4, ఆగస్టు 2021, బుధవారం

జర్నలిష్టులతో జర జాగ్రత్త - భండారు శ్రీనివాసరావు

 

(సుప్రసిద్ధ పాత్రికేయులు, కీర్తిశేషులు ఆర్.జే. రాజేంద్రప్రసాద్ ' డేట్ లైన్ ఆంధ్ర', 'వీచిన ప్రాంతీయ పవనాలు' అనే పేరుతొ రాసిన రెండు పుస్తకాలు, కొన్ని దశాబ్దాల రాష్ట్ర రాజకీయాలను మన కళ్ళముందు వుంచుతాయి. హైదరాబాద్ హిందూ ఎడిషన్ రెసిడెంటు ఎడిటర్ గా, ఆ పత్రిక న్యూస్ బ్యూరో చీఫ్ గా గడించిన అనేక సంవత్సరాల అనుభవంతో రాసిన ఈ పుస్తకాల్లో ఒక నిబద్ధత కలిగిన పాత్రికేయ దృక్కోణం కానవస్తుంది. ఈ గ్రంధాలలోనుంచి కొన్ని ఆసక్తికరమైన భాగాలు)

డాక్టర్ చెన్నారెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు (కాంగ్రెస్ పార్టీలో) అసమ్మతి కార్యకలాపాలు ఉధృతంగా ఉండేవి. తనను అభిమానించే అనుచరులతో తన గదిలో కూర్చుని వాళ్ళతో జోకులు వేస్తూ కాలాన్నే మరచిపోయేవారు. ఆయనను చూడడానికి వచ్చిన జనం బయట కిక్కిరిసి వుండేవారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉప కార్యదర్శి తనని చూడడానికి వస్తే ప్రధాన కార్యదర్శిని ఉడికించడానికా అన్నట్టు ఆయన్ని బయట వెయిట్ చేయించి ముందు ఆయన జూనియర్ అయిన ఉప కార్యదర్శిని లోపలకు రమ్మనేవారు.

“ 1978 లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు కేంద్రంలో ఇందిరాగాంధి అధికారంలో లేరు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఐ) తన ఆర్ధిక అవసరాలకోసం ఆంధ్రప్రదేశ్, కర్నాటకల్లోని కాంగ్రెస్(ఐ) ప్రభుత్వాలపై ఆధారపడింది. చెన్నారెడ్డి క్రమం తప్పకుండా ఢిల్లీకి డబ్బు పంపేవారు. దీనివల్ల ఆయనకూ చెడ్డపేరు వచ్చింది. (చెడు వార్తలు రాకుండా) పత్రికలను మేనేజ్ చేసేందుకు అనేకులు రంగంలోకి దిగారు. మంత్రి సరోజినీ పుల్లారెడ్డి సచివాలయంలోని ప్రెస్ రూముకు వచ్చి’విలేకరులు క్యాంటీన్ లో డబ్బు పెట్టి కాఫీ తాగడం ఏమిటి’ అంటూ ‘విలేకరులకు రోజూ అతిధిమర్యాదలు జరగాల’ని ఆదేశించారు. (పనిచేసే) విలేకరులు సంబరపడిపోలేదు కాని, గుర్తింపు పత్రాలు వుండి యే పత్రికకు వార్తలు రాయని జర్నలిస్టులు మాత్రం మంత్రి ఔదార్యాన్ని వాడుకున్నారు.

ఇలా వుండగా ఢిల్లీ నుంచి సండే మ్యాగజైన్ విలేకరి చెన్నారెడ్డి గారిపై వ్యాసం రాయడానికి హైదరాబాదు వచ్చారు. అతిధి గృహంలో బస, తిరగడానికి కారు, తోడుగా ఒక అధికారి ఇలా నాలుగు రోజులపాటు రాష్ట్రంలో విలాసవంతంగా తిరిగి, ముఖ్యమంత్రిని ఇంటర్వ్యూ చేసి ఆయన గారు ఢిల్లీ వెళ్ళిపోయారు. ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచెత్తే వార్త ఆదివారం నాడు ఆ పత్రికలో వస్తుందని అంతా అనుకున్నారు. అన్నట్టుగానే ఆ పత్రికలో వార్త వచ్చింది. కానీ అనుకున్నట్టుగా రాలేదు. ముఖచిత్రంపై చెన్నారెడ్డి ఫోటో వేసి ‘చెన్నారెడ్డి! మోస్ట్ కరప్ట్ సీఎం!’ అని శీర్షిక పెట్టారు. వ్యాసరచయిత తాను హైదరాబాదులో విమానాశ్రయం నుంచి ఆటోరిక్షాలో ఓ మధ్యతరగతి హోటల్ కు వెళ్లానని, డ్రైవర్ మీటర్ పై అయిదు రూపాయలు అదనంగా డిమాండ్ చేసాడని, అదేమిటని అడిగితె ముఖ్యమంత్రికి తాను కమీషన్ ఇవ్వాలని చెప్పాడని పత్రికలో రాసాడు.”

 

కామెంట్‌లు లేవు: