24, ఏప్రిల్ 2025, గురువారం

అయాం ఎ బిగ్ జీరో (148) – భండారు శ్రీనివాసరావు

 వ్యాసుడు, కార్ల్ మార్క్స్ వాహ్వ్యాళి

 

మంచి రచయితలు చక్కని పాత్రికేయులు కాగలుగుతారా! మంచి జర్నలిస్టులు చక్కని రచయితలు కాగలుగుతారా! రచయితలు అందరూ పాత్రికేయులు కాలేక పోవచ్చు కానీ, జర్నలిస్టులలో చాలామంది చక్కని రచనలు చేయగలుగుతారని ఒకప్పుడు చెప్పుకునే వారు. ఇప్పుడు నడుస్తున్న సోషల్ మీడియా శకంలో ఇక ఇలాంటి ప్రశ్నలకు ఆస్కారం లేకపోవచ్చు. ఈ మాధ్యమాలలో పోస్టులు పెడుతున్న చాలామందికి జర్నలిజం నేపధ్యం లేకపోయినా సమకాలీన అంశాలపై  సవివరమైన విశ్లేషణలు చేయగలుగుతున్నారు. రచనల మీద రచయితలకు, జర్నలిజం మీద జర్నలిస్టులకు  పరంపరగా వస్తున్న గుత్తాధిపత్యానికి గండి పడే రోజులు దగ్గరలోనే వున్నాయని అనిపిస్తోంది. ఒకరకంగా  మంచిదే.   

 

ఎప్పుడో చాలా ఏళ్ళ క్రితం ఓ ఆదివారం  సాయంత్రం హైదరాబాదు ప్రెస్ క్లబ్ లో ఉషశ్రీ గారి సంస్మరణ కార్యక్రమం జరిగింది. మనసులో గట్టిగా వెళ్ళాలని అనుకున్నా, చివరికి వెళ్ళలేక పోయాను. తన కలంతో ‘కలంకారీ’ చేసే చమత్కార రచయిత శ్రీ రమణ గారిని కలవలేకపోయాను. మిత్రులు కేవీఎస్  సుబ్రహ్మణ్యం గారిని అడిగి శ్రీరమణ గారి  కాంటాక్టు నెంబరు తీసుకున్నాను. చాలా రోజులయింది, గుర్తు పడతారో లేదో అని ‘నేను, భండారు శ్రీనివాసరావును’ అని మెసేజ్ కూడా పెట్టాను.

మర్నాడు ఉదయం ఫోను మోగింది. ఏదో కొత్త నెంబరు.

‘హలో! నేను శ్రీ రమణను మాట్లాడుతున్నాను’

ఎంతో సంతోషం అనిపించింది చాలా కాలం తర్వాత ఆయన గొంతు విని.

‘ఇదేమిటి, సుబ్రహ్మణ్యం మరో నెంబరు ఇచ్చాడే’ అన్నాను.

‘అదీ నాదే! ఆఫీసు వాళ్ళు ఇచ్చింది. ఇది నా పర్సనల్’

అదీ శ్రీ రమణ అంటే! పర్సనల్ కాల్స్ పర్సనల్ ఫోన్లో  మాట్లాడాలి అనే నియమం పెట్టుకున్నారేమో తెలియదు.

చాలా చాలా విషయాలు మాట్లాడుకున్నాం. లేదు లేదు, ఆయన చెబుతూ పోయారు, నేను వింటూ పోయాను. నండూరి రామమోహన రావు గారు, పురాణం సుబ్రమణ్య శర్మ, బాపూ రమణలు, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, రావిశాస్త్రి  ఎందరెందరో మహానుభావులు, వారందరి కబుర్లు కలబోసారు. నండూరి రామమోహన రావు గారు ఆంధ్రజ్యోతి ఎడిటర్ గా వున్నప్పుడు నేను ఆయన వద్ద అయిదేళ్ళు పనిచేసాను. తరువాత ఆలిండియా రేడియోలో ఉద్యోగం కోసం హైదరాబాదు వచ్చేసాను. ఆ తర్వాతనే  శ్రీ రమణ గారు, నేను పనిచేసిన  జ్యోతిలో చేరారు. అంచేత ముకహపరిచయం లేదు.

ఉషశ్రీతో కదా మొదలు పెట్టింది.

శ్రీ రమణ గారు ఓ సంగతి చెప్పారు, మాటల మధ్య.

ఉషశ్రీ ఆధునిక భావాలు కలిగిన ఆధ్యాత్మికవేత్త. రామాయణ మహా భారతాలను కాచి వడబోసి వాటి సారాంశాన్ని రేడియో శ్రోతలకు తనదయిన బాణీలో వినిపించేవారు. వాల్మీకి రామాయణం మాదిరిగా ఉషశ్రీ రామాయణం అని చెప్పుకునేవారు.

శ్రీ రాఘవాచార్య. విశాలాంధ్ర ఎడిటర్ గా చాలా కాలం పనిచేసారు. ఒక తరం జర్నలిస్టులకు మార్గదర్శి. వామపక్ష భావజాలం నరనరాన నింపుకున్న వ్యక్తి. ఆరోగ్యం అంతగా సహకరించక పోయినా ఉషశ్రీ మీది అభిమానంతో శ్రీ రాఘవాచార్య  ఆ సమావేశానికి వచ్చారు. పత్రికల్లో చదివాను.

ఉత్తర దక్షిణ ధ్రువాల వంటి భావజాలం కలిగిన  వీరిరువురూ మంచి స్నేహితులు.

విజయవాడ రోడ్ల మీద సరదాగా కలిసి తిరుగుతున్నప్పుడు వాళ్ళని చూసి, ‘వ్యాసుడు, కార్ల్ మార్క్స్’ చెట్టాపట్టాలేసుకుని వస్తున్నట్టు వుందని జనం అనుకునేవారట!

శ్రీ రమణ చెప్పారు.

ఆయన ఒక్కరే ఇటువంటి చక్కటి కబుర్లు చెప్పగలరు. ముందే చెప్పినట్టు మంచి రచనలు చేసే మంచి జర్నలిస్టు శ్రీ రమణ. ఆయన పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది మిధునం. దాన్ని ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి గారు  అదే పేరుతో సినిమాగా తీశారు. ఆ పుస్తకాన్ని మొదటినుంచి చివరివరకు బాపూ తన  చేతిరాతతో రాసి ముద్రించిన మిధునం నవలను శ్రీ రమణ నాకు కానుకగా ఇచ్చారు.

శ్రీ రమణ గారికి  రెండు పేర్లు, అదనంగా మరో  రెండు ఇంటి పేర్లు కూడా. పుట్టినప్పుడు తలితండ్రులు పెట్టిన పేరు రాధాకృష్ణ. ఇంటి పేరు వంకమామిడి. కాలేజీ చదువులో వున్నప్పుడు, మగసంతు లేని ఆయన తాతగారు ఆయన్ని దత్తత తీసుకున్నారు. ఆ విధంగా మరో ఇంటి పేరు, అసలు పేరు  శ్రీ రమణ పరమయ్యాయి. ఆ పేరు కామరాజు రామారావు. ఈ తికమక నుంచి బయటపడడానికి ఆయన తనకు తానుగా పెట్టుకున్న మూడో పేరే శ్రీ రమణ. ఈ పేరే ఆయనకు పేరు ప్రఖ్యాతులు తెచ్చి పెట్టింది.  హాస్యాన్ని, పేరడీలను ఆదరించే తెలుగు చదువరుల దురదృష్టం, 2023లో డెబ్బయ్యవ ఏట ఆయన కాలం చేశారు.    

మంచి పాఠకులు వున్నప్పుడే మంచి రచనలు వస్తాయి. ఇందుకు ఉదాహరణ దేవినేని మధుసూదన రావు గారు. మాస్కో గురించి ఎప్పుడో దశాబ్దాల క్రితం నా బ్లాగులో నేను రాసుకున్న నా పోస్టులు చదివి వారి శ్రీమతిని వెంటబెట్టుకుని మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన విషయం నేనెప్పటికీ మరచిపోలేను. ఆయన పుస్తక ప్రియుడు. అంతే కాదు సొంత ఊరు అంటే ప్రాణం. ఉద్యోగరీత్యా  హైదరాబాదు లో ఉద్యోగం చేసినా, ఆ ఉద్యోగ పర్వం ముగిసిన వెంటనే పల్లెకు పోదాం ఛలో ఛలో అంటూ, భార్యను తీసుకుని, ముచ్చటపడి కొనుక్కున్న ఇంటిని వచ్చిన ధరకు అమ్మేసి పొలోమంటూ తమ స్వగ్రామానికి వెళ్ళిపోయారు. ఆయనలో నాకు నచ్చిన విషయం ఇదే.

'పల్లెకు పోదాం పదండిఅని నేను 2005 లో  రిటైర్ కావడానికి ముందే రాశాను. ఒక్క దేవినేని మధుసూదనరావు గారు, వారి భార్య శ్రీమతి జయశ్రీ గారు  మాత్రమే ఈ పని చేసి చూపించారు.  హైదరాబాదులో ఉద్యోగ బాధ్యతలు పూర్తి కాగానే వాళ్ల స్వగ్రామం వెళ్ళిపోయారు. పెరట్లోనే కూరగాయలు పండించుకుంటూ,   పుస్తకాలతో సాహితీ సేద్యం చేస్తూ హాయిగా వుంటున్నామని మాటల మధ్యలో చెప్పారు. చదువుల కోసమోఉద్యోగాల కోసమో బస్తీలకు వచ్చినవాళ్ళు ఇళ్లు కట్టుకుని అక్కడే సెటిలై పోకుండా,  స్వగ్రామాలకు తిరిగి వెళ్ళిపోతే బస్తీలమీద ఇంత అనవసర భారం ( జనాభానీళ్ళువాహనాలువిద్యుచ్చక్తి వగయిరా రూపంలో) పడదని నా వాదన. కానీ ఏం లాభం జీవితంలో
ఎన్నో అనుకుంటాం కొన్నే చేయగలుగుతాం.

కృష్ణాజిల్లా తెన్నేరు గ్రామానికి చెందిన దేవినేని మధుసూదనరావు మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించినప్పటికీ ఛార్టర్డ్‌ అక్కౌంటెన్సీ చదివారు. హైదరాబాద్‌లో 'ఎపి రేయాన్స్‌', 'విజయ ఎలక్ట్రికల్స్‌తదితర కంపెనీల్లో పదేళ్లపాటు ఛార్టర్డ్‌ ఎక్కౌంటెంట్‌గానూ పనిచేశారు. రిటైర్ అయిన తర్వాత,  చిన్నతనంలో తన ఉన్నతికి దోహదపడిన అంశాలను ఈ తరానికి అందించే కృషి ప్రారంభించారు. ఇందుకు ఆయన ఎంచుకున్న ఆయుధం,  విలువలు పెంచే పుస్తకాలను పంపిణీ చేయడం.

'ప్రతి తెలుగు బాలుడూ నూరు పద్యాలు నేర్చుకోవాలి. పద్యాల్లో ఉండే నీతివిలువలు జీవితానికి ఉపయోగపడడమే కాకఅతడికి తెలుగు భాషా ప్రాచీన ఔన్నత్యాన్ని తెలియజేసినవాళ్ళమవుతాం.’  అంటారు దేవినేని మధుసూదనరావు. ఊరికే మాటలు చెప్పే రకం కాదు.

 

 ‘పుస్తకాలు కొని, వాటిని స్నేహితులతో పంచుకుంటున్నా. నేనిచ్చిన పుస్తకాలను వారితో చదివింపజేయడం హాబీగా మార్చుకున్నా’ అని 2014లో  ప్రజాశక్తి  దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
2010లో మా అమ్మాయి పెళ్లి జరిగింది. ఇక్కడో కొత్త ప్రక్రియ ప్రవేశపెట్టాను. 2010లో వెలువరించిన కథల సంకలనమొకటి పెళ్లికొచ్చిన వారందరికీ పంపిణీ చేశాను. అందరూ సంతోషించారు.
2011లో విజయవాడలో నా స్నేహితుడు ఫణి ప్రసాద్‌ షష్టి పూర్తి సందర్భంగా శ్రీరమణ రచించిన 'మిథునంపుస్తకాన్ని అచ్చు వేయించి, 1500 కాపీలను అక్కడికి వచ్చిన అతిథులందరికీ పంపిణీ చేశాను. 2012లో నా స్నేహితుడు 'శాంతా బయోటెక్‌వరప్రసాద్‌రెడ్డి నూతన గృహప్రవేశం సందర్భంగా ఐదారు కథలతో సంకలనం వేయించిఅక్కడకొచ్చిన అతిథులందరికీ ఇచ్చాను. నా భార్య చెల్లెలి కుమార్తె పెళ్లి సందర్భంగా  కూడా పెళ్లిపిల్లలుజీవితానికి సంబంధించిన ఐదు కథలతో సంకలనం వేసి రెండు వేల కాపీలను పంచిపెట్టాను. దీనికి మంచి స్పందన వచ్చింది.
‘ఇక పిల్లలకు పద్యాలు నేర్పించాలనే ఉద్దేశంతో 2012 మార్చి నుంచి శతకాలు పంపిణీ చేయడం ప్రారంభించాను. ఈ రెండేళ్లలో దాదాపు 45 వేల పుస్తకాలు ('పద్య పారిజాతాలుబాలగేయాలు') పంచిపెట్టానని తన పుస్తక వితరణ గురించి ఒకింత గర్వంగా చెప్పారు మధుసూదన రావు గారు ఆ ఇంటర్వ్యూలో.  

పుస్తక దాతా సుఖీభవ!

కింది ఫోటోలు:


శ్రీ రమణ 


దేవినేని మధుసూదన రావు దంపతులు 





(ఇంకావుంది)

9 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

మీ జ్ఞాపకాలు రిపీట్ అవుతున్నాయి గానీ ఆసక్తికరంగానే ఉంటున్నాయి.

మొన్న కశ్మీరులో జరిగిన అమానుష దాడి మీద సీనియర్ పాత్రికేయుడిగా ఒక పోస్ట్ వ్రాస్తారేమో అని ఎదురు చూసాను కానీ పోస్ట్ రాలేదు. ఇప్పటికైనా వ్రాసి పోస్ట్ చేస్తే బాగుంటుందని నా మనవి.

శోచనీయమైన విషయమేమిటంటే తెలుగు బ్లాగులోకంలోని ముస్లిమ్ బ్లాగర్ లు ఎవరూ కూడా ఈ అంశంపై పోస్ట్ వ్రాసినట్లు లేదు. మౌనం అర్థాంగీకారం అనుకోవాలా ? తాము నివసిస్తున్న దేశంలో జరుగుతున్న సంఘటనల పట్ల స్పందింపు కూడా ఉండదా ? వీరినా మనం భాయీ-భాయీ అనేది ?

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

వర్తమాన రాజకీయాలు గురించి రాయనని, కాడి కింద పారేశాను అని బ్లాగు ముఖంగా ప్రకటించి, కొత్తవో, సరికొత్తవో, పాతవో, మరీ పాతవో నా సంగతులు నేనే రాసుకోవడం మొదలు పెట్టి చాలా కాలం అయింది. ఈ బిగ్ జీరోలో అలాంటివి అప్పుడప్పుడు ఏమైనా దొర్లినా అవి పాత విషయాలు. ట్రోలింగ్ కు ఆస్కారం లేని అంశాలు.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

కొత్తవి పాతవి గుదిగుచ్చి ఒకే శీర్షికతో ఒకచోట చేరుస్తున్నాను.

అజ్ఞాత చెప్పారు...

నా బ్లాగు నా యిష్టము నువ్వెవరివి‌ అడగడానికి అన్నట్టనిపిస్తోంది.

అజ్ఞాత చెప్పారు...

ఓ మీకలా అనిపించిందా. నాకైతే ప్రశ్నను తప్పించుకునే play కనిపించింది.
A typical politician way of answering a question without answering the actual question, with a small hint of not interested in controversial topics :)

అజ్ఞాత చెప్పారు...

జిలేబి , శర్మ గార్లు ఏమైపోయారు.. పెహల్గావ్ దాడుల తర్వాత

అజ్ఞాత చెప్పారు...

మాలిక మూత పడిందని వాళ్ళూ పడకేసారేమో ..

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

అజ్ఞాత గారు 2015 లో ఎక్కడ వున్నారు : అప్పుడు కూడా అజ్ఞాతంలోనే వున్నారా! పారిస్ ఘటన సమయంలో రాసింది చదవలేదా! ఇప్పుడు చదవండి : " అయితే ఇవన్నీ షరా మామూలు ప్రకటనలుగా మిగిలిపోకూడదు. ఉగ్రవాదం ఒక దేశాన్ని బలహీన పరచడం తమకు రాజకీయంగా మంచిదే అని అనేక దేశాలు తలపోస్తూ వుండడం అంతగోప్యమేమీ కాదు. తమ ప్రత్యర్ధి దేశం ఉగ్రవాదపు కబంధ హస్తాలలో నలిగిపోవడం కొందరికి కొంత ఉపశమనం కలిగించవచ్చు. కానీ అది తాత్కాలికమే. పెంచి పోషించే ఉగ్రవాద భూతానికి కృతజ్ఞత ఉంటుందని ఆశించడం అత్యాశే అని అనేకదేశాల విషయంలో పలుమార్లు రుజువయింది. ఎందుకంటే ఉగ్రవాద ఉన్మాదులకు వివేచన పూజ్యం. వారికి తలకెక్కిన తలతిక్క మినహా మరేదీ తలకెక్కదు. నాశనం వినాశనం అనే రెండు పదాలే తప్ప వారికి శాంతి వచనాలు తెలవ్వు. చంపు, లేదా చచ్చిపో అనే రెండే రెండు వంటబట్టించుకున్న మరమనుషుల వంటి వాళ్ళు ఈ ఉగ్రవాదులు.
ఈ ఉగ్రవాదుల బలం అవతలి వాళ్ళలోని చావు భయం. చావు భయం లేకపోవడం వారికున్న మరో బలం.సంఖ్యాబలం రీత్యా చూస్తే అత్యంత బలహీనులయిన వీరు ఇంతగా రెచ్చిపోవడానికి ప్రధాన కారణం, వారిని ఎదురించాల్సిన శక్తులకు ఐకమత్యం లేకపోవడం.
ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాదులు జెడలు విదిల్చినా వీరందరూ గళం కలిపి చెప్పే మాట ఒక్కటే. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచి వేస్తామని. కానీ కార్యాచరణ శూన్యం.
అధిక సంఖ్యలో వున్న మంచి వారి మౌనమే అల్పసంఖ్యలో వున్న ఉగ్రవాదుల బలం. కలిసికట్టుగా అందరూ కృషి చేస్తే ఉగ్రవాద భూతాన్ని ప్రపంచం నుంచి తరిమివేయడం అంత అసాధ్యమేమీ కాదు. కానీ ఈ విషయంలో ఎవరి ఆలోచనలు వారివి. ఎవరి స్వార్ధాలు వారివి.
వీటి నుంచి ప్రపంచ దేశాలు బయట పడనంత వరకు ఉగ్రవాదులు ఇలా తోకలు ఝాడిస్తూనే వుంటారు.
అదే జరుగుతోంది. అందులో మరో అంకమే పారిస్ ఘటనలు.
(14-11-2015)

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

వీలుంటే ఇది కూడా చదవండి మీరింకా మర్యాదగా ట్రోల్ చేశారు. పేస్ బుక్ లో భయంకరంగా వుంటాయి. ఈ వయసులో కావాల్సింది మన శాంతి. బాగా రాశాడు అనే పొగడ్తలు కావు : " https://bhandarusrinivasarao.blogspot.com/2019/02/blog-post_17.html#google_vignette