20, ఆగస్టు 2021, శుక్రవారం

అమ్మకు ఏదిష్టం? – భండారు శ్రీనివాసరావు

 కాలం మన చేతిలో వుండదు. చూస్తూ ఉండగానే మా ఆవిడ రెండో ఆబ్దీకం వచ్చింది.

మూడు కూరలు, మూడు పచ్చళ్ళు జాబితా రాస్తున్నప్పుడు ఆమెకి ఇష్టం అయిన కూరో, స్వీటో చేయిస్తే బాగుంటుంది అని ఓ సలహా.

ఆమెకి ఏమిష్టం అన్న ప్రశ్నకు నా దగ్గర జవాబు లేదు. నా ఇష్టాలే తన ఇష్టంగా బతికింది. ఆమెకేది ఇష్టమో  నేను తెలుసుకునే తీరిక, ఓపిక నాకు ఎక్కడిది?

అమ్మకు నేనంటే ఇష్టం అని మనసులో మాట చెప్పాలని అనిపించింది. కానీ గుండెలో మొదలయిన ఆ మాటను గొంతులోనే నొక్కేసాను.

పనసుపొట్టు కూర, దబ్బకాయ పులుసు, ఐస్ క్రీం. ఇలా అనేక సూచనలు. వీటిమధ్య కర్ణపేయంగా వినబడింది ఓ మాట.

‘అర్ధరాత్రి అయినా, అపరాత్రి అయినా ఇంటికి వచ్చినవాళ్లు ఎంతమంది అనిచూసుకోకుండా అప్పటికప్పుడు వంట చేసి పెట్టడం’

ఇది అందరికీ నచ్చింది.

కొడుకు సంతోష్, కోడలు నిషా ఈ బాధ్యత నెత్తికి ఎత్తుకున్నారు.

మా ఆవిడ క్రమం తప్పకుండా వెళ్ళే మా ఇంటికి దగ్గరలోని  ఓ దేవాలయాన్ని సంప్రదించారు. డబ్బు చెల్లించి ఓ అయిదు వందల మందికి అన్న వితరణ ఏర్పాటు చేశారు.

ఈ కరోనా కాలంలో పిలవకుండా ఎవరు వస్తారని అనుకున్నాను. రెండు రోజుల ముందే ఆ గుడిలో పలానా వ్యక్తి సంస్మరణలో అన్నదానం అని బోర్డు పెట్టారుట. మా చుట్టుపక్కల అపార్ట్ మెంట్లలో వుండే పెద్దపెద్ద వాళ్ళు కూడా వచ్చారు. ఈ లొకాలిటీలో నన్ను తెలిసిన వాళ్ళు అరుదు. ఆమెకి ఇంతమందితెలుసా! ఇంతమందికి ఆమె తెలుసా! అన్న సంగతి అప్పుడే తెలిసింది.

మా రెండో అన్నయ్య భండారు రామచంద్రరావుగారు  ఎనభయ్యో పడిలో కూడా, కరోనాని కూడా లెక్క చేయకుండా చనిపోయిన మరదలి మీద, నా మీద  ప్రేమాభిమానాలతో వచ్చి నిలబడి వడ్డన చేశాడు. నాకది ఎంతో అపూర్వంగా  అనిపించింది.

మనిషి ఎలాటివాడు అన్నది అతడు చనిపోయిన తర్వాత తెలుస్తుంది అంటారు.

భార్యను చూసి మొగుడు గర్వపడే అవకాశం నాకు ఇచ్చి వెళ్ళిపోయింది మా ఆవిడ.(20-08-2021)            

1 కామెంట్‌:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఆమె మెచ్చుకునే కార్యక్రమం చేశారు 👏.
చాలా ఇళ్ళల్లో సమస్య ఏమిటంటే తల్లితండ్రులు, అలాగే
భాగస్వామి … బతికున్నప్పుడు వాళ్ళకిష్టమైనదేమిటో కనుక్కునే ప్రయత్నంగానీ పరిశీలన (observation) గానీ జరగడం అరుదు. పైగా తల్లుల్లో ఉన్న పెద్ద “దుర్గుణం” ఏమిటంటే ఎప్భుడూ ఎదుటివాళ్ళకు ఇష్టమైనవి చేసి పెట్టడడమే కానీ తమకిష్టమైనవి వండుకోవడం చెయ్యరు. దాని వల్ల కూడా వాళ్ళ ఇష్టాయిష్టాలు కుటుంబానికి తెలిసి రావడం కష్టం అవుతుంది too late అయిపోయేటంత వరకు.

ఇప్పుడు మీ పోస్ట్ చదువుతుంటే ఉన్నట్లుండి మంచి పాయింటు తట్టింది. ఇంకా టైముండగానే భార్యాభర్తలిరువురూ తమ తమ ఇష్టమైన ఆహారపదార్థాల లిస్ట్ తయారు చేసి ఒకరికొకరికి ప్లస్ పిల్లలకు కూడా ఇచ్చేస్తే మంచిది కదా? అలాగే ఆ ముగ్గురు పూర్వీకుల పేర్ల లిస్ట్ కూడా.