17, డిసెంబర్ 2016, శనివారం

వాదాలు, వాయిదాల సమావేశాలు

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 18-12-2016, SUNDAY)

మొత్తం మీద పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిశాయి. ముగిశాయి అని చెప్పొచ్చు కానీ, జరిగాయని చెప్పడం కష్టం. నియమావళి ప్రకారం నిర్వహించాలి కనుక  తూతూ మంత్రంగా సమావేశాలను జరిపినట్టు అనిపిస్తోంది. జరిగినన్నాళ్ళు ఏనాడూ  సభాకార్యక్రమాలు  ముందు నిర్ణయించుకున్న  విధంగా  జరిగింది లేదు, వాయిదాల మీద వాయిదాలు పడుతూ చివరాఖరుకు నిరవధికంగా వాయిదా పడడం తప్పించి.
ప్రతిపక్షాలు నిర్హేతుకంగా అడ్డుకోవడం వల్లనే ఈ పరిస్తితి తలెత్తిందని పాలక పక్షం వాదన. సభను సజావుగా నిర్వహించే చిత్తశుద్ధి పాలకపక్షంలో లోపించిందని ప్రతిపక్షాల ప్రతివాదన. మొత్తానికి ఎవరి పాత్ర వారు పోషించారు. ఆ పాత్రల్లో జీవించారు. కధను రక్తి కట్టించారు. కడకు సమావేశాలు ముగిశాయని అనిపించి చేతులు దులుపుకున్నారు.
యావత్ జాతిని ప్రభావితం చేసిన పెద్ద నోట్ల రద్దు దరిమిలా దేశంలో తలెత్తిన పరిణామాలే సమావేశాలను సయితం ప్రభావితం చేశాయి. సభ ద్వారా ప్రధాని మోడీ జాతికి సంజాయిషీ చెప్పాలని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పట్టుబట్టింది.సభలో తాను గొంతు విప్పితే భూకంపం వస్తుందన్న రీతిలో కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధి సభ ‘వెలుపల’ హెచ్చరిక చేశారు. నల్లకుబేరులపై తాను  ఎక్కుపెట్టిన బ్రహ్మాస్త్రంతో అవినీతికి మారుపేరైన కాంగ్రెస్ నేతలు బెంబేలెత్తిపోతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ సభ ‘వెలుపల’ ఎక్కడో ఒక బహిరంగసభలో వ్యాఖ్యానించారు. ఒక పక్క పార్ల మెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు వీరిరువురు సభలో కాకుండా ఇలా  ‘బయట’ మాట్లాడ్డం విడ్డూరంగా అనిపిస్తుంది. చర్చలకు, వివరణలకు అత్యున్నత వేదిక పార్లమెంటును ఒదిలిపెట్టి ‘వెలుపల’ గంభీర ప్రకటనలు చేయడం వెనుక ఉద్దేశ్యాలు ఏమైఉంటాయన్న దానిపై మీడియాలో కొత్త చర్చ మొదలయింది. ఏదిఏమైనా పెద్ద నోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజల ఇబ్బందులపై జనం తరపున మాట్లాడే అమూల్య అవకాశాన్ని ఇటు ప్రతిపక్షాలు,  అన్ని విషయాలు సాధికారికంగా  వివరించి, ఏవైనా సందేహాలు వుంటే వాటిని  నివృత్తి చేయగలిగిన సువర్ణావకాశాన్ని అటు  పాలకపక్షం చేజేతులా జారవిడుచుకున్నాయనే చెప్పాలి.
కొత్త కోడలు కాపురం చేసే కళ కాలి మెట్టెలు చూసే చెప్పొచ్చన్నట్టు ఈ సమావేశాలు ఇలానే జరుగుతాయని మొదటి రోజునే బోధపడింది.
పెద్ద నోట్ల రద్దు గురించి ప్రధాని సభలో ఉండగానే చర్చ జరగాలని ప్రతిపక్షాలు భీష్మించాయి.
గతంలో ప్రతిపక్షంలో వుండగా ఇలానే సభను అడ్డుకున్న బీజేపీ, గతాన్ని హాయిగా  మరచిపోయి  మొండికేసింది. పాలకపక్షం, ప్రతిపక్షం రెండూ కూడా  తమదయిన పాత్రలను తమదయిన బాణీల్లో పాత్రోచితంగా అవధులు మీరి మరీ పోషించాయి. పరిస్తితి ఈ విధంగా గాడి తప్పడానికి మీరు కారణం అంటే మీరు కారణంఅని ఒకరినొకరు దుమ్మెత్తిపోసుకున్నారు తప్పిస్తే,  ఏఒక్కరూ, ఉమ్మడిగా ‘మనం’ కారణం అనుకోలేదు. మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఏ దిశగా సాగుతున్నదో అర్ధం చేసుకోవడానికి ఇదొక్కటి చాలు.
చట్టసభలు సజావుగా నడవాలంటే  పాలక పక్షం ముందు బాధ్యత తీసుకోవాలి. ప్రతిపక్షాలు బాధ్యతతో వ్యవహరించాలి. ఈ పవిత్ర కర్తవ్య నిర్వహణలో పాలక ప్రతిపక్షాల వైఫల్యమే, బాధ్యతారాహిత్యమే  పార్లమెంటు సమావేశాలు ఇలా నిరర్ధకంగా ముగియడానికి ప్రధాన కారణం. ఈ విషయం నిర్ధారించడానికి పార్లమెంటరీ నియమ నిబంధలని అపోసన పట్టక్కరలేదు. బజారున పోయే ఏ సామాన్యుడిని అడిగినా ఇదే చెబుతాడు.
నిజానికి సభ సజావుగా నడవకపోతే ప్రతిపక్షానికే  నష్టం. పాలకపక్షానికి ఒకరకంగా వెసులుబాటు. సభ జరిగేలా చూసుకుంటే పాలక పక్షం తప్పొప్పులను ఎత్తి చూపి నిలదీయడానికి ప్రతిపక్షాలకు అవకాశం లభిస్తుంది. సభ జరక్కపోతే ఏదో అప్పటికి మమఅనిపించి పాలక పక్షం బయటపడొచ్చు. అయితే సభను అడ్డుకోవడం ద్వారా లభించే ప్రచార లాభం ‘ఉభయులను’ మరోరకంగా ఆలోచింపచేస్తున్నాయి. అందుకే ఇన్ని గడబిడలు. ఇన్ని శషభిషలు.      
ఎన్నికలు జరిగినప్పుడు ప్రజలు ఒక పార్టీని ఓడించి మరో పార్టీకి పట్టం కడుతున్నారు అంటే ఏమిటి అర్ధం. పాత ప్రభుత్వ విధానాలతో విసిగిపోయి, కొత్తగా వచ్చే ప్రభుత్వం అయినా కొత్త బాటలో నడవక పోతుందా అనే ఆశతో కదా!
గత  లోక సభ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని అక్కున చేర్చుకుని అంతటి స్థాయిలో ఆదరించడానికి దోహదం చేసిన అంశాల్లో ఇదొకటి. మార్పుకోరి వారు మోడీకి  ఓటు వేసారు. ఎన్నికలకు ముందు మోడీ కానీ, ఆయన నేతృత్వం వహించిన ఎన్డీయే కూటమి కానీ ప్రజలకు కొత్తగా చేసిన పెద్ద పెద్ద వాగ్దానాలు కూడా ఏమీ లేవు. యేవో కొన్ని నామకార్ధం చేసినా వాటిపై సామాన్యులు పెట్టుకున్న ఆశలు పెద్దగా లేవనే చెప్పాలి.  ప్రజలు మోడీకి పట్టం కట్టింది ఆయన ఏదో మార్పు తీసుకువస్తాడనే ఆశతోనే. ప్రధాని పీఠం ఎక్కిన కొత్తల్లో ఆయన ప్రదర్శించిన వ్యవహార శైలి, చెప్పిన మాటలు, చేసిన ప్రకటనలు ఈ ఆశలకు కొత్త ఊపిరిలూదాయి.
అయితే మొన్న ముగిసిన పార్లమెంటు సమావేశాల్లో అధికార పక్షం అటు సభలో, వెలుపలా గతాన్ని మరచి వ్యవహరించిన తీరు, సమర్ధించుకున్న విధానం ప్రజలు మోడీ ప్రభుత్వంపై పెట్టుకున్న ఆశలపై నీళ్ళు చల్లాయి. గతంలో మీరు అధికారంలో వున్నప్పుడు మీ నిర్వాకం ఏమిటిఅని ఎదురు ప్రశ్నించడం,  ‘మార్పుతెస్తామన్న సర్కారుకు శోభస్కరం కాదు.
ఇక కాంగ్రెస్ విషయం తీసుకుంటే, గత ఎన్నికల తరువాత ఆ పార్టీ పూర్తిగా డీలా పడిపోయింది. ఒకప్పుడు దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీకి లోకసభలో ప్రధాన ప్రతిపక్షం హోదాకు సరిపడనంతగా అతి తక్కువ స్థానాలు కట్టబెట్టి ఓటర్లు ఆ పార్టీపై తమ కసి ప్రదర్శించారు. ఆ స్థాయిలో పరాజయం మూటగట్టుకున్న ఆ పార్టీ నేతల నోళ్ళు చాలా రోజులు మూగనోము పట్టాయి. కానీ ఆ నోళ్ళు మళ్ళీ పెగలడానికి కారణం కాంగ్రెస్  పార్టీ నాయకత్వం ప్రతిభ ఎంతమాత్రం కాదు. ఈ పుణ్యమో, పాపమో ఆ చలవ పూర్తిగా మోడీ ప్రభుత్వానిదే. ఇందుకు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీకి రుణపడివుండాలి.
ఎన్నోసార్లు చెప్పుకున్నట్టు మనకు రేపటి గురించి ఆలోచించే  రాజనీతిజ్ఞులు లేరు. అందరూ ఈరోజు గురించి తపన పడే  రాజకీయ నాయకులే.  
పార్లమెంటు సమావేశాలను అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత రాజకీయ ప్రయోజనమో, లేదా మీడియా ప్రచారమో సంపాదించుకుని ఉండవచ్చు. కానీ అంశం ఎలాటిదయినా, అందులోని తీవ్రత ఎంతటిదయినా సభ జరగకుండా అడ్డుకోవడం విజ్ఞత అనిపించుకోదు. గతంలో ఇదేమాదిరిగా సభను అడ్డుకుకున్న బీజేపీ తీరును గుర్తుచేసి, ఆ పార్టీ గతాన్ని ఎండగట్టడంవరకు పరిమితమై, సభను నడపడంలో సహకరించి వుంటే కాంగ్రెస్ లోని మార్పునుప్రజలు గమనించేవారు.
హుందాగా ప్రవర్తించకపోవడం ద్వారా,  మీడియా ప్రచారాన్ని మించిన ప్రజాదరాన్ని బీజేపీ, కాంగ్రెస్ రెండూ దారుణంగా కోల్పోయాయి.
పార్లమెంటు సమావేశాలకు అయ్యే ఖర్చు నిమిషానికి రెండున్నర లక్షలు, రోజుకు ఆరుకోట్లు, ఇన్ని రోజులకు వెరసి ఇన్ని వందల కోట్లు అంటూ గణాంకాలు చెబుతుంటారు. మరి సభ జరక్కుండా చేసి ఎదుటివారి మీద నిందలు మోపుతున్న ఈ రాజకీయ పార్టీలు ఇంతటి స్థాయిలో ప్రజాధనం దుబారా కావడానికి  యేమని సమాధానం చెబుతాయి. ఆయా పార్టీలనుంచి ఈ డబ్బును  తిరిగి వసూలు చేసే విధంగా  రాజ్యాంగ సవరణ చేయాలని ఎవరయినా కోరుకుంటే తప్పేమిటి?           
పొతే, పార్లమెంటు సమావేశాల తీరుతెన్నులపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, బీజేపీ కురు  వృద్ధుడు లాల్ కిషన్ అద్వానీ అసహనం వ్యక్తం చేశారు. సామాన్యుడి మనసులోని మాటనే వారు తమ నోట పలికారు.  ప్రజాస్వామ్య వేదికలు ఒత్తిళ్లకు గురవుతున్నాయని చర్చావేదికగా ఉండాల్సిన పార్లమెంటు యుద్ధ క్షేత్రంగా మారిపోయిందన్న రీతిలో  ఆవేదన వెలిబుచ్చారు. సామాన్యుడి మాటను రాజకీయ నాయకులు ఎటూ చెవిన పెట్టరు. దేశ రాజకీయాల్లో తలపండిన పెద్దమనుషులు, అనేక (రాజకీయ) యుద్దముల ఆరితేరినవారు అయిన ప్రణబ్  ముఖర్జీ, అద్వానీలు, ‘సభను హుందాగా నడిచేట్టు చూడండి’ అంటూ   ఇచ్చిన సలహా అయినా కనీసం చెవికెక్కించుకుంటారేమో చూడాలి.    
తోక టపా: సరే! శీతాకాల సమావేశాలు ముగిశాయి. పార్లమెంటు సమావేశాలు మళ్ళీ జరుగుతాయి కదా! అవెలా సాగుతాయి అనే ప్రశ్నకు జవాబు చెప్పడానికి జ్యోతిష్యం తెలిసివుండనక్కరలేదు.  (17-12-2016)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595



కామెంట్‌లు లేవు: