన అనేకమంది ఐఏఎస్
అధికారులతో వృత్తిరీత్యా ఏర్పడ్డ అనుబంధాలలో భాగంగా చోటుచేసుకున్న ముచ్చట్లలో అధిక
భాగం వాళ్ళు కలెక్టర్లుగా పనిచేసినప్పటి విషయాలే కావడం నన్ను అబ్బురపరిచేది.
అరవై ఏళ్ళ కిందట సయ్యద్ హషీం ఆలీ ఖమ్మం
జిల్లా కలెక్టర్ గా పనిచేశారు. మా పెద్దన్నయ్య భండారు పర్వతాల రావు గారు ఆయన వద్ద
జిల్లా పౌర సంబంధాల అధికారిగా వుండేవారు. (తదనంతర కాలంలో ఆ శాఖకు డైరెక్టరుగా,
అయిదుగురు ముఖ్యమంత్రులకు, 'చెన్నా టు అన్నా' - పీఆర్వోగా పనిచేశారు) ఆ కలెక్టర్ గారు
ఎప్పుడు దౌరా వెళ్ళినా మా అన్నయ్యను వెంటబెట్టుకుని వెళ్ళేవారు. పత్రికల్లో
వార్తలు, ఫోటోలు వేయించుకోవడం ఆయనకు సుతరామూ
ఇష్టం వుండేది కాదు. మరి, ఎందుకు తనని కూడా తీసుకువెడుతున్నట్టు.
అసలు విషయం ఏమిటంటే జిల్లాలో ముఖ్యంగా
గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు సామాన్య ప్రజలు, ప్రధానంగా బీదాబిక్కీ ఆయన్ని కలుసుకుని తమ సమస్యలు చెప్పుకునే వారు.
హషీం ఆలీ గారి తెలుగు భాషా పరిజ్ఞానం అంతంత మాత్రం. కింది స్థాయి రెవెన్యూ
సిబ్బంది తర్జూమా చేసి చెప్పేటప్పుడు తనని తప్పుదోవ పట్తిస్తారేమో ఆయనకు అనుమానం.
అందుకని ఆ పనిలో తోడ్పడడం కోసం మా అన్నయ్యను వెంట ఉంచుకునే వారు. ఈ
సాన్నిహిత్యాన్ని కొందరు అపార్ధం చేసుకున్నారు కూడా. కలెక్టర్ గారితో మీకు బాగా
పరిచయం వున్నట్టుందే అని అడుగుతుండేవారు. మా అన్నయ్య స్వతహాగా హాస్య ప్రియుడు.
‘అవునండీ. బాత్ రూమ్ అవసరం లాంటిది మా పరిచయం. బాత్ రూమ్ లోకి వెళ్ళిన వాళ్ళు అక్కడే
వుండిపోరు కదా. అలాగే నేను కలెక్టర్ గారిని రోజూ ఎన్నిసార్లు కలుసుకున్నా అవసరం
మేరకే. అది పూర్తి కాగానే బయటకు వస్తాను’ అనేవారు.
ఆ రోజుల్లో ఖమ్మం కలెక్టర్ ఆఫీసు
ట్రంకు రోడ్డులో వుండేది. చాలా చిన్న భవంతి. మెట్లు ఎక్కగానే చిన్న వసారాలో ఎదురుగా
స్వింగ్ డోర్. దాని వెనుక ఒక నీలంగుడ్డ పరచిన మేజా బల్ల. వెనుక ఫేము కుర్చీలో కలెక్టర్. అదీ పరిస్తితి. అటాచ్డ్ బాత్
రూమ్ కూడా వుండేది కాదు. వెనక పెరట్లో ఎక్కడో దూరంగా వుండేది.
ఆ రోజు కలెక్టర్ ని కలవడానికి భద్రాచలం
దగ్గర ఓ పల్లెటూరు నుంచి ఓ రైతు వచ్చాడు. గుమ్మం ముందు హమేషా వుండే డవాలా బంట్రోతు
ఆ సమయంలో ఏదో పనిమీద వెళ్ళాడు. లోపల కలెక్టర్ గారు బాత్రూంకు పోవడానికి లేచి పెరటి
ద్వారం వైపు వెడుతున్నారు. సరిగ్గా ఆ టైంలో రైతు స్వింగ్ డోర్ తెరుచుకుని
‘కలెక్టర్ దొరగారెక్కడ?’ అని అడిగాడు. తాను అడుగుతున్నది
సాక్షాత్తు కలెక్టర్ నే అని అతడికి తెలియదు. హషీం ఆలీగారు ఏమాత్రం నొచ్చుకోకుండా,
అతడిని కూర్చోబెట్టి విషయం తెలుసుకుని సమస్యను
పరిష్కరించే విషయంలో తన కింది సిబ్బందికి తగు సూచనలు ఇచ్చి పంపేశారు.
ఆ
రోజుల్లో రెవెన్యూ బోర్డు సభ్యుడు, సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారి అనంత రామన్ ఖమ్మం దౌరాకు వచ్చారు.
రెవెన్యూ బోర్డు సభ్యుడు అందులోను మొదటి సభ్యుడు అంటే చీఫ్ సెక్రెటరీ తరువాత అంతటి హోదా కలిగిన
ఆఫీసరు. ఆ కాలంలో ఉన్నతాధికారులు కూడా రైళ్ళల్లోనే ప్రయాణాలు చేసేవాళ్ళు. అలాగే
రైల్లో ఖమ్మం చేరుకున్న అనంత రామన్ ని జిల్లా కలెక్టర్ సయ్యద్ హషీం ఆలీ రిసీవ్
చేసుకుని దగ్గరలోని ప్రభుత్వ అతిధి గృహం హిల్ బంగ్లాలో దిగబెట్టారు. మర్నాడు
అధికారిక సమావేశాలు, సమీక్షలు
ముగించుకున్న తర్వాత అనంత రామన్ గుట్ట మీద నరసింహస్వామి గుడి చూడాలని వుందన్న కోరిక వెలిబుచ్చారు. కలెక్టరు జీపులో అనంత రామన్ గుడికి వెళ్లి
పూజలు అవీ ముగించుకుని వచ్చారు. హైదరాబాదు రైలెక్కేముందు అనంత రామన్ కలెక్టర్ చేతిలో కొన్ని నోట్లు
పెట్టి చెప్పారు.
‘మీరు
జీపు ఇచ్చి నన్ను గుడికి పంపారు, సంతోషం. కానీ అది ప్రభుత్వ వాహనం.
కాబట్టి ఈ డబ్బు ప్రభుత్వ ట్రెజరీలో జమ చేయించండి’.
ప్రభుత్వ
ధనం అంటే పాముగా పరిగణించే రోజులవి.
పక్కనే
వున్న మా అన్నయ్య అన్నాడు, నేను
కూడా వారితో కలిసి ప్రభుత్వ వాహనంలో దేవాలయానికి వెళ్ళిన వారిలో వున్నాను. కాబట్టి
అందుకయిన ఖర్చులో నా వాటా కూడా ట్రెజరీలో జమచేయించండి’
మరో కలెక్టర్ కధ!
ఒకానొక కాలంలో జిల్లా మొత్తాన్ని తమ
కనుసన్నల్లో శాసించే జిల్లా కలెక్టర్లకు
తమ జిల్లాలో తిరగడానికి జీపు సౌకర్యం మాత్రమే వుండేది. అదీ టార్పాలిన్ పట్టాలు అటూ ఇటూ టపటపా కొట్టుకుంటూ వేళ్ళాడే
పాతతరం విల్లీస్ జీపులు.
అలాటి కాలంలో, ఒకానొక జిల్లాలో, కలెక్టర్ గా పనిచేస్తున్న ఓ ఐ.ఏ.ఎస్.
అధికారి జీపు తీసుకుని ఓ రోజు ఉదయం ఏదో
గ్రామానికి టూరుకు వెళ్లి తిరిగి వస్తుంటే, దారిలో జీపు టైరు పంక్చర్ అయింది. సెల్ ఫోన్లు లేని
రోజులాయె. డ్రైవర్ పంక్చర్ వేయించుకుని రావడానికి కొన్ని మైళ్ళ దూరంలో వున్న మరో
పెద్ద వూరికి వెళ్ళాడు. కలెక్టర్ గారి
వెంట వున్న బిళ్ళ బంట్రోతు, అయ్యగారికి చెట్ల నీడన వున్న ఒక మోరీ
చూపించి అక్కడ కూర్చోపెట్టాడు. డ్రైవర్ రావడానికి బాగా వ్యవధి వుంది. అటూ ఇటూ
చూస్తున్న కలెక్టర్ గారి దృష్టికి దగ్గరలో
ఓ వూరు జాడ కనిపించింది. కొందరు ఆడవాళ్ళు బిందెలు చంకన పెట్టుకుని వస్తూ కానవచ్చారు. ఆయన వారిని పలకరించి, 'నీళ్ళ కోసం ఇంత దూరం ఎందుకు
పడుతూ లేస్తూ వస్తున్నారు, మీ వూళ్ళో మంచి నీటి బావి లేదా?' అని ప్రశ్నించారు. 'నువ్వేమన్నా ఆర్చేవాడివా, తీర్చేవాడివా' వంటి చొప్పదంటు ప్రశ్నలు వాళ్ళు వేయకుండా, 'వూళ్ళో బావులకేం చాలా వున్నాయి, కానీ మమ్మల్ని అక్కడ నీళ్ళు తోడుకోనివ్వరు' అని బదులు చెప్పారు. కలెక్టర్ సాలోచనగా తలపంకించి ఊరుకున్నారు. ఈలోగా
టైరు పంక్చర్ వేయించుకుని డ్రైవర్
తిరిగివచ్చాడు. కలెక్టర్ తన మానాన తాను పొతే కధే లేదు. ఆయన అల్లాంటి
ఇల్లాంటి అధికారి కాదు కాబట్టి ఏం చేయాలో వెంటనే ఆలోచించి పెట్టుకున్నాడు. డ్రైవర్
ని నేరుగా జిల్లా కేంద్రానికి పంపించి
తాను ఆ మోరీ మీదనే కూర్చుండిపోయాడు. ఈలోగా ఆయన మౌఖిక ఆదేశాలు అందుకున్న కలెక్టర్
గారి సిబ్బంది, స్థానిక తాసిల్దారు టైప్ రైటర్లు, కలెక్టర్ గారి అధికారిక ముద్రిక తదితరాలతో సహా అక్కడికి వచ్చారు.
ఊళ్ళోకి కబురు పంపి గ్రామ సర్పంచుని రప్పించారు. ఈ హడావిడి అంతా చూసి ఊరిజనం అంతా
అక్కడ పోగయ్యారు. వూరి వెలుపల నుంచి మంచి నీళ్ళు తెచ్చుకునే వారికి, వారి గూడెం
లోనే ఒక మంచి నీటి బావి మంజూరు చేయాలని
సర్పంచు నుంచి ఓ అభ్యర్ధన పత్రం తీసుకున్నారు. దానికి అక్కడికక్కడే స్థానిక
అధికారి నుంచి ఆమోద ముద్ర వేయించారు. తనకున్న విశేష అధికారాలను ఉపయోగించుకుంటూ
అందుకు అవసరమైన నిధులను తక్షణమే మంజూరు
చేస్తూ ఆ మోరీ మీదనే కూర్చుని సంతకం చేసి,
కింద స్టాంపు వేసారు. ఆ వెనువెంటనే
కూలీలను పిలిపించారు. బావి తవ్వకానికి ఆయనే స్వయంగా గడ్డపారతో మొదటి పలుగు
వేసి స్వీకారం చుట్టారు. ఝాము పొద్దెక్కక ముందే ఝామ్మని బావి పని మొదలయింది. అంతకుముందు ఆ ఊరి జనం ఇలాటి
అధికారిని చూడలేదు సరికదా కనీసం వినికూడా వుండలేదు. అందుకే అందరి మొహాల్లో
నిండుకున్న నిబిడాశ్చర్యం. ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో వారి వూరిలో ఓ అభివృద్ధి
కార్యక్రమానికి శుభారంభం జరిగింది. పొద్దుగూకే సమయానికి బావిలో సమృద్ధిగా
జలపడింది. ఆ వూరి గూడెం జనానికి కొత్త పొద్దు పొడిచింది.
ఆ జిల్లా ఖమ్మం జిల్లా. ఆ వూరు
రెబ్బారం అని అందరూ పిలుచుకునే రెబ్బవరం. ఆ వూరి సర్పంచ్ మా రెండో బావగారు కొలిపాక
రామచంద్ర రావు. ఆ కలెక్టర్ గారి పేరు ఆర్. పార్ధసారధి. ఆయన ఇప్పుడు జీవించి
లేరు. కానీ ఆ గూడెం ప్రజల మనస్సులో ఇంకా
జీవించే వున్నారు.
మరో మంచి అధికారి కధ
సురేష్ చందా అనే ఓ ఐ.ఏ.ఎస్. అధికారి
కూడా ఈ కోవలోకే వస్తారు. తెలంగాణా
ప్రభుత్వంలో పనిచేస్తున్న ఈ అధికారి గురించి కొన్నేళ్ళ క్రితం పత్రికల్లో అనేక
కధనాలు వచ్చాయి. వాటి ఆధారంగా రూపొందించిన వ్యాసం ఇది.
గత అరవై ఏళ్ళలో అనేక మార్పులు వచ్చాయి.
జిల్లాకు ఒక ఐ.ఏ.ఎస్. అధికారి మాత్రమే వుండే
పద్దతి మారి జిల్లాకు ముగ్గురు నలుగురు వచ్చారు. టార్పాలిన్ పట్టాలు వున్న
జీపులు పోయి అధునాతన వాహన శ్రేణి వచ్చి చేరింది. జిల్లా మొత్తంలో ఎక్కడ చీమ
చిటుక్కుమన్నా క్షణాల్లో తెలియచెప్పే సమాచార
వ్యవస్థ చేతికి అంది వచ్చింది. సిబ్బంది పెరిగారు. జనం ఇబ్బందులూ పెరిగాయి.
మరీ అంతలా కాకపోయినా, రాజకీయ అవరోధాలను అధిగమించి, పదిమందికి పనికి వస్తాయని తాము అనుకున్న మంచి పనులను అనుకున్న రీతిలో
చేసి పెట్టే అధికారులు కూడా మన మధ్యనే వున్నారు. సురేష్ చందా అనే ఈ ఐ.ఏ.ఎస్.
అధికారి తెలంగాణా సచివాలయంలో ఒక ఉన్నత స్థానంలో పనిచేసేవారు. రాష్ట్రం
మొత్తంలో ఆరోగ్య, వైద్య సేవలు ఆయా ప్రభుత్వ ఆసుపత్రులలో
ఎలా అందుతున్నాయో పర్యవేక్షించే బాధ్యత ఆయనది. యువకుడు కావడం వల్ల కంప్యూటర్ పరిజ్ఞానం హెచ్చుగా
ఉండడంలో ఆశ్చర్యం లేదు. అంచేత తన శాఖ పని తీరు మెరుగు పరుచుకోవడానికి ఈ అధునాతన
సాంకేతిక పరిజ్ఞానం వాడుకోవాలని ఆయన భావించారు. తెలంగాణాలో పేరొందిన గాంధి
ఆసుపత్రితో మొదలు పెట్టి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని అనుకున్నారు. గాంధీ
ఆసుపత్రిలో ఏమూల ఏం జరుగుతున్నదో సచివాలయంలోని
తన చాంబర్ నుంచే కనిపెట్టి చూసే ఉద్దేశ్యంతో ఆ ఆసుపత్రిలో సుమారు రెండు వందల నిఘా
కెమెరాలను అమర్చాలని తలపెట్టారు. కింద వాళ్ళు చేసే పనులను కనిపెట్టి చూడడం
ఆయన బాధ్యతల్లో ఒకటి. కానీ, తాను ఎలా పనిచేస్తున్నది
కూడా నలుగురికీ తెలియాలి కదా! అందుకని ఈ
ప్రయోగాన్ని ఆయన తనతోనే ప్రారంభించారు. చడీచప్పుడూ కాకుండా తన కార్యాలయంలో ఒక నిఘా
కెమెరాను ఏర్పాటు చేసుకున్నారు. తన గదిలో ఏం జరిగేది, తనను కలుసుకోవడానికి ఎవరెవరు వచ్చేది, ఏం మాట్లాడేది రికార్డు చేయడం కోసం ఈ కెమెరా. అయితే ఈ కెమెరా
రికార్డు చేసేది, చూసేది తను ఒక్కరే
కాకుండా ఎవరయినా సరే చూడగలిగేలా,
ఇంటర్నెట్తో దాన్ని అనుసంధానం చేయడం
ఇందులోని ఒక ప్రత్యేకత. 'సమాచార చట్టం ప్రకారం ప్రజలకు
తెలుసుకునే హక్కు వచ్చింది. వాళ్ళు అడిగితే ఇవ్వడం కాకుండా అడక్కుండానే యావత్ సమాచారం
ప్రజలకు అందుబాటులో ఉంచితే తప్పేమిట'నేది ఈ అధికారి
అభిప్రాయం. తన దృష్టికి వచ్చిన ఫైళ్ళపై తాను
రాసిన నోట్ వివరాలను కూడా వెంట వెంటనే ఆయన ఇంటర్నెట్లో పెడుతుంటారని పత్రికల్లో చదివినవారికి ఒకింత ఆశ్చర్యం కలగడం
సహజం. అవసరానికి మించిన గోప్యతను అధికారులు పాటించడం వారికో అలవాటని జనంలో ఒక
అభిప్రాయం బలంగా నాటుకుని ఉండడమే ఇందుకు కారణం. తాము చెప్పినది సావకాశంగా విని,
కోరిన సమాచారం ఓ మేరకయినా అధికారులు
అందించగలిగితే, తమ సమస్య సగం పరిష్కారం అయిందని
సంతోషించే సామాన్యుల సంఖ్య కూడా అధికమే.
'అనుమతి లేకుండా పురుగు కూడా
ప్రవేశించలేని అతి శీతల గదుల్లో కూర్చుని అధికారులు ఏం చేస్తుంటారు?' అనే అనుమానం సాధారణ జనంలో వుంది. అ అధికారుల గదుల్లోకి కనీసం తొంగి
చూడడానికి కూడా వీలుపడని వారికి సురేష్
చందా అనే ఈ అధికారి చేస్తున్నది అబ్బురం అనిపించడంలో సందేహం లేదు.
అడగగానే మెచ్చి వరాలు ఇచ్చే దేవుళ్ళకు
మన పురాణాల్లో కొదవలేదు. అడగకుండానే సమాచారం ఇవ్వాలనే అభిమతం కొందరు అధికారుల్లో
అయినా ఊపిరి పోసుకోవడం అభిలషణీయం.
ఆహ్వానించదగ్గ పరిణామం .
మొత్తం పరిపాలన ఇలా ప్రజల కళ్ళ ముందు జరగడం అంటూ జరిగితే పాలకుల పట్ల
ప్రజల్లో పేరుకుపోతున్న అసహనం ఓ మేరకయినా తగ్గడం కూడా ఖాయం.
తోకటపా: ఇది జరిగి పదేళ్లు దాటింది. ఏ హోదాలో
వున్నా ఆ అధికారి ఇప్పటికీ అలానే వ్యవహరిస్తున్నారని ఆశిద్దాం.
(ఇంకావుంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి