9, డిసెంబర్ 2016, శుక్రవారం

రేపు లేదురా! ఈరోజు మనదిరా!

“రేడియోవాళ్ళు  నీకెంత జీతం ఇస్తారు?” ఆయన అడిగిన ప్రశ్న ఇది.
బేసిక్ 325, ఇతర అలవెన్సులు అదనం అని మాత్రం వుంది నాకొచ్చిన నియామక పత్రంలో.
1975లో ఆంధ్రజ్యోతిలో నా నెల జీతం అక్షరాలా నూట డెబ్బయి అయిదు. అప్పటికి అయిదేళ్ళు అయింది అక్కడ చేరి.
భత్యాలుగా వచ్చేది ఎంతో తెలియకపోయినా  నికరంగా 325 వస్తున్నప్పుడు ఆలోచన ఎందుకు” అంటూ ప్రోత్సహించాడు సహోద్యోగి ఎల్వీ రమణ, ‘ఓ వందా రెండువందలకోసం హైదరాబాదు దాకా పోవడం అవసరమా’ అనే నా మీమాంస గమనించి.
హైదరాబాదు వెళ్ళాలనే నిర్ణయం ఖరారు అయింది. కానీ చిల్లర మల్లర అప్పులు తీర్చి వెళ్ళాలి కదా! దానికోసం ఒక పెద్ద అప్పు చేయాలి కదా!
అప్పుడు గుర్తొచ్చాడు మా కుటుంబంలో ఒక పెద్దాయన. చిన్నా పెద్దా అందరికీ ఆయన మామయ్యే. చంద్రం మామయ్య. ఎలిమెంటరీ స్కూలు టీచరుగా పాతికేళ్ళ క్రితం  రిటైరయి నెలకు ఎనభయ్ రూపాయలు పించను పుచ్చుకుంటున్నాడు. కొంత భూమీ పుట్రా వుంది. దాని మీద అయివేజు, పించను డబ్బులు కలిపి పొదంగా, ఏ చీకూ చింతా లేకుండా  జీవితం గడుపుతున్న పెద్దమనిషి ఆయన. నిక్కచ్చిగా వ్యవహారం చేసే తత్వం కాబట్టి నికరంగా ఎంతో కొంత రొక్కం చేతిలో వుండేవుంటుంది. అందుకే ఆయన గుర్తు వచ్చాడు.
వెంటనే బస్సెక్కి పెనుగంచి ప్రోలు వెళ్లాను. వెళ్లి కలిశాను. కలిసి ఓ వెయ్యి రూపాయలు సర్దమని అడిగాను. అప్పుడు ఆయన అడిగిన మొదటి ప్రశ్నఇది.
“రేడియో వాళ్ళు నీకెంత జీతం ఇస్తారు?”      
“ఖచ్చితంగా తెలియదు కానీ, 325 మాత్రం నికరం.” నా జవాబు.
అప్పుడాయన నాకు జీవితానికి సరిపడే భగవద్గీత చెప్పాడు. అది ఆచరిస్తే జీవితపు చరమాంకంలో అందరూ ఆయనలాగే నిశ్చింతగా కాలం గడిపే వాళ్ళేమో అని అనిపిస్తుంది ఇప్పుడు.
“ఒరేయ్ సన్నాసీ. (ఆయన అందర్నీ అలాగే పిలుస్తాడు) నేను చెప్పేది కాస్త గుర్తు పెట్టుకో. అలవెన్సులూ అవీ కలిపి నీకు అయిదు వందలు వస్తుందనుకుందాం. అందులో 499 ఖర్చు పెట్టుకో. పరవాలేదు, సుఖపడతావు. అయిదు వందలూ తగలేయి. సుఖపడక పోయినా కష్ట పడవు. వచ్చేది అయిదు వందలు అయితే, ఒక్క రూపాయే కదా అని 501  ఖర్చు పెట్టావు అనుకో. ఇంతే సంగతులు. నిన్ను దేవుడు కూడా కాపాడలేడు. ఆదాయాన్ని మించి చేసే ఆ ఒక్క రూపాయి ఖర్చయినా, అప్పయినా, జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో  వందలు, వేరుగా పెరిగి నీ మెడకు చుట్టుకుంటుంది. మెడలోతు గోతిలో పడతావు సుమా!”
ఇలాంటి మాటలు చెవికెక్కే వయసు కాదు నాది. పైగా అవన్నీ చాదస్తం మాటలు అని కొట్టిపారేసే వయసు.
చంద్రం మామయ్య  నేను అడిగిన చేబదులు సర్దుబాటు చేసాడా అన్నది కాదు ప్రశ్న. చివరికి  ఆయన చెప్పినట్టే జరిగిందన్నది నా జవాబు.    

తత్వం బోధపడే వేళకు అనుభవం వస్తుంది. కానీ ఏం లాభం?

2 కామెంట్‌లు:

Arun చెప్పారు...

మంచి జీవిత సత్యం చెప్పారు శ్రీనివాసరావు గారు. గరికిపాటి గారు ఆంధ్ర మహాభారతం శాంతి పర్వం భీష్మ-ధర్మజ సంవాదంలో ఇదే నిజాన్ని భీష్ముని నోటి వెంట చెప్పించారు.


కంభంపాడు తో మా అనుబంధం ఈరోజు తెగిపోయింది, మా అమ్మమ్మ ఈరోజు ఉదయం 9 గంటలకు కొత్తగూడెంలో స్వర్గస్తులయ్యారు. మీ బ్లాగ్ తెరిచినప్పుడల్లా మా అమ్మమ్మ తాతయ్యే గుర్తుకొచ్చేవాళ్ళు. ఇకమీదట వాళ్ళ జ్ఞాపకాలే గుర్తొస్తాయి

Unknown చెప్పారు...

చాల బాగా చెప్పారు