7, ఏప్రిల్ 2025, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో ( 137 ) – భండారు శ్రీనివాసరావు

 ఎప్పటికీ మిగిలేవి జ్ఞాపకాలే!

తలపుకు వస్తే కొన్ని దుఃఖ పెట్టేవి, మరికొన్ని  మనసుకు ఉల్లాసం కలిగించేవి.

సమస్త సృష్టిలో ఒక్క మనిషికే దక్కిన వరం ఈ జ్ఞాపకం.

మనిషికి వున్న వాటికంటే  పోయిన, పోగొట్టుకున్న వాటి మీదే మక్కువ ఎక్కువ. జ్ఞాపకాలు కూడా వీటిచుట్టూనే తిరుగుతుంటాయి. అలాగే నా ఈ స్మృతులు.

ఎందుకీ రాతలు?
కారు అద్దంపై జారిపోతున్న వర్షపుచుక్కల్లా మనసును ముసురుకుంటున్న ఆలోచనలు.
వైపర్ తో నీటిపొరలను తొలగించినట్టు,
దిగులును దూరం చేసుకునేందుకే ఈ రాతలు.
ఒక్క క్షణం ఆపితే... చాలు
చుట్టూ జ్ఞాపకాల వరదలు

 

ఇన్నాళ్ళు నేను కాపురం చేసింది ఒక పిచ్చివాడితోనా!”

మా ఆవిడ చనిపోయి, దహన సంస్కారాలను కళ్ళారా చూసి వచ్చిన నెలరోజులకు తను నాతో మాట్లాడింది.
ఆశ్చర్యంగా వుంది కదూ. నేనే మాట్లాడేది. అసలు మాట్లాడకూడదు అనుకున్నాను. కానీ పొద్దున్నే లేచి నా ఫోటోకి దణ్ణం పెడుతుంటే చూసి ఇక మాట్లాడక తప్పదు అనిపించింది.
నేను ప్రతి రోజూ పూజలు చేస్తుంటే దేవుడి మండపంలో ఏనాడు దీపం కూడా వెలిగించని నువ్వు ఇలా చేస్తుంటే నాకూ ఆశ్చర్యం అనిపించింది.
నిన్ను ‘నువ్వు’ అంటున్నానని ఆశ్చర్యంగా ఉందా. నిజమే! నా జీవితంలో నిన్ను ఏనాడూ ‘నువ్వు’ అని పిలిచి ఎరుగను. ఇప్పుడు జీవితమే లేని ‘జీవితం’ నాది. ఎల్లాగూ దణ్ణం పెడుతున్నావు కాబట్టి ఇక నుంచి నిన్ను నేను నువ్వు అనే అంటాను.
ఆ రాత్రి నువ్వు అంబులెన్స్ కోసం హడావిడి పడుతూ నా చివరి మాటలు వినే ఛాన్స్ పోగొట్టుకున్నావు. నిజానికి నేనూ మాట్లాడే పరిస్తితి లేదు. ఏదో చెబుదామని నోరు తెరవబోయాను. మాట పెగల్లేదు. అంబులెన్స్, అడ్రసు చెప్పడాలు ఏవేవో మాటలు. అర్ధమయీ కాకుండా.
అందుకే నెల రోజులు ఆగి ఇప్పుడు చెబుతున్నా విను.
నువ్వు నువ్వులా వుండు. వేరేలా వుంటే నాకస్సలు నచ్చదు. బావగారూ, అక్కయ్యలు, మేనకోడళ్ళు పిల్లలు అందరూ ఇదే చెబుతున్నారు, నీకు. వారి మాటే నా మాట కూడా.
పెళ్లికాకముందు నుంచి నువ్వు ఎలా వుంటే బాగుంటుందో నాకో ఐడియా వుండేది. వేసుకుండే బట్టలు. నడిచే పద్దతి. మాట్లాడే తీరు. మూడోది నీదే, నేను మార్చింది ఏమీ లేదు. గుర్తుందా. మద్రాసు నుంచి ఒక చొక్కా పోస్టులో పంపితే ఇదేం ఫ్యాషను అని వంకలు పెట్టావు. చివరికి అదే ఫ్యాషన్ అయింది. ఈ యావలోనే నేను ఒక పొరబాటు చేశానేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. నీ దుస్తుల సైజు నీకు తెలవదు.  షర్ట్ బటన్లు సరిగా పెట్టుకోవడం చేతకాదు. ఏ ప్యాంటుపై ఏ కలర్ చొక్కా వేసుకోవాలో నేనే చెప్పేదాన్ని. మరి ఇప్పుడు ఎలా అన్నది నీకే కాదు, నాకూ ప్రశ్నే.
ఇన్నాళ్ళు ఇంటిని పట్టించుకోకుండా ప్రపంచమే నీ ప్రపంచమని వేళ్ళాడావు. ఇప్పుడు పట్టించుకోవడానికి ఇంట్లో నేనెట్లాగు లేను. నేనున్నప్పుడు నీకో ప్రపంచం వుండేది. అందులో వున్నప్పుడు నేనెప్పుడూ నీకు గుర్తు వుండేదాన్ని కాదు. సరే! అదొక విషయం. దాన్ని పక్కన పెడదాం.  మళ్ళీ నీ ప్రపంచంలోకి వెళ్ళిపో. నా మాట విని నువ్వు మళ్ళీ మామూలు మనిషివి అయిపో. ఇంకో విషయం చెప్పనా! నువ్వు అలా ఉంటేనే నేనిక్కడ సంతోషంగా వుంటాను. మాట వినే మొగుడు నా మొగుడని ముచ్చట పడతాను.
ఒంటరిగా ఎలా నిభాయించుకుని వస్తావో తెలవదు. అదొక్కటే నా బాధ. దానికి నేను కూడా చాలావరకు కారణం.  కానీ నీ చుట్టూ కంటికి రెప్పలా కనిపెట్టుకుని ఉంటున్న మన వాళ్ళని చూసిన తర్వాత ఆ భయం క్రమంగా తగ్గిపోతోంది.
మళ్ళీ చెబుతున్నా విను. ఇదే ఫైనల్. మళ్ళీ నా నోట ‘నువ్వొక పిచ్చివాడివి’ అనిపించకు”


నేనూ అందరిలాగే నిద్రలో అనేక కలలు కంటూ వుంటాను.
లేచిన తర్వాత ఒక్కటీ గుర్తు వుండదు. మరి ఇది ఎలా గుర్తుంది?
కల కాదా! నిజమా!! నా భ్రమా!!!

 

 

ఇంతగా భార్యను  ప్రేమించారు. చాలా గొప్ప విషయం’ అంటూ మితృలు కొనియాడుతున్నారు. ఇది కలలో కూడా నేను అంగీకరించను. ఒకవేళ నేను అలా గొప్పలు చెప్పుకుంటే నన్ను నేను మోసం చేసుకున్నట్టే.

మా ఆవిడ ప్రాణ  స్నేహితురాలు శ్రీమతి వనం గీత ఎప్పుడూ అంటుండేది. ‘నువ్వు మీ ఆయన్ని బాగా గారాబం చేసి చెడగొడుతున్నావు. అందరికీ మొగుళ్ళు లేరా! అందరూ ఇలానే మాలిమి చేస్తున్నారా! నీకు ఒంట్లో బాగా లేకపోయినా నువ్వే కాఫీ కలిపి ఆయనకు ఇవ్వాలా! వంటింట్లోకి పోయి ఓ కప్పు కాఫీ కలుపుకుని తాగలేరా, మరీ విడ్డూరం కాకపొతే!’

 

అవును. గీత గారు చెప్పింది అక్షరాలా నిజం. నన్ను చెడగొట్టి ఎందుకూ పనికిరాని ఓ మొగుడ్ని చేసింది. స్టవ్ అంటించడం కూడా రాని మొగుళ్ళ జాబితాలో చేర్చేసింది. సిగ్గు లేకుండా చెబుతున్నాను. నా బనీను సైజు కూడా నాకు తెలియదు. పొరబాటున ఏదైనా వూరు వెళ్లినప్పుడో, స్నేహితులు షాపింగ్ చేస్తున్నప్పుడు కొనుక్కున్నానా ఇక అంతే! లొడుంగు బుడుంగు. ప్యాంటు పైకి లాక్కుంటూ తిరుగుతుంటే తనే తీసుకువెళ్ళి వాటిని ఆల్టర్ చేయించేది.

 

ఇంటికి ఎవరు వచ్చినా ‘ఇదిగో ఎక్కడున్నావ్? రెండు కాఫీలు ఇస్తావా?’ అని కేక పెట్టి అడిగే పనే లేదు. వచ్చిన సమయాన్ని బట్టి, వాళ్ళు ఎవ్వరయినా సరే! కాఫీలో, టిఫిన్లో, భోజనాలో కనుక్కుని పెట్టేది. ఇన్నేళ్ళుగా ఆమె నిరంతరంగా చేస్తూ వచ్చిన సేవలను నేను ఎన్నడూ గుర్తించలేదు. ఓ మంచి మాట తనతో అన్నదీ లేదు. అందరూ అన్నపూర్ణ తల్లి అంటుంటే గర్వంగా ఫీలయ్యేవాడిని. పైగా అలా చేయడం ఆమె బాధ్యత అనుకునేవాడిని.

నేను పొద్దున్నే టీవీ షోలకు వెళ్ళాలి అంటే ఆ పాట్లేవో తనే పడేది. నాకంటే ముందే లేచి కార్న్ ఫ్లేక్స్ తయారు చేసి తినిపించి, బీపీ మాత్తర్లు ఇచ్చి పంపేది. డాక్టర్ రాసిచ్చిన ఆ మాత్ర పేరేమిటో నాకిప్పటికీ తెలవదు.

ఒక్కోసారి ‘వుండండుండండి! ఆ టీవీ వాళ్లకు ఈ చొక్కా రంగు పడదు. తీరా పోయిన తర్వాత గ్రీన్ మ్యాటో, బ్లూ మ్యాటో అని వేరే ఎవరి చొక్కానో తగిలిస్తారు. ముందే మార్చుకుని వెళ్ళండి’ అంటూ జాగ్రత్తలు చెబుతుంది. షర్ట్ గుండీలు సరిగ్గా పెట్టుకున్నానో లేదో చూసి సరిచేసేది.

అలా అన్నీ ఆమే నాకు అమర్చి పెట్టేది. కంటికి రెప్పలా కనుక్కుంటూ వుండేది. ఇంట్లో నేనొక మహారాజుని. ఆవిడ జీతం భత్యం లేని మహామంత్రి. నన్నలా మురిపెంగా, మన్ననగా, లాలనగా చూసుకుని, నా కళ్ళముందే అలా దాటిపోయింది.

ఇప్పుడు అర్ధం అవుతోంది. ఆమెను పోగొట్టుకుని కాదు, నేను ఇంతగా బాధ పడుతోంది. ఇలా చేసే మనిషి లేకుండా ఎలా బతకాలి దేవుడా అనే స్వార్ధం నా చేత ఇలా రాయిస్తోంది.

ఇది నిజంగా నా మనసులోని మాట. నిజాయితీగా చెబుతున్న నిజం.

ఇది నా జీవితం. కధకాదు.

అంచేత సాఫీగా ఎలాంటి ముడులు, ఎత్తుగడలు లేకుండా చెబుతాను.

అసలు ఇలాంటి విషయాలు మనసులో పెట్టుకోవాలి. కాగితం మీద పెట్టేవి కావనే స్పృహ లేనివాడిని కాదు. కానీ  పంచుకునే మనిషి మాయమై పోయింది.  మంచీ చెడూ చెప్పే  తోడు లేకుండా పోయింది.

పిల్లలు, కోడళ్ళ పుణ్యమా అని కరోనా కాలంలో కూడా జీవితం సాఫీగా గడిచిపోయింది. దేనికీ లోటు లేదు, ఎవరూ తీర్చలేని ఆ ఒక్క లోటు తప్ప. ఓ  ఆదివారం సామాను సదిరే కార్యక్రమంలో ఓ కపిలకట్ట బయట పడింది. అందులో ఏముంటాయో నాకు తెలుసు కాని మా అబ్బాయికి, కోడలికి తెలియదు. దాన్ని నేను పదిలంగా తీసుకుని భద్రపరచుకున్నాను. మా ఆవిడకు అదంటే ప్రాణ సమానం. మేము మాస్కో వెళ్ళినా మాతోటే వచ్చింది. తిరిగి మాతోటే ఇండియా వచ్చింది. హైదరాబాదులో ఎన్నో ఇళ్ళు మారినా అది మాత్రం తను మరచిపోకుండా వెంట తెచ్చుకునేది. అందులో బంగారం ఏమీ లేదు. బంగారం లాంటి ఉత్తరాలు ఉన్నాయి. మా పెళ్ళికి పూర్వం, యాభయ్ అయిదేళ్ళ క్రితం, రెండు మూడేళ్ళ పాటు మా మధ్య ఉత్తరాయణం నడిచింది. నేను రాసినవన్నీ ఆవిడ దగ్గర భద్రంగా వున్నాయి. తను రాసిన వాటిలో కొన్నే నా దగ్గర మిగిలాయి.

మిమ్మల్ని ఇలాంటి వ్యక్తిగత విషయాలతో విసిగించడం నా ఉద్దేశ్యం కాదు. ప్రేమించిన ఆడదాని హృదయం ఎంత గొప్పదో, అది ఎంతటి ఉదాత్తమైన ప్రేమో చెప్పడం కోసమే ఈ ప్రయత్నం.

ఆమె రాసిన వాటిల్లో అణువణువూ ప్రేమమయం. నా ఉత్తరాలు అన్నీ డాబుదర్పం.

పెళ్ళయిన తర్వాత ఎలా మెలగాలి, అత్తగారు, ఆడబిడ్డలతో ఎలా వుండాలి’ ఇలా అన్నమాట. నిజానికి అలా నిర్బంధించే అధికారం నాకేమి వుంది. ఆమె నన్ను ప్రేమిస్తోంది. నేను ఆమెను ప్రేమిస్తున్నాను. అంతే! అలాంటప్పుడు నా ఈ పేను పెత్తనం ఏమిటి? అవి చదివి ఎంత నొచ్చుకుని వుంటుంది. అయినా నన్ను పెళ్ళాడింది అంటే అది ఆమె గొప్పతనమే. ఇప్పుడు తలచుకుంటే చాలా చిన్నతనం అనిపిస్తుంది.

నన్ను మన్నించు! నన్ను క్షమించు ! అని ఎంతగా గొంతు చించుకున్నా నా మాటలు

 వినబడనంత దూరానికి వెళ్ళిపోయింది.





 

(ఇంకావుంది)

కామెంట్‌లు లేవు: