15, డిసెంబర్ 2016, గురువారం

లవ్ శాల్యూట్!


సుఖంగా పెరిగి కష్టాలు పంచుకోవడం యెంత కష్టమన్నది కష్టాల్లో పుట్టి కష్టాల్లో పెరిగిన వారికి ఓ పట్టాన అర్ధం కాదు. అందుకే నన్ను కట్టుకుని మా ఆవిడ పడ్డ కష్టాలు నాకెన్నడూ తెలవదు. తెలిసినా అది ఆమె బాధ్యత అనుకున్నాను, బాధ్యతారాహిత్యానికి నిలువెత్తు ఉదాహరణ అయిన నేను.
మా కాపురానికి  ఈ రోజుతో నలభయ్ అయిదేళ్ళు. మా ప్రేమ వివాహం  కాలపరీక్షను తట్టుకుని నిలిచిందని కాలరు ఎగరేయొచ్చేమో.
నా కారణంగా కష్టాలు పడ్డా, అరవై అయిదేళ్ళ వయస్సులో మా ఆవిడను కన్నసంతానం మాత్రం సుఖపెడుతూనే వున్నారు. నా వల్లఆమెకు జరిగిన మేలు ఇదొక్కటేనేమో!.
అదేమిటో చిత్రం! 
అదృష్ట, దురదృష్టాలు రెండూ పోటీ పడి నన్ను వరించాయి.


ఈ సందర్భంగా ఒక అసందర్భ ప్రలాపం.     
జర్నలిష్టు కురువృద్ధుడు వీ.హనుమంతరావు గారి గురించి రాస్తూ సాక్షి పత్రికలో నేను రాసిన వ్యాసంలో కొన్ని వాక్యాలను ఎక్కడెక్కడినుంచో చాలామంది  మహిళలు ఫోను చేసి మరీ  మెచ్చుకున్నారు. అవే ఇవి:
“గొప్ప జర్నలిష్టుని ప్రపంచం భరిస్తుంది. ఆదరిస్తుంది, అభిమానిస్తుంది. కాని అతగాడిని భరించడం యెంత కష్టమో తెలిసేది మాత్రం  ఆ జర్నలిష్ట్ భార్యకి మాత్రమే. అనుభవంతో చెబుతున్న మాట ఇది. ప్రపంచం బాధ్యత తప్ప ఇంటి బాధ్యత పట్టని గొప్ప జర్నలిష్టులు నాకు చాలామంది తెలుసు. జీ కృష్ణ గారు వారిలో అగ్రగణ్యులు. అలాటి విశిష్ట వ్యక్తులను గౌరవించేటప్పుడు విధిగా వారిని భరించిన భార్యలను కూడా గుర్తుపెట్టుకుని, గుర్తించి గౌరవించాలి. ఆ విధంగా హనుమంతరావు గారికి లభించిన గౌరవ ప్రతిపత్తుల్లో న్యాయబద్ధమైన, ధర్మబద్ధమైన సగంవాటా నిస్సంశయంగా ఆయన అర్ధాంగి సరళ గారికే దక్కాలి”

(16-12-2016)

కామెంట్‌లు లేవు: