23, డిసెంబర్ 2016, శుక్రవారం

కేసీఆర్ కర్తృత్వంలో పేదవాడి గృహప్రవేశం


  
  
మార్గశిర మాసం, కృష్ణ పక్షం, దశమి, శుక్రవారం.
తెలంగాణలో కొత్త బంగారు లోకం ఆవిష్కృతమైంది. నివేశన స్థలం, పూరి పాక, పక్కా ఇల్లు ఇలా కాలానుగుణంగా రూపాలు మార్చుకుంటూ వస్తున్న పేదవారి ఇల్లు, ముఖ్యమంత్రి కేసీఆర్ పుణ్యమా అని సంపన్నులు సయితం అసూయపడేరీతిలో రెండు పడక గదుల గృహంగా రూపాంతరం చెందింది. ఎర్రవల్లి, నరసన్నపేట గ్రామాలు సామూహిక గృహప్రవేశాలతో పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. స్వర్ణ శోభిత తెలంగాణాను కళ్ళముందు నిలిపాయి.విలేకరిగా ఉత్సాహం కొద్దీ ముహూర్త సమయానికి  ఎర్రవల్లి  వెళ్లాను. ఈరోజుల్లో ప్రభుత్వ కార్యక్రమాలు  ముఖ్యంగా ముఖ్యమంత్రి పాల్గొనే సభలు, సమావేశాలు అంటే ఆ హంగూ, ఆ ఆర్భాటమే వేరు. నిజానికి డబల్ బెడ్ రూమ్ పధకం కేసీఆర్ ప్రాధాన్యతా పధకాల్లో ఒకటి. అయినా సభ చాలా చాలా నిరాడంబరంగా జరిగింది. కళ్ళు మిరుమిట్లు గొలిపే ఏర్పాట్లు ఏవీ లేవు. లోగడ కొత్త జిల్లాల ప్రారంభోత్సవం అప్పుడు కూడా ఇంతే. హడావిడి తక్కువ. బహుశా ఇది కేసీఆర్ స్పెషాలిటీ కాబోలు. ఆయన వేదిక దిగి వస్తుంటే చిన్న సందు వంటి దారిలో నేనూ, జ్వాలా నిలబడి ఉన్నాము. మంత్రులతో పాటు నడిచివస్తున్న ముఖ్యమంత్రికి  జ్వాలా నన్ను పలానా అని   పరిచయం చేసారు. ‘ఆయన తెలియకపోవడం ఏమిటి’ , అంటూనే  నాతొ కరచాలనం చేసిన  తరువాతనే కేసీఆర్ ముందుకు కదిలారు.  
పునర్నిర్మించిన  నరసన్నపేట గ్రామంలో నాలుగు వీధులు కాలినడకన  కలయ తిరిగారు.  ఇళ్ళల్లోకి వెళ్లి అక్కడివారిని పలకరించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం విభిన్నంగా జరిగింది. ఎవరి మత విశ్వాసాలకు, సాంప్రదాయాలకు  అనుగుణంగా గ్రామస్తులు ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు  ప్రవేశించారు. ఇల్లంటే ఇలా వుండాలి అని  కలిగిన వాళ్ళు కూడా అబ్బురపడేలా ఆ గృహాలకు  రూపకల్పన చేసారు. ఇక వూరి సంగతి చెప్పక్కర లేదు. వీధులకు ఇరువైపులా ఒకే నమూనా కలిగిన ఇళ్ళు. సిమెంటు రోడ్లు, మురికి నీరు పోయేలా రోడ్లపక్కన కాలువలు, పచ్చని మొక్కలు, వీధి దీపాలు, ఇంటింటికీ నల్లాలు, ఇంకుడు గుంటలు, ఇంటర్  నెట్ సేవలు,  కళ్యాణ మండపం ఒకటేమిటి ఒక వూరికి ఉండాల్సిన సౌకర్యాలు సమస్తం ఈ ఊళ్లకు అమర్చి పెట్టారు. కొంతకాలం క్రితం ఇదే ఊళ్లలో పాత ఇళ్ళను పడగొడుతున్నప్పుడు, ‘ఇదంతా జరిగేదేనా’ అని నిరాశతో  నోళ్ళు నొక్కుకున్నవాళ్ళ నోళ్ళు, కళ్ళెదుట జరిగిన  ఈ గ్రామ  పునర్నిర్మాణాన్నిచూసిన తరువాత మూతబడి వుంటాయి.
వందల మంది పేదల కళ్ళల్లో ఆనందం నింపిన కేసీఆర్ నిజంగా ధన్యజీవి. ప్రజలు అప్పగించిన అధికారాన్ని, తిరిగి ఆ ప్రజల మేలుకే ఉపయోగించడం ఎలాగన్నది ఆయన చేసి చూపెట్టారు.
ఒక  హడావిడి లేదు, అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టించింది లేదు. అయినా అనుకున్న పనిని, అనుకున్న వ్యవధిలో పూర్తిచేసి, శంకుస్థాపన చేసిన చేతులతోనే ప్రారంభోత్సవం జరిపి, నిబద్దతత వుంటే మనిషికి అసాధ్యం లేదని నిరూపించారు. పేదవాడి సొంత ఇంటి కలని నిజం చేసి చూపించారు.
నిరుడు హైదరాబాదులో ఐ.డి.హెచ్. కాలనీలో తొలి అడుగు పడింది. మళ్ళీ ఏడాది తిరిగేలోగా నరసన్నపేట, ఎర్రవల్లి గ్రామాల్లో  మలి అడుగు పడింది. తడబడకుండా వడివడిగా అడుగులు వేస్తూ ఈ పధకాన్ని మొత్తం తెలంగాణా అంతటా విస్తరింపగలిగితే, యావత్ భారతానికి ఈ పధకం ఆదర్శంగా నిలుస్తుంది.
దాదాపు నాలుగు దశాబ్దాలుగా ప్రభుత్వాలు అమలు చేస్తున్న బలహీన వర్గాల గృహ నిర్మాణ కార్యక్రమాలను ఒక విలేకరిగా నేను గమనిస్తూ వచ్చాను. అరకొరగా కాకుండా పూర్తి స్థాయిలో, ప్రజల అవసరాలకు తగిన విధంగా పక్కా గృహాల నిర్మాణం జరిగింది మాత్రం ఇదే తొలిసారి.   
సొంత గూడు ఏర్పాటు చేసుకోవాలనే కోరికే ఆదిమ మానవుడిని జనవాసాల నాగరిక జీవనం వైపుగా మళ్ళించింది. లేనిపక్షంలో పొదలు, గుహలకే మనిషి జీవితం పరిమితమై వుండేది.
సొంతిల్లు అనే కల కనని మనుషులు వుండరు. ఇల్లు అనేది నివసించడానికే కాదు మరణించడానికి కూడా అవసరం అని నమ్మే వాళ్ళు వున్నారు. ఒక ఇంటివాళ్ళు కావాలనే కోరిక పెంచుకునే విషయంలో  వున్నవాళ్ళు లేనివాళ్ళు అనే తేడా లేదు. కలిగిన వాళ్ళు తమ విభవం కొద్దీ ఒకటికి మించిన ఇళ్ళుకట్టుకుంటే, లేనివాళ్ళు కనీసం ఒక్క ఇల్లుఅన్నా సొంతం అవుతే బాగుండని కోరుకుంటారు. ఇదేమీ తీరని కోరిక  కాకపోయినా అంత తేలిగ్గా సాధ్యం అయ్యే విషయం కూడా కాదు. అందుకే ఇల్లంటే అందరికీ అంతటి మక్కువ.
అత్యధిక జనాభా కలిగిన మన దేశంలో అత్యధికులు ఇళ్లు లేనివాళ్ళే. తల దాచుకోవడానికి కొందరు అద్దె కొంపల్ని నమ్ముకుంటే అసలా మాత్రం గూడు లేనివాళ్ళు కూడా పుష్కలంగానే వున్నారు.
మన దేశంలో పేదలకోసం ఏటా లక్షల సంఖ్యలో ఇళ్ళు నిర్మిస్తున్నామని మన రాజకీయ నాయకులు ప్రకటనలు చేస్తుంటే విని అభివృద్ధి చెందిన దేశాల వాళ్ళు  నోళ్ళు వెళ్ళబెట్టడానికి కారణం వుంది. మన దగ్గర పేదవాడి ఇల్లు అంటే నాలుగు మట్టి గోడలు, పైన తాటాకు కప్పిన పూరి పాక.  కానీ  అభివృద్ధి చెందిన దేశాల్లో ఇల్లుఅంటే ఆ  లెక్క వేరు.
బ్రిటన్ మాజీ ప్రధాని జేమ్స్ కేలహన్ ఒకసారి భారత దేశాన్ని సందర్శిస్తూ అందులో భాగంగా హైదరాబాదు వచ్చారు. ఆయన గౌరవార్ధం రాష్ట్ర ప్రభుత్వం జూబిలీ హాలులో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్నది కీర్తిశేషులు  టి. అంజయ్య.
రాష్ట్రం వివిధ రంగాల్లో సాధించిన విజయాలను గురించి ముందుగా అధికారులు తయారు చేసి ఇచ్చిన  ప్రసంగ పాఠం ద్వారా ముఖ్యమంత్రి  విదేశీ అతిధికి వివరించడం ప్రారంభించారు. పేద, బలహీన వర్గాలకు ప్రభుత్వం ఏడాది కాలంలో కొన్ని వేల పక్కా ఇళ్లను నిర్మించి ఇచ్చిందని చెబుతున్నప్పుడు బ్రిటిష్ లేబర్ పార్టీ నాయకుడయిన జేమ్స్ కేలహన్ ఒకింత విస్మయంగా విన్నారు. పక్కా ఇల్లు అంటే శాశ్విత గృహం (పర్మనెంట్ హౌస్) అనే అర్ధంలో అధికారులు అనువదించి చెప్పిన వివరణ ఆయన్ను మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది. అంత తక్కువ వ్యవధిలో అన్ని వేల ఇళ్లు నిర్మించడం సాధ్యమా అన్న సందేహం ఆయన ప్రశ్నల్లో వ్యక్తం అయింది. బ్రిటన్ దేశపు ప్రమాణాల ప్రకారం శాశ్విత గృహానికి ఎన్నో హంగులు, సదుపాయాలూ అవసరం అవుతాయి. ఆ దృష్టితో ఆలోచించే విదేశీ అతిధులకు మన పక్కా ఇళ్ళ ప్రణాళికలు అచ్చెరువు గొలపడంలో ఆశ్చర్య పడాల్సింది ఏమీ లేదు.
పేదల ఓట్లను ఆకర్షించడానికి మన రాజకీయ పార్టీలు అనుసరించే విధానాలలో నివేశనస్థలాల పంపిణీ ప్రధానమయినది. భూములకు, ఇళ్ళ స్థలాలకు   ఈనాడు వున్న ధరలు లేని ఆ పాత  రోజుల్లో కూడా పేదలకు  నివేశన స్థలాలు  అనేవి గగన కుసుమంగానే వుండేవి. అందుకని, గ్రామాల్లో ఖాళీగా వున్న పోరంబోకు  స్థలాలను  పేదవారికి ఇళ్ళ స్థలాలుగా ప్రభుత్వాలు ఇస్తూ రావడం అన్నది ఆనవాయితీగా మారింది. వూళ్ళల్లో వుండే రాజకీయ పెద్దలకు ఈ ఇళ్ళ  స్థలాల కేటాయింపు అనేది అదనపు పెద్దరికాన్ని కట్టబెట్టింది. కేటాయించిన స్థలాల్లో లబ్దిదారులు పక్కా ఇళ్లు కట్టుకునేందుకు ఎంతో కొంత డబ్బును సబ్సిడీ రూపంలో ఇవ్వడం కూడా మొదలయింది. తదనంతర కాలంలో ఎన్టీ రామారావు ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరవాత ఈ పక్కా ఇళ్ళ నిర్మాణాన్ని మరింత పక్కాగా అమలు చేసే పధకాలను ప్రారంభించారు. కాల క్రమంలో, కాంగ్రెస్ - తెలుగు దేశం పార్టీల నడుమ సాగుతూ వచ్చిన ఎన్నికల సంగ్రామాల్లో పక్కా ఇళ్ళ పధకం అనేక రంగులూ, రూపులూ, పేర్లూ మార్చుకుని అధికార పీఠం ఎక్కేందుకు అవసరమయిన సోపానాల్లో ప్రధానమయినదిగా మారింది. ఒకనాడు పేదలకు అవసరమయినది ఈనాడు పార్టీలకు అత్యవసరమయినదిగా తయారయింది. యధా రాజా తధా ప్రజా అన్నట్టు, లబ్దిదార్లు కూడా బినామీ పేర్లతో ఇళ్లు సంపాదించుకునే క్రమంలో, అవినీతి భాగోతంలో ఓ భాగంగా మారి విలక్షణమయిన ఈ పధకానికి తూట్లు పొడుస్తూ దాన్ని ఒక ప్రహసనంగా మార్చివేసే దుష్ట సంస్కృతి ఓ పధకం ప్రకారం రూపుదిద్దుకుంది. దానికితోడు, గత కొన్నేళ్లుగా సాదా సీదా భూముల ధరలకు కూడా రెక్కలు విచ్చుకోవడంతో ఈ సంస్కృతి మరింతగా పడగలు విప్పుకుని పేదరికాన్నే అపహాస్యం చేసే స్తితికి చేరుకుంది. దీనికి కారణం పాలకులా! పాలితులా! అన్న మీమాంసను పక్కన బెట్టి తిలాపాపం తలా పిడికెడు చందంగా, ఇందులో అందరికీ అంతో ఇంతో భాగం వుందనుకోవడమే సబబు. ఏతావాతా జరిగిందేమిటి? అర్హులను పక్కనబెట్టి అనర్హులకు తాయిలాలు పంచిపెట్టారనే అపవాదును పాలక పక్షాలు మూటగట్టుకుంటే, పేదసాదలకోసం తలపెట్టే సంక్షేమ పధకాల స్పూర్తినే సమూలంగా శంకించే అవకాశాన్ని విమర్శకుల చేతికి అందించినట్టయింది. పేదల పేరుపెట్టి గ్రామాల్లో వుండే సంపన్నులే ఈ అవకాశాలను దండుకుంటున్నారని, అధికారంలో వున్న ఆయా పార్టీల కార్యకర్తలకు వారి ఆర్ధిక పరిస్తితులతో సంబంధం లేకుండా పక్కా ఇళ్లను పంచిపెడుతున్నారనీ ఆరోపణలు వెల్లువెత్తడానికి ఆస్కారం ఇచ్చినట్టయింది.
దుర్వినియోగాన్ని సమర్ధించడం కాదు కానీ, సంపన్న  పారిశ్రామిక వేత్తలకు  'సెజ్' ల పేరుతో ధారాదత్తం చేస్తున్న భూములతో పోలిస్తే, బడుగులకో గూడు కల్పించే ఈలాటి పధకాలపై పెడుతున్న ఖర్చు ఏపాటి? అని ప్రశ్నించుకోవడం కూడా సబబే అవుతుంది. బడాబాబులకో రూలు, బడుగులకో రూలు అన్నప్పుడే కడుపు నిండినవాడు, కడుపు మండినవాడు అనే రెండు వర్గాలు సమాజంలో రూపుదిద్దుకుంటాయి. దీన్ని అడ్డుకోవడమే సిసలయిన  పాలకుల అసలయిన కర్తవ్యం.

ఈ నేపధ్యంలోనే  తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన ఎన్నికల వాగ్దానాల అంబుల పొదిలోని ఒక ప్రధాన అస్త్రానికి పదునుపెట్టి ప్రదర్శించారు. బడుగులకో గూడు ఏర్పాటు చేయాలనే సదుద్దేశ్యంతో కేసీఆర్ రెండు పడకల ఇంటి పధకానికి తొలి రూపం ఇచ్చారు. హైదరాబాదులోని ఐ.డీ.హెచ్. కాలనీలో తానే శంకుస్థాపన చేసిన 396 రెండు పడక గదుల  ఇళ్ళ కాలనీ నిర్మాణాన్ని పూర్తి చేసి తిరిగి తన చేతుల మీదుగానే ప్రారంభించి, బలహీన వర్గాల గృహ నిర్మాణ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి తెర తీసారు. అంతకుముందే  నిర్మాణదశలో కాలనీని  సందర్శించిన గవర్నర్ నరసింహన్, ఆ ఇళ్ళను చూసి ముచ్చట పడ్డ విషయం గమనార్హం.
అయితే ఇంతటితో ప్రభుత్వం బాధ్యత తీరిపోలేదు, సరికదా మరింత పెరిగింది. అధికారిక గణాంకాల ప్రకారం చూసినా తెలంగాణా కొత్త రాష్ట్రంలో ఇంటి వసతి లేని పేదల సంఖ్య లక్షల్లో వుంది. రెండు పడక గదుల ఇళ్ళు ఏటా అరవై వేలు కట్టాలన్నది ప్రభుత్వ యోచన.  ఈలెక్కన లక్షల ఇళ్ళ నిర్మాణం ఎప్పుడు పూర్తికావాలి?
నిజానికి కార్యక్రమం ప్రభుత్వానికి అలవికి మించిన భారం. సందేహం లేదు. అయినా ఇచ్చిన మాట ప్రకారం వందల సంఖ్యలో అయినా కొన్నింటిని  ప్రభుత్వం నిర్మించి చూపెట్టి, తన మాటలు నీటి మూటలు కావని నిరూపించుకుంది. కేంద్రం కూడా విషయంలో ఇతోధిక సాయం అందిస్తే క్రతువు జయప్రదం అవుతుంది. విదేశాల్లో స్థిరపడ్డ రాష్ట్ర వాసులు కూడా తమవంతు సాయం చేస్తే  తమ జన్మ భూమి ఋణం కొంత తీర్చుకోగలుగుతారు. ఏదిఏమైనా, ఎన్ని అడ్డంకులు ఎదురయినా నిబ్బరంగా నిలబడి పూర్తి చేయాల్సిన పవిత్ర కార్యక్రమం ఇది. జరిగి తీరాలని అందరం కోరుకుందాం. 
మొత్తం మీద మొదటి అడుగులు పడ్డాయి. కేసీఆర్ తన సొంత ఇంటి పండుగలా ఈ పేదల గృహ ప్రవేశ కార్యక్రమాన్ని జయప్రదంగా పూర్తిచేసారు. ఈ పేదల గృహ ప్రవేశ పధకాన్ని ఎలాటి అడ్డంకులు లేకుండా ముందుకు తీసుకు వెళ్ళగలిగితే, రెండు రూపాయల బియ్యం అనగానే జనాలకు ఎన్టీఆర్ గుర్తుకు వచ్చినట్టు, రెండు పడక గదుల ఇల్లు అనగానే తటాలున గుర్తు వచ్చేది కేసీఆర్ పేరే అవుతుంది.
ఉపశృతి: హైదరాబాదుకి తిరిగి వస్తుంటే మరో అనుకోని అవకాశం. ఎప్పుడూ వినడమే కాని కనని ప్రదేశం. కేసీఆర్ ఫాం హౌస్. లోపలకు వెడుతుంటే బాటకు రెండు వైపులా పున్నాగ చెట్లు. అవతల విశాలమైన భూముల్లో రకరకాల పళ్ళ తోటలు, కూరగాయల పాదులు. ఇన్నాళ్ళు ఫాం హౌస్  అంటే ఒక అభిప్రాయం వుండేది. తీరా చూసిన తరువాత అటువంటివి ప్రతి పల్లెలోనూ వుంటాయి అనిపించింది. రెండంతస్తుల భవంతి. ఒక పక్కగా మెట్లు. అవి చాలా సాదా సీదాగా వువ్నాయి. లిఫ్ట్  లేదు. కేసీఆర్ బస రెండో అంతస్తులో. మొదటి దాంట్లో డైనింగ్ హాలు. అదీ చాలా సింపుల్ గా వుంది.  ఆయన కూర్చునే కుర్చీ మీద ఒక యెర్ర తువ్వాలు వేసి వుంది. సీఎం పీఆర్వో విజయకుమార్ పూనికపై   అక్కడే టిఫిన్లు చేశాము. అదొక అన్నసత్రంలా వుంది. ఎవరు వచ్చి తిన్నా అడిగేవారు లేరు, పెట్టేవాళ్ళే తప్ప.
ఇదీ కేసీఆర్ స్పెషాలిటీ అనే చెప్పుకుంటారు.
              
రచయిత ఈ మెయిల్:bhandarusr@gmail.com మొబైల్: 98491 30595  


7 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ప్రియమైన శ్రీనివాసరావు గారూ ... మీ వివరణ చాలా బాగుంది ...
మీతో పాటు మేము కూడా ఎర్రవల్లి, నరసన్నపేట సందర్శించిన అనుభూతి కలిగింది.
మంచి పని ఎక్కడ జరిగినా అభినందించి,
ఆ విషయాన్ని నలుగురికీ తెలియజేయాలనే మీ తపన నచ్చింది.
ఈ పథకంపై పూర్వాపరాలను మీ బ్లాగులో చాలా బాగా తెలియజేశారు.
ధన్యవాదములు ....
.... పోణంగి బాల భాస్కర్, భాగ్యనగర్ కాలనీ, హైదరాబాద్ ....

అజ్ఞాత చెప్పారు...

It is good to know about a positive scheme in the midst of negativity all around.

Unknown చెప్పారు...

పొణoగి బాల భాస్కర్ గారి తో ఏకీభావిస్తున్నాను , వైజాగ్

sreeram chaturvedula చెప్పారు...

Forwarded your post without intimating you. pLEASE excuse me if i have offended you.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Sreeram Chaturvedula: What is the problem in acknowledging the writer while forwarding. That is the only consolation to the writer. Why do you want to deprive the same?

sreeram chaturvedula చెప్పారు...


నా facebook page లో మీ blog forward చేసాను. మీ పెరు దానిలొ ఉంది.దయ చెసి చూడగలరు.I have not deprived your name.On the contrary your name is mentioned without my comment.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@ Sreeram Chaturvedula. Thanks Sreeram garu