త్యాగరాయ గానసభలో సందడి చేసిన ఎస్సారార్ కాలేజీ జంధ్యాల గుంపు
(గ్రూపుకు గుంపు అని తెలుగీకరణ చేసింది గుంపులో గోవిందుడు ధర్మవరపు రామ్మోహన రావు)
హైదరాబాద్ నగరం నలుమూలల్లో నివాసం వుంటున్న ఈ బ్యాచ్ లో దాదాపు పదిహేను మంది నిన్న సాయంత్రం ఠంచనుగా అయిదింటి కల్లా చిక్కడపల్లిలోని గానసభకు చేరుకున్నాము. అప్పటికి పెళ్లి కుమారుడు రఘు, తోడి పెళ్ళికొడుకు సుబ్బరాయ శర్మలు పెళ్లి మంటపానికి చేరుకోలేదు. నిజానికి అక్కడ జరిగింది పెళ్లి కాదు అంతకంటే పెద్ద వేడుకే.
ఎంవీ రఘు అనే ఎస్సారార్ కాలేజీ కుర్రాడు ఎలాంటి అండాదండా లేకుండా మద్రాసు వెళ్ళిపోయి సినీ జనారణ్యంలో సినిమాటోగ్రాఫర్ గా నిలదొక్కుకుని, యాభయ్ చిత్రాలకు, అందులోను దిగ్ధర్శకులు బాపు విశ్వనాధ్ వంటి వారితో పనిచేసి వారిచేత, ప్రేక్షకుల చేత సెహభాష్ అనిపించుకోవడం మాటలు కాదు. అందుకే మరోమాట
లేకుండా త్యాగరాయ గాన సభలో ఘన సత్కారం. విమర్శకుల చేత ఆహా అనిపించుకున్న 'కళ్ళు' సినిమా దర్శకుడు కూడా ఈ రఘునే.
ఈ సుదీర్ఘ సినీ యానంలో మిత్రుడు రఘుకు ఇంతకంటే ఘన సన్మానాలు, సత్కారాలు ఎన్నో జరిగాయి. కానీ నిన్న జరిగింది వెరీ వెరీ స్పెషల్.
ఎప్పుడో యాభై ఏళ్ళ క్రితం ఒకే కాలేజీలో చదువుకున్న వాళ్ళం చాలా మందిమి, 'శనివారం సాయంత్రం ఓ మూడు గంటలు మీ సమయం అప్పివ్వండి' అని కాలేజీ గ్రూపులో రఘు సరదాగా పెట్టిన ఆహ్వానానికి అందరూ తలూపడం, ఆ ఊపిన తలకాయలన్నీ పోలోమని వెళ్లి కమనీయంగా, కన్నుల పండుగగా జరిగిన రఘు సన్మాన వేడుకను కనులారా తిలకించి పులకించడం జరిగింది.
మిత్రుడు ఎంవీ రఘు చూడడానికి చిన్న ఆకారం అయినా, సువిశాల సినిమా రంగంలో ఆకాశం ఎత్తుకు ఎదిగిన ఆ స్వయంకృషీవలుడికి స్వయంగా అభినందనలు తెలిపింది ఈ గుంపు.
ఎంవీ రఘుకు భవిష్యత్తులో మరిన్ని పురస్కారాలు లభించాలని కోరుకుంటూ అందరం ఇళ్లకు మళ్ళాము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి