6, ఏప్రిల్ 2025, ఆదివారం

పండగలేని ఇంట్లో అనుకోని పండగ – భండారు శ్రీనివాసరావు

 పొద్దున్న టీవీలో  కనపడ్డ మనిషి మధ్యాన్నం ఇంటికి వచ్చారు సతీ సుత సమేతంగా.

నాదొక ఎడ్డెగొడ్డు వ్యవహారం. తిన్నగా వుండదు. తిన్నడి (భక్త కన్నప్ప)  మనస్తత్వం. పండుగ కానీ పబ్బం కానీ పొద్దున్నే లేచి స్నానం చేయాలని, దేవుడికి దీపం పెట్టాలనే ఆలోచనే రాదు. అలాగని తెల్లగా తెలవారేదాకా పడుకునే అలవాటు లేదు. తెల్లవారకముందే ఆలోచనలు చుట్టుముట్టుతాయి. ఆ తేనెటీగల గుంపు  ప్రశాంతంగా పడుకోనివ్వదు. లే! లేచి కూర్చో! రాయి అంటుంది. ఏం రాయాలి? దేన్ని గురించి రాయాలి?

ఏం తోచక టీవీ పెట్టాను. సాధారణంగా దాని జోలికి పోను. శ్రీరామ నవమి కదా! ఏమైనా కార్యక్రమాలు చూపిస్తారేమో అని ఛానల్స్ మారుస్తుంటే ఇదిగో ఈ శ్రీరాముడు కనపడ్డాడు. ఆ రాముడిలాగే లిప్తకాల దర్సనం. ఈ లోగా ఈనాటి చర్చ ముగిసిందని యాంకర్ ప్రకటన.

అప్పుడు కంప్యూటర్ ముందు కూర్చొన్నవాడిని భద్రాచలంలో రామ కళ్యాణం ముగిసేవరకు తలెత్తకుండా రాసుకుంటూనే వున్నాను.

‘రాయకపోతే చచ్చిపోతానేమో అనే భావన కలిగేంతవరకు కాగితం మీద కలం పెట్టవద్దన్నా’డో   రచయిత. పోనీలే కలం, కాగితాల కాలం కాదు కదా ! యధేచ్చగా రాసుకోవచ్చు అని నా మానాన నేను రాసుకుంటున్నాను. ఇంతలో ఫోను మోగింది.  పొద్దున్న టీవీలో కనబడ్డ శ్రీరాముడే.

‘మీరు ఇంట్లో లేరా! మీ గడప ముందే ఉన్నాము. కాలింగ్ బెల్ పనిచేయడం లేదేమో!’

అదెందుకు పనిచేయదు, పని చేయంది నా మెదడే. లేచి వెళ్లి తలుపు తీశాను.

ఎదురుగా లవ, కుశ, సీతా సమేతంగా శ్రీరాముడు మాదిరిగా  కనిపించారు ఫేస్ బుక్ మితృలు రాం (నాద్) గారు.  వెంట వారి శ్రీమతి, ఇద్దరు పిల్లలు. ఈ ఇద్దరు నా కళ్ళముందే పెరిగినట్టు అనిపిస్తుంది. ఇంతకు  ముందు కూడా చాలా సార్లు వచ్చారు. పండగ రోజున  నా అవతారం తలచుకుంటే నాకే సిగ్గు అనిపించింది. కానీ చేయగలిగింది ఏమీ లేదు. చేయగలిగిన అతిథి మర్యాదలు చేయడానికి ఇంట్లో ఆడ దక్షత లేదు. కానీ రాం నాద్ ఇలాంటివి పట్టించుకునే రకం కాదు. చాలా సేపు వున్నారు. చాలా సేపు మాట్లాడుకున్నాము.

ఆ ఇద్దరు ఆడపిల్లల్ని చూస్తేనే కడుపు నిండి పోతుంది. వాళ్ళను ఆ దంపతులు పెంచుతున్న తీరు గమనించినప్పుడు నాకు గుండెలో కలుక్కుమంటుంది. నా ఇద్దరు పిల్లల్ని కూడా ఇదే తీరున పెంచలేకపోయానే అని మనసులో ఏళ్ళుగా గూడుకట్టుకున్న బాధ తన్నుకు వస్తుంది.

నా జీవితంలో ఎదురయిన ఎన్నో బాధల్లో ఇదొక బాధ. ఇంత బాధలోనూ ఒకే ఊరట. ఇలాంటి మంచి స్నేహితులు నాకు ఇంకా మిగిలి వున్నారని. నిజానికి ఆయన ఇల్లు మా ఇంటికి దగ్గరే. అయినా ఎప్పుడూ వెళ్ళలేదు.  చాలా సార్లు రోడ్డు మీద కలిసిన పరిచయం. అయినా ఆయన ఇల్లు వెతుక్కుంటూ వచ్చి తన పిల్లలని చూపించి వెడుతుంటారు. అది ఆయన సంస్కారం.

ఈ ఆలోచన రావడంతో బాధ తుస్సుమని  ఎగిరిపోయింది.

మళ్ళీ నా రాతల్లో పడొచ్చు.  పడ్డాను కూడా.









(06-04-2025)   

      

కామెంట్‌లు లేవు: