12, ఏప్రిల్ 2015, ఆదివారం

స్వయంకృతాపరాధాలుపురుషులందు పుణ్య పురుషులు వేరయాఅన్నాడు వేమన. అలాగే - విభక్తుల్లో సంబోధనా ప్రథమా విభక్తితరహాయే వేరన్న భావన ఈనాడు సమాజంలో కానవస్తున్నట్లుగా తోస్తోంది. తల్లిని ఒసేఅనడం - తండ్రిని ఒరేఅనడం ఈ మధ్య సినిమాల్లో షరా మామూలుగా మారిపోయి అదే సంస్కృతి క్రమంగా, వడి వడిగా సాధారణ జీవితాల్లోకి జొరబడుతుంది.
వెనుకటి రోజుల్లో పిల్లలు ఒకర్నొకరు సరదాగా గురూ-గురూఅని పిల్చుకుంటూ ఉంటే విని పెద్దలు గుర్రుమనే వారు. మాట తీరుకు ఆ రోజుల్లో అంత ప్రాధాన్యం ఉండేది. ఇళ్ళల్లో మాట్లాడుకునే దానికి - బయట సంభాషించే పద్ధతికి ఎంతో వ్యత్యాసం ఉండేది.ఇంట్లో 'అమ్మా' అని పిలిచినా బయట నలుగురిలో మాత్రం 'అమ్మగారు' అంటూ గౌరవంగా చెప్పుకునే వారు. ఉత్తరాలు రాసేటప్పుడు - 'గంగా భాగీరథీ సమానురాలైన అత్తగారికి' అనో, 'పూజ్యులైన తాతయ్యగారికి' అనో వినమ్రత కనబరిచేవారు. వినయాన్ని సంస్కారంగా, విధేయతని సభ్యతగా పరిగణించేవారు. ఒదిగి ఒదిగి ఉండడాన్ని ఆత్మన్యూనతగా కాకుండా అణుకువగా అనుకునేవారు. సభ్యతా, సంస్కారాలకు  అదే కొలమానంగా భావించేవారు.

ఇక, పత్రికల్లో వాడే భాష, సినిమాల్లో వినిపించే సంభాషణలు, చట్టసభల్లో జరిగే చర్చలు చాలా వరకు పరిధులకు, ప్రమాణాలకు లోబడే ఉండేవి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆకాశవాణి, దూరదర్శన్ ల సంగతి చెప్పనక్కర్లేదు. వాటి కార్యక్రమాలు, వార్తలు గిరి గీసుకుని, మడికట్టుకుని తయారుచేసినట్టుగా ఉండేవని గిట్టనివారు అనుకునేవారు కూడా. నిజాలను నిదానంగా  చెబుతాయన్న నింద తప్ప - సమాజానికి కాలుష్య కారకాలుగా మారాయన్న అపప్రధని అవి ఏనాడు మోయలేదు. 
కానీ, కాలం ఒక్క తీరుగా ఉండదు కదా! జనం అభిరుచులు కూడా కాలాన్ని బట్టి, తరాలను బట్టి మారిపోతుంటాఅయి. కనుకే సంబోధనా ప్రథమా విభక్తి ప్రత్యయాలకు ఈనాడు ఇంతటి ఆదరణ. అందుకే మార్పులోని మంచి చెడ్డలతో నిమిత్తం లేకుండా దాన్ని స్వీకరించడం, అమోదించడం అంతా సజావుగా సాగిపోతున్నది. ఈ మార్పుని మరింత వేగవంతంచేయడంలో ఈనాటి ఎ టూ జెడ్ఛానళ్ళు శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నాయి.

తరాలు మారుతున్నప్పుడు - వర్తమాన తరం వెనుకటి తరాన్ని చిన్నబుచ్చడం, హేళన చేయడం తరతరాలుగా వస్తోంది. పెద్దల సుద్దులను చాదస్తంగా కొట్టివేయడం మార్పుకున్న ప్రధమ లక్షణం. ఇలా మారిపోతున్న జనాల్లోనుంచే నాయకులు పుడతారు. మేథావులు పుడతారు. జర్నలిస్టులు పుడతారు. సంపాదకులు పుడతారు. కవులు - రచయితలు పుడతారు. పాఠకులు పుడతారు. శ్రోతలు పుడతారు. వీక్షకులు పుడతారు. వీళ్ళ సభ్యతా సంస్కారాల కొలబద్దలు కూడా మార్పులకి తగ్గట్టుగానే మారిపోతుంటాయి. మార్పుని అంగీకరించని మునుపటి తరం మౌనవీక్షణలో మునిగి సణుగుతుంటే - ఏది ఒప్పో, ఏది తప్పో చెప్పేవాళ్ళు లేక, చెప్పినా ఒప్పుకునే తత్త్వం లేక నవతరం ముందుకు సాగుతోంది. తరాల అంతరాల్లోనుంచి మొలకెత్తిన వైరుధ్యాలు, వైకల్యాల ప్రతిరూపాలే ఈనాడు సమాజంలోని అన్ని వర్గాలను ఆశ్రయించుకుని బహుముఖ రూపాల్లో బయటపడుతున్నాయి. అమ్మను 'ఒసే' అనడం, నాన్నను 'ఒరే' అనడం వంటి కొత్త ధోరణులను ఆవిష్కరిస్తున్నాయి. ముందే చెప్పినట్టు ఇది క్రమంగా సినిమాల నుంచి ఛానళ్ళకు, పత్రికలకు, పుస్తకాలకు, చట్టసభలకు విస్తరించి - సభ్యతా సంస్కారాలకు కొత్త భాష్యం చెబుతున్నాయి. ఈ క్రమంలో నుంచే ఆవిర్భవించిన ప్రజా ప్రతినిధులు, మేధావులు, జర్నలిస్టులు, కవులు, రచయితలు, కళాకారులు - చెప్పే మాటల్లో, ప్రవచించే పలుకుల్లో, రాసే రాతల్లో - సభ్యతా సంస్కారాల ప్రమాణాలే మారిపోతున్నాయి. ఇందుకు సజీవ సాక్ష్యాలు - ఈనాటి సినిమాలే, ఈనాటి ఛానళ్ళే, ఈనాటి పత్రికలే, ఈనాటి  పుస్తకాలే, ఈనాటి చట్ట సభలే!
రోజూ చచ్చేవాళ్ళకు ఏడ్చేవాళ్ళుండరు. రోజులు ఇలాగే గడిస్తే వర్తమాన వైరుధ్యాలకు బాధపడే వాళ్ళు మిగలరు. 
పాలితులను బట్టే పాలకులు- పాఠకులను బట్టే పత్రికలు - ప్రేక్షకులను బట్టే సినిమాలు - వీక్షకులను బట్టే ఛానెళ్ళు.
ఎవరు చేసిన ఖర్మ వారనుభవించక తప్పదు!

NOTE: COURTESY IMAGE OWNER

17 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...

>ఎవరు చేసిన ఖర్మ వారనుభవించక తప్పదు!

అవునండి.
ఈ మాట వ్యక్తులకు మాత్రమే కాదు.
సమాజాలకూ సమానంగానే వర్తిస్తుంది.

పరిథుల ఉనికినే గుర్తించనిరాకరించే స్వేఛ్ఛనిజానికి విశృంఖలత్వమే. అది వినాశనహేతువే కాని వికాశహేతువు కాదు. సంస్కృతీ సంప్రదాయాలవంటివి అడ్డుగోడలవంటి పరిధులు అనుకునే సమాజం దిగ్విజయంగా ఆత్మహననకార్యక్రమంలో మునిగిపోయి ఉందని అర్థం.

Jai Gottimukkala చెప్పారు...

కుటుంబంలో పెద్దవారిని మీరు అనో గారనో అనకపోతే మర్యాద కాదని అనలేము. మావైపు నువ్వు అనడమే కరెక్ట్.

PS: గంగా భాగీరధీ సమానురాలు అనే సంబోధన కేవలం వితంతువులకు వాడతారనుకుంటా

అజ్ఞాత చెప్పారు...

పైన శ్యామలీయం గారితో ఏకీభవిస్తున్నాను .
హద్దు అనే మాట బూతు అయిపొయింది . సృజనాత్మక కి ఎప్పుడు హద్దు ఉండదు . అభివృద్ధి కి అది ఆటంకం కాదు .
కాని , ఈ రోజుల్లో ఏ మాత్రం "వద్దు" అని చెప్పినా అదేదో పెద్ద బూతు మాట అన్నట్టు , మనం వెనకబడి ఉన్నట్టు మాట్లాడుతున్నారు . చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది .

మీరు / నువ్వు అనడం కాదు సమస్య , గౌరవం ఇవ్వడం . మాటకి విలువ ఇవ్వడం . అయ్యా , నాన్నగారు ఒకటే , కాని మా బాబు అనడం కరెక్ట్ కాదు కదా .

అజ్ఞాత చెప్పారు...

అమ్మ మొగుడా! అనడమే నేటి సభ్యత :)

శ్యామలీయం చెప్పారు...

"అమ్మను 'ఒసే' అనడం, నాన్నను 'ఒరే' అనడం వంటి...."

మీ వైపు నువ్వు అనడమే కరెక్ట్ కావచ్చును కాని జైగారూ, ఒసే ఒరే అనే రకం పిలుపులు మాత్రం ఏ వైపునైనా కరెక్ట్ కాదనే అనుకుంటాను.

Jai Gottimukkala చెప్పారు...

@శ్యామలీయం:

అమ్మను "ఏమే" అనడం మామూలేనండీ. అయితే "ఒసే" & "ఒరే" నేనెక్కడా వినలేదు.

సినిమాలలో నాణ్యత & కనీస సంస్కారం ఉండడం అనేది ఆత్రేయ & వేటూరి డబుల్ మీనింగులు & మాడా/కోటా/బాబూమోహన్ నాటు "హాస్యం" తోటే పోయింది. భర్తను భార్యలు "కుక్కా" అని సంబోదించడం సీరియల్లతో మొదలయింది. చిరంజీవి మేనమామను కొట్టడం (హిట్లర్ సినిమా) & చంద్రమోహన్ తండ్రి పైనే చేయి చేసుకోవడం (సినిమా పేరు గుర్తు లేదు నాగార్జున హీరో) కూడా చూసాం. రానురానూ ఇంకా దిగజారడం ఖాయం.

Unknown చెప్పారు...


"మీ వైపు నువ్వు అనడమే కరెక్ట్ కావచ్చును"

మావైపే కాదు, నెల్లూరు, రాయలసీమలో కూడా నువ్వు లేదా నీవు అని విరివిగా వాడతారు.

మన కావ్యాలు, ఇతిహాసాల ప్రకారం చూసినా రాజును కూడా హే రాజా అనే వారు తప్ప రాజావారు అనేవారు కాదు. సంస్కృతంలో త్వ అంటే तुम లేదా నువ్వు అనే, మీరు అని కాదు. బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత ఆంగ్ల సంస్కృతిలో భాగంగా బహువచన ప్రయోగం మొదలైంది. ఇప్పుడు దాన్నే మన పురాతన సంస్కృతిగా చిత్రించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిందార్థకాలు లేనంత వరకూ ఏక వచన ప్రయోగాలు తప్పు కాదని నా అభిప్రాయం.

శ్యామలీయం చెప్పారు...

> హే రాజా
అలా ఎలా అనేవారండీ? తప్పుకదా!

హే రాజన్ అనవలసి ఉంటుంది సంస్కృతభాషామర్యాద ప్రకారం.

Unknown చెప్పారు...

నేను హే రాజా అన్నది సంస్కృతం కాదు. తెలుగే. "త్వ" ధాతువు విషయంలోనే నేను సంస్కృతం గురించి చెప్పాను.

ఇక సంస్కృతంలోకి వస్తే...

राजा (రాజా) ప్రథమా విభక్తి ఏకవచనం.
राजानः (రాజానః) ప్రథమా విభక్తి బహువచనం.
राजन् (రాజన్) సంబోధనా విభక్తి ఏకవచనం.
राजानः (రాజానః) సంబోధనా విభక్తి బహువచనం.

ఇప్పుడు నిర్ణయించుకోండి, రాజును ఏక వచనంతో సంబోధించే వరో, బహువచనంతో సంబోధించేవారో!

hari.S.babu చెప్పారు...

విలువలూ వలువలూ
వాటంతటవి జారిపోవు,
మనం వొదిలేస్తే పోతాయి!

hari.S.babu చెప్పారు...

"హే రాజన్" - మాత్త వినగానే
నాకు బాదరాయణ ప్ర్గ్గడ గుర్తుకొస్తున్నాడు!
మీకెవరికన్నా గుర్తున్నాడా?

hari.S.babu చెప్పారు...

"హే రాజన్" - ఈ మాట వినగానే
నాకు బాదరాయణ ప్రగ్గడ గుర్తుకొస్తున్నాడు!
మీకెవరికన్నా గుర్తున్నాడా?

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

"బాదరాయణ ప్రగడ" అంటే "జగదేకవీరుని కధ" (NTR) సినిమాలో సి.ఎస్.ఆర్ ఆంజనేయులు గారు వేసిన వేషమే కదా.

శ్యామలీయం చెప్పారు...

రాజును ఏక వచనంతో సంబోధించే వారో, బహువచనంతో సంబోధించేవారో అన్నదానిపై నేను వ్యాఖ్యానించటం లేదు. అది మొదటి విషయం.

సంస్కృతంలో త్వ అంటే तुम లేదా నువ్వు అనే, మీరు అని కాదు..... అన్నప్పుడు ముద్రారాక్షసం ఏమీ లేదని మీరే మరొకసారి "త్వ" ధాతువు విషయంలోనే నేను సంస్కృతం గురించి చెప్పానని అన్నారు. పొరబడ్డారనుకుంటాను. లేదా నేనే పొరబడుతున్నానో ఏమో! ధాతువు త్వమ్‌ అనుకుంటాను. విజ్ఞులు చెప్పాలి. ఇది రెండవ విషయం.

ముఖ్యమైన మూడవ విషయం. నేను హే రాజా అన్నది సంస్కృతం కాదు, తెలుగే అన్నారు. కాని హే అని తెలుగులో సంబోధనావాచకం లేదు - అది సంస్కృతం! దానికి సమానంగా తెలుగు మాట 'ఓయి' అని కాని వ్యవహారంలో 'ఓ' అని ప్రసిధ్ధమే.

నిందార్థకాలు లేనంత వరకూ ఏక వచన ప్రయోగాలు తప్పు కాదన్న మీ అభిప్రాయం ఆమోదయోగ్యం. ఐనా లోకాచారంతు కర్తవ్యం అన్నారు కాబట్టి సముదాచారం ఒకప్రాంతంలో లేదా ఒక సామాజికవర్గంలో ఏ విధంగా ఉందో అది, దురర్థద్యోతకం కానంతవరకూ తప్పక అదరణీయం.

hari.S.babu చెప్పారు...

@విన్నకోట గారు
అన్ని సినిమాల్లోనూ భయపెట్టే రాజనాల "ప్రెగ్గడా!" అని పిల్వడమే నవ్వొచ్చేటంత క్యామెడీ.ఇటుపక్కన ఈయన - ఇద్దరూ కల్సి చేసిన అల్లరి ఇప్పటికీ గుర్తుంది నాకు:-)

Unknown చెప్పారు...

>>> రాజును ఏక వచనంతో సంబోధించే వారో, బహువచనంతో సంబోధించేవారో అన్నదానిపై నేను వ్యాఖ్యానించటం లేదు. అది మొదటి విషయం.

ఇక్కడ చర్చ అదే. దానిపైనే నేను వ్యాఖ్యానించడం జరిగింది. మీరు పిడకల వేటలాగా నా తప్పులు వెదుకుతున్నారన్నమాట! సరిపోయింది!!

నా తప్పులు మీరు వెదకవలసిన పనిలేదు, వాటికవే అనేకం దొర్లుతుంటాయి. శ్రమకోర్చి సరిచేయ బూనినందుకు ధన్యవాదాలు. నా మాటల్లో తప్పులపై కాక అసలు చర్చపై వ్యాఖ్యానిస్తే మరింత సంతోషించే వాడిని.

ధన్యవాదాలు.

అజ్ఞాత చెప్పారు...

@Haribabu:
అవును , హే రాజన్ , శృంగార పురష అంటూ కీర్తించే ఆ డైలాగులు ఎవరు మర్చిపోతారు . ప్రతీ సినిమా లో విలన్ గా కనిపించే రాజనాల ఆ సినిమా లో నవ్విస్తారు .
నాకు కూడా మొట్ట మొదట అదే గుర్తొచ్చింది , అయితే ఈ మాట ముందే ఉందన్నమాట నేనింకా సినిమా కోసం స్ప్రుష్టించారేమో అనుకున్న