13, ఆగస్టు 2021, శుక్రవారం

అతడు – ఆమె - ఆవిడ

 ఓసారెళ్ళి ఆవిడ్ని చూసిరండి. ఒకటే కబుర్లు చేస్తోంది.’

ఆఫీసు నుంచి ఇంటికి వచ్చి సైకిల్ స్టాండ్ వేస్తున్న శంకరం కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. భార్య నోటి వెంట ‘ఆవిడ’ ప్రస్తావన రావడం ఈ అయిదేళ్ళలో ఇదే మొదటిసారి.

పెళ్ళయిన నాటి నుంచీ ఇదే తంతు.

'నేను మీ జీవితంలోకి వచ్చాను. అంతే. ఇక ఆవిడ ప్రస్తావన మన మధ్య రావడానికి వీల్లేదు’ దాదాపు హుకుం జారీ చేసింది.

మొదటి రాత్రే తనంటే ఏమిటో స్పష్టంగా తెలియచెప్పింది. కాస్త వయసు మీదపడ్డ తరువాత పెళ్లి చేసుకుంటే ఇంతేనేమో. తానూ అప్పటినుంచి కుక్కిన పేను మాదిరిగానే పడివుంటున్నాడు, 'భార్య గీసిన గీత దాటడు' అనే పేరు బయట మారుమోగుతోందని తెలిసినా.

ఇక, ఇంట్లోఆవిడ’ ప్రసక్తి తేనంతవరకు, రానంతవరకు భార్య తనని పల్లెత్తు మాట అనదు. పొరబాటున వచ్చిందంటే చాలు ఇక తన మాట వినదు.

ఏమిటో ఈ ఆడవాళ్ళు. మరో ఆడదాని మాట మొగుడి నోట వెంట 'వినాల'ని కూడా అనుకోరు.

ఇంతకీ శంకరం భార్య మొగుడ్ని వెళ్ళి చూసిరమ్మని చెప్పిన ‘ఆవిడ' ఎవరో కాదు, శంకరాన్ని నవమాసాలు మోసి కని పెంచిన అతడి కన్నతల్లి. పదిహేనేళ్ళ క్రితం తండ్రి చనిపోయిన నాటి నుంచి తన బాగోగులు చూస్తూ తను ఒక ఇంటివాడు అయ్యేంతవరకు కనిపెట్టుకుని చూసిన మనిషి. పెళ్ళయిన మరుసటి నెలలోనే, కోడలి దాష్టీకం పుణ్యమా అని ఇల్లు వొదిలి పెట్టి పరాయి ఇంట్లో తలదాచుకుంటూ, ‘వంటలమ్మగా’ రోజులు వెళ్లమారుస్తోంది.

భార్యే స్వయంగా చూసి రమ్మని చెప్పడంతో ఇక శంకరం ఆఘమేఘాలమీద తల్లి దగ్గర వాలిపోయాడు. తనకోసమే కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నట్టు వుంది. కానీ ఆ తల్లి కళ్ళల్లో కొడుకుని చూసిన తృప్తే తప్ప జీవం లేదు.

'నీతో కలిసి భోంచేయాలని వుందిరా శంకరం. నీకు అంత తీరుబడిఉందా? వెంటనే వెళ్ళాలా!' అని అడిగింది. పర్మిషన్ తీసుకునే వచ్చాడు కనుక 'దానికేముందమ్మా! అన్నం తినడమే కాదు ఈరోజంతా నీతో కలిసేవుంటాను' అనేసాడు. ఆ తల్లి తబ్బిబ్బయింది. తత్తరపాటుతో లేచి వెళ్లి వంట మొదలు పెట్టింది. శంకరం కూడా పక్కనే పీట వేసుకు కూర్చున్నాడు. ఆవిడ ఒక పక్క వంట చేస్తూనే శంకరం చిన్నతనపు అల్లరి గురించీ, తిండి అలవాట్లు గురించి గుర్తుచేసుకోవడం మొదలుపెట్టింది. ఆ కబుర్లు వింటుంటే చిన్నప్పుడు తల్లిని ఎంతగా ప్రాణాలు కొరుక్కు తినేవాడో అ విషయాలన్నీ కన్నీటిపొర తెరలా కమ్మిన కళ్ళల్లో గిర్రున తిరిగాయి.

ఇద్దరూ కలిసి అన్నం తిన్నారు. తిన్నంత సేపూ తనివితీరా కబుర్లు చెప్పుకున్నారు. పాత సంగతులు గుర్తుచేసుకున్నారు. కానీ ఆవిడ పొరబాటున కూడా 'ఆమె' ప్రసక్తి తీసుకురాలేదు.

బయలుదేరేటప్పుడు ఒక మూట చేతిలో పెట్టింది. ఇంటికి చేరగానే ఆ మూటను భార్య చేతిలో పెట్టాడు. ఆమె విసురుగా దాన్ని అటక మీదకు గిరవాటు వేసింది.

రోజులు గడిచాయి. మళ్ళీ కబురు. కానీ ఈసారి ఆవిడ నుంచి కాదు. ఆవిడ వంటలు చేసిపెట్టే వారినుంచి.

'అంతా అయిపొయింది. ఇన్నేళ్ళు మా ఇంట్లో వంటలు చేసి పెడుతోంది కానీ ఆవిడ ఎవ్వరో, ఎవరి తాలూకో కూడా తెలియదు. మొత్తం మీద మీ చిరునామా కనుక్కునేసరికి ఇన్నాళ్ళు పట్టింది. అనాధ శవాలకు అంతిమ సంస్కారాలు చేసే ఒక సంస్థ వారు ఆపని పూర్తిచేశారు'

శంకరం బావురుమన్నాడు. ఇంటివారు కబురుచేసిన దానిప్రకారం తల్లితో కలిసి భోంచేసిన రాత్రే ఆవిడ కన్ను మూసింది. భార్యకు ఇచ్చిన మూట జ్ఞాపకం వచ్చి అటక మీద నుంచి తీసి చూశాడు. తల్లికి పుట్టింటివాళ్ళు పెట్టిన నాలుగు బంగారు గాజులు, వొంటిపేట చంద్రహారం అందులో వున్నాయి. వాటితో పాటే ఓ చీటీ.

'ఒరేయ్ శంకరం. నువ్వు పెళ్లి చేసుకుని కోడల్ని తీసుకురాగానే ఇవి ఇద్దామనుకున్నాను. ఇల్లు వొదిలి రావడం వల్ల కుదరలేదు. తరువాత ఇద్దామని ఎన్నోసార్లు అనిపించినా మళ్ళీ దేనికోసమో ఆరాటపడుతోంది అని అనిపించుకోవడం ఇష్టం లేక ఆ ఉద్దేశ్యం మానుకున్నాను. నా తరువాత ఇవన్నీ కోడలికే దక్కాలి. మనసులో ఏవీ పెట్టుకోకుండా తీసుకోమని చెప్పు. నేను ఇక ఎన్నో రోజులు బతుకుతానని అనుకోను. నిన్ను చూసాక ఇక నా ఆఖరి కోరిక కూడా తీరిపోయింది'

శంకరం ఆశ్చర్యంతో ఏడుపు ఆపేసాడు.

మరొకరు ఆ గదిలో రోదిస్తున్న ధ్వని సన్నగా వినబడుతోంది.

కామెంట్‌లు లేవు: