1, డిసెంబర్ 2016, గురువారం

గుర్తుకొస్తున్నాయి ....


డెబ్బయ్యవ దశకంలో బెజవాడ ఆంధ్రజ్యోతిలో పనిచేసే రోజుల్లో జీతం నెలకు నికరంగా కోతలు పోను తొంభయ్ రూపాయలు. గ్యాస్ సిలిండర్ పాతిక లోపు. వూళ్ళో  అందరికీ గ్యాస్  కొరత వున్నా జర్నలిష్టు ఉద్యోగం కాబట్టి ఫోను చేయగానే గంట వ్యవధిలో కొత్త సిలిండరు పంపేవాళ్ళు. అది సరే కాని పాతిక పరకలమాటేమిటి? అదే కదా అసలు సమస్య జర్నలిష్టులకు. ‘ఐ నో పీఎం, ఐ నో సీఎం’ కబుర్లు ఇక్కడ ఉడకవు.
ఆఫీసులో సహోద్యోగి ఉపేంద్ర దగ్గరలోనే వుండేవాళ్ళు. ఇలాంటి అవసరం పడితే తప్ప ఒకళ్ళ గడప తొక్కే రకం కాదు నేను. వచ్చిన పని నేను పనిమాలా  చెప్పకపోయినా, నా మొహం చూసి ఆయన  ఇట్టే కనుక్కునేవాడు. లోపలకు వెళ్లి ఓ పాతిక రూపాయలు తెచ్చి నా చేతిలో పెట్టేవాడు. అప్పటికి గండం గడిచేది. సిలిండర్ ఇంటికి వచ్చేది. వున్నది ఇద్దరమే కనుక మరో మూడు నెలల వరకు ఉపేంద్ర గారి ఇంటికి వెళ్ళాల్సిన అవసరం వుండేది కాదు.
మళ్ళీ ఇన్నేళ్ళకు డబ్బు అవసరం పడింది. ఈసారి వింత  ఏమిటంటే, అప్పు అడిగేవాడిదగ్గరా డబ్బుకు లోటు లేదు. అప్పు ఇచ్చేవాడి దగ్గరా డబ్బుకు కరువు లేదు. వున్న చిక్కల్లా ఆడబ్బు వారిద్దరి దగ్గరా  లేదు. బ్యాంకులో వుంది. కానీ అది అవసరానికి ఆదుకునేట్టు లేదు.

ప్రైవేటు గ్యాస్ కంపెనీలు ఆన్ లైన్ పేమెంట్ ఏర్పాట్లు చేశాయంటున్నారు. ఎంతయినా దేశం అంటే కాస్త భక్తి కదా!అంచేత  పబ్లిక్ రంగం గ్యాస్ కంపెనీలను నమ్ముకున్నాము. వాళ్ళేమో  మాలాగే పాతకాలం బాపతు. ఏం చేస్తాం!       

3 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

"వూళ్ళో అందరికీ గ్యాస్ కొరత వున్నా జర్నలిష్టు ఉద్యోగం కాబట్టి ఫోను చేయగానే గంట వ్యవధిలో కొత్త సిలిండరు పంపేవాళ్ళు. "
------------------------------
ఆహా, జర్నలిస్టు గా కెరీర్ ఎంచుకుంటే బాగుండేదే 🙂. ప్చ్, ఒక జీవితకాలం లేట్ 😢.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@విన్నకోట నరసింహారావు - అయ్యా! తరువాతి వాక్యం చూడండి."...అది సరే కాని పాతిక పరకలమాటేమిటి? అదే కదా అసలు సమస్య జర్నలిష్టులకు. ‘ఐ నో పీఎం, ఐ నో సీఎం’ కబుర్లు ఇక్కడ ఉడకవు...." అంటే ఏమన్నమాట. జీవితకాలం లేటని తీరిగ్గా విచారించాల్సిన అవసరం లేదన్న మాట.

అజ్ఞాత చెప్పారు...

బేంకి అకౌంటులో డబ్బులు ఫుల్లు. చేతిలో పైసలు నిల్లు. పెజానీకానికి జంబలకిడి పంబ అయ్యిందన్నట్టు.