4, ఏప్రిల్ 2015, శనివారం

పెచ్చరిల్లుతున్న 'తుపాకీ సంస్కృతి'


(Published by 'SURYA' telugu daily in it's Edit Page on 05-04-2015, SUNDAY)

గత కొద్ది రోజులుగా మీడియాలో నేర స్వభావం కలిగిన సమాచారాలు చోటు చేసుకుంటున్నాయి.
సూర్యాపేట హైటెక్ బస్ స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఒక కానిస్టేబులు, ఓ హోమ్  గార్డు చనిపోయారు. పోలీసు ఇన్స్పెక్టర్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అదే దుండగులు దారిన వెడుతున్న ఓ కారును ఆపడానికి విఫల ప్రయత్నం చేసి ఆ కారును నడుపుతున్న వ్యక్తిని తుపాకీతో కాల్చి గాయపరిచారు.
హైదరాబాద్ సరూరు నగర్ ప్రాంతంలో ఇంట్లో ప్రవేశిస్తున్న వ్యక్తిపై గుర్తు తెలియని వారు కాల్పులు జరిపి తీవ్రంగా గాయపరిచారు. హైదరాబాదు నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తులపై పెట్రోలు పోసి తగులబెట్టే ప్రయత్నం జరిగింది. నగరంలో తుపాకీని అమ్మజూపతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన  ఓ వ్యక్తిని అక్రమ ఆయుధాల కేసులో అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
ఇవన్నీ వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరుగా జరిగిన సంఘటనలు. అయితే వీటిలో దండలో దారంలా దాగున్న నిజం ఒక్కటే. అది  పెరిగిపోతున్న తుపాకీ సంస్కృతి, నేర ప్రవృత్తి.         
సూర్యాపేట బస్ స్టేషన్ వంటి  బహిరంగ ప్రదేశాల్లో జరిగిన సంఘటన సంచలనంతో పాటు ఆందోళన కూడా కలిగిస్తోంది.  పోలీసులపై తెగబడి కాల్పులు జరిపిన ఈ నేరస్తుల అసలు లక్ష్యం ఏమిటన్నది ఇంకా బయట పడలేదు.  ఎందుకంటె వీటికి కారణభూతులయిన వారు ఇంకా పోలీసుల చేతికి చిక్కలేదు. వారిని పట్టుకునేందుకు పోలీసుల వేట ముమ్మరంగా సాగుతోంది.
సరూర్ నగర్ కాల్పులకు ఆస్తి తగాదాలు కారణంగా చెబుతున్నారు. పెట్రోలు పోసి తగలబెట్టడానికి ప్రయత్నించిన సంఘటనల్లో  అలాటి హేతువు కూడా కానరావడం లేదు.
తుపాకీ సంస్కృతి ప్రబలడం అనేది విశ్వవ్యాప్తంగా జరుగుతోంది. ఇంగ్లండులో గత పదేళ్ళలో ఈ రకమైన నేరాలు 89 శాతం పెరిపోయాయి. వీటిని అరికట్టడం ఎలాగా అని అక్కడి పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.
ఇక అమెరికాలో తుపాకులు అనేవి పౌరుల జీవితాల్లో ఒక భాగమై పోయాయి. ఇళ్ళల్లో ఆయుధాలు అట్టిపెట్టుకోవడం, ఆత్మ రక్షణ కోసం వాటిని యధేచ్చగా ఉపయోగించుకోవడం చట్టరీత్యాకూడా అక్కడ చెల్లుబడి అవుతోంది. అయితే ఆయుధాలను మారణాయుధాలుగా వాడుకోవడం అనుమతించరు. ఆయుధాల వినియోగం విషయంలో అక్కడి పోలీసులకు విపరీతమైన స్వేచ్ఛ వుంది. పరిమితి మించిన వేగంతో వాహనాలను నడిపేవారు పోలీసుల చేతికి చిక్కినప్పుడు వారి అనుమతి లేకుండా జేబులో చేయి పెట్టబొయినా పోలీసులు ఊరుకోరు. మారణాయుధం తీయడానికి ప్రయత్నిస్తున్నట్టుగానే అనుమానించి పోలీసులే  ముందుగా కాల్పులు జరుపుతారు. అయినా ఆ దేశంలో జరిగే కాల్పుల సంఘటనలు తక్కువేమీ కావు. తుపాకీ ధరించిన దుండగుడు ఏదైనా పాఠశాలలోకి  హఠాత్తుగా దూరిపోయి విచక్షణారహితంగా కాల్పులు జరిపి అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్న ఉదంతాలు అక్కడ నిత్యకృత్యంగా మారిపోతున్నాయి.
సూర్యాపేట సంఘటన పరిశీలిస్తే పోలీసులకంటే దుండగులే ముందుగా కాల్పులకు పూనుకున్నట్టు తెలుస్తోంది. పోలీసుల దగ్గర కూడా ఆయుధాలు ఉన్నప్పటికీ వారు సకాలంలో స్పందించలేదనే ఆరోపణ వుంది. బస్సులో రొటీన్ గా జరిపే సోదాల్లో పోలీసులు అయుధాలు ప్రదర్శించి వుంటే అది మరో సంచలనవార్తగా మారివుండేది. కాబట్టి అమెరికా పోలీసుల మాదిరిగా కఠినంగా వ్యవహరించగల వెసులుబాటు మన పోలీసులకు లేదనేది కూడా కాదనలేని వాస్తవం.
వీటితో పోల్చలేకపోయినా మరో దారుణమైన విషయం గోవాలో వెలుగులోకి వచ్చింది. అక్కడ ఆధునిక దుస్తులు అమ్మే ఒక దుకాణంలో కొనుగోలు చేసిన దుస్తులు తమకు తగ్గట్టుగా సరిగా ఉన్నాయా లేదా అనే విషయం సరిపోల్చుకోవడానికి ఏర్పాటు చేసిన  గదిలో రహస్య కెమెరాలు అమర్చిన వైనం ఓ కేంద్ర మహిళా మంత్రి చేసిన పిర్యాదు కారణంగా వార్తలకెక్కింది. దుకాణంలో దొంగతనాలు జరగకుండా ఈ ఏర్పాటు చేసినట్టు యజమానులు చెబుతున్న కారణం ఆకుకూ పోకకూ అందకుండా వుంది.
తుపాకీతో చేసే ఘోరాలకన్నా  మహిళలపై  జరిగే అత్యాచారాల నైత్యం  తక్కువేమీ కాదు. మారణాయుధంతో నిండు  ప్రాణం తీయడానికి, 'మగతనం' అడ్డుపెట్టుకుని అబలల మానం  నిలువునా హరించడానికీ నేరస్థాయిలో తేడా ఏమీ లేదు. వీటికి చట్టంలో శిక్షలు కఠినంగానే వున్నాయి. కానీ చట్టం దోవ చట్టందే, నేరాల దోవ నేరాలదే అన్నట్టు విశృంఖలంగా పెరిగిపోతున్నాయి.

         

అయితే, కేవలం కఠిన శిక్షలు మాత్రమే  పెచ్చరిల్లుతున్న హింసా ప్రవృత్తికి అడ్డుకట్టవేయలేవు అన్న వాస్తవాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాల్సిన అవసరం వుంది. చట్టాలకు పదును పెట్టి కఠిన శిక్షలు వేయడం అన్న ఒక్క ప్రక్రియే ఈ సమస్యలకు పరిష్కారం కాదు.
అసలు సిసలు మార్పు ఇళ్లనుంచి  మొదలు కావాలి. పిల్లల పెంపకం పట్ల తలితండ్రులు  తీసుకునే జాగ్రత్తలు కూడా సానుకూల మార్పుకు దోహదం చేస్తాయి. గతంలో పాఠశాలల్లో నైతిక ప్రవర్తనకు సంబంధిన పాఠాలు బోధించే పద్దతి వుండేది. యేది మంచి యేది చెడు అన్నది చిన్నతనం నుంచే అవగాహన చేసుకోవడానికి అవకాశం వుండేది. ఉమ్మడి కుటుంబాలకు మూలస్తంభాలు అయిన బామ్మలు, తాతయ్యలు పసితనం నుంచే పిల్లలకు నడత, నడవడిక గురించిన మార్గదర్శనం చేసేవాళ్ళు. ఎదిగే దశల్లో మనసును నియంత్రించుకోవడానికి అవసరమయిన నీతి పాఠాలు కుమార శతకం, కుమారి శతకాల్లో లభ్యం అయ్యేవి. అవన్నీ ఇప్పుడు కలికానికి కూడా కానరావడం లేదు. అధవా ఎవరయినా కలిగించుకుని చెప్పే నీతి వాక్యాలను  పాత చింతకాయ పచ్చడిలా పరిగణిస్తున్నారు.
అలాగే,   ఇప్పటి వేగ యుగంలో, పోటీ ప్రపంచంలో వాణిజ్యరూపం సంతరించుకున్న విద్యాసంస్థలకు నైతిక పాఠాలు బోధించే వ్యవధానం వుంటుందని ఆశించడం వృధా.   అటు కుటుంబాలలో కూడా పిల్లలకు  మంచీచెడూ చెప్పే వాళ్లు లేకుండా పోతున్నారు. ఆధునిక సాంకేతిక పరికరాలు జీవన శైలి మెరుగుదలకు ఓపక్క దోహదం చేస్తూనే మరోపక్క యువత పెడదారులు తొక్కటానికి మార్గాలను  సులువు చేస్తున్నాయి. అందుకే  సమస్య మూలాల్లోకి పోయి పరిష్కారాలను కనుగొనాల్సిన అవసరం ఏర్పడింది.  
ఏ సమాజనికయినా విలువల పతనాన్ని మించిన అధోగతి వుండబోదు.
దాన్ని నిరోధించకుండా చేసే ఏ ప్రయత్నాలయినా పై పూత మందులే అవుతాయికాని  అసలు రోగాన్ని సమూలంగా  నిర్మూలించలేవు. (04-04-2014)

Note : Courtesy Image Owner 

కామెంట్‌లు లేవు: