13, ఆగస్టు 2021, శుక్రవారం

జయాలకు అపజయం లేదు – భండారు శ్రీనివాసరావు

(గురువారం నాడు శ్రీహరికోట నుంచి  ఇస్రో  ప్రయోగించిన జి.ఎస్.ఎల్.వి. ఎఫ్.10 వైఫల్యం గురించిన వార్తలు విన్నప్పుడు  గుర్తుకువచ్చిన పాత సంగతి)

1987, మార్చి నెల

ASLV-1 ప్రయోగానికి శ్రీహరికోటలో సర్వం సిద్ధం అయింది. 31 గంటల కౌంట్ డౌన్ కూడా పూర్తయింది. అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధి, గవర్నర్ కుముద్ బెన్ జోషి, ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, ఇస్రో చైర్మన్ డాక్టర్ యు.ఆర్.రావు రెండతస్తుల మిషన్ కంట్రోల్ రూమ్ టెర్రేస్ మీద నుంచి రాకెట్ ప్రయోగాన్ని వీక్షించడానికి ఆసీనులయివున్నారు. భారత దేశానికి గర్వకారణం కాగల ఈ ప్రయోగాన్ని కళ్ళారా చూడడానికి సుమారు పదివేలమంది ప్రేక్షకుల గేలరీలో వేచి వున్నారు.

అనుకున్న సమయానికి రాకెట్ ప్రయోగించారు. నిప్పులు చిమ్ముతూ రాకెట్ గగనంలోకి దూసుకుపోయింది. రాకెట్ పైకి లేస్తుండగానే వారందరూ ఒకరికొకరు అభివాదాలు తెలుపుకుంటూ, కరచాలనాలు చేసుకుంటూ ఉద్విగ్నంగావున్న సమయంలో జరగరానిది జరిగిపోయింది. ప్రయోగించి నిమిషం కూడా గడవకముందే రాకెట్ బంగాళాఖాతంలో కూలిపోయింది. ఒక్క లిప్తపాటు భయంకర నిశ్శబ్దం. అందరి మొహాల్లో ఆనందం తప్పుకుంది. విషాదం అలముకుంది.

రాజీవ్ గాంధి అందరికంటే ముందు తేరుకున్నారు. ఇస్రో అధికారులను, సిబ్బందిని అనునయించారు. ఇటువంటి శాస్త్రీయ ప్రయోగాలలో విజయాలే తప్ప, అపజయాలు ఉండవన్నారు. ముందుకు దూసుకుపోవడానికి ఇదొక అవకాశంగా భావించాలని ధైర్యం చెప్పారు.

అలా పోగుపడిన ధైర్యమే ఈనాడు ఇస్రో బృందాన్ని ప్రపంచ రికార్డు సొంతం చేసుకునేలా చేసింది.

అక్షరాలా నూట నాలుగు ఉపగ్రహాలను ఏక కాలంలో అంతరిక్షంలోకి పంపేలా చేయగలిగింది.

నిజమే. అంతకు ముందు తెలియని విషయాలను కనుగొనేముందు ఎన్ని అపజయాలు ఎదురయినా శాస్త్రవేత్తలు వెనక్కి తగ్గక పోవడం వల్లనే ఈనాడు ప్రపంచానికి ఇన్ని శాస్త్రీయ పరిశోధనల ఫలితాలు అందుతున్నాయి. మొదటి వైఫల్యానికే చతికిల పడివుంటే ఇప్పుడూ అక్కడే వుండేవాళ్ళం.

కాబట్టి గురువారం ప్రయోగం విఫలం అయిందని కుంగిపోనక్కరలేదు. ఆ వైఫల్యం మరో ఘన విజయానికి  సోపానం కావాలని కోరుకుందాం!(Image Courtesy ISRO)


(13-08-2021)

3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

బ్లాగు ఆస్థాన జ్యోతిషీ గారు చెప్పినది చదవలేదాండీ? ముహుర్తం మంచిది కాదు. జ్యోతిషీ గార్ని అడక్కుండా ముహుర్తం పెట్టారు లాంచ్ కి. ఆయన్ని అడక్కుండా చేయడం మొదటి తప్పు. టెక్నాలజీ మన ఇండియాది ఎప్పుడు ఫెయిల్ అని తెలుసుకోకపోవడం రెండో తప్పు. తప్పులేకుండా ఒప్పురాదని తెలియకపోవడం మూడో తప్పు.

అసలు ఇవన్నీ మీరు బ్లాగులో రాసి - అదీ జ్యోతిషీగారి బ్లాగు చదవకుండా, వివరాలు తెలుసుకోకుండా - తప్పులు ఫర్వాలేదులే అనడం అన్నింటికన్నా పెద్ద తప్పు. లెంపలు వేసుకుని గుంజీలు తీసు జ్యోతిషీ గార్ని క్షమాపణలు అడగండి లేకపోతే ఆయన మూడో కన్ను తెరిచి మిమ్మల్ని భస్మీపటలం చేయగలరు. సమయం మించిపోతోంది, త్వరపడండి.

bonagiri చెప్పారు...

ఇస్రో వాళ్ళు కౌంట్ డౌన్ మొదలెట్టిన వెంటనే చెప్పి ఉంటే బాగుండేది.

Chiru Dreams చెప్పారు...

వారు అన్నీ ఐపొయ్యాకే చెబుతారు. వారి పుస్తకాల్లో ముందే ఏమీ కనపడవ్. వినపడవ్.