9, ఏప్రిల్ 2025, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (138) – భండారు శ్రీనివాసరావు

 అయిదే అయిదు నిమిషాల్లో కొన్న లక్ష రూపాయల నెక్లెసు

మొదటి నుంచీ మా సంసారం చిల్లు పడిన గంగాళం కాదు, ఎన్ని నీళ్ళు నింపినా జలజలా కారిపోయే వెదురు గంప.

జీతం వంద వున్నప్పుడు ఖర్చు  నూట యాభయ్ దాటేది. అయిదు వందలు చేతికి వస్తే ఆరేడు వందలు చేతులు దాటేవి.  ప్రతి నెలా ప్రావిడెంట్ ఫండ్ నుంచి ఎంతో కొంత తీసుకోవడమే. రిటైర్ అయినప్పుడు ఈ ఫండ్ నుంచి నాకు వచ్చింది ఏమీ లేదు. ఇది నా ఒక్కరికే కాదు, ఇప్పుడు డెబ్బయ్యో పడిలో పడిన ప్రతిఒక్కరికి అనుభవైకవేద్యమే.

ఇక్కడి నా మిత్రులలో అన్ని వయసుల వాళ్ళు ఉన్నప్పటికీ చాలామంది కొంచెం అటూఇటూగా నా ఈడువాళ్ళే. నా తరం వాళ్ళే. కాబట్టి మా పెంపకాల్లో, జీవన విధానాల్లో కొంచెం పోలికలు కనిపిస్తాయి. మొదటి మెట్టు మీద కాలు మోపిన దగ్గరినుంచి పడిన కష్టాలు, ఇబ్బందులు, ఇప్పుడు పై మెట్టు మీద నిలబడి చూసుకుంటూ వుంటే చాలా వింతగా వుంటుంది. నడిచి వచ్చినదారి ఇలాంటిదా అని ఆశ్చర్యం వేస్తుంది.

తెలంగాణా సీ ఎం సీపీఆర్వో గా పదేళ్లు పనిచేసిన  వనం జ్వాలా నరసింహారావు, మా అన్నయ్య భండారు రామచంద్ర రావు గారు (స్టేట్ బ్యాంక్  చీఫ్ జనరల్ మేనేజర్, రిటైర్డ్)  నేను కొద్ది సంవత్సరాల తేడాతో హైదరాబాదులో కాపురాలు పెట్టాము. ఈ విషయంలో జ్వాలా సీనియర్. ఆయన భార్య అయిన మా మేనకోడలు విజయలక్ష్మి, మా వదిన గారు విమల, మా ఆవిడ నిర్మల కలిసి చిక్కడపల్లిని కాలినడకన చుట్టబెట్టేవారు. మా అన్నయ్య అప్పటికే స్టేట్ బ్యాంకులో రీజినల్ మేనేజర్. . ఉద్యోగ రీత్యా ఎన్నో వ్యాపార సంస్థలకు రుణాలు ఇచ్చి వుంటారు.  కానీ ఆయన అశోక్ నగర్ లో తన ఇంటికి దగ్గరలో వున్న కిరాణా దుకాణంలో రెండు వందలు ఖాతా పెట్టాల్సి వస్తే, తెలిసిన వాళ్ళు ఎవరైనా చెబితే ఇస్తాను అన్నాడు ఆ దుకాణదారు. చివరికి మా పెద్ద  మేనకోడలు కూతురు చిన్నపాప   సిఫార్స్ మీద ఆ రెండు వందలు అప్పు పుట్టిందట.

మా మేనకోడలు, మా వదిన గారు అశోక్ నగర్ నుంచి నడుచుకుంటూ త్యాగరాయ గానసభ దగ్గర వున్న మా ఇంటి (అమ్మవొడి)కి వచ్చి మా ఆవిడను తీసుకుని సరుకులు కొనడానికి చిక్కడపల్లి మెయిన్ రోడ్డుకు వెళ్ళేవాళ్ళు.

ఎండ బాగా వుంటే ముగ్గురూ కలిసి ఒక రిక్షా మాట్లాడుకుని మధ్యలో మా ఆవిడను దింపేసి వాళ్ళిద్దరూ అశోక్ నగర్ వెళ్ళేవాళ్ళు.

లక్ష్మీ షో రూములో వాయిదాల మీద చీరెలు కొనుక్కునే వాళ్ళు.

ఆ రోజుల్లో లోటస్ స్టీల్ షాపులో నెలకు పది రూపాయలు చొప్పున పది నెలలు కడితే నెలకోసారి లాటరీ తీసి వంద రూపాయల స్టీలు వస్తువు ఇచ్చేవాడు. ప్రతినెలా ఆ షాపు దగ్గరికి పోవడం, బోర్డు మీద చాక్ పీసుతో రాసిన విజేతల జాబితాలో తమ నెంబరు లేకపోవడం, ఉసూరుమంటూ తిరిగి వస్తూ సుధా హోటల్లో టు బై త్రీ కాఫీ తాగడం నెలనెలా ఓ తంతుగా మారింది.

ఇంట్లో అందరి పేరు మీద కట్టినా, లాటరీ ఎప్పుడూ తగలకపోవడంతో, మా వదిన గారు ఓ నెల, మా రెండో పిల్లవాడు సంతోష్ పేరు మీద కడితే మూడో నెలలోనే లాటరీ తగిలిందట. వంద రూపాయల వస్తువు తీసుకుంటూ, మా వాడికి కూడా, పాలు పట్టడానికి ఓ స్టీలు గ్లాసు కొనిచ్చింది.

ఆ రోజుల్లో ఇలా ఇబ్బందులు అందరికీ ఉండేవి కానీ, అవి ఇబ్బందులుగా అనిపించక పోవడానికి కారణం అందరూ ఒకే బోటులో ప్రయాణీకులు కావడమేమో మరి!

నిజం చెప్పాలి అంటే 2005 డిసెంబరు  31రిటైర్ అయిన తర్వాతనే నాకు రుణ విముక్తి కలిగింది. అప్పుల బాధ తీరింది.  గ్రాట్యుయిటీ మొదలయిన రూపాల్లో చేతికి వచ్చిన  నాలుగయిదు లక్షల రూపాయలతో,  పేరుకున్న చిల్లర బాకీలు తీర్చేముందు, మళ్ళీ ఇలాంటి బంగారు అవకాశం నాకు జన్మలో రాదని, మా ఆవిడకు నా  బ్యాంకు కార్డు ఇచ్చి, ఈ మొత్తానికి మించకుండా నీ ఇష్టం వచ్చింది కొనుక్కోమని పంజాగుట్ట లోని టాటా వాళ్ళ  టైటాన్ షో రూమ్ కి తీసుకువెళ్ళాను. ఒక్క చిన్న ఉంగరం కొనుక్కుని బయటకు వచ్చింది. మిగిలిన డబ్బుతో  బాకీలు అన్నీ తీర్చేసి, ఒక్క రూపాయి అప్పు అనేది లేకుండా అరవై ఏళ్ళ వయసులో ఉద్యోగ విరమణ పర్వాన్ని ప్రారంభించాము.  

రిటైర్ కావడానికి ఏడాది ముందు ఆరు నెలలు అమెరికా వెళ్ళాం మా పెద్దవాడు సందీప్ ఉంటున్న సియాటిల్ కు. అమెరికా అని చెప్పి  ఎందుకు  వున్న సెలవులు  పాడు చేసుకుంటారు, అదీ రిటై మెంట్ ముందు. అమలాపురం వెడుతున్నాం  అని రెండు రోజులు సెలవు చీటీ పారేసి అమెరికా వెళ్ళిరండి అని శ్రేయోభిలాషుల సలహా. బిగ్ జీరోలు అలాంటి మాటలు చెవిన పెట్టరు. కదా! అంచేత రిటైర్ మెంటులో పది నెలలకు రావాల్సిన జీత భత్యాల్లో  ఆరు మాసాల సొమ్ముకు చెల్లు చీటీ స్వయంగా రాశాను.  అలా వుంటుంది జీరోలతోటి.

అక్కడ అమెరికాలో మా వాడు సందీప్, కోడలు భావన కలిసి మా ఆవిడని వెంటబెట్టుకుని బంగారం షాపింగుకి వెళ్ళారు. తీరా ఇంటికి పది జతల చెప్పులతో వచ్చారు. ‘ఎంత చెప్పినా అమ్మ వినలేదు. బంగారం మీద మోజు లేదు. మంచి చెప్పులు కొనుక్కుంటాను, మా ఫ్రెండ్స్ కి కూడా తీసుకు వెడతాను’ అంటూ మొండికేసింది అని మొత్తుకున్నాడు మా వాడు. మా ఆవిడ దగ్గర పెరుగుతున్న పక్కింటి పాపకు ఒక బంగారు గొలుసు కొనమని చెప్పిందట, కొన్నాడు.  అదేమిటో ఈ కాలపు ఆడపిల్లలకు చాలామందికి బంగారం మీద మోజున్నట్టు లేదు. మా కోడళ్ళు ఇద్దరూ ఇదే బాపతు.

నా రిటైర్ మెంటు 2005 డిసెంబరు  31 న. ఒక్క రోజు తర్వాత, 2006  జనవరి ఒకటిన  రిటైర్ అయివుంటే,  ఆ నాటినుంచి అమల్లోకి వచ్చిన కేంద్ర  పే కమిషన్ సిఫారసుల ప్రకారం నా పెన్షన్ బాగా పెరిగేది. ఉద్యోగులకు, ఉద్యోగ విరమణ చేసినవారికి  గొప్ప ప్రయోజనం కలిగించిన అలాంటి  మంచి సిఫారసులు మళ్ళీ ఈ పాతికేళ్లలో రాలేదని చెప్పుకుంటారు.  ఆ బస్సు నాకు ఒక్క రోజులో మిస్సయింది. కానీ దేవుడు కరుణామయుడు. కేంద్ర ప్రభుత్వం కామధేనువు.  పే కమిషన్ లో కొంతమందికి జరిగిన అన్యాయాన్ని సవరించి మళ్ళీ కొంత మొత్తాన్ని పట్టుకుపొమ్మని దూరదర్సన్ వాళ్ళు ఫోన్ చేశారు. అది నా డెబిట్ కార్డులో భద్రపరచుకుని, ఈ సారి పోయిన సారిలా కాకూడదని మా ఆవిడను తీసుకు పోకుండా, నా అంతట నేనే వెళ్లి డెబిట్ కార్డుపై ఒక చిన్నపాటి నెక్లెస్ లక్ష రూపాయలు పెట్టి  అయిదంటే అయిదే నిమిషాల్లో కొన్నాను. అమ్మిన అమ్మడు నా వైపు అదోలా చూసింది, అనుమానంగా. ఒక పత్రికలో పడిన చిన్నపాటి నెక్లెస్ ప్రకటనని ఒకటి రెండు సార్లు మా ఆవిడ చూడడం గతంలో నా కంటపడింది. బహుశా అదంటే ముచ్చట పడుతున్నదేమో అనిపించి  అదే కొన్నాను.  చాలా సంతోషపడింది, దాన్ని చూడగానే. ఎందుకంటే నా అంతట నేను కొనిచ్చిన మొదటి బంగారు కానుక అది.  

ఎప్పుడు చిన్నమెత్తు బంగారం కొనిపెట్టని మొగుడు ఇలా కొనడం ఆ దేవుడికి  నచ్చినట్టు లేదు. మళ్ళీ ఆసుపత్రి పాలయింది.  వాళ్ళు పరీక్షల పేరుతొ  ఆమె ఒంటిపై ఉన్న కాలి మెట్టెలతో సహా తీసి ఇచ్చారు. అంతా అయోమయంలో ఉన్నాము. ఎలా జరిగిందో తెలియదు. నేను ముచ్చటపడి కొన్న ఆ నెక్లెస్ కనిపించకుండా పోయింది. రేపో ఎల్లుండో  డిస్ చార్జ్ అనగా, నేను నా మేనకోడలు విజయలక్ష్మికి అంటే నా మిత్రుడు జ్వాలా నరసింహారావు భార్యకి ఫోన్ చేశాను. వాళ్ళిద్దరూ ప్రాణానికి ప్రాణం బాపతు.

‘ఈ సంగతి ఎవరితో అనవద్దు. జరిగిన విషయం ఇది. తను ఇంటికి వచ్చేలోగా ఆ నెక్లెస్ ఇంట్లో వుండాలి. నేను ఆసుపత్రి నుంచి మీ ఇంటికి వస్తున్నాను. ఇద్దరం కలిసి వెడదాం. అచ్చు అలాంటిదే మరోటి కొనాలి. నీ సాయం కావాలి’ అని అడిగాను. అసలే నాకు  మతిమరపు. వేరే డిజైన్ కొంటే ఇబ్బంది. పాపం తను ఒప్పుకుంది. ఇద్దరం వెళ్లాం. అదే రకం నెక్లెస్ దొరికింది. అమ్మయ్య అనుకున్నా.  నా పెన్షన్ ఖాతాలో వున్న డబ్బులు సరిపోయాయి. కధ సుఖాంతం.   

దేనికయినా ప్రాప్తం అనేది ఒకటి వుంటుంది. ‘గోదావరిలో ఎన్ని నీళ్ళు వున్నా మనం బిందె తీసుకు వెడితే బిందెడు, గిన్నె తీసుకు వెడితే గిన్నెడు. ఎంత ప్రాప్తమో అంతే!’ అనేవారు మా పెద్దన్నయ్య పర్వతాల రావు గారు. పాత నెక్లెస్ ఎలా పోయిందని ఆలోచించలేదు. ఆలోచించి ఏం లాభం? ఎవరిమీదో అనవసరమైన అభాండం వేయడం తప్ప.

ఇలా ఎన్నో! ఎన్నెన్నో! అనుభవాలు.  

కింది ఫోటో:

పెన్షన్ డబ్బులతో మొదటిసారి కొన్న నెక్లెస్ తో మా ఆవిడ నిర్మల



(ఇంకా వుంది)

1 కామెంట్‌:

Zilebi చెప్పారు...

చాలా‌ టచింగ్ గా వుందండి స్టోరీ